లలితమ్మ హోటల్

మిత్రులకు నమస్తే. కరోనా కష్ట కాలంలో కుటుంబం అంతా హోటల్ కి వెళ్ళి మంచి టిఫిన్ చేసి ఎన్ని రోజులో అయినది కదా. అందుకే మీకోసం మా లలితమ్మ హోటల్ గురించి మీకు చెప్పాలని ఇక్కడ ఈ కథను పోస్ట్ చేస్తున్నాను. నేను రాసిన ఈ కథ “లలితమ్మ హోటల్ ” విశాలాక్షి మాస పత్రిక లో ప్రచురితం అయింది. కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయమును కామెంట్ రూపం లో తెలిపి నన్ను ప్రోత్సాహిస్తారు కాదు. ధన్యవాదాలు.


బడి ముందర రంగులరాట్నం తిరగతా ఉంది. దానికున్న నాలుగు తొట్లలో ఇద్దరేసి పిల్లలు తిరగతా ఉండారు. “పాలైసు పాలైసు ” అంటా అరస్తా ఉన్నాడు ఐసు బండి రాములు తాత. బడి గంట గణ గణ మంటా మోగింది. బిల బిల మంటా అందరం బడి లోకి పరుగులు తీసాం.

ఆ రోజు అందరు అయివార్లు వచ్చారు. మా ఐదో తరగతి అయివారు ‘మోహన్ రావు ‘ సార్ మాత్రం ఇంకా రాలేదు. మా పిలకాయల అరుపులతో తరగతి గది పైన ఉన్న రేకుల కప్పు ఎగిరిపోయేలా ఉంది. తరగతంతా గోల గోలగా ఉంది. నేను, సునీత రఫ్ నోట్స్ లో బొమ్మలేసుకుంటున్నాం. రెండో తరగతిలో నుంచి ‘శేషగిరి ‘ అయివారు వచ్చి మమ్మల్ని అరిచి ‘ గోల చేయకుండా గమ్మునుండండి. మోహన్ రావు అయివారు వచ్చే వరకు తెలుగు వాచకం తీసి కంద పద్యాలు చదవండి. మళ్ళా నేను ఒప్పజెప్పిచ్చుకుంటా “అని చెప్పి వెళ్ళాడు. అందరం తెలుగు వాచకం తీసాం.

ఒకటో పీరియడ్ బెల్ కొట్టాడు అటెండర్ చిన్నయ్య. గంట పది అయింది. అప్పుడు అదలా బదలా మంటా మోహన రావు అయివారు మా తరగతిలోకి వచ్చాడు. అందరం లేచి నిలబడి ‘గుడ్ మార్నింగ్’ చెప్పాము. మా అరుపులు విని హెడ్ మాస్టర్ రాంమూర్తి సార్ తరగతిలోకి తొంగి చూసి మోహన రావు అయివారిని చూసి ” హమ్మయ్య ” అనుకుంట స్థిమితంగా ఒకటోతరగతి సైడుకి వెళ్ళాడు.

వస్తానే మోహనరావు అయివారు నన్ను చూసి ” అమ్మాయ్ అనురాధ .. ఈ రోజు పొద్దునే అయ్యోరమ్మ బైట చేరింది. అందుకని ఇంట్లో నాస్టా చేయలా. నేను వంట చేసి వచ్చేసరికి ఆలస్యం అయింది. నువ్వు, సునీత పోయి బాలాజి నగర్ మూడో అడ్డ రోడ్డులో ఉన్న లలితమ్మ బ్రాహ్మణ హోటల్లో ఐదు ఇడ్లిలు, తనీగా చెట్నీ కట్టించుకురండి. ” అంటూ ఐదు రూపాయల బిళ్ళను నా చేతిలో పెట్టి ” ఇక్కడున్నట్లు రావాలి. భిన్నా పోయి రండి ” అన్నాడు. ఇంకాసేపటికి రెండో పీరియడ్ కూడా అయిపోయి ఒంటేలు గంట కొడతారు. మూడో పీరియడ్ శేషగిరి అయివారికి కంద పద్యాలు అప్పజెప్పే బాధ తప్పిందని ఎగురుకుంటా నేను, సునీత పరిగెత్తినాం. అమ్మణ్ణి మా వంక అసూయగా చూడడం భలే అనిపించింది మాకు.

