“ఆమె లేని వీధి”. ఈ వారం విమల సాహితీ పత్రిక లో “ప్రసేన్ “ గారు రాసిన కథ గురించి నా విశ్లేషణ కథా దర్పణం శీర్షిక లో చదవండి


రోహిణి కథా దర్పణం – 2
కథ: ఆమె లేని వీధి
*****************************************************
రచన : ప్రసేన్
“మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని కోల్పోయామని తెలుసుకోవడం ఒక దుఃఖం. కానీ ఆ మనిషి బతికున్నప్పుడు ఆ మనిషి హృదయంలోకి చూడలేకపోయామని ఆలస్యంగా తెలుసుకోవడం ఇంకా పెద్ద దుఃఖం” అత్యంత ఆర్ధ్రమైన ఈ మాటలు “ఆమె లేని వీధి” కథలోని ప్రధాన పాత్ర చేత పలికిస్తాడు రచయిత. ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి 2 ఆగస్టు 2026 సంచికలో ప్రచురితం అయింది.
స్థూలంగా కథని పరిశీలిస్తే, స్వతహాగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నవారు జరిగిన సంఘటనని కానీ, కలిసిన వ్యక్తిని కానీ ఒక సబ్జెక్టు, ఆబ్జెక్ట్ గానే చూస్తారు తప్ప వారి మనసులోకి దేనిని తీసుకోరు అంటారు. ఈ కథలోని ప్రధాన పాత్ర కూడా ఒక జర్నలిస్ట్. ఏదో పని మీద అతను తరచూ ఊర్లోని కొత్త బజార్ ప్రాంతానికి వెళుతుంటాడు. అది ముంబైలోని రెడ్ లైట్ ఏరియా లాంటి ప్రాంతం. అక్కడ రాణి అనే ఆమె ఇతన్ని తరచూ నవ్వుతూ పలకరించేది. కొంటెగా మాట్లాడేది. కవ్వించేది. మీ దగ్గర అయితే డబ్బులు కూడా తీసుకోను అనేది. ఆమె మాటలకు సమాధానం ఇచ్చేవాడు కాదు. పైపెచ్చు ఆమెతో మాట్లాడితే తన ఇమేజ్, జర్నలిస్టుగా తాను సంపాదించుకున్న గౌరవం, నమ్మకం వంటివాటి మీద మచ్చ పడుతుందేమో అనే భయం. దానికి కారణం ఆమె పడుపు వృత్తి. ఆమెతో మాట్లాడేవాడు కాదు కానీ, ఆమె వైపు దొంగతనంగా అయినా చూసేవాడు. ఆమె దేహ సౌందర్యం, మాటకారి తనం అతన్ని అంతగా ఆకర్షిస్తాయి. ఆమె మాట్లాడే తెలివైన మాటలు కూడా ఆమె చదువుకున్న మనిషిలా ఉంది అనిపిస్తాయి. కనీసం లోకాన్ని అయినా ఈమె చదివుంటుంది అనుకుంటాడు. అక్కడికి వెళ్లిన ప్రతిసారి ఏదోఒక చోట ఆమె తారసపడుతుంటుంది.
కొన్ని రోజుల తర్వాత ఏదో గొడవకు సంబంధించిన వార్తల కోసం మళ్ళీ అతను కొత్త బజార్ ప్రాంతానికి అర్ధరాత్రి వెళతాడు. రిపోర్టులు రాసుకుని వెళుతుంటే ఆమె కనిపిస్తుంది. అతన్ని చూసి పేలవంగా నవ్వి, నిరాశగా “సార్. మీకు ఎప్పుడైనా ఎక్కడికైనా పారిపోవాలనిపించిందా?” “ఎక్కడికైనా…మనల్ని ఎవరూ గుర్తు పట్టని చోటుకి” అని అతన్ని ప్రశ్నింస్తుంది. అతనేం సమాధానం చెప్పడు. కానీ ఆమె ప్రశ్న అతన్ని వెండాడుతూనే ఉంటుంది. తర్వాత ఆరు నెలల కాలం ఆమె తలపుల్లోనే గడిచిపోతుంది. మళ్ళీ ఒకరోజు కొత్త బజారుకి వెళతాడు. ఆమె అక్కడ కనిపించదు. ఆమెను చూడాలని తపన, ఆమె పట్ల తనకు పెరుగుతున్న మోహతీవ్రత అతన్ని ఆమెవైపు లాగుతుంటే, తరచూ ఆమె కోసం ఆ ప్రాంతానికి వెళతాడు. ఇదివరకూ ఆమె కనిపించిన ప్రదేశాలన్నీ గాలిస్తాడు. కానీ ఆమె జాడ ఉండదు. తర్వాత ఆమె ఈ లోకంలోనే లేదు అన్న పచ్చినిజం ఆమె స్నేహితురాలిద్వారా తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆమె మరణం పట్ల అతని స్పందన, దుఃఖం, నిరాశ, చివరగా ఆమెను కోల్పోయాక తను ఏం కోల్పోయాడో తెలుసుకున్న క్షణాలు, జీవితంలో ఏం కోల్పోకూడదు అనే జ్ఞానం గురించి రచయిత ఇచ్చిన విశ్లేషణలు కథని మామూలు వాస్తవ స్థాయిని దాటుకుని, తాత్విక, అధివాస్తవ శిఖరాగ్రపు పైతలం మీద కథని నిలబెడతాయి.
మనసుకు దగ్గరైన వారు అనుకున్న మనిషినో, బంధాన్నో కోల్పోతే ఆ మనిషిని ఎందుకు కావాలనుకుంటున్నాము అనే ఎరుక వారు బతికున్నప్పుడు కాక మరణించాక తెలిస్తే, ఆ ఎరుక తాలుకు దుఃఖం అన్నీ అహాలను, బేషజాలను తొలగించి మనసుని ఏరకమైన మకిలి అంటని స్పటికంలా మారుస్తోందో, అనేకానేక ముసుగులు వీడిన మనిషి అంతరంగం ఎలా ఉంటుందో తెలియాలంటే ఖచ్చితంగా “ఆమె లేని వీధి” కథ చదివి తీరాల్సిందే. అయితే ఈ కథ మొత్తం జర్నలిస్ట్ పాత్ర వెర్షన్ లోనే సాగుతుంది. రాణి అనే ఆమె కలలు, ఇష్టాలు, కోరికల గురించి కూడా జర్నలిస్ట్ పాత్ర ఆమెను చూసిన, ఆమె ఇతనితో మాటాడిన ఒకటి రెండు పొడిపొడి మాటల ద్వారా ఇతను ఊహించుకోవడమే. మరో కోణంలో ఆమె తాను చేసే వృత్తి పట్ల తన మనసులోని భావనలు, సంఘర్షలు ఆమె పాత్ర చేతనే చెప్పించివుంటే, బాగుండేది అనిపిస్తుంది.
ఈ కథలోని కొన్ని వ్యాఖ్యలు స్పందించలేని రాతి గుండెలను కూడా కదిలిస్తాయి. “మనిషి కోరికలకు కూడా ఒక చీకటి నైతికత ఉంటుందేమో! బయటపడకపోతే ఏదైనా నైతికమే”, “ఆమె మరణం…ఒక దేహ మరణం కాదు, నేను ఎప్పటికీ తెలుసుకోలేని ఒక సమాధాన మరణం”, “పాపం అంటే మనం చేసింది మాత్రమే కాదు. చేయలేక చేయకుండా వదిలేసింది కూడా పాపమే” “ఒక మనిషిని మనిషిగా చూడకపోవడం కూడా పాపమే” మనిషిని ఒక అవసరంగానో, వస్తువుగానో, కోరికగానో చూడడం చాల మంది చేసే పొరపాటు పని. కానీ మనిషిని మనిషిగా చూడడం అనేది అసలైన తాత్విక దర్శనం తనకి తాను కలిగించుకోవడం. కథ చివర్లో ఆ జర్నలిస్ట్ ఆమె పట్ల అటువంటి యదార్ధాన్ని కనుగొని స్థిమితపడతాడు. ప్రసేన్ గారు తప్ప మరొకరు ఇటువంటి రచన చేయలేరు అన్నంత పరిణతి ఈ కథలో పాఠకులు చూస్తారు. ఆమో, అతడో ఎవరైనా సరే మనం కలవాలనుకుని ఆశపడి, అన్వేషించి, వారు బతికున్నప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేసి, చివరకు వారు చనిపోయాక, వారి మరణం తాలూకు దుఃఖం మిగిల్చిన
శూన్యమే “ఆమె లేని వీధి”.
రోహిణి వంజారి