జాడలు

మిత్రులకు నమస్తే. నేను వ్రాసిన ఈ కథ ” జాడలు ” నవతెలంగాణ ఆదివారం బుక్ “సోపతి ” లో నవంబర్ 1, 2020 సంచికలో ప్రచురితం అయినది. మనిషిని మనిషిగా కాక కులం, మతం, ప్రాంతం, వర్గం అంటూ విబేధాలు చూపుతూ పొతే కొంతకాలానికి మనిషి జాడలు మాయమవుతాయి. ఈ నేపథ్యంలో వ్రాసిన కథ ఈ “జాడలు”. కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింది కామెంట్ బాక్స్ లో తెలుప ప్రార్ధన…

ఉదయం పదిగంటలకే ఎండ మిడిమేలంగా కాస్తోంది. లాక్డౌన్ ఎత్తేసి దాదాపు పదిహేనురోజులు పైనే అయింది. బజారులో ఒకటి అర అంగళ్ళు తెరుస్తున్నారు.

చంద్రమ్మకు చేపల కూర అంటే చాల ఇష్టం. ఏడాది పైనే అయింది చేపల కూర తిని. ఈ లాక్ డౌన్ సమయంలో తాము ఏం తిన్నామో, ఎన్ని దినాలు పస్తులు ఉన్నామో లెక్క తెలియదు ఇద్దరికి. కూటి నీళ్ళకే గతి లేకుంటే మనసు చేపల కూరమీదికి మళ్లడం ఎంత అత్యాశ. తనలో తానే నవ్వుకున్నాడు వేదాంతిలా కొండయ్య.

నిండుకున్న కుండల వంక, నీరసంతో పొట్ట వీపుకు అతుక్కుపోయి కళ తప్పిన చంద్రమ్మ ముఖం వంక చూసి గాఢంగా ఓ నిటూర్పు విడిచి తోలుసంచి భుజానికి తగిలించుకుని గోతాం పట్టను, గొడుగును చేతిలో పట్టుకుని గుడిసె నుంచి బయటకు నడిచాడు ఆరవై ఏళ్ళు దాటిన కొండయ్య.

కిటికీ తలుపు తెరిచింది గీతమ్మ. వీధికి అవతలి వైపు దృశ్యం చూడగానే ఆమె ముఖం అరుణ వర్ణంలోకి మారి జేవురించింది . కోపంతో నొసలు చిట్లించి ధభీమని కిటికీ తలుపు వేసేసింది. ” చూసారా అండి! ఆ కొండయ్య మళ్ళీ మన ఇంటి ఎదురుగా దుకాణం తెరిచాడు” . ఆమె మాట వినగానే సుధాకర్ వాకిలి తలుపు తీసి చూసాడు. సరిగ్గా తమ ఇంటికి ఎదురుగా ఉన్న ట్రాన్సఫార్మర్ ముందర చిరుగుల గొడుగు కింద కూర్చుని దారాలను నీటితో తడుపుతూ ఉన్నాడు కొండయ్య. గోనె పట్ట మీద బూట్ పోలిష్ సీసాలు, బ్రష్ లు, పాత చెప్పులు, బెల్ట్ లు పొందికగా పేర్చి ఉన్నాయి.

” నిజమే గీత.. మూడు నెలల నుంచి ఇతని పీడవిరగడైంది అనుకున్నాను. లాక్ డౌన్ అయిందో లేదో మళ్ళా తగలడ్డాడు వీడు. పొద్దునే ఈ చెప్పులు కుట్టే వెధవ సంతని చూడాలి మళ్ళీ ఇక మనం” ధుమ ధుమ లాడుతూ స్నానానికి వెళ్ళాడు సుధాకర్.

తెచ్చుకున్న నీళ్ళు ఎండకి తాళలేక పొట్టలోకి ఎప్పుడో వెళ్ళిపోయి ఖాళీ సీసా వెక్కిరించింది కొండయ్యను. పొద్దున నుంచి పడిగాపులు కాస్తే రెండు బేరాలు తగిలాయి. ఇరవై రూపాయలు వచ్చాయి. ఇంకో పది వస్తే రెండురోజులకు బియ్యం, పప్పు కొనుక్కుని ఇంటికి పోవచ్చు. దాహంతో నాలుక పిడచగట్టుకుపోతోంది కొండయ్యకు. ఖాళీ సీసాని ఎత్తి నోటిలోకి పెట్టుకున్నాడు. రెండు బొట్లు నాలుక మీద పడి, పడ్డంత వేగంగా ఆవిరైనాయి. చుట్టూ చూసాడు. వీధిలో నరమానవుడు అన్నవాడు లేడు. కుప్ప తొట్టి దగ్గర రెండు కుక్కలు పిచ్చి పట్టినట్లు చెత్తను గెలుకుతున్నాయి తినేదానికి ఏమైనా దొరుకుతుందేమో అని. విందులు, వినోదాలు అంటూ తిని, తిన్నంత చెత్త కుండీలో పారబోసి , అవసరం ఉన్నా, లేకున్నా వీధుల్లో తెగ తిరిగే మనుషులంతా మాయమై ఎక్కడకు పోయారో అని ఎంత ఆలోచించినా వాటికి తెలియక పాయె.
‘మీది, నాది ఒకటే పరిస్థితేలే ఇప్పుడు’ కుక్కల ఆరాటం చూసి నిట్టూర్చుతూ మాసిన తుండుగుడ్డతో చెమట తుడుచుకుని, ఖాళీ సీసా తీసుకుని రోడ్డు దాటాడు కొండయ్య.

వాకిలి గొళ్ళెం చప్పుడుకి ఉలిక్కి పడి చదువుతున్న ‘వివేకానందుని జీవిత చరిత్ర’ పుస్తకాన్ని మూసి ముక్కు,మూతిని మాస్కులో దాచి బయటకు వచ్చి చూసాడు సుధాకర్. ” అన్ని మంచినీళ్లు ఇప్పించండి బాబు. దాహంతో నోరెండిపోతోంది” నిలబడానికి కూడా ఓపిక లేనట్లు ఉన్న కొండయ్య ను చూసి చిరాకుగా ” నీళ్లు అడగడానికి మేము తప్ప ఇంకెవరు కనపడలేదా నీకు …మాస్కు లేకుండా బయటకు రాకూడదని తెలియదా? ” అని గీతమ్మని కేకేశాడు నీళ్ళు తెమ్మని.

తరతరాలుగా పేరుకుపోయిన ఏవగింపంతా ముఖంలో ప్రతిబింబిస్తుండగా చెంబుతో నీళ్ళు తెచ్చి పదడుగుల దూరంనుంచే కొండయ్యను సీసా కింద పెట్టమని చెంబు ఎత్తుగా పట్టుకుని సీసాలోకి నీళ్ళు పోస్తూ ” మా ఇంటికెదుగురుగా నీ చెత్త చెప్పుల దుకాణం ఎత్తేసి ఇంకెక్కడికైనా పో నువ్వు. ఇంటికెదురుగా ఆ చిరుగుల గొడుగు, పాత చెప్పులు దరిద్రంగా. మా పనులు కాక నీకు సేవలు చేయాలా మేము ” ఛీత్కారంగా లోపలికి వెళ్ళింది గీతమ్మ. సీసా సగమే నిండింది. మిగతా నీళ్ళన్నీ కిందపడి రొచ్చు అయింది అక్కడ.

‘ఛీత్కారాలు, చీదరింపులు తనకు కొత్తకాదు. మాదిగ పుటక పుట్టినప్పుడే ఆ బగమంతుడు తమ నొసటన వీటిని రాసాడు’ భైరాగిలా నవ్వుకుంటూ రోడ్డు దాటాడు కొండయ్య.

వేడుకోళ్ళు, వేడి నిట్టూర్పులు , చిటపటలు, చీత్కారాలతో మరోవారం రోజులు సెలవంటూ వెళ్లిపోయాయి.

ఆ రోజు సాయంత్రం ఆరుగంటలపుడు ఉరుము, మెరుపు లేకుండా ఊడిపడ్డ ఉప్పెనలా హడావిడిగా వచ్చాడు గీతమ్మ తమ్ముడు శ్రీధర్. అతని భార్య వినీతకి ప్రసవ సమయం. అత్తామామ, అమ్మ, నాన్న అంతా ఊర్లో ఉండిపోయారు. మరదలికి తోడుగా ఉండడానికి రమ్మని శ్రీధర్ బతిమాలడంతో కాదనలేక, రెండు రోజులు అక్కడే ఉంటానని, వంట ఏర్పాట్లు అన్ని చేసి, సుధాకర్ కి చెప్పి తమ్ముడుతో అతనింటికి వెళ్ళింది కారులో గీతమ్మ.

మధ్యాన్నం మిగిలిన చికెన్ కూర ఫ్రిడ్జిలో పెట్టి వెళ్ళింది గీతమ్మ. జిల్లుగా ఉన్న గిన్నెను ఫ్రిడ్జిలో నుంచి తీసి బాణలిలో వేసి కాస్త స్టవ్ మీద వేడి చేసుకున్నాడు సుధాకర్. అన్నం కూడా పొద్దున తినగా మిగిలినదే. తినడానికి మనసొప్పక అన్నాన్ని బయట పడేద్దాం అనుకున్నాడు. అంతలోనే మళ్ళీ మండే ధరలు, గీతమ్మ పొదుపు హితబోధ గుర్తుకు వచ్చి మరో ఆలోచనకు తావివ్వకుండా అన్నంలో చికెన్ కూర కలుపుకుని తిన్నాడు. నీళ్ళు తాగడానికి కూడా సందు లేకుండా పొట్ట నిండిపోయింది. తిన్న పళ్ళెం సింకులోకి చేరింది. బానంత ఉన్న పొట్ట కొండంత అయి ఇక ఒక్క క్షణం కూర్చోవడానికి కూడా ఓపికలేక బద్దకంగా పరుపు మీద వాలిపోయాడు.

ఉలిక్కి పడి లేచాడు సుధాకర్ . చుట్టూ చిమ్మ చీకటి. బెడ్ లైట్ వేసుకునే అలవాటు లేదు అతనికి. మంచం మీదినుంచే చేయి చాపి లైట్ స్విచ్ వేసాడు. గదంతా తెల్లగా పరుచుకుంది వెలుగు. తలని ఎవరో సూదులతో గ్రుచ్చుతున్నంత నొప్పి. సెల్ ఫోన్ లో టైం చూస్తే పావు తక్కువ మూడు గంటలు. ఒంట్లో చలి మొదలైంది. జ్వరం వచ్చినట్లు నీరసం, కడుపులో వికారంపుట్టి భళ్ళున వాంతి అయింది.

మంచం మీద నుంచి లేస్తుంటే తల తిరిగింది. మెల్లగా బాత్రూం కి వెళ్ళి వాంతి పడిన చొక్కా తీసేసి, నోరు పుక్కిలించాడు. నోట్లో చల్లని నీళ్ళు పడే సరికి ఒళ్ళంతా వణకు పుట్టింది. గదిలోకి వచ్చి ధర్మామీటర్ కోసం అల్మారాలో వెదికి అది కనపడక, తీసిన చోటే వస్తువుని పెట్టని భార్యని విసుక్కుంటూ పారాసెటమాల్ మాత్రలు అందుబాటులో ఉన్నందుకు సంతోషపడి మాత్రల షీట్ నుంచి ఒకమాత్ర తీసి నాలికమీద పెట్టుకుని సగం బాటిల్ నీళ్ళు తాగేశాడు.

ఇక నేను నీ దగ్గరకు రాను అంటూ నిద్ర అలిగి వెళ్ళిపోయింది. చలి, ఒళ్ళు నొప్పులతో మూలుగుతూ మంచం మీద కదలసాగాడు సుధాకర్ తనని ఒంటరిగా ఒదిలి వెళ్ళిన గీతమ్మని తిట్టుకుంటూ.

పొద్దుటికి ముక్కులు బిగుసుకుపోయి ఊపిరి తీయడం కష్టం అనిపించింది అతనికి. తనకు ‘కరోనా’ సోకిందో ఏమో అని భయంతో ఒణికిపోయాడు. సెల్ తీసి భార్యకి ఫోన్ చేసాడు. స్విచ్ఆఫ్ అని వచ్చింది. రెండు మూడు సార్లు ప్రయత్నించి విఫలమై తమ వీధి చివరలో ఉన్న స్నేహితుడు సుబ్బనాయుడుకి ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్ దాక తోడు రమ్మన్నాడు. ‘ తనకి ఒంట్లో నలతగా ఉంది’ రాలేను, సారీ అన్న అతని జవాబును సమాధానపరచుకోలేకపోయాడు సుధాకర్. సుబ్బనాయుడుకి ఏ అవసరం వచ్చి పిలిచినా తాను ముందు ఉండేవాడు. చిన్నగా పడక గదిలోకి వచ్చి కిటికీ తెరిచాడు. పక్కింటి ముఖర్జీ వాళ్ళ ఇంటి కిటికీ దగ్గర కనపడ్డాడు. చేయి చాపి పిలిచేలోపే ధడాలున కిటికి మూసేసాడు అతను. కరోనా కలికాలం మరి. మనిషిని మనిషి శత్రువుల చూసే పాడుకాలం దాపురించింది. ఓ పక్క బాధ, మరో పక్క తాను పిలిస్తే ఎవరు రాలేదని అసహనం అవరించింది అతన్ని.

ఒంట్లోశక్తి క్షణక్షణానికి ఆవిరైపోతుండగా ఇక లాభం లేదని మెల్లగా బీరువా తెరిచి లాకర్లో ఉన్న కొన్ని నోట్లను లెక్కపెట్టకుండానే తీసి జేబులో పెట్టుకున్నాడు. ఇంటి తలుపుకి గొళ్ళెం బిగించి తాళం వేసి వరండా గేటు తీసి వీధిలోకి వచ్చాడు. ఎండ మీద పడడంతో ఒక్కసారిగా తల గిర్రున తిరిగింది. వీధి చివరకు వెళితే కానీ ఆటోలు దొరకవు. నాలుగడుగులు ముందుకు వేసాడు అతను. కళ్ళు బైర్లు కమ్మడం మాత్రమే అతనికి గుర్తుంది . మొదలు నరికిన చెట్టులా రోడ్డు మీద కుప్పకూలాడు సుధాకర్.

బూట్లకు శ్రద్ధగా పాలిష్ వేస్తున్న కొండయ్య యదాలాపంగా కళ్ళెత్తి వీధిలోకి చూసాడు. సుధాకర్ నేలమీదకు జారిపోవడం చూసి తత్తర పడ్డాడు. ఒక్క క్షణం కాళ్ళు, చేతులు ఆడలేదు అతనికి . మరుక్షణం కర్తవ్యమ్ వెన్నుతట్టగా గోనెపట్ట మీద నుంచి లేచి చెప్పులమీద పట్టను కప్పి నీళ్ళ సీసా తీసుకుని వడివడిగా వెళ్ళి అచేతనంగా పడి ఉన్న సుధాకర్ ముఖం మీద నీళ్ళు చల్లి “బాబు.. బాబయ్య… ” పిలిచాడు కొండయ్య. అతని పిలుపులు సుధాకర్ చెవికి సోకలేదు. స్పృహలో లేని అతని నోటిని తానే తెరిచి నీటిని అతని గొంతులోకి ఒంపాడు కొండయ్య . కొన్ని నీళ్ళు గొంతులోకి వెళ్ళి మింగుడు పడ్డట్లు గొంతు కదిలింది. అప్పటికి కాస్త నిమ్మళ్ళించి చుట్టూ చూసాడు కొండయ్య.

రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఎండ మండిపోతోంది. ఒక్క ఇంటి తలుపు కూడా తెరిచి లేదు సాయం అడుగుదామంటే. సుధాకర్ ని అక్కడే వదిలి వీధి చివరకు వెళ్ళాడు అతను. సరిగ్గా సమయానికి వీరాస్వామి వచ్చాడు అక్కడకి అతని ఆటోతో సహా.

ఇద్దరు కలసి సుధాకర్ ని ఆటోలో పడుకోబెట్టారు. కొండయ్య సుధాకర్ పక్కనే కూర్చుని అతను పడిపోకుండా పట్టుకున్నాడు. ఎక్కుపెట్టిన బాణంలా ముందుకు ఉరికించాడు ఆటోని వీరాస్వామి. పదినిముషాలకల్లా ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు ఆపాడు అతను ఆటోని. విషయం తెల్సుకుని హాస్పిటల్ సిబ్బంది సుధాకర్ ని లోపలకు తీసుకువెళ్లారు.

కళ్ళు తెరిచిన సుధాకర్ కి తన వంకే ఆతృతగా చూస్తున్న కొండయ్య కనపడ్డాడు. తానెక్కడున్నాడో తెలియక గది అంతా పరికించి చూసి కొండయ్య వైపు చూసి ఏదో అనేంతలో డాక్టర్ వచ్చాడు అక్కడకి. సుధాకర్ ని చూసి మీకు అన్ని టెస్టులు చేసాం. కరోనా టెస్ట్ కూడా చేసాం. అది నెగటివ్ వచ్చింది. ఫుడ్ పాయిజన్ అవడంతో మీకు ఇన్ఫెక్షన్ సోకి జ్వరం రావడంవల్ల వల్ల మీకు స్పృహ తప్పింది. ఇతను మీకు ఏమౌతాడో తెలియదు కానీ సమయానికి మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకురావడంతో మీకు ప్రమాదం తప్పింది. బిల్లు కట్టేసి గంటలో మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఈ మందులు నాలుగురోజులు వాడండి అంటూ మందుల చీటీని సుధాకర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు డాక్టర్ మల్లికార్జున్.
మొదటిసారి కొండయ్య వంక కృతజ్ఞతతో చూసి చేతులు జోడించాడు సుధాకర్. ” వద్దు బాబు, మీరు పెద్దవారు. నాకు దండం పెట్టకూడదు”. సుధాకర్ కి ఆరోగ్యము బాగైందని తేలికపడ్డ మనసుతో అన్నాడు అతను. “కొండయ్య… నిన్ను ఎంత ఏవగించుకున్నాం మేము. అనుక్షణం నువ్వు తక్కువ కులపు వాడివంటూ నిన్ను మాటలతో చిత్రహింస చేసాం. అయినా నువ్వు నాకు సాయం చేసావు. మా మీద కోపం లేదా నీకు” అన్నాడు సుధాకర్ కొండయ్య తీరుకు అమితాశ్చర్యంతో..

” అవేమి నాకు తెలీదు సుధాకర్ బాబు..మనం మడుసులం. సాటి మడిసి ఆపదలో ఉంటే ఆదుకోకపోతే ఇక మడిసికి , జంతువుకి తేడా ఏముంది. మడిసికి మడిసి సాయం చేసుకోకపోతే ఇక మడిసి జాడలు మాయమైపోతాయి. జంతువుల్లా మిగలతాం మనం. తమరు రోడ్డు మీద నిస్సహాయంగా పడి ఉంటే చూసి కూడా నా మానాన నేను గమ్మునుంటే నేను మడిసినే కాదు. మీకు కోపం వస్తుందని తెలిసినా, అట్టా పడి ఉన్న మిమ్మల్ని ఒగ్గేసి పోలేక మిమ్మల్ని ముట్టుకుని హాస్పిటల్ కి తీసుకొచ్చాను” ఆర్తిగా వచ్చిన అతని మాటలకు కళ్ళు చెమర్చాయి సుధాకర్ కి.
వారం తర్వాత రామాయణ గ్రంథము తెరిచాడు సుధాకర్. అరణ్య కాండ ఘట్టం చదువుతున్నాడు. శ్రీరామ చంద్రుని రాక కోసం తపించిపోయిన శబరి మాత ప్రేమకు దాసుడైనాడు రాముడు. శబరి అడవుల్లో పెరిగిన దళితజాతి స్త్రీ. రాముడు తన దైవం అని అతన్ని ఆరాధిస్తూ ముదిమి కట్టే గా మారినా కూడా రాముడు తనకోసం వస్తాడని ఎదురు చూసింది. ఆ రామచంద్రుని కలుసుకునే శుభఘడియ రానే వచ్చింది. సంతోషంతో పొంగిపోయిన ముదుసలి శబరి మాత రాముని కోసం అడవి పండ్లను సేకరించి ప్రతిపండు కొరికి రుచి చూసి తియ్యగా ఉన్న పండ్లనే బుట్టలో పెట్టుకుంది తన రామునికి ఇవ్వాలని. ఆమె ప్రేమకు, అనురాగానికి తలవంచి కన్నతల్లికన్నా మిన్నగా ఆమెను అక్కున చేర్చుకుని , ఆమె ఎంగిలి చేసిన పండ్లను ఎంతో ప్రీతిగా తిన్నాడు రామచంద్రుడు. నేను క్షత్రియుడను, ఆమె దళిత స్త్రీ అని అని ఆయన చూడలేదు. అపారమైన ఆమె ప్రేమకు తలఒగ్గాడు.

చదువుతున్నవాడల్లా హఠాత్తుగా ఆగిపోయాడు కొండయ్య గుర్తుకు వచ్చి. తాను ఎన్ని మహా గ్రంథాలు చదివినా ఏం లాభం. మనుషులంతా ఒక్కటే అని తనకు కలగని జ్ఞాన్నాన్ని ఏ పుస్తకం చదవని కొండయ్య తన చేతల్లో చూపించి ఆ రోజు తనని రక్షించాడు. ఇప్పుడు తాను బ్రతికి ఉన్నాడంటే అది తనకు కొండయ్య పెట్టిన ప్రాణ బిక్షే. పుస్తకం పక్కన పెట్టి కిటికీ తలుపు తీసి చూసాడు. మండే ఎండైనా, తుఫాన్ వచ్చినా ఆ తావు నుంచి కదలడు కొండయ్య. అతను లేని ఆ తావు ఖాళీగా కనిపించింది సుధాకర్ కి. ఎవరెంత చీదరించుకున్నా ఎప్పుడూ ఆ తావుని వదలని కొండయ్య ఈ రోజందుకు రాలేదో.

బుద్ధుడికి భోధి వృక్షము కింద జ్ఞానోదయం అయితే చిరుగుల గొడుగు కింద కూర్చున్న కొండయ్య తనకు జ్ఞానోదయం కలిగించాడు. మనిషి వాసనా, మమత రుచి తనకు తెలియజాసాడు. కానీ తన ప్రాణం కాపాడిన కొండయ్య కి తాను చేసింది ఏముంది. తన పిల్లలు వలస పక్షుల్లా విదేశాలకు ఎగిరిపోయినా తనకు అర్ధబలం, అంగబలం ఉన్నాయి. అవన్నీ కొండయ్య తనకు చేసిన సాయం ముందు దిగదుడుపే. కొండయ్య పిల్లలు కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ముదిమి వయస్సు లో అతనికి ఆ చిరుగుల గొడుగు తప్ప ఇక ఏ అండా లేదు. కొండయ్య చేసిన సాయానికి బదులుగా అని కాదు కానీ సాటి మనిషిగా తాను అతన్ని ఆదుకోవాలి. అతను చెప్పుల షాప్ పెట్టుకునే దానికి తాను ఆర్థికంగా సాయపడాలి. అవసరం అయితే బ్యాంకు లోన్ ఇప్పించాలి. ఇప్పుడే కొండయ్య ఇంటికి వెళ్ళి అయినా ఈ విషయం చెప్పాలి. చెప్పులేసుకుని గేటు మూసి, గీతమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా రెండు వీధుల అవతల కొండయ్య గుడిసె ఉన్న వాడ దగ్గరకు వెళ్ళాడు సుధాకర్.
గుడిసె ముందరి దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు సుధాకర్. కొండయ్యను పాడే మీద పడుకోబెట్టి ఉన్నారు. కొండయ్య భార్య చంద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది తనను ఒంటరిని చేసివెళ్ళడని. ఒక్క క్షణం తానేం చూస్తున్నాడో అర్ధం కాలేదు సుధాకర్ కి. ” రాత్రి వరకు బాగానే ఉన్నాడు. కూడు తిని పడుకున్నాడు. పొద్దునకి శవమైనాడు. పొద్దున మనిషి కదలకపోయేతలికి చంద్రమ్మ ఆర్.ఎం.పి . డాక్టర్ పుల్లయ్య ని తీసుకొస్తే, చూసి గుండె పోటుతో నిద్రలోనే ప్రాణం పోయిందని చెప్పాడట డాక్టర్. పాపం చంద్రమ్మని దిక్కు లేనిదాన్ని చేసి తాను సుఖంగా వెళ్ళిపోయాడు”.

ఇక అక్కడి మాటలేవి వినిపించలేదు సుధాకర్ కి. ” ఎంత పని చేశావు కొండయ్య. నా ప్రాణం నిలబెట్టి నన్ను రుణగ్రస్తుడిని చేసి, నీకు సాయం చేసి నా ఋణం తీర్చుకుందాం అనుకుంటే నాకు ఆ అవకాశం ఇవ్వకుండానే వెళ్లిపోయావా… ఎంతైనా నువ్వు అభిమానవంతుడివి”. తనలో తానే గొణుక్కుంటూ బరువెక్కిన గుండెతో, కంట తడిని తుడుచుకుంటూ వెనక్కి మరలాడు సుధాకర్ భారంగా అడుగులు వేస్తూ…

12 thoughts on “జాడలు”

  1. Mi rachanaloni sunnitha bhavaalu samaja pokada Sabari prasthavana entho mudavahamu marentho kanu vippu.mi nundi marinni rachanalakosam eduru chuse abhimani……madhavan

  2. Dr G V Ratnakar

    Good story
    దళిత జీవన చిత్రణ వాస్తవానికి దగ్గరగా ఉంది

  3. Nama Purushotham

    కథ చాలా బాగుంది…
    మేడం…బాగా రాశారు…

Comments are closed.