మా బడి వెనుక ఉన్న యెద్దలరేవు వంతెన దాటి బాలాజీనగర్ కి వెళ్ళాం. వీధికి రొండు పక్కల పూల అంగళ్లలో సంపంగి,రోజా పూలతో కట్టిన పూలమాలలు వరసగా వేలాడదీసి ఉండి సువాసనలు వెదజల్లతా మాకు స్వాగతం చెప్తున్నట్లున్నాయి. బాలాజి నగర్ ఒకటి,రెండు అడ్డ రోడ్లు దాటినం. ఆంధ్రా బ్యాంకు బిల్డింగ్ కనపడింది. అక్కడ నుంచి మూడవ అడ్డ రోడ్డులోకి వెళ్ళాం. వీధి అంతా తిరిగినా లలితమ్మ హోటల్ మాకు కానరాలేదు. ఇక అప్పుడు మొదలైంది లలితమ్మ హోటల్ కోసం మా వెదుకులాట. నాలుగు, ఐదు అడ్డ వీధులలో కూడా చూసాం. ఎక్కడా ఉడుకుతున్న ఇడ్లీల వాసన కానీ, చెట్నీ గమ గమలు కానీ మా ముక్కులకు సోకలేదు. వీధులన్నీ తిరుక్కుంటా చివరకు గౌడు హాస్టల్ కాడికి చేరాం. హాస్టల్ వెనుకే “స్వామిదాసు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ” అని పెద్ద అక్షరాలతో బోర్డు కనపడింది మాకు.

రైలు కట్టకు ఇవతల ఊరు మొత్తానికి ఉన్న ఒకేఒక్క ఇంగ్లీష్ మీడియం బడి అది. అంటే మేము మాకు తెలియకుండానే బాలాజీనగర్ చివరకు దాదాపు ఐదు మైళ్ళ దూరం వచ్చేసాం. ఆ బడి గంట గణ గణ మోగింది. మా గుండెలు గుబ గుబలాడినాయి. అంటే మూడో పీరియడ్ కూడా అయిపోయింది అన్నమాట. ఇక అయివారి చేత మాకు బడితే పూజ తప్పదు అనుకున్నాం. ఎర్రటి ఎండకి తల చురుక్కుమంటా ఉంది. చెమటలు తలనుంచి కారతా ఉన్నాయ్. ఓ పక్క కాళ్ళు లాగేస్తా ఉన్నాయ్. మరో పక్క దాహం. ” ఈ లలితమ్మ హోటల్ ఎక్కడ ఉందిరా దేవుడా ” అనుకుంటా మేము మళ్ళా వొచ్చిన దోవనే వెనుక్కి తిరిగినాం.

ఇంకాసేపటికి మధ్యాహ్నం గంట కొట్టేస్తారు అని తలచుకోగానే మా అయివోరి రౌద్ర రూపం గుర్తుకువచ్చి మా నడక వేగం హెచ్చింది. వెనక నుంచి మళ్ళా మూడో అడ్డ రోడ్డులోకి వచ్చాము. ఇంటి ఇంటిని, ప్రతి అంగడినీ జల్లెడ పట్టాం. ఊహు. లాభం లేదు. ముడిచిన అరచేతిలోని ఐదు రూపాయల బిళ్ళ చెమటతో తడిచిపోయింది. హోటల్ కనపడక పొతే ఇడ్లీలు తేలేదని మోహనరావు సార్ కొడతాడు. నిస్సహాయతతో కూడిన రోషం వస్తోంది మాకు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కూడా దాటేశాం. అయివారు మరిచిపోయి మూడో అడ్డరోడ్డు అని చెప్పాడేమో, లలితమ్మ హోటల్ ఇక్కడ ఏమైనా ఉందేమో చూస్తాం అనుకుంటా రెండో అడ్డ రోడ్డులోకి వెళ్ళాం.

అక్కడ నాలుగు అంగళ్ళు దాటగానే ఓ ఇంటిముందర బల్లల మీద కూర్చుని కొందరు నాస్టా తింటా ఉన్నారు. పెనం మీద వేసిన నీళ్లు “సుయ్ సుయ్ ” మంటా ఉన్నాయ్. పెద్ద వృత్తం అంత దోశ పోసి దానిమీద అట్లకాడతో ఎర్రగడ్డ కారం పులమతా ఉన్నాడు ఒకాయన. మరోపక్క ఇడ్లీల స్టాండులోనుంచి పొగలు, పోగలతో పాటుగా కమ్మటివాసనా వస్తున్నాయి. ఒకామె ప్లేట్లల్లో చిన్న అరిటాకు వేసి ఇడ్లీలు పెట్టి చెట్నీ, కారం వేసి ఇస్తాఉన్నాది.

మంత్రమేసినట్లు ఆ అంగడి ముందు ఆగిపోయాం మేమిద్దరం. అంగడి పైన ” శ్రీరాములు టిఫిన్ సెంటర్ ” అని బోర్డు చూసాం. అది లలితమ్మ హోటల్ కాదు. దోశ పొసే ఆయన ముఖాన్ని పరీక్షగా చూసాను. అతను మా బడిలో నాలుగో తరగతి చదివే “రమేష్ ” వాళ్ళ నాయన. మా అయివారు ఆ అబ్బాయిని ” ఏరా కాపోళ్ళ రామేశ” అని పిలవడం చాలాసార్లు విన్నాను నేను. అంటే ఇది కాపోళ్ళ హోటల్. సునీత ముఖం చూసాను. నా మనసు గ్రహించినట్లు సునీత కూడా ముఖాన్ని చాటంత చేసుకుంది. ఇప్పటివరకు ఎంత వెతికినా లలితమ్మ హోటల్ కనబడకపాయ.

ఇంతసేపు అయింతర్వాత ఉత్త చేతులతో పొతే ఆకలి మీద ఉన్న అయివారి చేతిలో మాకు బడితే పూజ తప్పదు. ఏం అయితే అదవుతుందని హోటల్లో ఉన్న ఆమెను ఐదు ఇడ్లీలు, తనీగా, చెట్నీ పార్సెల్ కట్టివ్వమని ఐదు రూపాయల బిళ్ళ ఆమె చేతిలో పెట్టాను. దానికంటిన చెమట గుడ్డతో తుడిచి గల్లా పెట్టెలో వేసి మా చెమటలు కారిన ముఖాల చాయ సందేహంగా చూస్తూ ” ఏడ నుంచి వస్తా ఉన్నారు మీరిద్దరూ. ఇడ్లీలు ఎవురికి ” అనింది. “మేము ‘ శ్రీనివాస విద్యాలయం’ బడి కాడనుంచి మా అయివోరు నాస్టా తెమ్మంటే వచ్చాము ” అన్నాను నేను తడబడతా. హోటల్ లో జనాలు ఎక్కువుండడంతో ఆమె ఇంకేం అడగకుండా అరిటాకులో ఐదు ఇడ్లీలు, ఇంకో చిన్న అరిటాకులో తనీగా చెట్నీ కట్టి దారపుండనుంచి దారం లాగి పొట్లం కట్టించింది. ఐదు రూపాయలకు ఐదు ఇడ్లీలు అప్పుడు. ఎంత మంచి కాలం అది.

బతుకు జీవుడా అనుకుంటా వెనక్కి తిరిగి చూడకుండా ఇద్దరం ముందుకి పరుగెత్తాం. ” మీ పాసుగాల… ఏంది అనురాధ..మిమ్మల్ని నేను ఎప్పుడు పంపాను. మీరు వచ్చింది ఎప్పుడు. ఇంత సేపు ఏడ పెత్తనాలు చేస్తా ఉన్నారు మీరిద్దరూ ” అంటా చింత బరిక తీసాడు మోహనరావు అయివారు . గమ్మున చేతిలో ఉండే ఇడ్లీల పొట్లం అయివారి చేతికి అందించాను నేను. అప్పటికే ఆకలికి నాకనకలాడతా ఉన్న అయివారు ఇడ్లీల పొట్లం చూడగానే అందుకుని మమ్మల్ని తిట్టే ఓపిక లేక ఇడ్లీలు తీనేదానికి పోయినాడు.

అయివారు నాస్టా తిన్నంత వరకు మేము భయపడతానే ఉన్నాం. రుచిలో ఏమైనా తేడా వచ్చి లలితమ్మ బ్రాహ్మణ హోటల్లో తేలేదని మమ్మల్ని ఏడ కొడతాడో అని. బ్రాహ్మణ హోటల్లో తప్ప ఇంకెక్కడా నాస్టా తినని మా మోహన్ రావు అయివారి చేత అట్లా ఆ రోజు కాపోళ్ళ హోటల్ ఇడ్లీలు తినిపించాం మేము. అయివారు మమ్మల్ని ఏం అడగలేదు. ఆయన చెప్పిన లలితమ్మ హోటల్లో తేకుండా మేము పొరపాటు చేసినా ఆయన ఆకలి తీరింది అని తృప్తి పడ్డాం. లలితమ్మ హోటల్ ఎత్తేసి వాళ్ళు ఊరికి వెళ్లిపోయారని అయివారికి తెలిసింది . అయినా అయివారు మమ్మల్ని ఏం అనలేదు.

ఆకలికి కులం లేదని అప్పుడు తెలిసింది మాకు.

2 thoughts on “లలితమ్మ హోటల్”

Comments are closed.