“#storyreview” #మొక్కు” నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీ పీఠం వారి కథల పోటీలో 10 వేలు రూపాయల బహుమతి పొందిన కథ Balaramaswamy Boddeda రాశారు. ఆ కథ పైన నేను రాసిన విమర్శ ఈనాటి విమల సాహితీ పత్రిక లో (13-9-2026) చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. కథా విమర్శను మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా కథ గురించి మరికొంత మంది కి సమాచారం అందుతుంది.

వ్యక్తిగత కక్షల నుంచి దేవుడిని ప్రశ్నించే దాకా సాగిన తీరని “మొక్కు”
#########################################
బొడ్డేడ బలరామస్వామి రాసిన కథ “మొక్కు” నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం” వారు నిర్వహించిన కథలపోటీ – 2025 లో పదివేల రూపాయల బహుమతి పొందింది. ఈ కథ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ [30 – 8- 2026] సంచికలో ప్రచురితమైంది.
అనాదిగా అనేక తరాలనుంచి సమాజంలో సాగుతున్న దౌర్జన్యాలు, దురాచారాలను ప్రశ్నిస్తూ సాగిన ఈ కథలో ప్రధానంగా భూస్వాములు, పొగరుబోతు జమీందార్లు తమకంటే ఏదోఒక అంశంలో తక్కువ మనుషులపై [కులం, అధికారం, డబ్బు] జరిపే దాష్టికపు పొరలు విప్పి చూపించే కొత్త ప్రయత్నం ఈ కథ “మొక్కు”. అయితే ఈ అంశం మీద వచ్చిన కథలు ఈనాటివి కాదు. దశాబ్దాలుగా ఎంచుకుంటున్న కథా వస్తువే. మారుతున్న కాలంతో పాటు సమాజపు ఆధునిక పోకడలను అద్దంలా ప్రతిబింబించేది సాహిత్యం. ఈ కథలో ప్రతిబింబించిన కొన్ని సత్యాలు ఇప్పటికీ కొరుకుడుపడనివే. అయితే ఈ కథలో మనుషుల మధ్య జరిగే కొన్ని సంఘర్షణలకు ప్రకృతిని, సాటి మూగజీవులను సాక్షిభూతాలుగా చూపించడంతో ఒక ప్రతీకాత్మక కధనం అయింది.
కథలోని సంఘర్షణ ఇద్దరు మనుషులది లేదా రెండు గొర్రెలది కాదు. సమాజంలోని ఆధిపత్య వర్గపు అహంకారానికి, శ్రమజీవుల పిరికితనానికి మధ్య జరిగే అంతరంగ బహిర్గత పోరాటం. ఈ పోరులో విజయం సాధించింది ఎవరు అనేది మూలసూత్రం. కథలో ఉండేవి రెండు ప్రధాన పాత్రలు. ఒకరు అప్పల కొండ. ఇంకొకరు పందల్నాయుడు. పేదరికంలో కృంగిపోకుండా భార్యకు వచ్చిన మంచి ఆలోచనని అమలుచేసి, బిడ్డలసాయంతో గొర్రెల పెంపకం చేపట్టి, ఆర్ధికంగా ఎదిగి, కావాల్సిన వనరులు ఏర్పాటు చేసుకుని, ఆత్మగౌరవ జీవనానికి ప్రతీక అయిన పాత్ర ఇది. అయితే యెంత ఎదిగినా, అంతర్గతంగా తాము తక్కువ అనే భావనతో ఉండి, కపట భూస్వాములను ఎదిరించలేని బానిసత్వ బతుకులకు ప్రతీక అప్పల కొండ పాత్ర. కథనంలో అతడు చివరకు పీడిత భూస్వామి దాష్టికానికి లొంగిపోయాడా లేక ఎదిరించాడా అనేది తెలియచేసిన విధానం రచయిత కథన నైపుణ్యాన్ని అంచనా వేసే కొలబద్ద. పందల్నాయుడు అవినీతి సర్పంచిగా పేరుతెచ్చుకుని, పదవి ఊడిపోయి మాజీ సర్పంచి అయినా, అప్పలకొండ లాంటి వారిని పీడించే పాత్ర. కథలో మధ్యలో వచ్చే మలుపుతో పాఠకుల ఆలోచనల్లో ముగింపు గురించి ఆత్రుత పెరుగుతుంది.
“నెర్రెలుబారిన పంట పొలంలో నిశ్చంతగా నిద్రపోతున్న గొఱ్ఱెలమంద” అంటూ ప్రారంభించిన కథ పల్లెటూరి సహజ వాతావరణాన్ని పాఠకుడిని ఆసక్తిగా ముందుకు తీసుకువెళుతుంది. కథనం కాస్తా నెమ్మదిగా సాగినా పందల్నాయుడి ప్రవేశంతో వేగం పుంజుకుంటుంది. అప్పలకొండ భయపడడానికి, పందల్నాయుడు చెప్పిన పనిని ఇష్టం లేకున్నా చేయడానికి కారణమైన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వల్ల కథని మరీ సాగదీయడం లేకుండా అవసరం మేరకు వాడుకోవడం బాగుంది. క్లైమాక్స్ లో మాత్రం భీముడు అనే గొర్రెని బాలి ఇవ్వడానికి తీసుకువెళుతుంటే, మందలోని మిగతా గొర్రెలు అన్నీ అడ్డుగా నిలిచినట్లు చెప్పడం కొంత అసహజంగా అనిపించవచ్చు, కానీ ‘ఒక కాకి చనిపోతే, చుట్టూ పది కాకులు చేరుతాయి. అలా నా భీముడి కోసం ఇన్ని గొర్రెలు అడ్డునిలబడ్డాయి. నేను మాత్రం పిరికితనంతో చావాలి అనుకున్నాను’ అని అప్పల కొండ తలపోసి, తర్వాత అతను ఏం చేస్తాడు అనేది రచయిత అల్లిన వ్యూహాత్మక రచనా మేళవింపు. అది కథని మరో స్థాయిలో నిలుపుతుంది.
కథలో వాడిన భాషా పదాలు ఉత్తరాంధ్రా యాస పదాలు[ బూతం, దొడ్డుతట్టు, గోర్జి లాంటి పదాలు] తీపి పొంగలి మధ్యమధ్యలో జీడిపప్పులు పంటికింద నలిగిన రుచిని చేకూరుస్తాయి ఉత్తరాంధ్ర ప్రాంతం వారికి. అయితే అన్నీ ప్రాంతాలవారికి ఈ పదాలు తెలియదు కనుక కథలో సందర్భాన్ని బట్టి ఆ పదాలను అర్ధం చేసుకోవాల్సిన కష్టం పాఠకులకు తప్పదు. ఇది కథలో ఎంచదగ్గ లోపం కాదు. పాత్రల సంభాషణలు ఉత్తరాంధ్ర మాండలికంలో సాగడం గమనిస్తే, భాషకు ప్రాణం పొసే యాసలను కథల ద్వారా బతికించుకోవచ్చు అనే ఆశ కలుగుతుంది. ప్రాంతాలను, యాసలను, పాఠకులను కలిపే వంతెన కథా సాహిత్యం అనడంలో ఎటువంటి సందేహం రాదు ఈ కథను చదివినవారికి.
సంభాషణల్లో ఎక్కడా కృత్రిమత్వం కనపడలేదు ఈ కథలో. “ఏంట్రా కుర్రకుంక..నోరులెత్తుంది”, “నాను మొక్కీసుకున్నను. నువ్వు సచ్చిగింజుకున్నా దీన్ని అమ్మోరికి బలిచ్చే తీరుతాను”, “మడిసి తన బూతం దీర్చుకోడనికి ఇట్టాటి మొక్కు ఎట్టుంటాడు” ఇలాంటి సంభాషణలు కథకి మాండలికపు సొబగులు అద్దాయి.
కథ శీర్షిక “మొక్కు” అనేది కథలో నాయకుడైన అప్పలకొండకు వర్తించదు. ప్రతినాయకుడైన పందల్నాయుడు అప్పకొండ మీద ఉన్న కసిని తీర్చుకోవడానికి, అతని గొర్రె భీముడ్నిఅమ్మోరుకు బలివ్వాలనుకొనే తలంపు ఈ కథకు ఆయువు పట్టు కాబట్టి, రచయిత కథకి “మొక్కు” అని పేరు పెట్టిఉండవచ్చు కానీ, ఈ కథకి అంతకన్నా బలమైన శీర్షిక పెట్టివుండే ఇంకా ప్రభావవంతంగా ఉండేది అనిపిస్తుంది.
