ఈ పక్షం “సారంగా” పత్రికలో ప్రచురితం అయిన నా కథ “సమాధానం లేని ప్రశ్న” ఇక్కడ చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా కథ మరికొంత మందికి చేరుతుంది.
భుజానికి హ్యాండ్బ్యాగ్, చేతిలో సూట్కేసుతో దిగాను. రైలు దిగే, ఎక్కే ప్రయాణికులతో స్టేషనంతా గోలగోలగా ఉంది. ఓసారి చుట్టూ పరికించి చూసాను. వస్తానన్నాడే ! ఏదైనా పని ఉండి రాలేదేమో. ఆలోచనల మధ్య ఉండగానే, “అమ్మా..యమునా” పిలుపుతో తల తిప్పాను. ఎదురుగా గోపాల్ అన్నయ్య. కాలం, పరిస్థితులు పెంచిన దూరంతో మేము కలిసి చాల ఏళ్ళయింది. ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు. దాచడానికి ప్రయత్నించలేదు ఇద్దరం. సూట్కేసు చేతిలోకి తీసుకుని ఆటోని పిలిచాడు. ఇంటికెళ్ళగానే సరోజ వదిన కుశలప్రశ్నలు వేసి కాఫీ ఇచ్చింది.
“రిజిస్ట్రేషనుకి ఇంకా రెండురోజులు పడుతుందట యమునా. డాక్యుమెంట్లలో కొన్ని కరెక్షనులు చేయాల్సిఉందన్నారు రిజిస్టార్ ఆఫీస్ వాళ్ళు” ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అన్నాడు గోపాలన్నయ్య.
“అవునా” అన్నాను ఇక ఏమనాలో తెలియక. ఊర్లో నా పేరా ఉన్న అరెకరా పొలం అక్కరకు వస్తుందని ఇప్పుడు అమ్మడం. వదిన ఉల్లికారం వేసి దోశలు పోసిచ్చింది అన్నయ్య , నేను తినేశాము.
“అన్నా..బాబా గుడికి వెళదామా? ” అడిగాను. “నాకు ఆఫీస్ టైం అవుతోంది. నువ్వెళ్ళిరా యమునా. సాయంత్రం ఎటైనా వెళదాం” ఎవరో తరుముతున్నట్లు గబగబా వెళ్ళిపోయాడు.
“యమునా..లంచ్ కి టేబుల్ మీద అన్ని సర్ది పెట్టాను. తిను” చెప్పేసి లంచ్ బాక్స్ తీసుకుని వదిన కూడా ఆఫీస్ కి వెళ్ళిపోయింది. అన్న, వదిన ఇద్దరూ వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలాను. సాయంత్రం వరకు కాలక్షేపం చేయాలిక .
హాల్లోకి వచ్చి టి.వి. పెట్టాను. ఉహు. చూడబుద్ది కాలేదు. ఊర్లోనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనే సంగతి గుర్తుకు రాగానే కొత్త ఉత్సాహం వచ్చింది. వాళ్ళతో మాట్లాడి చాలాకాలం అయింది. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారో లేదో అనే సందేహంతోనే విమలకి కాల్ చేసాను. ఫోనెత్తలేదు. మరో రెండుసార్లు ట్రై చేశాను. నో రెస్పాన్సు. విసుగు పుట్టి, సాయిలక్ష్మి నెంబరుకు కాల్ చేశాను. రింగ్ అవుతోంది. తనైనా రెస్పాన్సు ఇస్తుందో లేదో అని సందేహిస్తూ ఉంటే అవతల నుంచి, “హలో..ఎవరండీ” అని వినిపించింది. హమ్మయ్య అనుకుని “సాయిలక్ష్మీ..నేను యమునని” అన్నాను. “యమునంటే సెంటర్ యమునేనా?” సందేహంగా అడిగింది.
“అవును సాయిలక్ష్మి” అన్నాను ఉత్సాహంగా. “అబ్బా.. యమునా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు! ఎలా ఉన్నావు?” అడిగింది. “బాగున్నాను సాయిలక్ష్మి. అన్నా వాళ్ళింటికొచ్చాను. నువ్వు మా ఇంటికి రాకూడదా, ఇద్దరం కల్సి సాయిబాబా గుడికి వెళదాము”
“ఏంటి..! బాబా గుడికా” తన స్వరంలో ఏదో తెలియని కంగారు.గుడికే కదా నేను రమ్మంది. ఇంత గాబరా ఎందుకు అనుకుంటుంటే, అంతలోనే “యమునా..! మరి ఇప్పుడు నన్ను ‘సాయిలక్ష్మి’ అని పదే పదే పిలవకు. లక్ష్మి అని మాత్రమే పిలువు. ఎవరైనా వింటే బాగుండదు”
“అదేంటే..! నీ పేరు సాయిలక్ష్మి నే కదా. మీ ఇంట్లో అందరు సాయిభక్తులని, అందరి పేర్ల ముందు సాయి అని ఉంటుంది కదా”
కొత్తగా పేర్లు మార్చుకున్నారా ఏంటి? విపరీతమైన ఆశ్చర్యం .
“అదంతా ఒకప్పుడు . ఇప్పుడు మేమెవరం సాయిబాబాను కొలవడం లేదు”
“అయ్యో..ఎందుకలా?” అవాక్కయినాను.
“ఇప్పుడు మా వాళ్ళు కొందరు బాబాపేరు తల్చుకోవడానికి కూడా ఇష్టపడడంలేదు. వాట్సాప్ గ్రూపులు పెట్టి, సాయిబాబా ఆరాధన నిషేధం చేసారు. ఆ నియమాన్ని అతిక్రమించినవాళ్ళని వెలేసి ఒంటరిని చేస్తున్నారు”
“అదేంటే.. ఎప్పట్నుంచి ఇలా” నేను ఏం వింటున్నానో అర్ధం కాలేదు.
“సాయి బాబా పరాయి మతం వారికి మద్దతుగా నిలిచాడని. మాటికి ముందు “అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఏక్” అంటాడని” అంది సాయి లక్ష్మి.
“అదంతా ఇప్పటిది కాదుకదా. ఎన్నో దశాబ్దల ముందు నుంచి బాబాను కొలుస్తూ, ప్రతి ఊరిలో బాబా మందిరాలు నిర్మించి, రోజుకి నాలుగు హారతులు అంటూ తరించి, ఇప్పుడేంటి..! ఇలా ?” ఏదో తెలియని ఆందోళన నాలో.
“ఏంటో యమునా, మన దేశంలో కొన్ని చోట్ల బాబా మందిరాలను కూలగొట్టారట. ఇప్పుడు యూ ట్యూబ్ లలో కూడా బాబాకి వ్యతిరేకంగా చాలామంది ప్రచారం చేస్తున్నారట నీకు తెలీదా?” అంది లక్ష్మి.
“అల్లర్లు జరిగాయని న్యూస్ లలో చూసాను. ఆ అంటురోగం ఇక్కడిక్కూడా వ్యాపించిందా..!”
ఏమోనే! మా పేర్ల ముందు సాయి అనే పదం ఉండకూడదన్నారు. అందుకే నా పేరు ఉత్త లక్ష్మి అయింది. ఈ రోజు మా సమూహం అడ్మిన్ వాళ్ళింట్లో పూజ ఉంది. నేను రేపొస్తాను మీ ఇంటికి ప్లీజ్ యమునా..” కాల్ కట్ చేసింది
.
పొద్దున అన్నయ్యను బాబా గుడికి వెళదామంటే అంత కంగారుపడ్డాడు. ఇప్పుడీ సాయిలక్ష్మి షాక్ ఇచ్చింది. ఏంటి వీళ్ళు ఇలా తయారైనారు! బుర్ర తిరిగిపోయింది. ఈ పదిహేనేళ్ళల్లో ఎంతమార్పు..! ఏవేవో ఆలోచనలతో మనసు వికలమై, చాలాసేపటివరకు చలనం లేని నీటి కొలనులా కూర్చుండిపోయాను. డోర్ బెల్లు సౌండ్ వినపడి ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చాను. డోర్ తీయగానే పోస్టుమ్యాన్ యేవో కవర్లు ఇచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళాడు. కవర్లు టేబుల్ మీద పెట్టి, టైం చూస్తే మూడున్నర కావస్తోంది. ఆకలివేయలేదు. ఫ్రిడ్జ్ లో నుంచి మజ్జిగ తీసుకుని తాగాను. పడుకుందామని ప్రయత్నిస్తే కంటిమీదకు కునుకు వస్తేగా. కళ్ళు మంటపుడుతున్నాయి. సింకు దగ్గర కుళాయి తిప్పి గుప్పిళ్ళతో నీళ్ళు తీసుకుని ముఖం మీద చల్లుకున్నాను. ఇక ఇంట్లో నిలవలేకపోయాను.
