89. ఏక్ దిన్ కా రాణి

“ఏక్ దిన్ కా రాణి” బహుళ త్రైమాసిక ఆన్లైన్ పత్రిక “మహిళ దినోత్సవ ప్రత్యేక సంచిక లో ప్రచురితం అయిన నా కవిత చదవండి

Jwalitha Denchanala Jwalitha మేడమ్ గారికి ధన్యవాదాలతో

“స్త్రీ దేవత పూజించాలి” అని

ఊగిపోతూ కవితను చదివినవాడే

ఇంట్లో వంట చేయడం ఆలస్యమైందని

భార్య చెంప మీద అరచేతి

ముద్ర వేశాడు..

“మహిళలను నేను గౌరవిస్తాను”

వేదికపై మైకులో గొంతు చించుకున్న వాడే

కాసుల కోసం గుడ్డలిప్పి

ఆమెను విపణి వీధిలో నిలబెట్టాడు..

ఆఫీసులో పక్కసీటు ఆమె అంగాంగాన్ని

కళ్ళతోనే కుళ్లబొడిచినది అతడే..

పూటగడుస్తుందని డబ్బుల ఎర చూపి

సగం బట్టల్లో ఆమె చేత

రికార్డుడాన్స్ వేయించిందీ అతడే..

ఇద్దరు మగవాళ్ళ గొడవలో

ఆమె మర్మాంగాన్ని తిట్టిందీ అతనే..

జాతుల సమరపు రోతల్లో

మతపు బురద గుంటల్లో పొర్లాడుతూ

ఆమెను వివస్త్రగా

ఊరేగించింది అతనే..

ఇప్పుడు

ఏడాదికి ఒకరోజు

ఏక్ దిన్ కా రాణిని చేసి

సన్మానాలు సత్కారాలు అంటూ

ఆమెను ప్రశంసల తాటిచెట్టు

ఎక్కించిందీ అతనే..

మరునాడే కిందకు తోసేసి

మళ్ళీ బానిసను చేసేదీ అతనే..

అమ్మలారా..అక్కలారా..!

పొగడ్తల మత్తులో పడిపోకండి

శాలువాల సత్కారాలు

మనకొద్దు

ఏ సౌలభ్యాలు సౌకర్యాలు

అదనంగా మనకొద్దు ..

“మహిళ” అనే జాలిచూపుల

విమెన్ కార్డ్ అసలు ఆశించవద్దు..

ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం

నీ ఆయుధాలు అయితే

ఆకాంక్ష అభివృద్ధి

నీ ధ్యేయం అయితే

నిరంతర సాధనే

నీ గెలుపుకు సోపానం..

హక్కులతో పాటే నీ బాధ్యతలు

విస్మరించని బాటలో పయనించు..

విజయానికి దగ్గరదారులు లేవు

“కష్టే ఫలి” ని నువ్వు నమ్మితే

నీ నమ్మకాన్ని వమ్ము చేసే

ఏ శక్తి లేదిక..

విజయాపథ సోపాన పటంలో

పై మెట్టు మీద నువ్వు

కాలు మోపిన రోజే

అసలు సిసలైన

అభ్యుదయ పండుగ రోజు..

రోహిణి వంజారి

9000594630

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *