91. పాప నవ్వింది..

నేను రాసిన కథ “పాప నవ్వింది” ఈ రోజు [25 – 10 – 2026] ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం “స్నేహ” పత్రికలో ప్రచురితం అయింది. చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.

“అమ్మ..అమ్మా..భయంవేస్తోంది. నేను..నేను..స్కూల్ ” నిద్రలో వణుకుతూ కలవరిస్తోంది శృతి. దిగ్గున లేచి లైట్ వేసి శృతిని ఒడిలోకి తీసుకుంది వసుంధర. పాప ఒళ్ళంతా చెమటతో తడిచిపోయి ఉంది. తుఫాను గాలికి రాలిపడిన చిగురుటాకులా వణుకుతోంది. కన్నబిడ్డను ఆ స్థితిలో చూసిన వసుంధర కళ్ళు వర్షించే మేఘాల్లా ఉన్నాయి. ఆందోళనతో శ్రీకాంత్ ని తట్టి లేపింది. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ ఆడుకునే పిల్ల. చదువు, తెలివి తేటల్లో తరగతి లో అందరికంటే ముందుండే తమ చిట్టి తల్లి వారం రోజుల నుండి జ్వరంతో మూసిన కన్ను తెవరకుండా పడి ఉండడం చూసి, విలవిలలాడిపోయారు వాళ్ళిద్దరూ. జ్వరంతోపాటు నిద్రలోనే ఉలిక్కిపడడం, ఏవేవో అర్ధంకాని కలవరింతలతో వారం రోజులుగా స్కూల్ కి పోవడం లేదు శృతి. ఫస్ట్ క్లాస్ చదువుతోంది. డాక్టర్ కి చూపించి, పాప పరిస్థితి వివరించారు. శృతిని పరీక్షించిన డాక్టర్ “పాప ఎందుకో భయపడుతోంది. స్కూల్ లో టీచర్ ఎవరైనా పాపని బెదిరించడం లేదా కొట్టడం లాంటివి చేశారేమో. ఆ విషయాన్నీ సరిగా చెప్పలేకపోతోంది. లేదా మీకు చెప్పడానికి భయపడుతున్నట్లుంది. పాపకు మందులతో పాటు తల్లిదండ్రులుగా మీ కేరింగ్ కూడా చాల అవసరం” అని చెప్పింది డాక్టర్ నీలిమ.
వసుంధర వారం రోజులు ఆఫీస్ కి సెలవు పెట్టింది. ఆ తర్వాత రెండు రోజులు శ్రీకాంత్ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. శృతికి సమయానికి మందులు ఇవ్వడం, అన్నం పెట్టడం దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. ఇంట్లో అమ్మ, నాన్నల ప్రేమ, సంరక్షణలో శృతికి జ్వరం పూర్తిగా తగ్గింది, కానీ హఠాత్తుగా భయపడడం, నిద్రలో కలవరించడం మాత్రం తగ్గలేదు. ముందు జ్వరం తగ్గిందని తేలికగా ఊపిరిపీల్చుకున్నారు. అయితే అసలు చిక్కు ఇప్పుడే మొదలైంది. ఆ రోజు పొద్దున శృతిని స్కూలుకి పంపాలనుకుని స్నానం చేయించాక బీరువాలో నుంచి యూనిఫామ్ డ్రెస్ ని తీసింది. ఆ డ్రెస్ ని చూడగానే,శృతి ముఖంలో భయం కదలాడింది. క్షణాల్లో ముఖం చెమటతో తడిచిపోయింది. “అమ్మా..నేను స్కూలుకి పోను. ఇంట్లోనే ఉంటాను. నువ్వు కూడా ఆఫీస్ కి వెళ్ళకు. నాతోనే ఉండు” అంది, బతిమాలుతున్నట్లు తన చిట్టి చేతులను ఊపుతూ. “మా బుజ్జి తల్లివి కదా. ఈ రోజు పొద్దున స్కూల్ వ్యాను లో వెళ్ళు. సాయంత్రం నేనొచ్చి, నిన్ను స్కూటీలో ఇంటికి తీసుకుని వస్తా” అంది లంచ్ బాక్స్ సర్దుతూ. “నేను స్కూల్ కి వెళ్ళను. ప్లీజ్ అమ్మా” శృతి బతిమిలాడుతూ, మెల్లగా ఏడుపు ఎత్తుకుంది. “ఎందుకో స్కూల్ అంటేనే శృతి భయపడుతోంది. ఈ రోజుకి ఇంట్లోనే ఉంటుందిలే. నేను ఉంటాను శృతికి తోడుగా. నువ్వు ఆఫీస్ కి వెళ్ళు” అన్నాడు శ్రీకాంత్. ఆ మాట వినంగానే శృతి ముఖంలోకి వెలుగు వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద వండిన కూరలు, అన్నం పెట్టేసి, జాగ్రత్తలు చెప్పి, ఆఫీస్ కి వెళ్ళింది వసుంధర. శృతిని ఆడిస్తూ ఉండిపోయాడు శ్రీకాంత్. సాయంత్రం ఇద్దరి ఫోన్లకు స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇంకో రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతాయి. శృతిని స్కూల్ కి పంపండి’ అని శృతి క్లాస్ టీచర్ చేసిన మెసేజ్ అది.
“శ్రుతీ ..ఈ రోజు నువ్వు స్కూలుకి పోవాలి తల్లి. రెండ్రోజుల్లో ఎగ్జామ్స్ మొదవవుతాయట” యూనిఫామ్ తీస్తూ అంది వసుంధర. “అమ్మా..నేను ఎగ్జామ్స్ రాయను. స్కూలుకి పోను. ఇంట్లోనే ఉంటా ” మళ్ళీ మొదలుపెట్టింది శృతి. “ఇలా పేచీ పెడితే ఎలా శృతి? స్కూల్ లో ఎవరైనా టీచర్ నిన్ను కొట్టిందా చెప్పు? నేను వచ్చి అడుగుతాను” అనునయంగా శృతికి యూనిఫామ్ వేయసాగింది. ‘జ్వరం తగ్గాక పాప ఎందుకు భయపడుతోందో మెల్లగా అడిగి తెలుసుకోండి’ అనిచెప్పిన డాక్టర్ మాటలు గుర్తుకు వచ్చాయి వసుంధరకి. అప్పుడే సెల్ ఫోన్ మ్రోగింది. “హలో..ఎవరు” అంది వసుంధర విసుగ్గా. “హలో వసుంధర గారు. నేను మీ శృతి ఫ్రెండ్ మౌనిక వాళ్ళ అమ్మని. శృతి స్కూలుకు రావడంలేదని మా మౌని చెప్పింది. తను కూడా స్కూలుకి పోనని పేచీ పెడుతోంది. పోనీలే అని రెండు రోజులు పంపలేదు. ఈ రోజు యూనిఫామ్ వేస్తుంటే ఏడుస్తోంది స్కూలుకి పోనని. గట్టిగా అరిస్తే బెదిరిపోతోంది. ఎందుకో స్కూల్ అంటే భయపడుతున్నారు వీళ్ళు. ఏమైందో వీళ్ళకి. నాకు కంగారుగా ఉంది. ఎవరో టీచర్ వీళ్ళని బాగా భయపెడుతున్నట్లుంది. ఈ రోజు స్కూల్ కి వెళ్ళి కనుక్కోవాలనుకుంటున్నాను. మీరేమైనా వస్తారా?” అని అడిగిందావిడ.
“అవునా. శృతి కూడా స్కూల్ అంటే ఎందుకో భయపడుతోంది. నేను కూడా ఈ రోజు స్కూల్ కి వస్తానండి. తప్పకుండా కనుక్కుందాము” అని ఫోన్ కట్ చేసింది వసుంధర. తల్లి మాటలు విన్న శృతి కళ్ళల్లో భయం. “అమ్మా. ప్లీజ్ నువ్వు రావొద్దమ్మా. నేను కూడా స్కూల్కి పోను. నువ్వొస్తే చంపేస్తాడు” వణికిపోతోంది శృతి. ఆ మాట వినగానే “ఎవరు శృతి ? ఎందుకు చంపుతారు?” వసుంధర కళ్ళు పెద్దవి అయినాయి. శృతి ఏం చెప్పలేక వెక్కుతోంది. పసిబిడ్డను ఆ స్థితిలో చూసిన వసుంధర తల్లి మనసు తల్లడిల్లిపోయింది. శృతిని ఒళ్ళోకి తీసుకుని ఓదారుస్తూ “ఎందుకు తల్లీ! ఎందుకంత భయం. ఎవరు చంపుతాను అన్నారు? మీ టీచర్ చెప్పిందా అలా? నాకు చెప్పు. నేను వెళ్ళి ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇస్తాను. నీకేం భయం లేదు. నిన్ను ఎవరూ ఏమనకుండా నేను చూసుకుంటాను. సరేనా” శృతి బుగ్గల మీద ముద్దులు కురిపిస్తూ అంది వసుంధర. అమ్మ లాలన, ఓదార్పులతో కాస్త తేరుకున్న శృతి,
“అమ్మా..మరేమో.. మరేమో వ్యాను అంకుల్ లేడు” కళ్ళు పెద్దవి చేసి అంది శృతి. “ఎవరు..! స్కూల్ వ్యాను డ్రైవర్ బాబ్జి నా” వసుంధరలో ఆందోళన పెరిగిపోయింది “హా..ఆ అంకులే అమ్మా. ఇంటెర్వేల్ తర్వాత నేను టాయిలెట్ కి వెళితే” వసుంధర కళ్ళు పెద్దవైనాయి. “అక్కడేమో వ్యాను అంకుల్ నాకు ఇష్టమైన డైరీ మిల్క్ చాకోలెట్ ఇచ్చాడు. నేను తింటుంటే..” ఇంట్లోకి రాబోయిన శ్రీకాంత్ శృతి ఏం చెప్తుందా అని గుమ్మం దగ్గరే ఆగిపోయాడు చప్పుడు చేయకుండా. “తర్వాత..ఏమైంది చెప్పు శృతి” వసుంధర కళ్ళల్లో ఆందోళన. “మరేమో. అంకుల్ నా దగ్గరకి వచ్చి బుగ్గలు కొరికాడు. సుస్ పోసుకునే దగ్గర చెయి పెట్టి….” శృతి చెప్తున్న మాటలు విని గట్టిగా గుండెలకి హత్తుకుంది భయంతో. శ్రీకాంత్ దవడ కండరం బిగుసుకుంది. అలివికాని కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పటికప్పుడు వ్యాను డ్రైవర్ బాబ్జిని చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది. ” చాల నొప్పి అమ్మా ఇక్కడ. నువ్వు అప్పుడప్పుడూ చెప్తావు కదా నాకు. ఎవరైనా బుగ్గలు, భుజాలు… టచ్ చేస్తే వాళ్ళు బాడ్ అని. వ్యాను అంకుల్ అలా చేసాడు. వ్యాను అంకుల్ చాల చాల బాడ్ అమ్మా” వణుకుతూ, గుక్కపట్టి ఏడుస్తూ తల్లిని అల్లుకుపోయింది శృతి. బిడ్డ మాటలకు వణికిపోయింది వసుంధర. శృతిని గుండెల్లో పొదువుకుంది. నెమ్మదిగా శృతి తలనిమురుతూ “ఎప్పుడు అలా చేసాడు నిన్నుశృతి. నాకెందుకు చెప్పలేదు నువ్వు” అంది పుట్టెడు దుఃఖాన్ని గొంతులోనే అదిమిపెట్టి.
“చాల సార్లు అమ్మా. నీకు చెప్తే నిన్ను, నన్ను చంపుతాను అన్నాడు. నాకు భయం వేసి నీకు చెప్పలేదు” అమాయకమైన ఆ పసి మొగ్గ ఎదుర్కొన్న ఆ కిరాతక చర్యకు ఆ దంపతుల మనసులు విలవిలలాడాయి.
