విమల సాహితీ ఇం[న్న]టర్ వ్యూ “కలం నా గళం”

ఈ నాటి “విమల సాహితీ” పత్రికలో నా పరిచయం. నా ఆలోచనలు చూడండి. డాక్టర్ విద్యాధర్ రావు జెల్ది గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. శ్రీమతి కల్యాణి తురిమెళ్ళ గారికి ప్రత్యేక దన్యవాదాలు

పూర్తి పేరు : రోహిణి వంజారి

జన్మతేదీ : 04-02-1971

జన్మ స్థలం : నెల్లూరు

స్థిరనివాసం : హైదరాబాద్

తల్లిదండ్రులు: అరిశా ఆదిలక్ష్మి, అరిశా సత్యనారాయణ

విద్యాభ్యాసం: B.Sc, B.Ed.

వృత్తి : 20 సంవత్సరాలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని ఆరు స్కూల్స్ లో సైన్స్ టీచర్ గా అనుభవం.

జీవిత భాగస్వామి: కృష్ణ మూర్తి వంజారి, టీ.వి. నటులు

సంతానం : శ్రీనివాస చైతన్య, వైష్ణవి

ప్రచురించిన పుస్తకాలు:

**********************

1. నల్లసూరీడు కథలు

2. విజయమహల్ సెంటర్ కథలు

3. దిగులు వర్ణం కవిత్వసంపుటి.

1.మీ సాహిత్యప్రస్థానం ఎక్కడినుండి ప్రారంభమైంది?

***********************************************

జవాబు: మా నాన్న నెల్లూరు ప్రభుత్వ బి.ఎడ్. కాలేజీ గ్రంధాలయంలో పనిచేసేటప్పుడు, నా కోసం స్వాన్, బాలల కథల పుస్తకాలు తెచ్చేవారు. వాటితోపాటు చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలు చదివాను. హైస్కూల్ సమయంలో మా పక్కింటివాళ్ళు ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి వారపత్రికలు తెప్పించేవారు. అవి ఒక్క పేజీ కూడా వదలకుండా చదివేదాన్ని. మా మేనత్త శమంతకమణి బాడుగకు నవల్స్ తెచ్చి చదివేవారు. అప్పుడే యద్దనపూడి సులోచనారాణి, యండమూరి లాంటి వారి రచనలు పరిచయం అయినాయి. కాలేజీకి వెళ్ళే సమయంలో ఇంటికి దగ్గరగా ఉన్న మహిళా గ్రంథాలయంకి వెళ్ళి, చాల పుస్తకాలు చదివాను. ఆ స్పూర్తితో ఆంధ్రభూమికి కొన్ని కవితలు రాసి పంపాను. అలా పంపినవాటిలో నా మొదటి కవిత “అభాగ్యుడు” ఆంధ్రభూమి లో “కోయిలా కుయిలా” కవితా శీర్షికలో ప్రచురణ అయింది.

2. రచయిత/కవిగా మారడానికి ఏదైనా ప్రత్యేకమైన సంఘటన ప్రేరణగా మారిందా?

******************************************************

జవాబు: చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు నాకు వేదన కలిగించినవి, కన్నీళ్ళు తెప్పించినవి చాల రోజులు నన్ను వెంటాడేవి. నా కళ్ళ ముందు జరిగిన, నాకు మాత్రమే తెలిసిన విషయాల గురించి పదిమందికి తెలియాలి అనే తాపత్రయం, ఇక రాయకుండా ఉండలేని స్థితిలో నా ఆవేదనలకు అక్షరరూపం కల్పించాను. ఉదాహరణకి మేము కొత్తగా చేరిన ఇంటి వెనుక ఇంట్లో అమ్మ, కొడుకు ఇద్దరు మానసిక, శారీరక వేదనలతో చనిపోయి,శవాలుగా మారి వారం అయినా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ గుర్తించలేకపోయారు. బిజీ పరుగుల జీవితంలో పక్కవారిని పలకరించే మనుషులు లేక కొంతమంది అనాధలుగా బతుకీడుస్తున్నారు. ఆ సంఘటన కలిగించిన వేదనలో పుట్టిన కథ “ఆసరా”. నవ్య పత్రిక ఉగాది కథల పోటీలో బహుమతి పొందింది.

3. మీ చిన్నప్పటి చదువులు, పుస్తకాలు లేదా గురువులు మీ మీద ఎలా ప్రభావం చూపించారు?

******************************************************

జవాబు: చిన్నప్పటి నుంచి కథల పుస్తకం కంటపడితే వదలకుండా చదివేదాన్ని. నేను నెల్లూరులో ఆ.బి. ఎం. గర్ల్స్ హైస్కూల్ లో చదివాను. అది మిషనరీ స్కూల్ కావడంతో మా సుశీలమ్మ టీచర్, చంద్రలీలమ్మ టీచర్స్ రోజు అసెంబ్లీ సమయంలో ప్యానెల్ బోర్డు మీద బొమ్మలు పెట్టి, బైబిల్ కథలు చెప్పేవారు. తెలుగు బోధించే విజయలక్ష్మి టీచర్ లీజర్ పీరియడ్స్ లో మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలగురించి మొత్తం పరిజ్ఞానాన్ని అందించేవారు. మా ఇంట్లో రెంట్ కి సైకిల్ షాప్ నడిపే కరీముల్లా బాబాయ్ వంటి వారి వల్ల కొంత మహమ్మదీయుల సంస్కృతి తెలిసింది. మా ఇంటికి అతి సమీపంలో చల్లా ఏనాదుల సంఘం ఉండేది. అక్కడ నివసించే బడుగు ప్రజల జీవితాలను చాల దగ్గరగా చూసాను. ఇలా మొత్తంగా పరిచయమైనా ప్రతి వ్యక్తి నుంచి, జరిగిన సంఘటనల నుండి ప్రేరణ పొందాను.

4.మీ కవిత్వం/కథల్లో ప్రధానంగా ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు?

********************************************************

జవాబు: నావన్ని నేలమీది కథలే. ఊహలు, ప్రకృతి వర్ణనలు చాల తక్కువ. కన్నీళ్ళు తెప్పించే సంఘటనలకు చలించిపోతాను. సర్వ జీవుల ఎడల సమభావం [జంతువులతో సహా] కలిగివుండాలి. హింస చేయకుండా ప్రతిప్రాణికి ప్రేమను అందించాలి అనే విలువలకి నేను కట్టుబడి ఉంటాను. ఇక అలనాటి కన్యాశుల్కం కాలం నుండి ఈనాటి మహిళల అస్తిత్వవాదం వరకు పురోగామి జీవితాలు నా కథలకు ఆయువుపట్లు.

5. మీ రచనల్లో ఎక్కువగా వ్యక్తిగత అనుభవాల ప్రభావమా, లేక ఊహాజనితమా?

*******************************************************

జవాబు: పైన జవాబులో చెప్పనట్లు నావి మనిషి కథలు. నాకు ఎదురైనా ప్రతిమనిషి నుంచి ఓ కథ పుడుతుంది. దళిత క్రిస్టీయన్ అని ఒక వ్యక్తికి, అతని జీవనాధారం అయిన ‘టీ’ బంకు పెట్టుకోవడానికి ఎవరూ కాసింత జాగా ఇవ్వరు. చివరకు తన హోటల్ ముందు కాస్త జాగా ఇస్తాడు ఒకవ్యక్తి. అక్కడనుంచి కూడా తరిమేయాలని చూస్తారు కొందరు. ఆ పరిస్థితిలో అతనేం చేసాడు అనేది నా రెండవ కథ “నల్ల సూరీడు”. పంటలు పండక ఎండ్రిన్ తాగి చనిపోవాలనుకున్న వ్యక్తి, ఊరందరికీ మేలు చేసిన వ్యక్తిగా ఎలా మారాడు అనేది నా “దాసాని పూల మడుగు” కథ. కవిత్వం కూడా అంతే. ఊసరవెల్లి రంగులు పూసుకున్న మాయలోకపు ముసుగులు తొలగించే ప్రయత్నాలు నా “దిగులు వర్ణం” కవితలు.

6. ఒక రచన చేయడానికి మీకు ఎక్కువ ప్రేరణ కలిగించే పరిస్థితి ఏది?

********************************************************

జవాబు: ఒకటని కాదు. పొద్దున లేచి పేపర్ చూసినా, టీవీలో వార్తలు చూసినా ఎక్కడెక్కడో ఏవేవో విషాదాలు గుండెను మెలిపెడతాయి. ఇలా ఎందుకు జరుగుతోంది. ఇంత దయలేని మనుషుల మధ్య మనం మసలుతున్నామా అనే ఆలోచనలు స్థిమితంగా ఉండనీయని పరిస్థితుల్లో ఆవేదనకు అక్షరరూపం ఇస్తాను.

7. మీ రచనా శైలిలో మీరు ఎవరైనా కవులు/రచయితల ప్రభావాన్ని అనుభవించారా?

********************************************************

జవాబు: ఖచ్చితంగా. బుచ్చిబాబు గారి “చివరకు మిగిలేది” నవల, రావిశాస్త్రి గారి “అల్ఫ జీవి”,

కేశవ రెడ్డి గారి “చివరి గుడిసె” నవలలు నా పైన చాల ప్రభావం చూపించాయి. శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానం, అలిశెట్టి ప్రభాకర్ వంటి అభ్యుదయ కవిత్వం చాల నచ్చుతుంది. కానీ వారి రచనా శైలి వారిదే. వారిలా మరొకరు రాయలేరు. అలాగే సమకాలీన కవులు, కథకుల రచనలు చాల ఉత్తమమైన వాటిని నేను చదివాను. అయితే రచనా మార్గం తెలుస్తుంది కానీ, కథల్లో ఎవరి శైలి వారికే ఉండాలి. అనుకరణ కూడదు అని నేను నమ్మి, ఆచరిస్తాను.

8. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజాన్ని, సమస్యలను మీరు ఎలా చూడగలుగుతున్నారు ? అవి మీ రచనల్లో ఎలా ప్రతిబింబిస్తాయి.

*******************************************************

జవాబు: ప్రపంచమే ఇప్పుడు దిక్కులేనిది అయింది. ఏ మూలనుంచి యుద్ధపవనాలు మిసైల్స్ విష వర్షం కురిపిస్తాయో, ఏ చోట చిన్నారులు భయవిహ్వలులై నేల రాలిపోతున్నారో, ఎక్కడ పరువంటూ కన్నబిడ్డలను నరికి కాటికి చేరుస్తున్నారో, నిచ్చన మెట్ల సమాజంలో పైమెట్టుకూ, కిందిమెట్టుకూ అంతరం ఎప్పుడు నశిస్తోందో, ఎక్కడ పసిపాపలు చిరునవ్వులు చిందిస్తూ గుండెలమీద చేయి వేసుకుని కలల పంటను కంటారో, అంత వరకూ మనసున్న మనుషులకు కంటికి కునుకు ఉండదు కదా. అందుకు నేను, నా రచనలు కూడా అతీతం కాదు.

9.సాహిత్యం సమాజాన్ని మార్చగల శక్తి కలిగి ఉందని మీరు నమ్ముతున్నారా?

*****************************************************

జవాబు : ఒకప్పుడు రంగనాయకమ్మ గారు రాసిన “జానకి విముక్తి” రచన చాల మంది మహిళలను ప్రభావితం చేసింది. వారి రచన చదివి తమ బానిస జీవితం నుంచి బయట పడ్డాము అని అప్పట్లోనే కొందరు మహిళలు చెప్పడం నాకు తెలుసు. శ్రీ శ్రీ కవిత్వం కార్మికులను, కర్షకులను ఎంత ప్రభావితం చేసిందో మనకి తెలుసు. అయితే సాహిత్యానికి సమాజాన్ని మార్చగల శక్తి ఉంది అని పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు సాహిత్యం, కళలకన్నా సోషల్ మీడియా ఎక్కువ ఆకర్షిస్తోంది. సాహితీ విలువలు తగ్గించే రచనలు కూడా పాఠకుల పైన చెడు ప్రభావాన్ని చూపవచ్చు.

10. ఆధునిక సాహిత్యం, సామాజిక మాధ్యమాల్లో రచనల ప్రభావం పై మీ అభిప్రాయం ఏమిటి?

*****************************************************

జవాబు: ఆధునిక సాహిత్యం కొత్త పుంతలు తొక్కుతోంది. మానవ సంబంధాల్లోని సంక్లిష్టాలు, నవీన జీవన విధానంలోని సాధకబాధకాలు అన్నింటిని తమ రచనల్లో అలవోకగా ప్రతిబింపచేస్తున్నారు నేటి సీనియర్ మరియు యువ రచయితలు. అయితే ఒక రచన చేసి, దానిని పత్రికలకి పంపి, ప్రచురణ కొరకు ఎదురుచూడడం ఇప్పటివరకూ జరుగుతోంది. దానివల్ల మన రచనలు వెలుగుచూడడానికి కొంత ఆలస్యం జరిగినా, అనుభవజ్ఞులైన సంపాదకులు కథలను చదివి, లోపాలు ఉంటే సరిచేసి, ముడిబంగారాన్ని నాణ్యమైన నగలాగా మలచే స్వర్ణకారుల్లాగా మంచి కథలను పాఠకులకి అందిస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా రచనలు చేసేవారిని ఎదురుచూసే ఓర్పు లేక, తాము అనుకున్నదేదో గబగబా రాసేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. లైకులు, కామెంట్స్ ని లెక్కబెట్టుకుని తృప్తి చెందుతున్నారు. దీనివల్ల నాసిరకం రచనలు వస్తున్నాయి అనడం అతిశయోక్తి కాదు. అయితే కొన్ని మంచి రచనలు కూడా వెలుగు చూస్తున్నాయి అని చెప్పడం కూడా సబబు.

11. మీరు కవిత/రచన రాయడం ప్రారంభించే ముందు ఏమైనా ప్రత్యేక అలవాట్లు పాటిస్తారా ? [ ఉదా: నిశ్శబ్దం, సంగీతం, ఓతరితనం]

*******************************************************జవాబు : అలా ఏమి లేదు. రచన చేయడానికి ప్రధానం నా మనసే. నేను చెప్పాలనుకున్న విషయం మనసులో నలుగుతూ ఉంటే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నా రచనను కొనసాగిస్తాను.

12. సాహిత్యానికి యయసుతో సంబంధం ఉంటుందంటారా..రాయగా రాయగా వయసుతో రచనా శక్తి పరిణతి చెందుతుందంటారా..?

********************************************************

జవాబు: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడి మనకి తెలుసు. కొందరు అతి చిన్న వయస్సులోనే పరిణతి చెందిన రచనలు చేస్తారు. కొందరికి వయసు పెరిగినా పరిణతి స్థాయి, పరిపక్వ ఆలోచనలు కలగకపోవచ్చు. అయితే సాధన చేయడం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే దానికి సాహిత్యం అతీతం కాదు.

13. ఏ రకమైన రచనలు వస్తే సమాజంలో మార్పు సాధ్యం అని మీరు నమ్ముతారు?

*******************************************************

జవాబు: ఈ ప్రశ్నకు జావాబు కంటే ముందుగా సాహిత్యం ఎంతమంది చదువుతున్నారు, ఎంత మందికి మంచి సాహిత్యం చేరువ అవుతోంది అనేది లెక్కకు రావాలి. సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ, యూట్యూబ్ రీల్స్, చెత్త వీడియోలు ఆకర్షించినంతగా సాహిత్యం ప్రజలను ఆకట్టుకోవడం లేదు. కరోనా కాలంలో ప్రింట్ మీడియా దెబ్బ తిని చాల పత్రికలు మూతపడ్డాయి. ముందు సాహిత్యాన్ని సమాజానికి చేరువ చేయగలిగితే, మార్పు దానంతట అదే వస్తుంది. ఇదైతే అసాధ్యం అనలేము కానీ, సాహితీకారులు కుల, మత, ప్రాంత, జాతి విభేదాలు మరచి సాహిత్యాన్ని ప్రజల చెంతకు చేర్చేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలి.

14. మీ సాహితీ ప్రస్థానంలో మరచిపోలేని మధుర జ్ఞాపకం?

*****************************************************

జవాబు: 2016 ఏప్రిల్ నెలలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చి పనులు చేసుకుంటూఉంటే, నా పేరు మీద ఏదో కొరియర్లో కవర్ వచ్చిందని ఫోన్ వచ్చింది. మా అబ్బాయి చైతన్య వెళ్ళి కవర్ తెచ్చి నా చేతికి ఇచ్చాడు. కవర్ తెరచి చూస్తే, గురువులు శ్రీ ఏ. ఎన్. జగన్నాథశర్మ గారు సంపాదకత్వం వహిస్తున్న ఆంధ్రజ్యోతి వారి నవ్య వారపత్రిక. ఆత్రంగా పేజీలు తిప్పి చూస్తే, నేను రాసిన మొదటి కథ “సూపర్ టీచర్ సిండ్రోమ్” ప్రచురింపబడి ఉంది. ఆ రోజు నా కళ్ళల్లోని మెరుపుని అబ్బాయితో పాటు, మా పాప, శ్రీవారు కూడా పంచుకున్నారు. సాహితీ లోకంలోకి తొలి అడుగు వేసిన ఆ రోజు నాకు చాల ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని అందించింది.

15. మీ రచనల ద్వారా పాఠకులకు చివరికి ఏ సందేశం అందాలని మీరు కోరుకుంటారు?

*******************************************************

జవాబు: సందేశాలకన్నా జరిగిన నిజాల గురించి, నేను గ్రహించిన వాస్తవాలు పాఠకులకు చేరాలి అనుకుంటాను. కథంతా చెడు రాసి, చివర్లో ఇలా చేయడం తప్పు అని చెప్పే రచనలు, సినిమాలు ఇప్పుడు చూస్తున్నాం. పాఠకులు చివర్లో ఉన్న సందేశాన్ని వదిలేసి, కథలో తమకి ఉపయోగపడే దినుసులకోసం చూస్తారు. అయితే ఒక కథ ద్వారా పాఠకులకు లేదా సమాజానికి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ, నేను ఇలా ఉన్నాను, మీరు నన్ను అనుసరించండి అని చెడుని వారిపై రుద్దడం ఎంత మాత్రం సమంజసం కాదని నా అభిప్రాయం.

విమల సాహితీ పత్రికలో నా పరిచయాన్ని ప్రచురించి, నన్ను పాఠకులకి మరింత చేరువ చేసిన సంపాదకులు శ్రీమతి కళ్యాణి తురిమెళ్ళ గారికి, విమల సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ విద్యాధర్ జెల్ది గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ రోహిణి వంజారి

మొబైల్: 9000594630

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *