ఈ వారం సృజన క్రాంతి సాహితీ పేజీలో నా కవిత “ప్రేమ తరగలు”. Wilson Rao Kommavarapu గారికి ధన్యవాదాలతో..

కర్తవ్యాన్ని పూర్తి చేసిన సైనికుడిలా
చలి మౌనంగా వెనుదిరిగింది..
మోడువారిన బీడులన్నీ
పచ్చగా విచ్చుకుంటున్నాయి..
లేత చిగుళ్ళ వగరుకి చైత్ర కోయిలలు
సానబెట్టుకున్న స్వరాలతో
వసంత రాగాన్ని పదేపదే ఆలపిస్తున్నాయి..
అమావాస్య చీకటిని చీల్చుతూ
విల్లులా ఒంపు తిరిగిన బాలచంద్రుడు
రంజాన్ మాసానికి స్వాగతం పలికాడు..
మరోపక్క
వేపపూత, మామిడి పిందెలు
ఆమని పిలుపు అందుకుని
ఉగాది రాక కోసం ఉవ్విళ్లూరుతున్నాయి..
మసీదుల నుంచి వినిపించే
పాతేహా దువా ప్రార్ధనలు
హృదయపు గదులను స్వచ్ఛం చేస్తుంటే
వసంత లక్ష్మి ఆగమనం కోసం
కోవెల్లో పండితులు చదివే వేద నాదాలు
శ్రవణ గవాక్షాలకు
కమ్మదనాన్ని చేరుస్తున్నాయి..
ఇఫ్తార్ సహార్ విందుల సువాసనలు
గాలితోపాటే పయనిస్తూ
ఘ్రాణనాడులకు పరిమళాలు
అందిస్తున్నాయి..
ఉగాది వెంబడి రంజాన్
నీ వెంటే నేను
నీకు ఆసరాగా నేను..
నువ్వు నేను అంటే మనం
భాయ్ భాయ్ అనే పలకరింపులు
చక్కెర కలిపిన కోవాబన్నులా
మాటలకు మెత్తదనాన్ని అద్దుతున్నాయి..
సామరస్యంతో పులకరించిన
మనసులు
పాల కడలంత తేటగా
ప్రేమ తరగలను
ఉప్పొంగిస్తున్నాయి..
రోహిణి వంజారి
9000594630