అమ్మ చెప్పింది

ఈనాటి విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధం లో నేను రాసిన కథ “అమ్మ చెప్పింది” చదవండి. మీ ఇంట్లో ఉన్న చిన్నారులకు చదివి వినిపించండి. కథ భావాన్ని వివరించి చెప్పండి. మీ మిత్రుల బిడ్డల కోసం కథని షేర్ చేయండి

సాయంత్రం ఇంటి గంట కొట్టగానే చాల మంది పిల్లలు ఇళ్ళకు వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లలు మాత్రం బడి చుట్టూ ఉంటే జాగాలో ఆడుకుంటున్నారు. బడి ముందర ఉండే జామచెట్టు కింద కూర్చుని, వాళ్ళ అమ్మ వస్తుందని ఎదురుచూస్తూ కూర్చున్నాడు గౌతమ్. ఇంతలో కొంతమంది పెద్ద తరగతుల పిల్లలు జామచెట్టు, సపోటా చెట్లు ఎక్కి పచ్చి పిందెలను తెంపి, కొరికి వగరుగా ఉన్నాయని పడేస్తున్నారు. కొందరు చెట్ల కొమ్మలు పట్టుకుని ఊగుతూ, కొమ్మలు విరిచి పడేస్తున్నారు. పూలమొక్కలు తొక్కి, మొగ్గలు కోసి పాడుచేస్తున్నారు. అంతా చూస్తున్న గౌతంకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వాళ్ళ దగ్గరకి వెళ్ళి “అన్నా..! ఎందుకు చెట్లను విరిచి పాడుచేస్తున్నారు. వాటికి కూడా ప్రాణముంటుంది తెలుసా. పాపం అవి బాధ పడతాయి” అన్నాడు చేతులూపుతూ.

“మాకు తెలుసులే. వేలెడంత లేవు నువ్వు మాకు నీతులు చెప్తావా. పోరా..పోయి నీ పని చూసుకోపో” అని ఎగతాళిగా నవ్వి, కావాలని ఒక చిన్న మొక్కను వేళ్ళతో సహా పెరికి పారేసాడు నవీన్. మిగతా వాళ్ళు పగలబడి నవ్వారు. వాళ్లంతా ఐదో తరగతి చదువుతున్నారు. తను చెప్తే వాళ్ళు వినలేదు సరికదా, తనని తిడుతున్నారు. ఇపుడు ఏం చేయాలి అనుకుంటూ, తనకి వచ్చిన ఆలోచనని అమలుపరచడానికి వెళ్ళాడు. నేరుగా హెడ్ మాస్టర్ కరుణాకర్ సార్ గది దగ్గరకి వెళ్ళాడు. చిన్న పిల్లాడు తనగదికి రావడం ఆయనకి ఆశ్చర్యం కలిగించింది “గౌతమ్..ఏంటి ఇలా వచ్చావు..!” అన్నాడాయన.

హెడ్ మాస్టర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ “సార్. మరేమో అక్కడ పెద్ద అన్నా వాళ్ళు చెట్లను పాడుచేస్తున్నారు. జామచెట్టు ఎక్కి కొమ్మలు విరిచేస్తున్నారు. పూల చెట్లు తొక్కెస్తున్నారు. చెట్లకు ప్రాణముంటుంది తుంచకూడదు అని చెప్తే నన్ను కోప్పడుతున్నారు” అంటూ తాను చూసిందంతా చూసినట్లు ధైర్యంగా చెప్పాడు.

“శెభాష్ గౌతమ్. ఇప్పుడే మనం వెళ్ళి చెట్లను పాడుచేసినందుకు వాళ్ళకు తగిన శిక్ష వేసి, బుద్ధి చెపుదాం. చెట్లకు ప్రాణముంటుందని నీకు ఎవరు చెప్పారు? వాడి అమాయకమైన మాటలకి ముచ్చటేసి అడిగాడు హెడ్ మాస్టర్.

“మా అమ్మ చెప్పింది సార్ ” అన్నాడు కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. గౌతమ్ చేయి పట్టుకుని చెట్లు ఉన్న దగ్గరికి వెళ్ళాడు హెడ్ మాస్టర్.

గౌతమ్ చెప్పినట్లే అక్కడ పెద్దపిల్లలు చెట్లమీదికి ఎక్కి, కొమ్మలు విరిచేస్తున్నారు. వాళ్ళు తుంచి పారేసిన మొగ్గలు, కొమ్మలు ఆటస్థలంలో పడివున్నాయి. హెడ్ మాస్టర్ రావడంతో పిల్లలందరూ చెట్లమీది నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించారు. కొంతమంది పిల్లలు అప్పటికే వెళ్ళిపోయారు. ఇంతలో గౌతమ్ వాళ్ళ అమ్మ వసుధ స్కూల్ దగ్గరకు వచ్చింది. గౌతమ్ తనకి చెప్పిన విషయాలు ఆమెకి చెప్పి, గౌతమ్ ని మంచి మార్గంలో నడిపిస్తున్నారు అని ఆమెని ప్రశంసించాడు. పక్కరోజు పొద్దున గౌతమ్ తో పాటు ఆమెని కూడా స్కూలుకి రమ్మని చెప్పాడు.

మర్నాడు గౌతంతో పాటు, వాళ్ళ అమ్మ కూడా స్కూల్ కి వచ్చింది. అసెంబ్లీ ప్రారంభమై, ప్రార్ధనా గీతం పూర్తి కాగానే గౌతమ్ ని స్టేజి మీదకి రమ్మని పిలిచాడు హెడ్ మాస్టర్. గౌతమ్ స్టేజి మీదకు వెళ్ళగానే, పిల్లలందరికీ గౌతమ్ ని చూపిస్తూ “ఈ చిన్నారి విద్యార్థి గౌతమ్. రెండో తరగతి చదువుతున్నాడు. నిన్న కొందరు పెద్ద పిల్లలు బడిలో ఉన్న చెట్లను పాడుచేస్తుంటే చూసి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెట్లను పాడుచేయకూడదు అని చెప్పాడు. వాళ్ళు వినకపోయేసరికి, ధైర్యంగా నా దగ్గరకు వచ్చి, వాళ్ళు చేసిన పనిని నాకు చెప్పాడు. నిన్న గౌతమ్ ని తిట్టిన వాళ్ళు నిలబడండి. మీరెవరో నాకు తెలుసు” అన్నాడు హెడ్ మాస్టర్ కరుణాకర్ ఐదోతరగతి పిల్లలు కూర్చున్న వైపు చూసి. ఇక తప్పదు అన్నట్లు నిలబడ్డారు కొందరు పిల్లలు. వారంతా ముందు రోజు చెట్లను తుంచి, పాడుచేసినవాళ్ళు. వాళ్ళ చేత గౌతమ్ కి సారీ చెప్పించాడు హెడ్ మాస్టర్.

చెట్లు మనకి చాల రకాలుగా ఉపయోగపడతాయి. ఆహారాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇళ్ళు కట్టుకోవడానికి కలపను ఇస్తాయి. చాల రకాల పక్షులు, కీటకాలు, కొన్ని రకాల జంతువులకు ఆశ్రయాన్నిస్తాయి. ముఖ్యంగా జీవులన్నింటికీ ప్రాణవాయువుని ఇచ్చి, మన ప్రాణాలను నిలబెడతాయి చెట్లు. అటువంటి చెట్లను పాడుచేయడం తప్పు. ఇంకోసారి ఎవరైనా చెట్ల పైకి ఎక్కి, పిందెలు కోయడం, కొమ్మలు విరిచేయడం, మొగ్గలను తుంచడం లాంటివి చేస్తే వాళ్ళను తప్పకుండా శిక్షిస్తాను. చెట్లను కాపాడమని చెప్పిన గౌతమ్ కి ఓ చిరు బహుమతి అంటూ గౌతమ్ చేతికి ఒక మంచి పెన్ను ఇచ్చాడు హెడ్ మాస్టర్ కరుణాకర్. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. మంచి విషయాలు నేర్పుతున్న గౌతమ్ వాళ్ళ అమ్మను కూడా హెడ్ మాస్టర్, ఇతర టీచర్స్ ప్రశంసించారు.

అప్పటినుండి ప్రతి నెల రెండవ శనివారం పిల్లలచేత మొక్కలు నాటించడం, పాదులు తీసి, నీళ్ళు పోయించడం, ఎండుటాకులు, కలుపు మొక్కలను తొలగించడం వంటి పనులను చేయించసాగాడు ఆ బడి హెడ్ మాస్టర్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *