విజేత

నమస్తే! నేను రాసిన ఈ కథ “విజేతసమన్విత / ఐద్వా / కోపూరి ట్రస్ట్ సమ్యుక్తంగా నిర్వహించిన ట్రాన్స్ జెండర్లపై కథానికల సంకలనం “అస్మిత” లో చోటు చేసుకుంది. మాడా గాడు, తేడా గాడు, పాయింట్ ఫైవ్, కొజ్జా, చెక్క గాడు ఎన్ని రకాలుగా అవహేళనలు చేసే ఈ లోకంలో ఓ ట్రాన్స్ జెండర్ మనిషి తన జీవితంలో ఎలా విజయం సాధించాడో తెలిపే కథ ఈ “విజేత“. మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుప ప్రార్ధన.

——————————————————————————————————————————

సూది కింద పడితే వినబడేంత నిశ్శబ్దం. అందరి మనసులలో ఉత్కంఠత. న్యాయ మూర్తులు అడిగిన ఆఖరి ప్రశ్నకు ఆమె ఏం సమాధానం చెప్తుందో అని అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
చల్లటి సాయంకాలం. పిల్లగాలుల వీవెనలు.ఆహ్లదకరమైన వాతావరణం. హోటల్ తాజ్ బంజారా మిరుమిట్లు గొలిపే రంగురంగుల నియాన్ బల్బులతో శోభాయమానంగా మెరిసి పోతోంది. ఆ రోజు మిస్ ఇండియా పోటీల ఆఖరి ఘట్టం. ఫిట్నెస్, బ్యాలెన్సింగ్, గ్లామర్, క్యాట్ వాక్, ఫాషన్ షో,మెంటల్ ఎబిలిటీ రౌండ్స్ ని దాటుకుని ఫైనల్స్ కి వచ్చారు దియా,డింపుల్,నాగరాణి. ఆఖరి ఘట్టం రానే వచ్చింది. ఇద్దరి సమాధానాలు విన్న న్యాయ మూర్తులు. నాగరాణి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. టీవీ సెట్ల ముందు కూర్చున్న వారు, తాజ్ బంజారాలోని సమావేశమందిరంలోని వారు అందరు ఆత్రుత గా ఎదురు చూస్తుండగా, సమాజంలో మనుషులను మీరు ఎలాచూస్తారు, అంటే మనిషికి ఎలా విలువ ఇస్తారు అని అడిగిన న్యాయ మూర్తుల ప్రశ్న కు ” మనిషిని మనిషిగా చూస్తాను. కుల,మత, పేద,గొప్ప, స్త్రీ,పురుష లింగ వివక్షలు చూపకుండా మనిషిని మనిషిగా గౌరవిస్తాను.” అని జవాబు చెప్పింది నాగరాణి. తాము ఆశించిన సమాధానం రావడంతో సంతృప్తిగా నాగరాణి వైపు చూసారు న్యాయ మూర్తులు.

అందరి ఉత్కంఠత కు తెరదించుతూ ఆ ఇయర్ మిస్ ఇండియా ” మిస్ నాగరాణి” అని ప్రకటించారు న్యాయమూర్తులు. ఒక్కసారిగా కరతాళధ్వనులు మిన్నంటాయి. మిస్ ఇండియా నాగ రాణికి ప్రశంసలు, అభినందలు వెల్లువెత్తాయి. పోయిన సంవత్సరపు మిస్ ఇండియా విజేత ” మిస్ జూహీ” తళతలా మెరిసిపోయే మిస్ ఇండియా కిరీటాన్ని ఈ ఇయర్ మిస్ ఇండియా టైటిల్ విజేత “మిస్ నాగరాణి” కి అలంకరించింది.

నాగ రాణి అచ్చమైన తెలుగింటి అమ్మాయి. తను మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడం తో దేశం మొత్తం ఆమె పేరు మారుమ్రోగిపోతోంది. రాజకీయా ,సినీ ప్రముఖులందిరి మన్ననలందుకొంది. ” అందాల రాణి” కిరీటాన్ని తలపైన అలంకరించుకోవలనే కాస్త అందంగా ఉన్న ప్రతి ఆడపిల్ల కల ” మిస్ ఇండియా”. ఆ కలని తను సొంతం చేసుకుంది. ఆమె ఇంటర్వ్యూ కోసం టీవీ, యూట్యూబ్ చానెల్స్ వాళ్ళు ఆమె ఇంటిముందు క్యూ కట్టారు.

“మిస్ ఇండియా” కిరీటాన్ని కైవసం చేసుకున్న సంధర్బంగా నాగరాణి కోసం ఏర్పాటు చేసిన విందు లో రాజకీయా ప్రముఖులు, సినీ నిర్మాతలు, దర్శకులు, ప్రముహీరోలు, వ్యాపారవేత్తలు అందరూ హాజరైనారు. విందు ముందర జరిగే సమావేశంలో నాగరాణి ని ” మిస్ ఇండియా” విజేతగా నిలిపిన నేపధ్యాన్ని, తెలుగింటినుంచి దేశం మొత్తం గర్వించ దగ్గ స్థాయికి ఎదిగిన తీరుని గురించి తెలుపమన్నారు.
శ్వేత వస్త్రాలలో మెరిసి పోతుండగా స్టేజి మీదకు వచ్చిన నాగరాణి ” అందరికి అభివాదములు. మిస్ ఇండియా కిరీటం నాకు దక్కడం తో నేను దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను, మీ అందరి ప్రేమను కూడగట్టుకున్నాను. ఇదంతా కల నిజమా అనిపిస్తోంది నాకింకా. ఇపుడు నా బాధ్యత మరింత పెరిగింది. ఓ సామాన్య తెలుగింటి అమ్మాయిగా ఉన్న నేను మిస్ ఇండియా గా ఇపుడు మీ ముందు నిలబడడానికి మధ్య నేను చేసిన ప్రయాణంని మీకు వివరిస్తాను. దానికి ముందుగా నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. అంటూ లాప్టాప్ ఆన్ చేసింది. తెర మీద ఓ అందమైన యువకుడి ఫోటో వచ్చింది. నాగరాణి ఆ ఫోటోని చూపుతూ ఆహుతులను ఉద్దేసించి ” అతను ఎవరో మీరు ఎవరైనా చెప్పగలరా ” అని ప్రశ్నించింది. అందరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నాగరాణి నవ్వుతూ ” అతను ఎవరు నా పోలికలతో ఉన్నాడు. నాకు అన్నో, తమ్ముడో అనుకుంటున్నారు కదా. అతను మరెవరో కాదు నేనే. ఒకప్పటి నాగరాజానే ఇపుడు మీ ముందర విజేతగా నిలబడిన నాగరాణి.

అక్కడ ఉన్న వాళ్లకు ఒక క్షణం అర్ధం కాలేదు ఆమె ఏం చేప్తోందో. అర్ధమయ్యాక ఒక అద్భుతం తమ కళ్ళ ముందు నిలిచినట్టు సంభ్రమాశ్చర్యాలకు గురైనారు. ఒక్కసారిగా కరతాళ ధ్వనులు ఐదు నిముషాలపాటు ఆగకుండా మారుమ్రోగాయి. అనంతరం అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆమె చెప్పేది నిజమా, అబద్దమా తేల్చుకోలేని స్థితి లో ఆమె ఏం చెప్తుందో అని అందరు ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూడసాగారు.

నాగరాణి నవ్వుతూ ” మీ అందరి కళ్ళలోకి చూస్తుంటే మీరు నా గురించి తెలుసుకోవాలని ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకు కూడా నా గురించి మీకు చెప్పాలని ఎంతో ఆతృతగా ఉంది. నేను మా అమ్మ, నాన్నలకు ఒకే సంతానాన్ని. నెల్లూరు జిల్లాలోని ఓ చిన్న టౌన్ గూడూరు మాది. నాన్న చిరుజ్యోగి. అమ్మ గృహిణి. చాల సామాన్యమైన మధ్య తరగతి కుటుంబం మాది. మా అమ్మ, నాన్నల వివాహం అయిన ఏడు సంవత్సరాల వరకు వారికి పిల్లలు పుట్టకుండా ఉంటే వాళ్ళు ఎన్నో గుళ్ళు, గోపురాలు తిరిగారు. ఎందరో డాక్టర్లను కలిశారు. వాళ్ళ పూజలు ఫలించి నేను పుట్టాను. నేను పుట్టినప్పుడు ఏవో చిన్న జన్యు లోపాలతో పుట్టానని వాటి ఫలితం ఇపుడు తెలియదు. బాగా పెద్ద అయిన తర్వాత శారీరకంగా కానీ, మానసికంగా కానీ నాలో కొన్ని లోపాలు తలెత్తవచ్చుఅని డాక్టర్లు చెప్పారట మా అమ్మ వాళ్లకు. బిడ్డ పుట్టినందుకు సంతోషించాలా, లేక పుట్టిన బిడ్డ పెరిగే కొద్దీ తనకు ఎటువంటి అనారోగ్య పరిస్థతి వస్తుందో అని దిగులు పడాలో తెలియని సంకట పరిస్థితి లో వాళ్ళు నన్ను పెంచారు. మా ఇంట్లో కొలిచే దైవం నాగేంద్రస్వామి పేరు మీద నాకు నాగరాజా అని పేరు పెట్టారు. నాకు ఆరేళ్ళు వచ్చేవరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పెరిగాను. ఇక నా పెరుగుదలకు, ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదని మా అమ్మ, నాన్నలు ఆనందంగా నన్ను స్కూల్ లో చేర్పించారు. స్కూల్ లో మరి పెద్ద మేధావిని కాకపోయిన క్లాసులో మొదటి పదిమంది ర్యాంక్ స్టూడెంట్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాను.

కాలం అలా గడియారం ముల్లు వెంట పరుగుతీయడం తప్ప ఏనాడైనా ఆగడం చూసామా మనం. కాలం ఆగిపోతే బాగుంటుంది అని మనం అనుకోగానే ఆగిపోతే కాలం విలువ మనకు తెలిసేదెలా. నేను ఏడవ క్లాస్ లో ఉన్నపుడు అనుకుంటా తొలిసారిగా నాలో ఏదో మార్పు నాకు తెలియకుండానే రంగప్రవేశం చేసింది. నత్త గుల్ల నడకలా మొదలైన ఆ మార్పు క్రమంగా కుందేలు పరుగులా నన్ను నిలవనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది. అంతవరకూ క్లాస్ లో అబ్బాయిల పక్కన కూర్చున్న నాకు ఇపుడు వాళ్ళతో కలిసి కూర్చోవాలంటే ఏదో బిడియంగా ఉంది. అంతవరకూ ఏ భావం లేని సోషల్ మాస్టర్ రఘు సార్ పట్ల ఇపుడు ఆరాధనా కలుగుతోంది. ఆ రోజు ఏదో తెగింపుతో మా క్లాస్ అమ్మాయి భార్గవి పక్కన కూర్చున్న. వెంటనే అమ్మాయిలంతా నన్నో పురుగును చూసినట్టు నా నుంచి దూరంగా జరిగిపోయారు.

అబ్బాయిలంతా నన్ను చూసి గేలి చేసారు. నాకు ఏడుపు వచ్చింది. అమ్మాయిలంతా కలసి మా స్కూల్ ప్రిన్సిపాల్ “గంగాధర్” సార్ కి నా మీద కంప్లైంట్ చేసారు నేను వాళ్ళ పక్కన కుర్చున్నానని. ఆ రోజు అందరి ముందు “గంగాధర్” సార్ నాకు చీవాట్లు పెట్టారు. ఇంకోసారి ఇలా చేస్తే టీసీ ఇచ్చి పంపుతాము అని నన్ను హెచ్చరించారు. ఇంటికి వెళ్లి గదిలో తలుపులు వేసుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. నాకు ఏమైందో తెలియక మా అమ్మ, నాన్న దుఃఖం తో కుమిలిపోయారు. ఎన్నో రకాలుగా నన్ను ఓదార్చి మళ్ళీ స్కూల్ కి పంపారు. ఏంటో అబ్బాయిలంటే సిగ్గు,అమ్మాయిలతో చెలిమి చెయ్యాలి అని లోలోపల తపన. నిరంతరం ఇవే ఆలోచనలు. క్లాస్ లో మొదటి పది మందిలో ఉండే నా ర్యాంక్ ఇపుడు చివరి పదిమందిలోకి మారింది. చదువు మీద ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. పైకి కనిపించే నా దేహం లోపల ఇంకెవరో కొత్త మనిషి ఉండి నన్ను తన అజమాయిషీలో పెట్టుకున్నట్టు అనిపిస్తోంది నాకు.

రెండు సంవత్సరాలు కాలం వేగం గూడ్స్ బండి వేగంతో పోటీపడి ఓడిపోయినట్టు నెమ్మదిగా సాగుతోంది. నాలో మార్పులు మాత్రం జెట్ స్పీడ్ అంత వేగంగా జరిగిపోయినై. కానీ నాలో ఏం జరుగుతుందో మా అమ్మ, నాన్నలు మాత్రం గ్రహించలేక నా ఆరోగ్యం పట్ల వారు నిశ్చింతగా ఉన్నారు. ఆ రోజు అమ్మ, నాన్న ఊరికి వెళ్లారు. ఆదివారం కావడంతో స్కూల్ కి వెళ్ళలేదు నేను. తొమ్మిదో తరగతి చివరి రోజులు. ఇపుడు అసలు స్కూల్ కి వెళ్లి చదవాలని లేదు నాకు. సాయంత్రం అమ్మ బీరువా తీసి చీరలు అన్నీ ఆసక్తిగా చూస్తున్నాను. వెంటనే ఓ మంచి చీర, జాకెట్ తీసి నేను జాకెట్ వేసుకొని చీర కట్టుకున్నాను. తల దువ్వుకొని కాస్త పొడవుగాన్న నా జుట్టుకి హెయిర్ బ్యాండ్ వేసి ముఖానికి పౌడర్ అడ్డుకొని బొట్టుపెట్టుకున్నాను. అద్దం లో నన్ను నేను చూసుకొని మురిసిపోయాను. నేను ఏంటో నాకు నిజం అప్పుడు తెలిసింది. అద్దంలో కనిపించే నేనే నిజం. రోజు అందరికి కనిపించే నాగరాజా అబద్దం అని నిశ్చయంగా నాకు తెలిసింది. నేను ఇలాగే ఉండాలని కూడా అనిపించింది.

ఇన్నాళ్లు అనుభవించిన వేదనకు ఓ అర్ధం, పరమార్ధం ఉన్నట్టు ఆ క్షణం అనిపించింది నాకు. “రాజా ఏంటిరా ఇది ? అమ్మ పిలుపుతో వెనక్కి తిరిగిన నాకు ఇంటి బయట డోర్ వేసుకోలేదని గుర్తుకు వచ్చింది. అమ్మ, నాన్న నన్ను అలా చూసి దిగ్బ్రాంతి చెందారు. ముఖాన్ని చేతుల్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చాను. నాన్న అయోమయస్థితిలో పడిపోయాడు. అమ్మ అనునయంగా నన్ను ఓదార్చి ” ఏంటి రాజా ఇది. ఎదిగిన మగబిడ్డవు నీవు. ఇలా ఆడపిల్లలా అలంకరించుకోవచ్చా? చెప్పు. ఎవరినా చూస్తే నవ్వుకోరా ? ” అంది. ” అమ్మ నాకు ఇలాగే ఉండాలనిపిస్తుంది. అబ్బాయిలతో స్నేహం నచ్చడం లేదు. నేను స్కూల్కి ఇక పోను, ఎందుకో స్కూల్ లో అందరు నన్ను చూసి గేలి చేస్తున్నారు. నవ్వుతున్నారు, నాకు చదువుకోవాలని లేదు అమ్మ అంటూ మా అమ్మ ఒడిలో పడుకొని మనసుతీరా ఏడ్చాను. నా పరిస్థితికి మా అమ్మ, నాన్నలు కలవరపడి పోయారు. నేను పుట్టినప్పుడు డాక్టర్లు చెప్పిన విషయం వాళ్లకి గుర్తుకువచ్చి క్రుంగిపోయారు. పెరిగి పెద్ద అయ్యే క్రమంలో నాలో ఏవో జన్యు లోపాల వల్ల కొత్త ఆరోగ్య సమస్య రావచ్చు అన్నారని , కానీ నాలో ఈ లక్షణాలు ఏంటి అని మా అమ్మ, నాన్న నన్ను డాక్టర్ దగ్గరకి తీసుకుపోయారు. అక్కడ డాక్టర్ లు నాకు రకరకాల పరీక్ష చేసారు. మానసిక వైద్యుల చేత కూడా నాకు పరీక్షలు చేయించారు. పరీక్షల అనంతరం డాక్టర్లు చెప్పిన సంగతి విని మా అమ్మ,నాన్న దిగ్బ్రాంతి చెందారు. నాలో శారీరక జన్యువుల అమరికలో లోపాల వల్ల క్రమంగా నాలో ఆడవారి లక్షణాలు అభివృధి చెందాయని, మానసికంగా కూడా నన్ను నేను ఆడదానిగా తలపోస్తున్నానని, పైకి మగవాడిల కనిపిస్తూ, లోపల మాత్రం కొన్ని స్త్రీ లక్షణాలతో ఉన్నానని, వైజ్ఞానిక పరిభాషలో దీనిని ” ట్రాన్స్ జెండర్ ” అంటారని డాక్టర్లు చెప్పారు. ఈ లక్షణాలకు ఇక వైద్యం కూడా లేదు అని తేల్చి చెప్పారు.

ఏదో ఒక జబ్బు అయితే ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయిన వైద్యం చేయించుకోవచ్చు. కానీ ఈ లోపానికి మందులే లేవు. ఇక జీవితాంతం ఇలా బ్రతకాల్సిందే నేను అని నాకు తెలిసిపోయింది. అమ్మ, నాన్నల వంక తలెత్తి చూడలేకపోయాను. ఆ రోజు నుంచి స్కూల్ మానేసాను. నా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కూర్చుంటే గంటల తరబడి ఆలోచనలు నాలో. నా మీదే ప్రాణాలు పెట్టుకున్న అమ్మ,నాన్న నా పరిస్థితికి తాము బాధ పడలేక, నన్ను ఓదార్చలేక తమలో తాము క్రుంగి పోయారు. నా బ్రతుకు ఇక ఇంతేనా, ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలు అని చాలాసార్లు అనిపించింది. ఓసారి ఆ ప్రయత్నం కూడా చేశాను. గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకునే టైం లో అమ్మ, నాన్న చూసి నన్ను ఆ ప్రయత్నం నుంచి కాపాడారు. నువ్వు ఎలా ఉన్నా మా బిడ్డవు. నీవు చనిపోతే నీతో పాటే మేముకూడా ప్రాణాలు తీసుకుంటాం. ఇంక ఎప్పుడు ఇలాంటి పని చేయకు, నీకు ఎలా బ్రతకాలనిపిస్తే అలా బ్రతుకు అని నాకు ధైర్యం చెప్పారు. ఇక వాళ్ల కోసం బ్రతకాలి అనుకున్నాను. రోజు ఇంట్లోనే ఉంటే పిచ్చి పడుతోంది. నాలో ఎన్ని మార్పులు వచ్చిన చదువు మీద ఏ మూలో కాస్త ఆసక్తి ఉండేది. తొమ్మిదో తరగతి లో చదువు ఆపేసాను. మళ్ళీ చాల రోజుల తర్వాత ప్రైవేటుగా డిగ్రీకి కట్టాను. పాసైనాను. డిగ్రీ పాస్ అయినాను. మళ్ళీ వూరికే ఇంట్లో కూర్చుంటే ఎడతెగని ఆలోచనలు. ఏమైతే అది అవుతుందని మా ఇంటికి కాస్త దగ్గర ఉన్న స్కూల్లో టీచర్ గా చేరుతామని వెళ్ళాను. ఆ స్కూల్ కరెస్పాండెంట్ పవన్ సార్ మా నాన్నకి కాస్త తెలిసి ఉండడంతో నేను జాబ్ అడిగినపుడు కాస్త సందేహించి, మరి కాస్త సంకోచంతో ఓ వారం రోజుల తర్వాత రమ్మన్నాడు. అప్పటికే మా ఇంటి చుట్టు పక్కల అందరికి నాలోని తేడాలు తెలియడం తో నన్ను చూసి నవ్వుకోవడం, గుసగుసగా మాట్లాడుకోవడం లేదంటే జాలిగా నా వంక చూడడం చేసేవారు. డాక్టర్ కి తెల్ల కోటు, లాయర్ కి నల్లకోటు డ్రెస్ కోడ్ గా ఉన్నట్లు ప్రతి మనిషికీ ఈ లోకం లో మనిషి అనిపించుకోవడానికి ఒక కోడ్ ఉండాలేమో. మనిషి ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా మాట్లాడాలి అని నిబంధనలు ఉన్నాయేమో. అలా కాకుండా ఏ మాత్రం తేడా గా కనిపించినా సమాజం భరించలేదేమో. సూటి పోటీ మాటలతో హింసించి ఎదుటి వారు బాధ పడితే చూసి రాక్షసానందం పొందే వారు ఎక్కువ మంది ఈ లోకంలో. వాళ్ల చూపులు నాకు చిరాకు పుట్టించేవి.

