ఈనాటి ఆంధ్రజ్యోతి పత్రిక సాహితీ పేజీ వివిధ లో నా కవిత “బువ్వ గింజల మోపు” ప్రచురితం అయింది. చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. వివిధ సంపాదకులకు, మెహర్ గారికి ధన్యవాదాలతో..


గెనంగట్టు మీద నాయిన కొడవలి భుజానేసుకొస్తుంటే
బువ్వకుండ నడిచొస్తా ఉన్నట్లనిపించేది ..
గుంటబాయి నించి యాతంతో నీళ్ళు తోడిపోస్తుంటే
తొలకర్లు చిలకరించే వానదేవుడిలా అవుపడేటోడు..
చెంగోవాలు కట్టి చాడేసిన కయ్యల్లో
మెరుస్తూ తిరిగే పొద్దప్పతో పోటీపడి
పరుగుతీసే నాయినను పలకరిస్తే
పొద్దుతిరుగుడు పువ్వులా
పచ్చపచ్చంగా నవ్వేటోడు..
వరికంకుల నడమ నిలబడుకోని
పదేపదే చేతులుపతా ఉంటే
గెడకర్రకు బోర్లించిన సున్నంబొట్లకుండ మాదిరి
దిష్టిబొమ్మ ఆయ్యేటోడు..
కయ్యల్లో కలతిరగతా కొన్ని ఆశల విత్తనాలుగూడా జెల్లి
తాకట్టులో ఉన్న ఆలి తాళిబొట్టు ఇడిపించాలి
అమ్మికి పూలపూలగౌను కొనాలి అనుకుంటా
పగటికలలు కనేటోడు..
ఓ తూరి కరువమ్మ మరోతూరి వరదమ్మ
కళ్ళెర్ర చేస్తే ఆశలవిత్తులన్నీ కన్నీళ్ళలో కొట్టకపాయె
పిడేటిగొట్టి తూర్పారబట్టిన తాలుగింజల్లా కలలన్నీ కల్లలైపాయే..
ఓ చేత్తో కొడవలి మరోచేత్తో పుస్తకం నెత్తిమీద గుడ్డలమూటతో
పట్నానికి వలసొచ్చినా
ఐదు రోజులు గుమస్తాగిరి
రెండు రోజులు బువ్వమ్మ చెంత ఎగుసాయం
ఇరు భుజాల మీద మోస్తున్న సవ్యసాచి..
బతుకుకలలు కంటూ నడిచొచ్చే
బువ్వగింజల మోపు మా నాయిన..
రోహిణి వంజారి
9000594630