“కమండల గంగ” కథా విమర్శ. ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ పత్రికలో. తప్పకుండా చదవండి.

రోహిణి కథా దర్పణం – 1
********************
కథ: కమండల గంగ
********************
రచన: చాగంటి ప్రసాద్
*********************
“న మృత్యుర్న శంకా న మే జాతి బేధ:పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్నమిత్రం గురుర్నైవ శిష్య ! చిదానందరూపం. శివోహం శివోహం !”
“నాకు మరణం లేదు, భయం లేదు, జాతిభేదం లేదు. తల్లిదండ్రులు లేరు, జన్మ లేదు. నాకు బంధుమిత్రులు, గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని” ఈ మాటలు అన్నది స్వయంగా ఆ లయకారుడైన శివుడు. ఈ బంధాలు ఆత్మను బంధించనప్పుడు ఆ జీవి సుఖదుఃఖాలకు అతీతమైన అద్వైత స్థితిని పొందుతాడు. ఆ స్థితికి వెళ్ళడానికి ప్రతిఒక్కరూ చేరాలంటే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తూ, విశ్వేశ్వరుడు వెలసిన కాశీ మహానగరాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి. కమండల గంగ కథలో ఒక చోట ఈ వ్యాఖ్యాలు కనపడతాయి. మరి అద్వైత స్థితి అంటే?
ప్రముఖ కథకులు చాగంటి ప్రసాద్ గారు రాసిన “కమండల గంగ” కథ ఆమూలాగ్రం పరిశీలించాక పాఠకులకు బోధపడే సూక్ష్మర్ధం భావనాతీత స్థితిలోకి వెళ్ళిపోవడం. దానికి చూపించే మార్గదర్శనం ఈ కథలోని స్థూలార్థం. మరి భావనాతీత స్థితికి మనిషి చేరుకునే మార్గంలో అనేక శీతోష్ణ, సుఖదుఃఖ భావ సంవేదనలను ఎదుర్కోవాలి. అది కాస్త కష్టమే కానీ, అసాధ్యం మాత్రం కాదు అని ఈ కథలోని నడతని బట్టి అర్ధమవుతుంది. కథలోకి వెళితే సాగర్, విశాల దంపతులు వారి మిత్రుడు రమణతో కలిసి కాశీ యాత్రకు వస్తారు. విశాల భక్తిపరురాలు. ఆమె భర్త సాగర్ ఆస్తిక, నాస్తిక భావనల తక్కెడలో ఎటువైపు మొగ్గు చూపాలో తెలియని స్థితిలో ఉంటాడు.
వారి ముగ్గురితో పాటు పాఠకుల చేయి పట్టుకుని కాశీ క్షేత్రం మొత్తం చుట్టి చూపిస్తాడు రచయిత. అక్కడున్న చిన్నచిన్న ఇరుకు గల్లిలలో నడిపిస్తాడు. కాశీ నగరంలో అడుగుపెట్టాక, విశ్వనాధుని దర్శనం కంటే ముందు చూడాల్సిన కాలభైరవుని గుడి, డుండి గణపతి, ద్వాదశాదిత్యులను దర్శింపచేస్తాడు. దగ్గరుండి గంగా గదిలో మునకలు వేయిస్తాడు. పడవ ఎక్కించి, గంగా నది చుట్టూ ఉన్న పవిత్ర ఘాట్లన్ని తిప్పుతాడు. మణికర్ణికా ఘాట్ లో నిర్జీవ దేహాల దహన ప్రక్రియని, అలా కాలుతున్న శవాల మీద నుంచి వీచిన గాలికి ఎగసిన ధూమం గంగను స్పర్శించి, ఆకాశం వైపు పయనించడం దగ్గరుండి చూపిస్తాడు. దశాశ్వ మేధఘాట్ లో సాయంత్రం పూట ఇచ్చే గంగా హారతిని కన్నుల విందుగా దృశ్యమానం చేయిస్తారు. భోలేనాథుని దర్శనం చేయించి, విశ్వేశ్వరుని లింగాన్ని స్పర్శదర్శన భాగ్యాన్ని కలిగించి పరిసర స్పృహ తెలియనివ్వని అలౌకిక శివతత్వంలోనికి అడుగులు వేయిస్తాడు. ఇంతవరకు కాశీ నగరాన్ని సందర్శించని వారికి ఈ కథ ద్వారా కాశీలోని విశేషాలన్నిటిని ఒక గైడ్ లాగా రచయత మనకి పూసగుచ్చినట్లు చూపిస్తాడు.
ఇక ఈ కథలో కనిపించిన ముఖ్యమైన పాత్రలు టీ స్టాల్ నడిపే ముఖేష్, సూరజ్ భగవాన్ పేరుమీద తాయత్తులు కట్టే త్రిపాఠి, యాత్రికుల కోసం గంగా నదిలో పడవ నడిపే గుహారాజ్. ఉత్తర భారత దేశంలోని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వచ్చిన యాత్రికుల నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు, హిందీ భాష రాక ఇబ్బందులు పడుతుంటే, అదే అవకాశంగా తీసుకుని, కల్లబొల్లి మాటలు చెప్పి యాత్రికులను మోసం చేసేవాళ్ళు, అధిక మొత్తంలో డబ్బులు గుంజే వ్యాపారస్తులు ఉంటారు అని వినికిడి ఉంది. కొన్ని సినిమాల్లో కూడా ఇటువంటివి చూపిస్తారు. కానీ ఈ మూడు పాత్రల ద్వారా అటువంటి అపప్రధను తొలగిస్తాడు రచయిత. తమకు ఉన్న దానిలోనే ఇతరులకు సాయం చేయాలి, ఆ సాయం చేయడమే దైవత్వం అని నమ్ముతూ ఆచరించిన వ్యక్తులు టీ స్టాల్ నడిపే ముఖేష్ , గంగా నదిలో పడవ నడుపుకునే గుహారాజ్. తండ్రి, తాతల నుంచి వారసత్వంగా అందుకుని, శారీరక, మానసిక అస్వస్థతలకు గురైన వారికి, స్వాంతన కలిగించే మాటలు చెపుతూ, వారిలో నూతనోత్తేజం, నమ్మకం కలిగేలా తాయత్తులు కట్టడం, తాను నమ్మి, తన కుటుంబం కోసం కాక, ఇతరుల మంచి కోసం మాత్రమే తాయత్తులు కట్టి, వారు ఇచ్చిన త్రుణమో పణమో పుచ్చుకోవడం వంటివి త్రిపాఠి అనే పాత్ర ద్వారా చూస్తాము.
అయితే ఒకసారి ఎవరో ధర్మరాజును, దుర్యోధనుడిని కలిసి, ” మీరు ఇద్దరూ ఊరు మొత్తం తిరిగారు కదా. మీకు ఎంత మంది మంచివాళ్ళు, ఎంతమంది చెడ్డవాళ్ళు తారసపడ్డారు” అని ప్రశ్నించారట. దానికి దుర్యోధనుడు “నాకు ఒక్క మంచివాడు కూడా కనపడలేదు. అందరూ చెడ్డవాళ్ళే ఈ ఊర్లో” అన్నాడట. ధర్మరాజు “నాకు ఈ ఊర్లో ఒక్క చెడ్డవాడు కూడా తారసపడలేదు. అందరూ మంచివాళ్ళే” అన్నాడట. అంటే మనలో ఏవైతే గుణాలు ఉంటాయో, అవే ఎదుటివారిలోమనకి కనిపిస్తాయి అనడానికి వీరిద్దరూ ఉదాహరణ అయితే, ఈ కథలో కూడా కాశీ యాత్రలో ఒక్కచోట కూడా సాగర్, విశాల దంపతులు మోసపోయినట్లు కనపడలేదు అనడానికి రచయిత దృష్టి కోణం సాత్వికం కాబట్టి, అందరూ సాత్విక గుణాలు ఉన్నవాళ్ళే ఎదురైనట్లు రాశారు. ఇది కథలో ఓ చిన్న అసంతృప్తిని కలిగిస్తుంది తప్ప, కథా గమనంలో ఎంచదగ్గ లోపం కాదు.
మొత్తంగా ఈ కథని చదివాక ఎంతటి నాస్తికుడైనా సరే, విశ్వనాధుని దర్శించడానికి ఇష్టపడని వారైనా సరే, కాశీ నగరంలోని స్థానిక వ్యక్తులను కలిసినప్పుడు వారు చూపించే ఆప్యాయతకు తలవంచని వారు ఉండరు. అలాగే మణికర్ణికా ఘాట్లో కాలుతున్న చితి మంటల్లోనుంచి వినపడే చితుకుల శబ్దం, అలాగే గంగా నదిపైన పడవలో ప్రయాణిస్తుంటే, ఎంతటి వారికైనా మనస్సు నిర్వికార, తాత్విక అద్వైత దర్శనం కావలసిందే అని ఈ “కమండల గంగ” కథ ద్వారా తెలుస్తుంది. కథ ఆద్యంతం గంగా ప్రవాహంలా సాగిపోయే తాత్విక శైలి పాఠకులను కట్టిపడేస్తుంది.
ఈ కథ “కమండల గంగ” పుణ్యమూర్తుల లక్ష్మీకుమారి, డా. సత్యనారాయణమూర్తి స్మారక కథల పోటీలో బహుమతి పొంది, కథల కౌముది సంకలనంలో చోటు చేసుకుంది. తప్పకుండా అందరూ చదవాల్సిన కథ ఇది.
రోహిణి వంజారి