

రచయిత్రి రోహిణి వంజారి ‘దిగులు వర్ణం’ కవితా సంపుటి తరువాత వెలువడిన కథల సమాహారం “విజయ మహల్ సెంటర్ కథలు”. ఆమె పుట్టి పెరిగింది నెల్లూరులో. విజయమహల్ సినిమా హౌస్ ముందు రోడ్ లో రెండు వీధుల కార్నర్ ఇంట్లో. తండ్రి చిన్న రైతు. అమ్మ ఆ కుటుంబాన్ని సమర్ధవంతంగా నెట్టుకొచ్చిన తల్లి. ఈ కథలన్నీ తన స్కూల్ రోజుల్లో ఆ పసి మనసు పైన ముద్రపడి నిలిచిపోయినవి. ఉత్సాహంగా బొంగరం లాగా తన స్నేహితులతో కలయతిరుగుతూ ఉండిన చిన్న పిల్ల బుజ్జమ్మ. ఈ బుజ్జమ్మే తన చిన్నప్పటి సంఘటనలను కథలుగా చేసి చెప్పింది. ఒక విధంగా చెప్పాలంటే, ఇవి “దిగులు కథలు”. చూడండి, చిన్నప్పుడు మనం పుట్టి పెరిగిన కాలంలో అనుభవాలు, మంచివైనా, బాధించేవైనా జీవితాంతం జ్ఞప్తికి వస్తూనే ఉంటాయి. నా మటుకు నేను పది మంది పిల్లలున్న ఒక స్థితిపరుల కుటుంబంలో, ఒక పల్లెటూళ్ళో పుట్టి, హైస్కూల్ దాకా పక్క ఊళ్ళో చదివినా, ఇవ్వాళ లేని ఆ పెద్ద పెంకుటిల్లు, కష్టాలు సుఖాలు అన్నీ రోజూ గుర్తుకొస్తాయి. కలలో కూడా గోచరమవుతాయి. రోహిణి కథలు అలాటివే. చదివేక ఆ జ్ఞాపకాలు గుండెను
ఆర్ద్రపరుస్తాయి. సంపుటిలో ఉన్న మొత్తం 21 కథల్లో మూడిటి గురించి సూక్ష్మంగా చెప్తాను. ఈ కథలన్నీ, అందమైన నెల్లూరు యాసలో రాసినవి.
1. వజ్రం ఇలువ.
తండ్రి, స్కూల్ (వీధి బడి-ప్రైమరీ స్కూల్) ఫీ కట్టమని పావలా కాసు ఇస్తాడు. స్కూల్ మొదలవటానికి ఇంకా సమయం వుంది కదా అని, బుజ్జమ్మ తన స్నేహితురాలితో స్కూల్ ఎదురుగా వున్న మురికి నీటి పిల్ల కాలవకి అటొకరు ఇటొకరు నిలబడి, పాటలు పాడుతూ ఆ కాలవ పైనుండి గెంతటం. ఈ గెంతటంలో బుజ్జమ్మ షర్ట్ జేబులో వున్న పావలా కాసు ఆ మురికినీళ్లలో పడిపోతుంది. ఒక్కసారి గుండె ఆగినంత పనై ఆ నీళ్లలో వెతుకుతుంది. దొరకదు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తండ్రికి చెప్తుంది. ఆయన వున్నవాడు వున్నట్టే హడావిడిగా బయలుదేరి ఆ మురికినీళ్లలో చెయ్యిపెట్టి వెతుకుతుంటే గాజుపెంకు గీచుకుపోయి రక్తం వస్తుంది. అయినా వదలక రెండో చేత్తో ప్రయత్నించి చివరకు దొరికించుకుంటాడు. ఆ పావలా విలువ అతడికి అంత గొప్పది ఆ రోజుల్లో.
2. కర్పూరదీపం.
పాయిఖానాలు చేతితో శుభ్రం చేసే ఒంటరి మనిషి
నరసమ్మ కథ. ఆమె ఒక్కరోజు రాకపోతే జనం అల్లాడిపోతారు. అతి కొద్ది జీతానికి ఇల్లిల్లు తిరిగి చేత్తో ఆ విసర్జనాన్ని రేకుతో తీసి, బకెట్లో వేసుకొని, ఆ దొడ్డి అంతా ఫినాయిల్ తో కడిగి శుభ్రం చేస్తుంది. ఆవిడను అందరూ దూరం పెడతారు, ఆ మలినం కంపు భరించలేక. ఒకసారి తుఫాను వచ్చి నరసమ్మ నాలుగు రోజులు రాకపోతే, జనం ఇబ్బంది పడి, కోపం వచ్చి, మురికి కాలువగట్టున కడుపేదవాళ్లు పాకలు వేసుకుని వుండే చోటుకి ఆమె ఇంటికి వెళ్తారు. లోపల నరసమ్మ నిర్జీవంగా కనబడుతుంది, కళ్ళు తెరుచుకొని. ఆ పాకకు వున్న తాటి దూలం తుఫానుకు కదిలి ఊడిపోయి ఆమె నెత్తిన పడి మరణిస్తుంది. ఆ తెరిచిన కళ్ళు ప్రశ్నిస్తున్నట్టు ఉంటాయి- ఒక్కరోజు నేను రాకపోతే తిట్టుకొనేవాళ్ళు, నాలుగు రోజులు రాకపోతే ఏమై ఉంటుందని-జబ్బు పడిందా, తిన్నదా లేదా అని ఏనాడూ కనుక్కోనివాళ్లు ఈరోజు మీ దొడ్లు కుళ్ళిపోయి కంపుకొడుతున్నాయని వచ్చారా బాబూ! అని. ఆ ఇళ్లవాళ్ళు అన్ని కులాలు మతాల వాళ్ళు చందాలు వేసుకొని నరసమ్మని సాగనంపుతారు, దుఃఖపడుతూ.
3. మహారాజు.
బుజ్జమ్మ ఇంటి ఎదురుగా వున్న ఖాళీ స్థలంలో కరీముల్లా అనే వ్యక్తి చిన్న షెడ్డు వేసుకొని రిక్షాలు బాడుగకు ఇస్తూ ఉంటాడు. వీళ్ళలో రమణయ్య ఒకడు. ఒంటరివాడు. రిక్షా బేరం వచ్చినప్పుడు తోలి, మిగతా సమయంలో తాగేసి రిక్షా సీటు వాల్చి పడుకుంటూ ఉంటాడు. ఈ రిక్షా కార్మికులు నవరాత్రి ఉత్సవాల్లో యేవో వేషాలు వేస్తూ, వీధులు తిరిగి షాపులవాళ్లు ఇచ్చేద కొద్ది డబ్బుతో తాగి, తినేవాళ్ళు, కుటుంబాలను పోషించేవాళ్ళు. ఒకరోజున వేషాలు ఏమంటే ఒక శవాన్ని పాడె మీద పడుకోబెట్టి, దానిని మోస్తూ ఏడుస్తూ అడుక్కోవటం. ఆ రోజు ఫుల్ గా తాగివున్న రమణయ్యది శవం వేషం. మత్తుగా జోగుతున్నవాడిని లేపి పాడె ఫై పడుకోబెట్టి నాలుగు వీధులు తిరిగి వచ్చిన డబ్బులు పంచుకుంటూ రమణయ్యను లేపితే లేవడు. అతడు ఆ పాత్రలో జీవించి నిజంగానే చనిపోయాడు. అందరూ, తోటి
కార్మికులు, షాపుల వాళ్ళు బాధపడి, అతడి దహన సంస్కారాలకి చందాలు వేసుకుంటారు.
అన్నీ పేదల కథలే. రోహిణి గారు చేసిన కథనం గుండెలను సూటిగా తాకుతుంది. తప్పక చదవవలసిన కథలు. ఈమె ‘దిగులు వర్ణం’, ‘విజయమహల్ సెంటర్ కథలు’, తరువాత కథల సంపుటం ‘నల్ల సూరీడు’ హైదరాబాద్ నవోదయ బుక్ హౌస్ లోను, విశాలాంధ్ర బుక్ హౌస్ లోను దొరుకుతాయి. లేదా రోహిణి గారికి 90005 94630 కి మెసేజి చేసి కాని పొందవచ్చు. ఒక్కో పుస్తకం వెల రు. 200. పోస్టు ఖర్చులు అదనం.
ఈ కథలు చదువుతుంటే నాకు రావిశాస్త్రి కథలు, తెనాలిలో హోటల్ సర్వర్ గా పనిచేసి చిన్నతనంలోనే క్షయ వ్యాధితో పోయిన ‘శారద’ అనబడే నటరాజన్ కథలు గుర్తుకొచ్చాయి.