శ్రీకాంత్, వసుంధరల ద్వారా విషయం తెల్సుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మేడం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ‘తమ స్కూల్ లో ఇంతటి దారుణం జరుగుతుంటే, ఇంతవరకు తనకి తెలియకపోవడం శోచనీయం. ఇంతవరకు ఒక్క స్టూడెంట్ కూడా తమ దగ్గరకి వచ్చి బాబ్జి గురించి కంప్లైంట్ ఇవ్వకపోవడంతో విషయం తమదాకా రాలేదు. చాల రోజుల నుంచి స్కూల్ లో వ్యాను డ్రైవర్ గా చేస్తూ, నమ్మకస్తుడిలా అనిపించాడని, తమకు అతని మీద ఎటువంటి అనుమానం రాలేదని చెప్పింది’. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేముందు మనమే అతనికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు. శృతి చెప్పిన మాట ప్రకారం టాయిలెట్ రూమ్స్ దగ్గర సి.సి. కెమెరా లో ఉన్న వీడియో ఫుటేజ్ చూస్తాం అని కంప్యూటర్ ఆన్ చేశారు. సి.సి. కెమెరాలో ఏం రికార్డు కాలేదు. అంతా నల్లగా ఉంది. టాయిలెట్ రూమ్స్ దగ్గరకి వెళ్ళి చూస్తే, సి.సి. కెమెరా పగిలిపోయి ఉంది. ఆ వెధవ చేసిన పనే అయివుంటుందని అనుకున్నారు. “వాడు చేసిన నీచమైన పనులకు సాక్ష్యం లేకుండా చేయాలని సి. సి. కెమెరా ని పగలగొట్టాడు. స్కూల్ లో ఏం జరుగుతోందో తెలుసుకోలేని చీకట్లో ఉన్నాం” అంటూ ప్రిన్సిపాల్ మేడం అపరాధభావంతో చలించిపోయింది . ప్రతిక్షణం వాడి కదలికలను కనిపెట్టి, రెడ్ హ్యాండెడ్ గా ఆ వెధవను పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇంత వరకు బాబ్జి విషయం బయటికి పొక్కలేదు కాబట్టి, థర్డ్ బెల్ కొట్టడంతో, ఏం తెలియనట్లు పిల్లలను క్లాసులలోకి పంపేశారు.
లాస్ట్ ట్రిప్లో పిల్లలను వ్యానులో తీసుకువచ్చిన డ్రైవర్ బాబ్జి, వ్యానుని పార్కింగ్ స్థలంలో పెట్టి, వ్యానులోనే కూర్చుని టిఫిన్ తిన్నాడు. తనతో పాటు ఉన్న కుర్రాడిని ఇంటికి పంపేశాడు. తర్వాత తాపీగా సిగరెట్టు తాగుతూ కూర్చున్నాడు. నెమ్మదిగా సీట్ మీదకు వాలి ఓ కునుకు తీసాడు. ఇంటెర్వేల్ బెల్ మ్రోగడంతో ఉలిక్కిపడి లేచాడు బాబ్జి. పిల్లలందరూ వాష్ రూమ్స్ దగ్గరకు వెళ్ళి, మళ్ళీ క్లాసులలోకి వెళ్ళిపోయారు. బాబ్జి మెల్లగా వ్యాను దిగి వాష్ రూమ్ వైపు నడిచాడు. అతని చేతిలో ఫైవ్ స్టార్ చాకోలెట్లు ఉన్నాయి.
పిల్లలందరూ వెళ్ళాక, ఆయమ్మ వాష్ రూమ్స్ ని శుభ్రం చేసి వెళ్ళిపోయింది. పది నిముషాల తర్వాత, యూకేజీ చదివే పాప నిఖిత ఒక్కటే వాష్ రూమ్ కి వెళ్ళి తిరిగిరాగానే “పాప…..ఇలారా” అంటూ పిలిచాడు. “ఏంటి అంకుల్” అంది నిఖిత. “ఇదిగో ఈ చాకోలెట్ నీ కోసం తెచ్చాను. తీసుకో” అన్నాడు చేతిలోని చాకోలెట్ ని చూపిస్తూ. “ఐ…ఫైవ్ స్టార్ చాకోలెట్” అంటూ తీసుకుని “థాంక్స్ అంకుల్” అంటూ చాకోలెట్ రేపర్ తీసి ఓ ముక్క కొరికి తినసాగింది. బాబ్జి అటూఇటూ తలతిప్పి చూసి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని , పాప ఇలారా అంటూ నిఖితకి దగ్గరగా వెళ్ళి బుగ్గలు నిమిరాడు. తర్వాత పాప భుజాలు పట్టుకొబోయాడు. అంతే..! అప్పటివరకు ఎక్కడ, ఎంతసేపటినుంచి మాటువేసి ఉన్నారో కానీ, ఒక్కసారిగా సివంగుల మాదిరి దూసుకువచ్చి బాబ్జి ని చుట్టుముట్టారు వసుంధర, ప్రిన్సిపాల్ మేడం విజయలక్ష్మి, మౌనిక వాళ్ళ అమ్మ. బాబ్జి ని గట్టిగా పట్టుకుని చెంపలు వాయించారు. అక్కడ జరుగుతున్న అలికిడికి ఇంకొందరు టీచర్లు, పిల్లలు వాష్ రూమ్స్ దగ్గరికి వచ్చారు. అక్కడ అంతమంది టీచర్స్ ఉండడంతో బాబ్జి తమని ఏమి చేయలేడని ధైర్యంతో, చాల మంది పిల్లలు “వేన్ అంకుల్ బ్యాడ్..వేన్ అంకుల్ బ్యాడ్” అంటూ పెద్దగా అరిచారు. విషయం తెల్సిన టీచర్స్ తమ స్కూల్లో ఇంత దారుణం జరుగుతోందా అని విస్తుపోయారు. అదను చూసి, పట్టు విదిలించుకుని ముందుకు ఊరకపోయాడు బాబ్జి. అయితే అతని పప్పులు ఉడకలేదు. ఎదురుగా గన్ పట్టుకుని వస్తూ కనిపించాడు ఇన్స్పెక్టర్ రవీంద్ర. వెనుకనే బేడీలతో సిద్ధంగా ఉన్నారు కానిస్టేబుల్స్. శ్రీకాంత్ కూడా వచ్చాడు పోలీసులతో పాటే. బాబ్జి చేతులకు బేడీలు వేసి, నెట్టుకుంటూ పోయి వేన్ లోకి తోశారు పోలీసులు.
సరైన సమయంలో మాకు విషయం తెలియచేసి, మంచి పని చేశారు మేడం. ఇంటిదొంగను ఈశ్వరుడే కనిపెట్టలేడని ఇటువంటి వెధవలు మన చుట్టుపక్కలే ఉంటారు. నమ్మకస్తులుగా నటిస్తూ ఉంటారు. అదును చూసి నీచపు పనులకు పాల్బడుతుంటారు. వీళ్ళు పక్కఇంటి అంకుల్ రూపంలోనో, ఎదురింటి తాతరూపంలోనో, తెలిసిన వాళ్ళే ఉండవచ్చు. అందరూ చెడ్డవాళ్ళని కాదు. మంచివాళ్ళుగా నటిస్తూ అవకాశం దొరికినప్పుడు తమ వక్రబుద్ధిని చూపించే వాళ్ళు సమాజంలో ఎక్కువయ్యారు. స్కూల్స్ యాజమాన్యాలు, పేరెంట్స్ మాతో సహకరిస్తే, ఇటువంటి విషయాల పట్ల పిల్లలకి అవగాహన చేకూర్చే కార్యక్రమాలు చేపడదాము అన్నాడు ఇన్స్పెక్టర్ రవీంద్ర.
“తప్పకుండా సర్. మీ వంటి వారు మాకు అండగా ఉంటే, ఇటువంటి నేరస్తులను సులభంగా పట్టుకోవచ్చు. ఇంకా పిల్లలకు ఇటువంటి వ్యక్తుల గురించి, వారి నీచపు చేష్టల గురించి, గుడ్ టచ్, బాడ్ టచ్ గురించి అవగాహన కలిగేలా క్లాసులు తీసుకోవచ్చు” అంది ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మేడం. శృతి పాప చెప్పిన విషయం ద్వారా ఈ రోజు ఒక దుర్మార్గుడిని చట్టానికి పట్టించగలిగాము. మీరు కూడా, విషయం దాచకుండా మాకు చెప్పినందుకు చాల చాల కృతఙ్ఞతలు” అంటూ వసుంధర, శ్రీకాంత్ లకి థాంక్స్ చెప్పింది విజయలక్ష్మి మేడం. శృతిని ఎత్తుకుని స్కూటర్ వెనుక సీట్లో కూర్చుంది వసుంధర. శ్రీకాంత్ స్కూటర్ని స్టార్ట్ చేసాడు.
“మరి.. శృతి బంగారు తల్లీ..! ఆ బ్యాడ్ బాబ్జిని పోలీసులు తీసుకుపోయారు కదా. వాడిని జైల్లో పెడతారు. ఇక వాడెప్పుడూ స్కూల్ కి రాడు. మరి నువ్వు రోజు స్కూల్ కి వెళతావా” అంది వసుంధర ఆ పిల్లను పొదివిపట్టుకుని. “ఓ..రోజు స్కూల్ కి వెళతాను” అంటూ పకపకా నవ్వింది శృతి. ఆ నవ్వుల్లో చాలామంది పసిపాపల నవ్వులు శృతి కలిసాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *