రెండో బాల్యం

ఈనాటి సృజన క్రాంతి సాహితీ పేజీలో నా కవిత “రెండో బాల్యం” చదవండి. Wilson Rao Kommavarapu సర్ కి ధన్యవాదాలతో

ఏటిగట్టున చింతచెట్టు

కొమ్మకు ఊయల కట్టాను

దిగంతాల అంచుల నడుమ

అలిసిపోయేదాకా ఊగాను..

దిక్కుతోచని పిల్లపిట్టలా

తోటంతా కలయదిరిగాను

పూల పరిమళానికి

మత్తిల్లిన గొల్లభామలా

గడ్డిపరుపు పైన కాసేపు

సోలిపోయాను..

సాయంత్రపు నీరెండకు

నీడలు పొడుగవుతున్నాయి

రేగిపోయిన జుట్టులో

పిల్లగాలి గడ్డిపూలు తురుముతోంది

నునులేత పారిజాత రేకులు

నా ముఖాన్ని తడుముతూ

దోబూచులాట మొదలుపెట్టాయి..

బుగ్గకు తగిలిన

ఆ పసిపాలుకారినముద్దుకు

ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను

చిట్టి చేతులతో నా ముఖాన్ని తడుముతూ

కిలకిలా నవ్వుతోంది బుజ్జి కుందేలు..

ఆ క్షణంవరకు కళ్ళు తెరచే కలకంటున్నాను

మహా నగరపు రంగుల పార్కులో

జారుడుబండ అంచున కూర్చుని నేను

ఒడిలో గులాబీరంగు

బుట్టగౌనులో

నా కూతురి బిడ్డ..

చుట్టూ కాపలాదారుల

కెమెరాచూపుల్లో

ఆటలాడుతున్న బుజ్జాయిలు

రెండో బాల్యంకి చేరువలో ఉన్ననన్ను

కాలచక్రాన్ని వెనక్కి తిప్పి

బాల్యపురంగు కొయ్యగుర్రంమీద

పసిదనపు వీధులన్నీ

చుట్టించుకొచ్చింది

నా బుజ్జికుందేలు పిల్ల..

రచన: రోహిణి వంజారి

9000594630