వారం తర్వాత స్కూల్ కి వెళ్లి సార్ ని అడిగితే ఏదో మొక్కుబడిగా ఇవ్వాలన్నట్టు స్కూల్ అయిపోయినాక సాయంత్రం స్టడీ అవర్ లో స్టూడెంట్స్ ని చదివించే పని ఇచ్చారు. ఇంట్లో వూరికే ఉండడం కన్నా ఇది కాస్త మేలు అనుకోని ఆ పనిలో చేరాను. సాయంత్రాలు పిల్లలతో కలిసిఉండడం, వాళ్ళని చదివించడం నా మనసుకు ఊరటగా ఉండేది. కొన్ని రోజులు ఈ జాబ్ బాగానే ఉంది అనిపించింది. కానీ అక్కడ కూడా నా వాలకాన్ని చూసి పిల్లలు ” నాగరాజా సార్ చూడు అమ్మాయి లా నడుస్తున్నారు, అమ్మాయిలా మాట్లాడుతున్నారు ” అని నా వెనుకనవ్వుకోవడం నేను చాల సార్లు గమనించాను. నవ్వులు, ఛీత్కారాలు, జాలి చూపులు, ఎగతాళీ మాటలు అలవాటు అయిన నాకు వాళ్ళు నవ్వుకోవడం పెద్దగా బాధ అనిపించలేదు. నా దేహ నిర్మాణాన్ని, నా మానసిక పరిస్థితిని నేను అంగీకరించసాగాను.
కానీ ఎన్ని రోజులు ఇలా బ్రతకాలి అనే ఆలోచనలు నన్ను, నా నిద్రని అతలాకుతలం చేసేవి. మా అమ్మ, నాన్న కూడా నా భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకున్నారు. ఇంటిలో అంతా ఓ రకమైన స్మశాన వైరాగ్యం అమలుకుని ఉండేది. ఓ రోజు పేపర్ చూస్తుంటే’ విదేశాలలో ఎవరో ట్రాన్స్ జెండర్ వ్యక్తి అందాల పోటీల్లో పాల్గొని అందాల రాణి టైటిల్ గెలుచుకున్నాడు ‘ అనే వార్త నన్ను ఆకర్షించింది. ఓ వంద సార్లు ఆ వార్తని చదివాను. నాలో ఎవో కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు చిగురించాయి. ఇంటర్నెట్ లో వెతికి ఆ వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఆ వ్యక్తి కూడా పుట్టుక తో మగవాడుగా పుట్టి క్రమంగా అతనిలో స్త్రీ లక్షణాలు అభివృద్ధి చెందాయట. తర్వాత ఆ వ్యక్తి కొన్ని హార్మోనల్ సర్జరీలు చేయించుకొని పూర్తిగా స్త్రీ గా మారిపోయి అందాల పోటీలలో పాల్గొన్నాడట. అమ్మ, నాన్నలకు ఆ వార్త గురించి చెప్పాను. వాళ్ళు నీకు ఎలా ఉంటే సంతోషమో అలాగే ఉండు అన్నారు.

నాలో కొత్త ఆశలు మొదలైనాయి. ఏ సమాజంలో మనుషుల చేత గేలి చేయబడ్డానో , ఏ మనుషుల చేత నవ్వులపాలైనానో, వారి చేతనే గొప్ప వ్యక్తిగా గుర్తింపబడాలి. వారి చేతనే మెప్పుదల పొందాలి అనే ఆకాంక్ష బలంగా నా మనసులోకి నాటుకుపోయింది. భూమిలోకి విత్తనం నాటుకున్నట్టు. సూర్య రశ్మి, గాలీ, నీరు సంవృద్ధిగా అంది అనుకూలమైన నేలలో పోషకాలను అంది పుచ్చుకున్న విత్తనం భూమిని చీల్చుకొని మొలకెత్తి ఎలా గర్వంగా తన తల పైకెత్తుతుందో, అలా బీడువారిన నా మనసనే భూమిలో ఆశల విత్తనాలు చిగురించాలని తహతహలాడసాగాయి. జీవితానికి ఏదో కొత్త అర్ధం, పరమార్థం ఉన్నట్టు అనిపించసాగింది. సాయంత్రాలు స్కూల్ కి వెళుతూనే పగలు ఇంటర్నెట్ లో ట్రాన్స్ జెండర్ ల గురించి, వారి సమస్యల గురించి, వారి పట్ల సమాజంలో వివక్ష గురించి చాల సమాచారం సేకరించాను. అలాగే హార్మోనల్ సర్జరీ గురించి, అది అమలు జరిగే విషయంలో సాధ్యాసాధ్యాల గురించి డాక్టర్ల తో మాట్లాడడం, చాల సందేహాలు అడిగి తెలుసుకున్నాను. ఆ క్రమంలో హార్మోనల్ సర్జరీలు చేసే డాక్టర్లు బొంబాయి లో ఉన్నారని తెలిసి బొంబాయి కి ప్రయాణం అయినాను. ఆ ప్రయాణంలో చాల కఠోరమైన నిజాలు కళ్ళ చూసాను. ఆ రోజు సాయంత్రం అనుకుంట ట్రైన్ లో ఉండగా గుంపుగా కొందరు ట్రాన్స్ జెండర్ లు రైలు ఎక్కి ప్రతి ఒక్కళ్ళ దగ్గరకి వచ్చి డబ్బులు దండుకోసాగారు. డబ్బులు ఇవ్వమని చప్పట్లు కొడుతూ, బూతులు మాట్లాడుతూ అందరిని వేధించసాగారు. నేను ఎక్కిన భోగీలోనే ఓ యువకుడు డబ్బులు ఇవ్వనని వారితో గొడవ పడ్డాడు. హఠాత్తుగా ఓ ట్రాన్స్ జెండర్ వ్యక్తి ఆ యువకుడిని సీట్లో నుంచి లాగి రైలు లో నుంచి కిందకు తోసేసాడు. క్షణాలలో కళ్ళ ముందు ఆ యువకుడు రైలు కింద పడి రెండు ముక్కలైనాడు. గుంపుగా వచ్చిన ట్రాన్స్ జెండర్ లు అందరు పరుగులు తీస్తూ మాయమైపోయారు. నేను కళ్ళు మూసుకొని వణికిపోయినాను. జరిగిన ఘోరాన్ని తలచుకొని ప్రయాణికులు అందరు భయబ్రాంతులతో దిమ్మెరపోయినారు. కొందరు మాత్రం ఇది మాకు అలవాటే అన్నట్టు ” కొజ్జా వెధవలు డబ్బులు అడిగితే ఎంతో కొంత వాళ్ళ ముఖాన కొట్టాలి. మూడు నెలల ముందు కూడా ఇలాగే ఒకరిని డబ్బులు ఇవ్వలేదని చావకొట్టారు. ఈ వెధవలనందరిని కాల్చి పారేయాలి.” అంటూ వారి పట్ల తనకు ఉన్న కోపాన్ని చాల బూతుమాటలతో వెడలఁగక్కాడు. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో నాకు తెలీదు కానీ వారిని అలా క్రూరులు గా మార్చింది ఎవరు. వాళ్ళు కూడా సమాజంలోని భాగమే అనుకోని వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మాములు మనుషులుగా బ్రతుకుతారు కదా. వాళ్ళని గేలి చేస్తూ, ఏ పని చేయడానికి పిలవకుండా ఉంటే వారు ఎలా బ్రతకాలి.

అ ప్రయాణంలోనే నాకు ఇంకొందరు ట్రాన్స్ జెండర్ లు కలిశారు. వారి కష్టాలు చెప్పుకున్నారు. ఏ పని దొరకక పొట్ట పోసుకోవడానికి చివరకి వ్యభిచారం చేస్తున్నాం అని వారు చెప్తుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. ఏమిటి ఈ జీవితం. ఎలాగైనా నేను అనుకున్నది సాధించి, నాలాంటి వారికీ ఉపాధి కల్పించాలి. జీవితం మీద ఆశ కలిగించాలి అని చాల బలమైన సంకల్పాన్ని మనసులో ముద్రించుకున్నాను. బొంబాయి వెళ్లి డాక్టర్లని కలిసాను. పూర్తిగా హార్మోనల్ సర్జరీ అంటే చాల ఖర్చు, రిస్క్ తో కూడుకున్న పని. సర్జరీలు ఒక్కోసారి ఫలించవచ్చు. ఒక్కోసారి ఆపరేషన్ వికటించి చెడు ఫలితాలు రావచ్చు. అప్పుడు ప్రాణానికే ముప్పు రావచ్చు. కాబట్టి ఈ సర్జరీ గురించి కుటుంబం అంతా కలసి మాట్లాడుకొని అందరి ఆమోదం ఉంటేనే ఇలాంటి ఆపరేషన్లు చేస్తాం అని చెప్పారు డాక్టర్లు. ఇంకో ముఖ్య విషయం పూర్తిగా స్త్రీ గా మారినా సర్జరీ చేయించుకున్న వాళ్లకు సంతానోత్పత్తి సామర్థ్యం మాత్రం ఉండదు. ఇందుకు సమ్మతం అయితేనే సర్జరీ గురించి ఆలోచించండి అని చెప్పారు డాక్టర్లు.

హు; సమాజంలో మనిషిగా గుర్తింపబడితే చాలు. పెళ్లి,సంతానం లాంటి ఆశలు నాకు లేవు. నా లాంటి వారు ఎందరో పసివారుగా ఉన్నపుడే అనాధలుగా వీధిలోకి నెట్టివేయబడతారు. అలాంటివారికి అమ్మనైతే చాలు నేను అనుకున్నాను.

బొంబాయి నుంచి తిరిగి ఊరికి వచ్చేసాను. అమ్మ, నాన్నకు సర్జరీ విషయాలు, డాక్టర్లు చెప్పిన సంగతులు అన్ని చెప్పాను. ” నీ సంతోషమే మాకు కావాలి రాజా. నీకు ఏం చేయాలిఅనిపిస్తే అది చెయ్యి.” అన్నారు. ఇలాంటి తల్లి దండ్రులకు పుట్టడం నిజంగా నా అదృష్టం.కొన్ని రోజులు బయట తిరిగి “ట్రాన్స్ జెండర్ ” ల జీవితాల గురించి తెలుసుకొని వస్తాను అని అమ్మ, నాన్నలకు చెప్పి దేశాటనకు బయలుదేరాను. దాదాపు ఓ నెల రోజులు చాల ఊర్లు తిరిగాను. చిన్న పల్లెటూరు నుంచి పెద్ద పెద్ద నగరాలు అయిన హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, బొంబాయి లాంటి ఊర్లు కూడా తిరిగాను. ఒక్క ” ట్రాన్స్ జెండర్ ” లే కాదు పుట్టుక, విధి వక్రించి, సమాజం చేత చిన్న చూపు చూడబడే అభ్యాగులు ఎందరో తారసపడ్డారు ఈ ప్రయాణంలో నాకు. పెద్దగా తెలివి తేటలు లేక, సరిగా చదువు అబ్బక, మంచి ఉపాధిదొరకక ఇళ్లలో పాచి పనులు చేసేవారు, నీళ్లు మోసే వారు పల్లెటూర్లలో. ఇక నగరాలలోఅయితే ఎవరు పనులకు పిలవక, కొంత సోమరితనంతో సులభ సంపాదనకు అలవాటు పడి వక్ర మార్గాలలో రైళ్లలో ప్రయాణికులను దోపిడీచేయడం, దౌర్జన్యంగా డబ్బులు గుంజుకోవడం, అదీ కాకుంటే పడుపు వృత్తి లాంటి చీకటి తప్పులు చేయడం, ఇది విధి వంచితులు ఎంచుకున్న ఉపాధి మార్గాలు. వీటివల్ల సుఖ వ్యాధుల బారిన పడినవారు, వయసుడిగి రోగాలతో మంచాన పడి నా అని ఇంత అన్నం పెట్టే దిక్కు లేక అల్లాడుతూ దయనీయ పరిస్థితిలో చావు కోసం ఎదురు చూసేవాళ్ళు ఎందరో. నూటికో కోటికో ఒక్కరు అన్నట్టు చాల కొద్దిమంది మాత్రం కాస్త చదువుకొని చిన్న చితక ఉద్యోగాలు చేసేవారు నాకు తారసిల్లారు.మరి కొద్ది మంది తెలివితేటలు కలిగి ఊరికి ప్రెసిడెంట్, ఒక నియోజక వర్గానికి యం.ఎల్.ఎ. అయిన వాళ్ళు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. వాళ్ళు నా కంటికి ఆరిపోయే నా ఆశల దీపానికి చమురు పోసి ఒత్తి సరిచేసి మళ్ళీ నా ఆశాజ్యోతినివెలిగించిన దేవతలు వాళ్ళు అనిపించింది.

అలా అందరిని చూసిన నాకు ఏవేవో కొత్త ఆశలు, ఆలోచనలు. నాలాంటి వాళ్ళకోసంఏమైనా చేయాలి. ఊరికి తిరిగి వచ్చేసాను. అమ్మ, నాన్నలకు సర్జరీ గురించి చెప్పాను, కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదని తెలుసు. ఏం చెయ్యాలో తోచలేదు. ఆలోచనలతోనిద్ర పట్టేది కాదు నాకు. నేను పడే బాధ ఎవరికి తెలిసిన తెలియక పోయిన మా అమ్మమాతృ హృదయం అర్ధం చేసుకుంది. అమ్మ మాటే మా నాయనా మాట అయినది.నా మనసులోని బాధని, సంకోచాలని గమనించిన అమ్మ ” రాజా, నువ్వేమి సందేహాలు పెట్టుకోకు. నువ్వు పుట్టినప్పుడు ఎంతో తోషపడ్డాం. నువ్వు పెరిగి పెద్ద అయినాక నీ శరీరంలో లోపాలు ఉన్నాయని తెలిసి ఎంతో కుమిలిపోయాం. మేము ఏ జన్మలో చేసిన పాపమో మాకు ఇలాంటి మానసిక క్షోభ, నీకు ఈ శాపం అని మేము బాధ పడని రోజు లేదురా. నీ ముందు బాధ పడుతుంటే నువ్వు మరింత కృంగిపోతావని మా దుఃఖాన్ని దిగమింగుకొని బ్రతుకుతున్నాం బాబు. నీ సంతోషమే మాకు కావాలి. నువ్వు సర్జరీ గురించి, ఖర్చు గురించి చెప్పినపుడు మేము ఒకటే నిర్ణయించుకున్నాం బాబు. అది ఏమిటంటే నీవు సంతోషంగా ఉండడానికి మేము ఎంతకైనా పోరకాడలని. అందుకే ఊర్లో ఉన్న మన పొలాన్ని బేరానికి పెట్టాం. మంచి బేరానికి అమ్మేసి ఆ డబ్బుతో నీకు సర్జరీ చేయించవచ్చుఅని అనుకున్నాం. నీ సంతోషం కన్నా మాకు ఆస్తులు గొప్పకాదు. నువ్వు డాక్టర్లతో మాట్లాడు రాజా “. అంది మా అమ్మ.

అమ్మ, నాన్నలకు నా పట్ల ఉండే ప్రేమకు నేను చలించిపోయాను. నాకు ఈ శారీరక లోపం వున్నా సహృదయులు, బంగారంలాంటి అమ్మ, నాన్నలను ఇచ్చాడు ఆ దేవుడు అనుకున్న. కన్నా వాళ్ళ చేత కూడా చీదరింపబడి అందరు వున్నా అనాధలుగా బ్రతుకుతున్న ఎందరో ” ట్రాన్స్ జెండర్” లను చూసాను నేను. ఈ విషయంలో మాత్రం నాది అదృష్టం అనుకున్నాను నేను. జీవితం అంటేనే ఒక సవాలు. ఒక సాహసం. కష్టాలు లేకుండా సాఫీగా జీవితం గడిచిపొతే ఆ జీవిత ప్రయాణం నిస్సారంగా ఉంటుంది. ఎన్ని కష్టాలకు ఎదురొడ్డితే అంత రాటుదేలుతుంది బ్రతుకు. మనిషి అన్నాక ప్రతిఒక్కరికి కష్టాలు, సవాళ్లు వస్తాయి. అసలు అవి వస్తేనే జీవితం. కష్టం వచ్చినప్పుడు మనం ఎలా కష్టానికి ఎదురు నిలబడి గెలుస్తామో అనేదానిని బట్టి మన గొప్పదనం, మన విజయం ఆధారపడి ఉంటాయి. ఒక్కో మనిషికి ఒక్కో రూపంలో కష్టం వస్తుంది. నాకు ఈ రూపంలో వచ్చింది అనుకున్నాను. అమ్మ,నాన్న ఇచ్చిన భరోసాతో నా ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి సంతోషంగా సిద్ధపడ్డాను.

బొంబాయి వెళ్లి సర్జరీ గురించి డాక్టర్లను సంప్రదించాను. నాన్న ఊర్లోనే వుండి పోయాడు. అమ్మ మాత్రం నాతో బొంబాయి వచ్చింది. అనుక్షణం నా వెన్నంటి ఉండి నాకుతోడు , నీడగా ఉంది. డాక్టర్లను కలిసిన తర్వాత నేను కొన్ని స్వచ్చంధ సేవ సంస్థలను కూడా కలిసి నా గురించి, నా ఆశయాల గురించి, నా సర్జరీ గురించి వారికి వివరించాను. ఆశయాలకు అబ్బురపడి, నా ఆశయాలు నెరవేరడానికి తమవంతు సాయం చేయడానికి,నా సర్జరీ కి అయ్యే ఖర్చులో కొంత వారు భరించడానికి వారు ముందుకు వచ్చారు. అమ్మ,నాన్న, నాకు సాయం చేయడానికి వచ్చిన మనసున్న మారాజుల అందరి దీవెనలతోనాకు సర్జరీ జరిగింది. ఒకటి కాదు రెండు కాదు. సంవత్సరం రోజులలో దాదాపు పది రకాల పైనే సర్జరీలు జరిగాయి నాకు. సర్జరీలు జరిగేటప్పుడు ఎన్నోబాధలు,నొప్పులను భరించాను. ముడి బంగారాన్ని కొలిమిలో కాల్చి సమ్మెట తో కొట్టి, కరిగించి, వంచి, తీగలుగా సాగదీసి, మెరుగు పెడితే కానీ అది ఆభరణంగా మలచడానికి సాధ్యం కాదు. అలాగే ఎన్నో శస్త్ర చికిత్సలు జరిగి, ఎంతో శ్రమని, బాధని, నొప్పులను ఓర్చుకుని, అంతకంటే ఎంతో సహనంతో ఎదురు చూసాను. సర్జరీలు అయినాక ఓ ఆరు నెలలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఎన్నో రకాల శిక్షణలు పొంది అంచలంచలుగా ఒక్కో ఎక్కుతూ , ఒక్కో పోటీలో విజయం సాధిస్తూ ఆనాటి నాగరాజు ఈనాడు ఇదిగో ఇలా మీ ముందు మిస్ ఇండియా నాగరాణిలా నిలిచింది.

ఆడిటోరియం అంతా కరతాళధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఒక్క క్షణం అంటూ అందరిని ఆగమని సైగ చేసి నాగరాణి ” ఇంకొక్క రెండు నిముషాలు నేను చెప్పేది వినండి. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి మంచిగా బ్రతకాలి అనుకుంటారు.కానీ వారి వారి విధో,ఖర్మో, అదృష్టమో, దైవానుగ్రహమో, జన్యువుల లోపమో, స్వయంకృతమో, పరిస్థితుల ప్రభావమో అనుసరించి ఈ లోకం లో ఎందరో అభాగ్యులు దివ్యాంగులు, మానసిక వికలాంగులు, స్వజాతి సంపర్కులు [హోమో సెక్సువల్స్] అయిన “లెస్బిన్” లు, “గే” లు, “సూపర్ మేల్ “, “సూపర్ ఫిమేల్” ల రూపంలో పుట్టి కన్నవారిచేతనే నిరాధరించబడి, సమాజం చేత చీదరించుకోబడి, మన మధ్యనే ఉంటూ ఎవరు లేని అనాధలుగా చీకటి తప్పులు చేస్తూ కొందరు, భిక్షం ఎత్తుతూ మరికొందరు బ్రతుకు బండిని భారంలా లాగుతున్నారు. ” ట్రాన్స్ జెండర్” గా నేను ఎన్ని అవమానాలు చవిచూసానో నాకు తెలుసు. నాలాంటి వారికోసం ఏమైనా చెయ్యాలి అనిపించింది. శారీరక , మానసిక లోపాలతో పుట్టినంత మాత్రాన వారు సమాజంలోని అందరిలాగా బ్రతకాలనుకోడం తప్పు కాదు. ఇప్పుడిప్పుడే సమాజంలో మార్పులు వస్తున్నాయి. వారి అందరికి కూడా సమానమైన విద్య,ఉపాధి అవకాశాలు, హక్కులు, భాద్యతలు చట్ట ప్రకారం ఉన్నాయి. నేను నా జీవితంలో విజయం సాధించాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే . పుట్టుకలో లోపాలు ఉన్నవారు మీకు ఎదురైతే వారిని చూసి నవ్వకండి, చీదరించుకోకండి, గేలి చేయకండి, జాలిగా కూడా చూడకండి. వాళ్ళు కూడా మన లాగే బ్రతికేందుకు వారికి ధైర్యం చెప్పండి. చేయూత నివ్వండి. వారి సంతోషకరమైన బ్రతుకు కు భరోసా ఇవ్వండి. నేను మిస్ ఇండియా విజేతగా నా జీవితంలో విజయం సాధించాను. ఇప్పుడు నా భాద్యత మరింత పెరిగింది. వారందరికీ మంచి జీవితాన్ని సాధించుకోవడానికి నా శక్తి వంచన లేకుండా వారికి చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నాను. నాతో చేతులు కలపడానికి మీరందరు కూడా సిద్ధపడతారు కదా” అంటూ ఎంతో ఉద్వేగంగా అందరిని చూసింది ” మిస్ ఇండియా” నాగ రాణి.

ఆమె నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ, ఆమె చేపట్టే కార్యక్రమానికి “చేయూత”ఇవ్వడానికి తమ వంతు సహకారం అందిస్తాం అనేదానికి సూచనగా ఆ ఆడిటోరియం మొత్తం కరతాళధ్వనులతో మారుమ్రోగిపోయింది.

12 thoughts on “విజేత”

  1. ఏడిద గోపాలకృష్ణ మూర్తి

    మీ ట్రాన్సజెండర్ కథ విజేత బాగుంది. చాలా బాగా రాశారు. అభినందనలు.

  2. కంబదూరి షేక్ నబిరసూల్

    సమాజంలోఅతిదయనీపరిస్తితులెదుర్కొంటున్న”కొజ్జాలు”గాపిలువబడేవారిఎదుగుదలనుహృద్యంగాఅక్షరీకరించి”కృషితోనాస్థిదుర్భిక్ష్యం” అన్నలోకోక్తినిఆజాతివారికిఎరుకపరిచేప్రయత్నంవిజయవంతమైంది. కథనడిపినతీరులోఅందెవేసినచేయిశ్రీమతిరోహిణిగారిది.పాఠకులనీ.సమాజాన్నిచైతన్యపరిచేప్రయత్నమేఆమెవిశ్వాసంగాఈమద్యవచ్చిన ఆమెకథలేసాక్ష్యం.. ఇంకావిశ్వజనీనదృక్ఫథంతోదూసుకెళ్లాలనిమనస్పూర్తీగాఆశీర్వదిస్తూఅనంతపురంజిల్లారచయితలసంఘంపక్షానఅభినందనచందనాలు తెలియజేస్తున్న.. హాజీ కంబదూరి షేక్ నబిరసూల్. జిల్లా గవర్నర్ ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. అనంతపురం

  3. Marasani vijayababu

    సామాజిక సమస్యను కథగా ఎన్నుకున్నారు. అందుకు అభినందనలు.

Comments are closed.