కథ ముగింపులో జంతుబలి జరుగుతున్నది అని పోలీసులకు సమాచారం ఇవ్వడం, సరిగ్గా సమయానికి పోలీసు ఇన్స్పెక్టర్ వచ్చి, ప్రతినాయకుడిని ప్రశ్నించడం, పందల్నాయుడు తనని పోలీసు నుంచి రక్షించమని అప్పలకొండకు సైగచేసి వేడుకోవడం, బలి జరగలేదు అని పోలీసు వెళ్ళిపోవడం ఇది కాస్తా నాటకీయంగా ఉంది. అయినా కథ చివర్లో అద్భుతమైన ముగింపు ఇచ్చి పాఠకుల మనోరథాన్ని గెలుచుకోవడంలో సఫలీకృతుడైనాడు రచయిత.
కథలో అంతర్లీనంగా సాగే రెండు అంశాలు వ్యక్తిగత కక్ష. జంతుబలి నిరసన. ఈ రెండు అంశాల చుట్టూ నడిచే ఈ కథలో కేంద్ర బిందువు పంద ల్నాయుడి దుష్టసంకల్పం. దాన్ని తిప్పి కొట్టి జీవకారుణ్యం వైపుకి కథను తీసుకువెళ్ళడం ఈ కథలో ఎంచదగిన మలుపు. దానికోసం అప్పలకొండ పాత్రను అత్యంత సహజంగా మలచడంలోనే రచయిత ప్రతిభ కనబడుతోంది. ఇది ఒక పల్లెటూర్లో పేద శ్రామికులపైన దురహంకార భూస్వాములు చూపించే దాష్టికాన్ని చూపిస్తూనే, జంతుబలి లాంటి దురాచారాలను నిరసించే అభ్యుదయ కవనం ఈ “మొక్కు”.
ఈ కథను ఎందుకు చదవాలి అని పాఠకులకు సందేహం రావచ్చు. అలాంటి ఆలోచన నాకు కలిగింది. అయితే కథలో “ఒక జీవిని బలిస్తాననే అక్కు మనిషికుందా?నిజంగా అమ్మోరు బలికోరుతుందా?” అప్పల కొండ వేసిన ఈ ప్రశ్నలు ఈనాటి సామాజిక వ్యవస్థలకు సూటిగా తగులుతాయి. ఈ ప్రశ్నల దగ్గరే నేను ఆగిపోయాను. సహజంగా జంతు ప్రేమికను నేను. రచయిత ఈ కథలో ఏం చెప్పదల్చుకున్నాడు అనేది ఈ ప్రశ్నలతో అర్ధం చేసుకోవచ్చు. అధికారుల అండదండలతో ఇప్పటికీ పండుగలప్పుడు చాప కింద నీరులా సాగుతున్న కోళ్ళ పందాలు, దేవుడికి త్యాగం అంటూ వందల,వేల సంఖ్యలో జంతువులను చంపడం, అమ్మవారు కోరిందంటూ జంతువులను కత్తివేటుకి గురిచేసి, బలి ఇచ్చాము. [ఒక్క నెత్తురు బొట్టు అయినా దేవుడు/దేవత స్వీకరించినట్లు ఇంతవరకూ ఎక్కడా రుజువు కాలేదు. జంతువులను చంపి, మనుషులే తినడం తప్ప. దానికి భక్తిపరమైన కోటింగ్ ఈ మొక్కులు, త్యాగాలు, బలులు] మా కోరికలు తీర్చు అని దేవుళ్ళని కూడా స్వార్ధానికి వాడుకునే దురాచారాలపై సూటిగా వేసిన గొడ్డలి వేటు ఈ కథ “మొక్కు”.
కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని కథలు ఏడిపిస్తాయి. కొన్ని కథలు ఎటువంటి ప్రయోజనంలేక ఉబుసుపోని అంశాలతో ఊకపొట్టులాగా తేలిపోతాయి. కానీ పాఠకుడు కథని చదివిన తర్వాత తమనితామే ప్రశ్నించుకునేలా చేసే కథలు చాల అరుదు. అటువంటి అరుదైన కథల కోవకు చెందినది ఈ కథ “మొక్కు”. అందరూ చదవాల్సిన కథ. పదిమందికి చేరవేయాల్సిన కథ ఇది. రచయిత బొడ్డేడ బలరామస్వామి గారికి హృదయ పూర్వక అభినందనలు.
కథా విమర్శ
రోహిణి వంజారి
9000594630