హ్యాండ్బ్యాగ్ భుజానికి తగిలించుకుని, మెయిన్ డోర్ తాళం వేసి, వరండాలో ఉన్న షూ రాక్ లో తాళాన్నిపెట్టి, బయలుదేరాను.
ఆటో ఎక్కి కూర్చుని పోవాల్సిన చోటు చెప్పాను. ఇరవై నిమిషాల తర్వాత ఆటో దిగి, డ్రైవరుకి డబ్బులిచ్చేసి, తలెత్తి చూసాను. రంగులు వెలిసిపోయి, అక్కడక్కడా పెచ్చులూడిపోయుంది మందిరం పైభాగం. మనసు చివుక్కుమంది. చెప్పుల స్టాండ్ దగ్గర ఎవరూ ఉన్నట్లు లేదు. అక్కడికి కాస్త ఎడంగా ఓ ముసలాయన కూర్చుని ఉన్నాడు. అతని ముందర చిన్న గుడ్డ పరచి ఉంది.
“తాత.. నువ్వొక్కడివే ఉన్నావు. ఇక్కడ ఇంకా కొంతమంది కూర్చుంటారు కదా ” అనగానే నన్ను ఎగాదిగా చూసి,
“ఈవాళ సెనోరం కదమ్మా. ఎంకటేశర సోమి గుడికాడికి పోయుండారు అందురూ. రేపు చర్చి కాడ ఉంటారు. రెండూ కాళ్ళు లేని అవిటోడిని. యాడికి కదల్లేక ఈడ్నే ఉండాను తల్లీ” అన్నాడు నేలమీద కర్ర తాటించి, నా హ్యాండ్బ్యాగ్ చాయ ఆశగా చూస్తూ.
ఓహో..బిచ్చగాళ్ళు కూడా రోజుని బట్టి చోటును, దేవుడిని మారుస్తున్నారన్నమాట. అయినా వారాలతో సంబంధం లేకుండా బాబా గుడి ఎప్పుడూ జనాలతో కళకళలాడేది. ఇప్పుడేంటి ఎవరూ కనిపించడం లేదు? నా సందేహాన్ని తీర్చేవారు అక్కడెవరూ లేక, గుడిలోపలకి అడుగుపెట్టాను. మందిరంలోనే కుడివైపున్న పూజ సామగ్రి అమ్మే అంగడి మూసేసి ఉంది.
“గురోరమొక్కటే ఆ అంగడి తీస్తారమ్మా” బైట నుంచి అంతా గమనిస్తునట్లున్నాడు. ముసలాయన మాట పెద్దగా వినపడింది. ఇప్పుడు మాట సాయం చేస్తే, వెళ్ళేటపుడు ముష్టి వేస్తానని ఆశ కాబోలు. ప్రధాన ద్వారం దగ్గర వంగి గడపని కళ్ళకద్దుకుని, లోపలకు అడుగువేశాను.
మందిరం లోపల ఒకటి, రెండు లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి, ఏదో కోల్పోయిన్నట్లు మసగ్గా ఉంది గుడి మొత్తం. బాబా విగ్రహం ముందర మాత్రం ఒక 60 వోల్టుల బల్బు వెలుగుతోంది. ఎన్నో ఏళ్ళుగా పరిచయం ఉన్న బాబా విగ్రహం. ఆ పాలరాతి మోములో ఎప్పటిలాగే చిద్విలాసంగా మెరిసే చిరునవ్వు. రెండు చేతులెత్తి నమస్కరించాను. బాబా పాదాలవైపు చూసాను. అక్కడ రెక్కనందివర్ధనం పూలు కొన్ని తెల్లగా, కొద్దిగా వాడినట్లున్నాయి. చిన్న సెమ్మె లో ఒక్క దీపమే వెలుగుతోంది ఒంటరిగా బిక్కుబిక్కు మంటూ.
పదిహేనేళ్ళ క్రితం చివరిసారిగా చూసిన మందిరం. ఇదేమిటి..! ఒక్క పూలమాల అయినా లేకుండా బాబా మెడ వెలవెల పోతోంది. అప్పట్లో బాబా ప్రతిమ కనిపించనంతగా లెక్కకు మిక్కిలి మాలలు ఉండేవి బాబా మెడలో. గురువారం పాతిక గంపల నిండుగా టెంకాయ చిప్పలు వస్తే, మిగతా రోజుల్లో కూడా పది గంపలకు తగ్గకుండా టెంకాయలు తెచ్చేవాళ్ళు భక్తులు. ఇప్పుడేంటి గుడిలో ఒక్కరూ లేరు..! ఆలోచనలతో తల విదిల్చాను.
బాబా విగ్రహం ముందు కూర్చున్న పూజారి చేతిలో అక్షింతలు పట్టుకుని, దగ్గరకి రమ్మని సైగ చేసాడు. ప్రదక్షణం చేసి వస్తానన్నట్లు చేయి గుండ్రంగా తిప్పి, ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టాను. మందిరం వెనకంతా బూజుతో నిండిపోయుంది. సాలిగూళ్ళు వేలాడుతున్నాయి. మెల్లగా ప్రదక్షిణాలు చేస్తున్నానే కానీ, కళ్ళు మాత్రం గుడి చుట్టూ పరికిస్తున్నాయి. ఏ మూలా చూసినా ఎండిపోయిన టెంకాయపీచు, ప్లాస్టిక్ కవర్లు. గుడిని శుభ్రం చేసి చాలారోజులైనట్లుంది. అప్పట్లో గుడిలోకి అడుగుపెడితే చాలు ప్రసాదాల వాసన గుప్పుమనేది. ఇప్పుడు గుడంతా ఏదో మురికి వాసన కొడుతోంది.
పూజారి మళ్ళీ దగ్గరకు రమ్మని సైగ చేసాడు. వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. పూజారి నన్నే గమనిస్తున్నాడు. ఒక్క క్షణం భయం వేసింది. ‘ఎందుకతను పదేపదే నన్ను దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. ఎవరూ లేని సమయం. దగ్గరకు వెళితే.. వెనక్కి లాకెళ్ళి ఏమైనా చేస్తే..!’ గుడులు, ప్రార్ధనా మందిరాల్లో ఆడవాళ్లు, చిన్నారుల మీద ఎన్ని దాష్టికాలు జరిగాయో గుర్తుకు వచ్చి, ఒళ్ళు జలదరించింది. మరుక్షణం ‘ఛా ఛా..ఈ వెర్రి ఆలోచనలేంటి నాకు..! , పాపం..పేద బాపడుగా కనిపిస్తున్నాడు’ అనుకున్నాను. ఇదివరకూ నాకు తెలిసున్న పూజారి చలమయ్య ఉండేవాడు. ఈ పూజారి నీరుకావి పంచ మోకాళ్ళవరకు మడిచి కట్టుకునిఉన్నాడు. నల్లగా మురికిపట్టి, జవికిపోయిన జంధ్యం, చిరుగుల తుండుగుడ్డ భుజంమీద వేసుకుని దైన్యానికి చిహ్నంలా ఉన్నాడు.
మూడో ప్రదక్షణ అయినాక కర్పూరం వెలిగించి, గబగబా బాబాకు హారతి ఇచ్చి, పళ్ళెం తెచ్చి నా ముందుకు పెట్టాడు. హారతి కళ్ళకు అద్దుకున్నాను. పూజారి అక్కడే నిలబడి నా హ్యాండ్బ్యాగ్ చాయ నా చాయ మార్చి మార్చి చూస్తున్నాడు. అప్పుడు బుర్ర వెలిగింది నాకు. హారతి పళ్ళెంలో డబ్బులు వేస్తానని అక్కడే నిలబడి ఉన్నాడేమో. అతని ముందర హ్యాండ్బ్యాగ్ తీసి వెతకడం ఏదోగా అనిపించి, కుడిపక్కనున్న కిటికీ దగ్గరికెళ్ళి కూర్చున్నాను. పూజారి మెల్లగా హుండీ పక్కనున్న బెంచి మీద హారతి పళ్ళేన్ని పెట్టి, బాబా ముందరకి వెళ్ళి కూర్చున్నాడు. హారతి పళ్ళెంలో పది రూపాయల నోటు చూసి ఎన్నో రోజులైనట్లు అతని చూపుల్లో నిరాశ కొట్టొచ్చినట్లు కనపడింది. కాసేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రయత్నించాను. పొద్దున సాయిలక్ష్మితో జరిగిన సంభాషణలు పదేపదే గుర్తుకొచ్చి, నా ప్రశాంతతను చెడగొడుతున్నాయి.
సంధ్యా హారతికి సమయమైంది కాబోలు టేప్ రికార్డర్ ఆన్ చేసాడు పూజారి. పాతకాలపు మైకులో గురగుర శబ్దంతో వస్తున్న హారతిపాటలో స్పష్టత లేదు. అయినా ఊరికి నడిబొడ్డులో ఉన్న ఆ మందిరంలో ఆ సాయంసంధ్య వేళ బాబా విగ్రహానికి పక్కగా నిలబడి పూజారి, విగ్రహం ముందు భక్తులు నిలబడడానికి కట్టిన గ్రిల్స్ కమ్ములదగ్గర నేను, గుడి బైట ఆ అవిటి బిచ్చగాడు. అంతే. మేం ముగ్గురమే. ఒకప్పుడు సంధ్యా హారతికి గుడి క్రిక్కిరిసిపోయి, గుడి బైట వరకు జనాలు బారులు తీరేవారు. ఎందుకో మనసు మూగబోయింది. హారతి కాగానే, మళ్ళీ కర్పూరం వెలిగించి నా దగ్గరకు తెచ్చాడు. కళ్ళకద్దుకున్నాను. వెంటనే వరండాలోకి వచ్చి కూర్చున్నాను. అక్కడ చిన్న మెట్లు. స్టేజి ఉన్నాయి. ఆ స్టేజి మీద ఎన్ని కార్యక్రమాలు చూశానో లెక్కేలేదు. జనంతో గుడి నిండిపోయేది తల్చుకుంటే, అదంతా ఇక గత వైభవ దీప్తులేనా..! అనిపించింది. అర్ధరాత్రి వరకు హరికథా కార్యక్రమాలు జరిగినప్పుడు, అమ్మఒడిలో తలపెట్టుకుని నిద్రపోతే, లేపి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళిన రోజులు గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్ళు చిప్పగిల్లాయి. కళ్ళు తుడుచుకుంటూ హ్యాండ్బ్యాగ్ తీసి చూసాను. ఐదొందల కాగితం తప్ప, ఒక్క రూపాయి కూడా లేదు. జిప్పులు అన్ని తీసి ఎంతసేపు వెతికి చూసినా ఏవో కొన్న బిల్లులు, లెక్క కాగితాలు తప్ప ఇంకేం లేవు.
‘అయ్యో.. ఇప్పుడెలా..?’
ఒకప్పుడు పర్సులో ఎంతుంటే అంత లెక్క చూసుకోకుండా ఇచ్చేసిన రోజులు గుర్తుకువచ్చాయి. జీవితం కొట్టిన ఆర్ధిక దెబ్బలు, నేర్పిన పొదుపుపాఠాలు ఐదొందల నోటును ఇచ్చే పరిస్థితిలో లేనిప్పుడు. పోనీ పూజారి కి గూగుల్ పే చేద్దామని సెల్ తీశాను. ఛార్జింగ్ అయిపోయి, ఎప్పుడో స్విచ్చాఫ్ అయిపోయింది. అయినా ఆ పూజారి దగ్గర సెల్ ఫోన్ ఉందొ లేదో..! చిల్లర డబ్బులు పెట్టుకోకుండా వచ్చినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. ఓ సారి తలెత్తి పూజారిని చూసాను. బాబా విగ్రహం ముందు కూర్చుని ఏవో మంత్రాలు చదువుతున్నట్లు నోరు కదులుతోంది కానీ, ఆయన చూపంతా నావైపే ఉంది. మాటికిముందొకసారి వెనక్కి వెనక్కి తిరిగి కిటికీలో నుంచి నన్నే చూస్తున్నాడు. అప్పుడు మొదలైంది నాలో అసహనం.
ఆ పూజారికి దక్షిణ ఇవ్వడానికి నా దగ్గర చిల్లర డబ్బులు లేని నా అసహాయత కోపంగా మారి మనుషులమీదికి మళ్లింది. ‘ఛీ ఛీ..! ఏం మనుషులు. నేను గుడికొచ్చి గంటపైనే అయింది. ఇంతవరకూ ఒక్కరూ గుడికి రారేంటి..! సోషల్ మీడియా ఆకర్షించినంతగా ఇప్పుడు దేవుళ్ళు ఆకట్టుకోవడం లేదా మనుషులను..! ఎప్పుడో ఏ కష్టమో వస్తేనో “దేవుడా” అంటూ పరుగెత్తుకు రావడం, చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి వారానికో, ఆర్నెల్లకో గుడిచుట్టూ తిరగడం, పుష్కరాల్లో నదీ స్నానాలు చేసి, పాపాలు పోయాయని సంతృప్తి పడడం తప్పిస్తే, గుడికి రావాలనిగానీ, ఎప్పుడూ ఉండే ప్రాపంచిక వ్యవహారాలను పక్కనపెట్టి, కాసింతసేపు ఊరట కలిగించే ధ్యానం వైపుకు మనసును మళ్ళించి, రవ్వంత ప్రశాంతతను పొందాలని ఎందుకనిపించడంలేదో ఇప్పుడు మనుషులకు..?
గుడి అంటే ‘కలుషితమైన ఆలోచనల నుండి ఎవరి మనసును వారు శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక కర్మాగారం’ అని తెలుసుకోరెందుకు? మనుషులకు శాంతినిచ్చి, కైవల్యానికి మార్గం చూపించి, మంచి చేసేవాడుఏ రూపంలో ఉన్నా దేవుడే కదా. పేరు మారితే దైవత్వంలో తేడాలు ఉంటాయా..!? ఎందుకీ మనుషులు ద్వేషంతో కొట్టుకుచస్తున్నారు. సర్వజీవుల పట్ల సమభావంని ఎందుకు చూపలేకపోతున్నారు!’ నాలో నేనే రగిలిపోతున్నాను. మనసును దిగులు ఆక్రమించుకుంది యుద్ధ మేఘంలా. చివరిసారి పర్సునంతా గాలించాను. ఏమిదొరకలేదు. ఈ సారి కోపం కాస్తా వేదనగా మారింది. ‘మనుషులు మతాలకు దగ్గరై దైవత్వానికి దూరమవుతున్నారు. మనుషులమని మరచి సాటి మనుషులను కులం, మతం అంటూ వేరు చేస్తూ మనిషితనాన్ని కోల్పోయి మృగాలవుతున్నారు.’ మనసంతా చేదుగా అనిపించింది.
ఆ క్షణం ముసురుకుంటున్న సంధ్య చీకట్లలో, మనుషుల రాకకోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు పూజారి. ఏదెలా జరిగినా దేనికీ చలించని చిద్విలాసుడు బాబా వైపు నా చూపును మళ్ళించాక, ‘మనుషులు మందిరాలకు రాకపోతే, పాపం దేవుళ్ళు మాత్రం ఏం చేస్తారు! అనిపించింది. మనుషుల మీద కోపం, దేవుళ్ళ మీద జాలి కలిగాయి నాకు ఆ క్షణంలో. మనుషుల ఆలనాపాలనా లేక శిధిలావస్థలో ఉన్న మందిరాల్లో, చమురుదీపాల కాంతికూడా లేని చీకట్లో ఒంటరిగా మ్రగ్గుతున్న దేవుళ్ళు అనాథలా? మానవత్వానికి తిలోదకాలిచ్చి దైవత్వాన్ని దూరం చేసుకుని, మతాలకు మాత్రమే కొమ్ముకాసే మనుషులు అభాగ్యులా? సమాధానం లేని ప్రశ్నలను నాకు నేనే వేసుకుని, వికలమైన మనసుతో గుడి నుంచి బయటపడ్డాను వెనుదిరిగి చూసే సాహసం చేయలేక…