3. రోహిణి కథా దర్పణం – 3

ఈనాటి (30-8-2026) విమల సాహితీ పత్రిక లో ప్రముఖ సాహితీవేత్తలు శ్రీ పాపినేని శివశంకర్ గారు రాసిన “శిశిర వసంతాలు” కథ గురించి నేను రాసిన విమర్శ చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి

కథ: శిశిర వసంతాలు

రచయిత : శ్రీ పాపినేని శివశంకర్

” స్త్రీ , పురుషుల మధ్య అనుబంధం అంటే ఎప్పుడూ దగ్గరగా ఉండటమేనా? దానికి శరీరమే సరిహద్దా?”

ఆధునిక, వర్తమాన కాలంలో ఎవరికి వారు సూటిగా వేసుకోవలసిన ఈ ప్రశ్నలు ఈ వారం విడుదలైన ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం [23-8-2023] సంచికలో ప్రచురితమైన “శిశిర వసంతాలు” కథలోనివి. రచయిత ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత [రజనీ గంధ కవిత్వ సంపుటి] శ్రీ పాపినేని శివశంకర్ గారు.

“శిశిర వసంతాలు” అనే శీర్షిక చూడగానే ఇది తప్పకుండా వృద్దాప్యంతో శారీరక, మానసిక కుంగుబాటుకు గురైన జీవితాల గురించి రాసిన కథ అనిపించింది. అయితే కథలోకి వెళ్ళాక, వ్యక్తుల జీవితాల్లో వృద్దాప్యం కన్నా ముందు, మధ్యవయసు దశలో కుటుంబం, వృత్తి, భాద్యతలు, ఒత్తిడి, అలసటల మధ్య వ్యక్తులు తమని తాము కోల్పోయి, శిశిరం రాల్చేసిన హరితాన్ని తల్చుకుంటూ, మోడులుగా మిగిలి మళ్ళీ ఒక పచ్చటి వెలుగు కోసం తపించే జీవితాల కథ ఇది అనిపించింది.

ప్రపంచీకరణ, ఆధునిక జీవితాలు, పెద్ద కుటుంబాలు నశించి, వ్యక్తి కేంద్రకంగా సాగే జీవితాల్లోని అసంతృప్తిని, స్తబ్దతని అనుభవిస్తున్న జీవితాలు. తడిఆరిన హృదయాలు. మూగబోయిన హృదయతంత్రులు. ఎక్కడో ఓ చోట మళ్ళీ ఎవరో ఆ హృదయ తంత్రులను మీటితే ! నిశ్శబ్దాన్ని ఛేదించి, వసంత రాగాన్ని ఆలపిస్తే..? నెర్రలు బారిన గుండె గదుల్లో మళ్ళీ అనురాగపు తొలకరిజల్లులు కురిస్తే ! ఆ వ్యక్తుల జీవితాలు ఎలా మారుతాయి? అందువల్ల ఆ వ్యక్తులతో పాటు అనుబంధంగా ఉన్న వారి కుటుంబాలు ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సివస్తుంది? అంతిమంగా ఈ కథ ఏం చెప్తుంది అనేది అత్యంత ఆసక్తి కలిగించే విషయం.

కథలోకి వెళితే సిద్దార్ధ ఒక విశ్వవిద్యాలయంలో పర్యావరణ శాస్త్రవేత్త. వృత్తిలోని ఒత్తిడులు, ప్రయాణాలు, అలసటలతో ఒకరకమైన స్తబ్ద జీవితం సిద్ధార్థ ది. అతని ఆరోగ్యం గురించి అనుక్షణం కనిపెట్టుకుని ఉంటూ, ఆమె పరిధిలో భర్తకు సేవలు చేస్తూ, అనురాగాన్ని పంచే ఇల్లాలు సిద్ధార్థ భార్య లావణ్య. అతని మేధోపరమైన ఆలోచనలు, వృత్తిలోని ఒత్తిడుల గురించి వారిద్దరూ ఎప్పుడూ చర్చించుకోలేదు. ఆమెకు తెలియవు కూడా. ఆ రకమైన అసంతృప్తి అతనిలో పొడచూపిఉంది.

సమీర ఇంటిని బాధ్యతాయుతంగా నడిపే గృహిణి. అదే సమయంలో జీవితంలో కొంత అసంతృప్తిని మోస్తున్న స్త్రీ. సమీర గృహిణిగా ఉంటూనే, పర్యావరణ విద్యా కార్యక్రమాలు నిర్వహించే ఒక స్వచ్చంధ సంస్థలో పార్ట్ టైమ్ కోఆర్డినేటర్. ఆ పనులకోసం ఆమె తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. ఆమె భర్త గవర్నమెంట్ ఆఫీసర్. అయితే ఆమె తరచూ బయటకు వెళ్ళడం ఇష్టం లేని అతను ఆమె చుట్టూ ఒక నియంత్రణ రేఖను గీస్తాడు. ఆ పరిధిలోనే సాగే ఆమె జీవితంలో కూడా తెలియని అసంతృప్తి. పెళ్ళి కాకముందు తను పుస్తకాలు చదవడం, కవితలు రాయడం, పాటలు పాడుకుంటూ, తనకి నచ్చిన పనులు చేసి ఆనందంగా గడిపే వనిత. పెళ్ళి తర్వాత భర్త నియంతృత్వపు నీడలో తన చైతన్యలను అన్నిటినీ కోల్పోయి, జీవితాన్ని నిశ్శబ్దంగా, నిస్తేజంగా, మోడులా గడిపే గృహిణి. భర్త మాటలు కనపడని గోడలుగా ఆమెని ఊపిరాడనీయవు.

అలాంటి అసంతృప్తులు ఉన్న ఆ ఇద్దరూ హైదరాబాద్ లో జరిగిన ఓ పర్యావరణ సదస్సులో కలుస్తారు. శాస్త్రవేత్తగా సిద్దార్ధ తన ప్రసంగాన్ని వినిపిస్తాడు. ప్రకృతిని కోల్పోవడం అంటే మనిషి తనని తాను కోల్పోవడం అంటాడు. ఆ మాటలు సమీరని కదిలిస్తాయి. ఆ విషయాన్నే అతనికి చెప్తుంది. ఇద్దరి పరిచయానికి ఆ సదస్సు వేదిక అవుతుంది. ఆ సాయంత్రం ఆమెకు జ్వరం రావడం, అతను మాత్రలు, సూప్ ఇవ్వడం వంటివి వారి స్నేహం పెరగడానికి ఊతం అవుతాయి. పత్రికలో వచ్చిన ఆమె కవితని అతను మెచ్చుకోవడం, అతను రాసే వ్యాసాలకు ఆమె మేధోపరమైన సూచనలు ఇవ్వడం ఇద్దరి మనస్సులో కొత్త సందడి మొదలవుతుంది. అంతవరకూ గడిపిన స్తబ్ద జీవితంలో ఒక కదలిక. ఒక పక్క జీవితేశ్చను పెంచే సిద్దార్ధ మాటలు. మరోపక్క ఇంట్లో భర్త “వంట చేసావా?”, “గ్యాస్ బుక్ చేసావా?” లాంటిసాధారణ అవసరపు మాటలు తప్ప ఇంకే రాగాన్ని ఆలపించని మృతమౌనాలు.

వారి పరిచయం స్నేహంగా మారి, స్నేహం కాస్త అప్పుడప్పుడు ఫోన్లో చాటింగ్ చేసుకునేంతగా పెరిగి, కాఫీ డే లకి, ఔటింగ్ లకి వెళ్ళడం లాంటి పరిణామాలు వారి జీవితాల్లో చోటు చేసుకుంటాయి. అందువల్ల వారిలో కలిగిన ఒక నూతనోత్తేజం వారి ముఖంలో, ప్రవర్తనలో ప్రతిబింబించడంతో స్నేహితులు, ఇంట్లో వాళ్ళు గుర్తించి అడగగానే, తాము చేస్తున్నది సరైనదేనా అని తమని తాము ప్రశ్నించుకోవడం మొదలుపెడతారు. “నేను మీకేం తక్కువ చేసాను?” లావణ్య అడిగిన ప్రశ్న సూటిగా సిద్దార్ధ హృదయాన్ని ఛేదిస్తుంది.

ఇద్దరూ తమ మధ్య ఏర్పడిన బంధం గురించి పునరాలోచిస్తారు. తమ బంధం అంతిమ లక్ష్యం ఏమిటో గుర్తించి, చివరికి వారు ఏమి నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ కథకు ముగింపు. తమను తాము కోల్పోయి, ఇంకో మనిషి పరిచయం ప్రేరణగా తమ శిశిర జీవితానికి ఆమని వెలుగులు నింపుకోవాలనుకునే వారికి చక్కని సందేశాన్ని ఈ కథ అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కథకు తీసుకున్న వస్తువు చాల పాతది అయినప్పటికీ, కథని రాసిన పాపినేని శివశంకర్ గారు సామాన్యులుకారు. తమ అసామాన్య మేధో నైపుణ్యంతో శిల లాంటి వస్తువుకి శిల్పానికున్న నయగారాన్ని కలిగించి, ఎంతో నైపుణ్యంతో చెక్కిన కథా శిల్పి వారు. నిపుణులైన రచయిత చేతిలో రూపుదిద్దుకున్న సాహితీ శిల్పం ఈ “శిశిర వసంతాలు” కథ.

“ఒక సరస్సు ఎండిపోతే కేవలం నీరే కాదు. మనలోని మృదుత్వమూ ఆవిరి అవుతున్నట్లే”, “ప్రతి శిశిరం అవతల ఎక్కడో ఒక వసంతం ఉంటుంది”, “ఒక మనిషిని ప్రేమించడం అంటే కేవలం ఆ వ్యక్తిని పొందడం కాదు, వారు మరింత వికసించడానికి దోహదపడడం కూడా”, “ప్రతి కలయిక ఒక కొత్త శ్వాస, ఒక కొత్త భయం”, “Distance is environmentally irresponsible” కథలో అడుగడుగునా కనిపించే ఇటువంటి జీవనసత్యాలు కథ స్థాయిని పెంచాయి. తప్పకుండా అందరూ చదవాల్సిన కథ ఈ “శిశిర వసంతాలు.

రోహిణి వంజారి

సంపాదకులు

ప్రముఖ రచయిత్రి, కవయిత్రి

కథా విమర్శకులు

9000594630

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *