నేను రాసిన ఈ కథ ప్రతిష్టాత్మకమైన “నవ మల్లె తీగ”ఈ July 2026 సంచికలో ప్రచురితం అయింది. నవ మల్లె తీగ పత్రిక 100 వ సంచిక విడుదల సందర్భంగా సంపాదకులు Kalimisri Malleteega కలిమి శ్రీ గారికి హృదయపూర్వక అభినందనలు. కథని ప్రచురించి గొప్ప ప్రోత్సాహాన్ని అందించిన కలిమి శ్రీ గారికి కృతజ్ఞతలు. హృదయ పూర్వక ధన్యవాదాలు. కథ ను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి






ఇస్త్రీపెట్టెలో నించి బూడిదను సైడు కాలవ పక్కన విదిలించి, ఎర్రగా మండుతున్న బొగ్గులను పెట్టెలో వేసి, పట్టకారుతో సర్ధతా ఉండాడు శీనయ్య. రథసప్తమి పండగపోయి వారం దినాలు గడిచింది. పండగ ఎనకన్నే చలికూడా పోయి, ఎండలు మల్లుకున్నాయి. సాయంత్రం నాలుగయింది. ఒకచేత్తో డ్రైక్లినింగ్ చేసిన చీరలున్న సంచి, మరోచేతిలో నాష్టా ఉన్న టిఫిన్ బాక్స్ తో షాపులోకి వచ్చాడు సిద్దయ్య.
“సిద్దా..వచ్చావా ! నీకోసరమే చూస్తా ఉండాను రారా, పొద్దన షాపుకాడికి వచ్చిన కాడ్నుంచి ఇస్త్రీ చేస్తా ఉన్నా, ఇంకో నాలుగు మూటలు మిగిలిపోయి ఉండాయి. నడుము పడిపోతా ఉండాది రా. ఆ టిఫిన్ బాక్స్ ఇటీరా, ఆకలేస్తా ఉండాది” అంటా ఆడ్నే ఓ గుడ్డల మూట మీద కూలబడి, ఆవురావురుమంటా ఎర్రకారం నంజుకోని పెసల దోశలు తినేశాడు శీనయ్య. నీళ్ళు తాగి, బ్రేవున తేపి, “ఇదిగో సిద్దయ్యా..నేనటు పోగానే సావాసగాళ్ళతో చేరి, యెవ్వారాలు, బాతాఖానీలు చేయిబాక. రేత్తిరి లోగా ఈ నాలుగు మూటల గుడ్డలు ఇస్త్రీ చేయాలి ” అన్నాడు “అట్నేలే అన్నా. నువ్వు ఇంటికిపో..నేను అన్నీ గుడ్డలు ఇస్త్రీ చేసేస్తాలే” అంటూనే మగ్గులో ఉన్న నీళ్ళను ఇస్త్రీ చేసే బల్లమీద ఒబ్బిడిగా చిలకరించాడు సిద్దయ్య. “సరేరా..అదిగో ఆ ఎర్ర మూట రమణా రెడ్డి వోళ్ళది. రేపొద్దన్నే ఆరింటికే వొచ్చి షాపు ముందర కూచుంటాడు రమణారెడ్డి. ముందు ఆ మూటలోవి ఇస్త్రీ చేయి. ఆ బులుగు మూటలోవి నల్లరామూర్తి ఐవోరివి. ఆ తెల్ల పంచెలో ఉండేటివి వనమ్మ చీరలు. ఆ పెద్ద మూటలోవి రంతుల్లా సాయిబు వోళ్ళవి. అన్ని రాత్రిలోగా చేసైయాలి. రేపు నేను చాకిరేవుకి పోవాలి. ఆదివారం కదా. చానా మంది గుడ్డలు ఇస్త్రీ చేయించుకునేదానికి వస్తారు.షాపు కాడ నువ్వే ఉండాలి. పెందలాడే ఇంటికాడికొచ్చేయి” తమ్ముడికి అన్నీ జాగ్రత్తలు చెప్పి ఇంటికిపోయేదానికని బైటికొచ్చాడు శీనయ్య.
***
లాండ్రీ షాపునే ఉన్న పెద్ద గంగరాయి చెట్టుకింద నిలబడుకోనున్నారు పాండు, కృష్ణా రావులు. శీనయ్య కనపడగానే చెట్టు చాటుకు పోయినారు. “సాయంత్రమైతే చాలు అందరూ కట్టగట్టుకొని షాపు కాడికి వొస్తారు. ‘కూసే గాడిదలు వొచ్చి, మేసే గాడిదను చెడిపినట్లు’ ఈ ఎదవలంతా చేరి సిద్దయ్య పని చెడగొడతారు”. తనలోతానే గొణుక్కుంటూ రోడ్డు దాటి జేమ్స్ గార్డెన్ తట్టుకు పోయినాడు. శీనయ్య ఆటు పోయినాడో లేదో తుర్రుమంటా షాపులోకి దూరారు పాండు, కృష్ణారావులు. తెల్ల మూట ఇప్పి ప్యాంటు, చొక్కాలు ఇస్త్రీ చేస్తా ఉండాడు సిద్దయ్య. చొక్కాని ముడతలు లేకుండా చేత్తో సాపుచేసి, చొక్కా కాలర్ మీద, ఫుల్ హాండ్స్ మీదా ఒడుపుగా నీళ్ళు చిలకరించి ఇస్త్రీ పెట్టెను చొక్కా మీద పెట్టి జరపతా ఉంటే, చొక్కా ముడతలన్నీ మాయమైపోయి, కొత్త చొక్కా మాదిరి తయారైంది. ‘శీనయ్య, సిద్ధయ్య చేతుల్లో ఏం మహిమ ఉందో కానీ, పాత గుడ్డలు కూడా ఆ ఇద్దురు అన్నదమ్ములు ఇస్త్రీ చేస్తే కొత్తవాటి మాదిరిగా మెరిసిపోతాయి’ అంటారందరు. అందుకే ఆ సెంటర్లో వాళ్ళ లాండ్రీ షాపుకి ఎక్కువ డిమాండ్ ఉండాది.
“సిద్దయ్యా..సునీల్ రాలేదా ఇంకా..” అడిగాడు కృష్ణారావు. మాటల్లోనే సునీల్ షాపులోకి వచ్చాడు. వస్తానే “అబ్బా..సిద్దయ్యా. ఎంతసేపు పనేనా. కాసేపు కూచోని మాట్లాడుకుందాం రారా” అన్నాడు. మీరు మాట్లాడతా ఉంటే, నేను ఉషారుగా, బిన్నా ఇస్త్రీ చేసేస్తా. అప్పుడు అందరం కూచుని మాట్లాడుకోవచ్చు” అన్నాడు సిద్ధయ్య ఈలోగా తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకుని నుదుటిమీద పడ్డ క్రాపునీ ఎడంచేత్తో ఎనక్కి నెట్టుకుంటా, చేతికి కట్టుకున్న వాచీ చాయ చూస్తూ కంగారుగా షాపులోకి వచ్చాడు రాంబాబు. “సిద్ధయ్య.. టైం ఐదు అయింది. ఆ అమ్మి వచ్చేస్తుంది. తొందరగా పాట పెట్టవా” దీనంగా ముఖం పెట్టి అడిగాడు రాంబాబు. “అబ్బా..రాము..మొదలెట్టావా నీ గోల” అన్నాడు పాండు. నవ్వతా టేప్ రికార్డర్ స్విచ్ నొక్కాడు సిద్ధయ్య.
సరిగ్గా అప్పుడే ఎదురింట్లో ఉన్న నారాయణ అయివోరి కూతురు రాధమ్మ, ఆమె ఫ్రెండ్ ఇద్దురు రోడ్డు దాటి వాళ్ళఇంటి ముందర ఉన్న ఇనప గేటు తీసుకుని లోపలి పోతా ఉండారు. వాళ్ళని చూస్తానే రాంబాబు కళ్ళు పెద్దవైనాయి. “సింధూర పువ్వా తేనే చిందించరావా..చిన్నారి గాలి సిరులే అందించరావా” లాండ్రీ షాపు నుంచి వీధి మొత్తానికి పాట ఇనొస్తావుండాది. లోపలి పోతా పోతా రాధమ్మ పక్కనుండే అమ్మితలని వెనక్కి తిప్పి లాండ్రీ షాపులోకి చూసింది. రాంబాబు అలర్ట్ అయిపోయి, ఆ అమ్మిని చూసి స్టైల్ గా క్రాపు దువ్వుకుంటా చిరునవ్వు నవ్వాడు. నవ్వినవ్వనట్లు పెదాలు విచ్చుకున్న ఆ అమ్మి కళ్ళల్లో మెరుపులు. ఒక్క క్షణం. అంతే. తల తిప్పేసింది. ఇంటిలోపలికి వెళ్లిపోయారు ఇద్దురూ. లోనికి పోతానే కిటికీ తలుపు తెరిచింది రాధమ్మ. కిటికీ దగ్గర చేరి వాళ్ళు మాట్లాడుకుంటా ఉండారు. ఇక్కడ షాపులోనుంచి రాంబాబు ఆ అమ్మి చాయ ఆరాధనగా చూస్తా ఉండాడు. పెద్ద పెద్ద కళ్ళు, నున్నటి ఎర్రని బుగ్గలు, నడుమును దాటిన పొడవైన జడ, గులాబి రంగు పావడా, జాకెట్టు, ఆకుపచ్చ రంగు పైటలో చూడ్డానికి అచ్చం హీరోయిన్ విజయశాంతి మాదిరిగా ఉండే ఆ అమ్మిమీద మనసు పారేసుకున్నాడు రాంబాబు. రాధమ్మతో మాట్లాడతానే ఆ అమ్మికూడా మధ్య మధ్యలో షాపులోకి చూస్తా ఉంది. అరగంట తర్వాత వాళ్ళ నాయిన వొచ్చి, మోపెడులో ఆ అమ్మిని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మి అటువెళ్ళిందో లేదో, పరీక్షలకి చదువుకోవాలంటూ రాంబాబు హడావిడిగా షాపు లోనించి బయటపడి, సైకిల్ స్టాండ్ తీసి కూర్చుని, బాలాజినగరుకి తట్టుకి పోయినాడు.
***
సిద్దయ్య, పాండు, సునీల్, కృష్ణారావు అందరూ నవ్వుకున్నారు రాంబాబు హడావిడి చూసి. ప్రతిరోజూ సాయంత్రం లాండ్రీ షాపు కాడ జరిగే తంతే అది. రాంబాబు బుధ్ధిమంతుడు. కాస్త భయస్తుడు. దూరం నుంచి ఆ అమ్మిని చూడడమే తప్ప ఒక్క రోజు కూడా దగ్గరకు పోయి మాట్లాడింది లేదు. ఆ పిల్ల పేరు కూడా తెలియదు. ఐతే ఐదో గంట కొట్టడం ఎప్పుడైనా ఆలస్యం అవుతుందేమో కానీ, రాంబాబు ఆ సమయానికి షాపు దగ్గరకి రావడం మాత్రం ఎప్పుడూ ఆలస్యం కాలేదు. ఈడ షాపు లోనుంచి రాంబాబు, ఆడ ఎదురింటి కిటికీ లోనించి ఆ అమ్మి కళ్ళతో మాట్లాడుకోవడం సావాసగాళ్ళకు అందరికీ తెలుసు. అవకాశం దొరికినప్పుడల్లా రాంబాబుని ఆటపట్టిస్తుంటారు.
షాపు కి ఎదురుగా రోడ్డు అవతల రాధమ్మ వాళ్ళిల్లు. ఆ ఇంటి చేపట్టు గోడ వారగా ఉన్న కిష్టయ్య బంకు కాడ్నుంచి బజ్జీలు, పులిబొంగరాలు తెచ్చాడు సునీల్. మధు, మురళి, ప్రభాకర్ కూడా షాపు లోకి వచ్చారు. అందరూ మిరపకాయ బజ్జీలు, పులిబొంగరాలు ఎర్ర కారం నంజుకోని తిన్నారు. సోడాల రావమ్మ అంగడి నుంచి లైమ్ జ్యూస్ తెచ్చుకుని తాగారు మధు, మురళి. అంగళ్ళకు టీ తెచ్చే కుర్రాడిని కేకేసి నాయిరు బంకు లో నుంచి టీ లు తెప్పించాడు సునీల్. అందరూ మాట్లాడుకుంటా, జోకులేసుకుంటా బాతాఖానీ మొదలుపెట్టారు. వాళ్ళ మాటలు ఇంటూనే మూటల్లోని గుడ్డలన్ని ఇస్త్రీ చేయసాగాడు సిద్దయ్య. గంట తొమ్మిది అయింది. అప్పుడు అదలాబదాలా రొప్పుకుంటా వచ్చాడు శాంతి స్వీట్ హోమ్ లో పనిచేసే వెంకటేశ్వర్లు. చేతిలో సినిమా టికెట్లు ఉండాయి. “ఇదిగో సిద్దయ్యా..పని భిన్నా కానీ, ‘కొండవీటి దొంగ’ సినిమాకు టికెట్లు సంపాదించా. ఇంక రెండు దినాలే నర్తకి హాల్లో ఆ సినిమా ఆడేది. తర్వాత విజయ మహల్ కి సినిమా వొసద్ది కానీ, నర్తకి ఏ.సి. హాల్లో చూస్తేనే మజా” అన్నాడు చేతిలోని టికెట్లు ఉపతా.
“అబ్బా. మంచి పని చేసావు వెంకటేశ్వర్లు. రేపు పోదామని ఇప్పుడే చెప్పబోతున్నా, నువ్వు ఈ రోజుకే టికెట్లు తెచ్చావు. అందరం ఈడనుంచే పోదాము” అన్నాడు పాండు. “నేను, మురళి సైకిల్ లో వస్తాం” అన్నాడు మధు. “నేను, రవి మోపెడు బండిలో వస్తాం. సిద్దయ్య, పాండు, కృష్ణారావు, మీరు చెంచురాముడి రిక్షాలో రాండి. ఇప్పటికే తొమ్మిదింగాలు అయింది. తొమ్మిది ముక్కాలుకు సినిమా మొదులుబెడతారు” అంటూనే మోపెడు బండి స్టార్ట్ చేసాడు సునీల్. గబగబా ఇస్త్రీ చేసిన గుడ్డలు సర్ది, అంగడి మూసేసి, చెంచురాముడి రిక్షాలో నర్తకి హాలుకి బయలుదేరారు సిద్దయ్య, పాండు, కృష్ణారావులు.
***
‘కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా’ చిరంజీవి, విజయశాంతి పాటకి కుర్రకారంతా లేచి నిలబడి ఈలలు వేస్తూ, కాయితాలు చింపి ఎగరేస్తా డాన్స్ వేయసాగారు. “పాపం ఆ రాంబాబు ఒక్కడే సినిమాకి రాకండా పోయినాడురా”అన్నాడు పాండు. “ఏం పర్వాలేదులేరా. రాంబాబు ఆ అమ్మితో కలలో డ్యూయెట్ పాడుకుంటా ఉంటాడు” అని పెద్దగా ఈల వేసాడు కృష్ణారావు. రెండోఅట సినిమా వొదిలేతలికి ఒంటిగంట అయింది. అందరూ ఇళ్ళకు వెళ్లిపోయారు. సిద్దయ్య ఇంటికి పోయేటప్పటికి శీనయ్య నిద్రపోతా ఉండాడు. వదిన రమణమ్మ సిద్దయ్యకు అన్నం పెట్టింది. తిని పండుకోగానే గుర్తుకు వచ్చింది ఎర్రమూటలో ఉండే గుడ్డలు ఇస్త్రీ చేయలేదని. సిద్దయ్యకు గుండె గుభేలుమంది. అన్న చెప్తనే ఉండాడు అవి రమణా రెడ్డి వోళ్లవని, పొద్దున్నే వస్తారని. ఇకన నిద్దర పడితే ఒట్టు.
పొద్దన్నే అన్నతోకూడా లేచేసి, షాపు కాడికి వొచ్చేసాడు. వీళ్ళు పొయ్యేతలికే రమణారెడ్డి అల్లుడు శ్యామయ్య రెడ్డి వొచ్చేసి అంగడి మెట్లమీదా కూర్చొనుండాడు. షాపు తలుపులు తీయగానే ఎర్రమూట కనిపించింది అందరికీ. మొదులే శ్యామయ్య రెడ్డి మిడిమేళం మనిషి. ఎర్రమూట చూడగానే కోపం నషాళానికి అంటింది ఎర్ర కారం మాదిరి. ఇకన తిట్ల దండకం ఎత్తుకున్నాడు. “ఏం శీనయ్య నిన్ను నమ్ముకోని, గుడ్డలు ఇస్త్రీకి ఇస్తే మూత అట్నే పెట్టావు. ఇప్పుడు నేను ఊరికెట్టా పోవాలా. బుద్ధిలేదా మీకు” అంటూ కల్లు తాగిన కోతిమాదిరి ఎగరసాగాడు. అతన్ని బతిమాలి, అరగంటలో గుడ్డలు ఇస్త్రీ చేసి, ఇంటికి తెచ్చిఇస్తానని శీనయ్య మాట ఇచ్చాక, శాంతించి రోడ్డు దాటి ఇంటికి వెళ్ళాడు శ్యామయ్య రెడ్డి. అతనట్లా పోగానే సిద్దయ్య “అన్నా..రాత్రి అన్నీమూటలు ఇస్త్రీ చేసాను అనుకున్నాను. ఈ ఎర్రమూట సంగతి మరిచిపోయాను. నా వల్ల నువ్వు తిట్లు తిన్నావు” అన్నాడు ముఖం కందగడ్డలా చేసుకుని.
“సిద్దయ్యా..పర్వాలేదు లేరా. చెప్పిన టయానికి ఇస్త్రీ చేసిఇవ్వలేకపోయాం. అందువల్ల వాళ్ళు తిడితే మనం పడాలి. కానీ అదేదో సామెత ఉంది కదా “చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు” అని. నీ సావాసగాళ్ళంతా చదువుకున్నోళ్ళు. వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా చెల్లుతుంది. వాళ్ళ మాదిరిగా మనం ఉండాలంటే కష్టంరా. వాళ్ళకి అమ్మా అబ్బలు సంపాదించి పెట్టిన ఆస్తులు ఉంటాయి. కానీ మనం కష్టపడితే కానీ నాలుగు ముద్దలు మన నోళ్ళొకి పోవురా. ఈ సంగతి నువ్వు తెలుసుకుంటే చాలురా నాకు” అన్నాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ. అన్నను పట్టుకొని పెద్దగా ఏడస్తా “ఇంకెప్పుడు నీ మీద మాట పడనీయను అన్నా” అన్నాడు. అన్నదమ్ములు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. “సావాసగాళ్ళతో ఉండొద్దని నేను అననురా. మాటల్లో పడి పని మర్చిపోబాక” అంటూ ఇస్త్రీ చేసిన మూటని రమణారెడ్డి ఇంట్లో ఇచ్చిరావడానికి పోయినాడు శీనయ్య.
***
సాయంత్రం అయింది. లాండ్రీ షాపులో నుంచి యదావిధిగా “సింధుర పువ్వా తేనే చిందించరావా” పాట మొదలైంది. పాట మధ్యలో ఉండగా రాధమ్మ, ఆమె ఫ్రెండ్ రోడ్డు దాటారు. ఆ అమ్మి తలతిప్పి షాపులో ఉన్న రాంబాబుని చూడడం, చిరునవ్వు నవ్వడం, రాంబాబు పరవశించి పోవడం కూడా జరిగిపోయింది. “రాము..ఎంత కాలం ఇలా దూరంనుంచే చూసి తృప్తి పడతావు. ఒక్కసారి కలసి ‘నువ్వంటే ఇష్టమని ఆ అమ్మికి చెప్పచ్చు కదరా రా!” అన్నాడు పాండు టీ తాగతా. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నాం కదా. డిగ్రీ పూర్తి అయినాక చెప్తే బాగుంటుందనీరా . తను ఎక్కడికి పోతుందని” అన్నాడు కళ్ళద్దాలు సరిచేసుకుంటూ. రాంబాబు కళ్ళల్లో గొప్ప నమ్మకం తన ప్రేమపట్ల. “బాగుంది రా. అవకాశం వచ్చినప్పుడు నీ ఇష్టాన్ని ఆ అమ్మికి చెప్తేనే కదా, నీపైన తనకి ఇష్టం ఉందొ లేదో తెలిసేది. నేనైతే ఇంత లేటు చేయను. నేరుగా పోయి చెప్పేస్తాను” అన్నాడు కృష్ణారావు చార్మినార్ సిగరెట్టు పొగని రింగులు రింగులుగా వదులుతూ. “అవునవును..నీ కోసం అమ్మాయిలు క్యూలో ఉండారురా” ఇస్త్రీ చేసిన గుడ్డలు సర్దుతూ నవ్వతా అన్నాడు సిద్దయ్య. “మీకందరికీ సరదాగా ఉందిరా. నా ఇష్టాన్ని చెప్తే ఆ అమ్మాయి కాదంది అనుకోండి. నా ప్రాణం ఆగిపోతుంది. అందుకే తన దగ్గరకు వెళ్ళి మాట్లాడాలంటే భయమేస్తుంది” ముఖంలోని ఆందోళనని కనపడనీయకుండా దాచే ప్రయత్నం చేసి విఫలమైనాడు రాంబాబు. “అందుకని ఇలా దూరం నుంచి చూస్తూ మూగ ప్రేమికుడివి అవుతావారా. పోనీ నేనెళ్ళి నీ గురించి ఆ అమ్మికి చెప్పేదా. తను కూడా నిన్ను నవ్వుతూ చూస్తుంది కదరా” అన్నాడు మధు. “ఆ పని మాత్రం చేయకండిరా. వీలుచూసుకుని నేనే చెప్తాలే” చిన్నగా నవ్వాడు రాంబాబు. “వెరీ గుడ్. ఇప్పుడు ‘రాముడు మంచి బాలుడు’ అనిపించుకున్నావు” అన్నాడు రవి.
***
పెన్నా నదికి వరదలొచ్చినంత వేగంగా ఏడాది గడిచిపోయింది. డిగ్రీ పరీక్షలు ఇంక వారంలో మొదలవుతాయి. పరీక్షల సమయం. అయినా లాండ్రీ షాపుకి వచ్చి, కాసేపు సిద్దయ్య దగ్గర కూర్చుని బాతాఖానీ కొట్టకుండా ఆ స్నేహబృందానికి రోజు గడవదు. డిగ్రీ అయినాక పైచదువులులకు పోవాలని మధు, రాంబాబు ఆశపడితే, పాండు, కృష్ణా రావు లు డిగ్రీ అయితే చాలు. ఏదో ఒక జాబ్ ఎంట్రెన్స్ పరీక్షలు రాసి, ఉద్యోగాల్లో చేరాలని అనుకున్నారు. పై చదువులకోసం అమెరికా కి వెళ్ళాలని సునీల్ కి ఆశ. “సిద్దయ్య..మేమంటే చదువుతో తంటాలు పడి, పరీక్షలతో కుస్తీలు పడి ఏదో ఒక జాబ్ కోసం చూస్తున్నాము. మరి నువ్వు ఎట్లా స్థిరపడాలని రా” సునీల్ అంటుండగానే గుడ్డల మూట బుజం మీద పెట్టుకొని షాపు లోకి వచ్చాడు శీనయ్య. “మీరంటే డిగిరీలు చదువుకున్నోళ్ళు కదా అబయా. మేము చదువుకోకపోతిమి. చాకిరేవే మా కాలేజీ. ముడతలు లేకండా గుడ్డలు ఇస్త్రీ చేయడమే మా చదువు” అన్నాడు శీనయ్య. “అంతేగదైతే అన్నా”అన్నాడు సిద్ధయ్య, శీనయ్య కాడ్నించి మూట అందుకుంటా.
“అయితే మాకు కూడా ఒక ప్లాన్ ఉండాదిలే అబయా పాండు. ఈ షాపు ఓనర్ నిరంజను మమ్మల్ని ఖాళీ చేయమంటా ఉండాడు. ఈ విజయమహల్ సెంటర్ లోనే ఒక షాపు ను సొంతంగా కొనుక్కోవాలని ఆలోచన ఉండాది. దానికే ఇప్పుడు కష్టపడి పైసా పైసా కూడబెడతా ఉండేది” అన్నాడు శీనయ్య నవ్వతా. “మంచి ఆలోచనన్నా! ఎవరు ఎక్కడ ఉన్నా మన స్నేహితులందరూ కలిసే ఉండాలని అందరి కోరిక” కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే, బైటికి వచ్చేసాడు పాండు . సావాసగాళ్ళందరూ చాటుగా కళ్ళు తుడుచుకున్నారు.
***
డిగ్రీ పరీక్షలు అయిపోయి రెండు నెలలు కావస్తా ఉండాది. అందరూ ఫలితాల కోసం ఎదురు చూస్తా ఉంటే, రాంబాబు మాత్రం దిగాలు పడిపోయి ఉండాడు. సాయంత్రం పూట షాపులో “సింధూర పువ్వా” పాట వస్తా ఉండాది కానీ, ఆ పాట వినాల్సిన పిల్ల మాత్రం రాధమ్మ ఇంటికి రావడం లేదు. వారం దినాలనుంచి రాధమ్మ ఒక్కటే టైపు ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికి వస్తా ఉండాది. రాధమ్మ ఫ్రెండ్ ఎక్కడికి పోయిందో తేలిక, ఆ అమ్మిని చూడకుండా ఉండలేకపోతున్న రాంబాబు బాధని ఓదార్చడం ఎవరితరం గావడం లేదు.
ఆ సాయంత్రం కూడా రాధమ్మ రోడ్డు దాటి ఇంటికి పోబోతా ఉండాది. ఇకన ఉండబట్టలేక “రాధమ్మా” అంటా కేకేశాడు సిద్దయ్య. అప్పటికే ముఖం నల్లగా పెట్టుకొని, వెయ్యి లంఖణాలు చేసినట్లు దిగాలుగా ఉండాడు రాంబాబు. రాధమ్మ వెనక్కి తిరిగి షాపు ముందరకి వొచ్చి “సిద్దన్నా..ఏంది? పిలిచావు?” అనింది భయంగా వాళ్ళ ఇంటి చాయ చూస్తా. “అదే రాధమ్మా..రోజు నీతో గూడా వస్తాది కదా నీ ఫ్రెండ్. ఆ అమ్మి అవపడడంలేదు ఎందుకు” గబగబా అడిగేసి నీళ్ళు నమలసాగాడు సిద్దయ్య. రాధమ్మ ఏం చెప్పుద్దా అని ఆత్రంగా చూస్తా ఉండారు వాళ్ళు. రాంబాబు గుండె వేగం పెరిగింది.
“ఓ పద్మ గురించి నా. వాళ్ళ నాయనను గుంటూరు ఆంధ్రా బ్యాంకు కు మార్చినారంట. వాళ్ళు బాలాజినగరులో ఇల్లు ఖాళీ చేసి గుంటూరుకు వెళ్ళిపోయినారు. పద్మ కూడా ఎం.సి.ఏ. చేయాలని హైదరాబాద్ లో వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిపోయింది.” చెప్పేసి వెనక్కి తిరిగి రోడ్డు దాటింది రాధమ్మ. తాను ఇష్టపడ్డ పిల్ల పేరు ‘పద్మ’ అని అప్పుడే తెలిసింది రాంబాబుకు. రాధమ్మ చెప్పిన మాటలు ఇంటానే లాండ్రీ షాపు మెట్ల మీద కూలబడిపోయాడు రాంబాబు.
సగం రోడ్డు దాటి, మళ్ళా వెనక్కి తిరిగి గబగబా షాపు కాడికి వొచ్చి, పుస్తకంలోనుంచి ఓ చీటి తీసి, “సిద్దన్నా.. పద్మ ఈ చీటీని రాంబాబన్నకి ఇమ్మంది” సిద్దయ్య చేతిలో చీటీ పెట్టి, పరిగెత్తుకుంటా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సిద్దయ్య చీటీ తెరిచి చూసాడు. ఏదో ఇంగ్లీష్ లో రాసి ఉంది. అర్ధం కాలేదు. పక్కనే ఉన్నకృష్ణా రావు కి ఇచ్చాడు. అతను చూసి,ఏం మాట్లాడకుండా రాంబాబు చేతిలో పెట్టాడు. స్నేహితులందరూ చీటీలో ఏం రాసుందో అని తొంగి చూసారు. ” I am sorry ” ఆ ఒక్క మాట చూడగానే రాంబాబు కళ్ళల్లో నీళ్ళు. ప్రేమతో పెంచుకున్న ఆశలసౌధం పేక మేడలా కూలిపోయినంత దుఃఖం. సావాసగాళ్ళంతా తలా ఒక మాట చెప్పి రాంబాబుని ఓదారుస్తా ఉండారు. వాళ్ళందరి మధ్యన చేరి ఏడస్తా ఉండాడు రాంబాబు. “రాంబాబు..ఓరే రాంబాబు..పెద్దగా కేకలు వేసుకుంటా పరిగిస్తా వస్తా ఉండాడు పాండు. చేతిలో ఈనాడు పేపర్. “రాంబాబు. ఎం.ఏ. ఎంట్రెన్స్ లో నీకు పదవ ర్యాంకు వచ్చిందిరా. ఇదిగో పేపర్లో నీ నెంబర్ చూడు” గబగబా వచ్చి పేపర్ తీసి చూపించాడు పాండు. కృష్ణారావు పరిగిస్తా పోయి, శాంతి స్వీట్ హోమ్ నుంచి ‘మలై కాజా’ స్వీట్ ప్యాకెట్ తెచ్చి రాంబాబు మలై కాజా నోట్లో పెట్టాడు. శీనయ్య కూడా నవ్వతా చూసాడు రాంబాబుని. “చాల సంతోషం రాంబాబు. తిరుపతి యూనివర్సిటీ కి పోయి ఎం.ఏ. చదివే వాడివి నువ్వొక్కడివే మన అందరిలో. నువ్వు ఎం.ఏ. చదివి ప్రొఫెసర్ అయితే, పద్మ లాంటి అమ్మాయిలు పది మంది నీ వెంట పడతారు. ఆ అమ్మిని మర్చిపోయి, హాయిగా యూనివర్సిటీకి పో. నువ్వు మా స్నేహితుడివి అవడం మాకు చానా గర్వంగా ఉండాది”అన్నాడు మురళి. అందరూ కలిసి రాంబాబుని ఎత్తుకుని గిరగిరా తిప్పేశారు. లాండ్రీ షాపు బైట కుర్రకారు సందడికి పక్క అంగళ్ళవాళ్ళు, ముసిలి ముతకా కూడా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. రాంబాబు కళ్ళల్లో తడి. ఒక కంట్లో నవ్వు, ఒక కంట్లో ఏడుపు”
పాత పుస్తకాలు సర్దుతుంటే, పుస్తకాల మధ్య తన ఎం.ఏ. సర్టిఫికెట్ కనపడి, నలభై ఏళ్ళుగా గుండెల్లో దాచుకున్న ఆ తొలి యవ్వనపు రోజుల స్మృతులు పెల్లుబికి రావడంతో చెమ్మతో మసకబారిన కళ్ళను తుడుచుకున్నాడు రిటైర్డ్ ప్రొఫెసర్ రాంబాబు.
రోహిణి వంజారి
9000594630