ఆసరా

నమస్తే!

ఈ కథ నవ్య వీక్లీ -రచయిత్రి శ్రీమతి కమలారాంజీ సంయుక్తంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన
ఉగాది కథల పోటీలో రూ. 5000 బహుమతి పొందినది. మేము గూడూరులో ఉన్నపుడు మాకు రుచి ఫాస్ట్ ఫుడ్స్ అని హోటల్ ఉండేది. ఈ కథ మా ఇంటివెనుక ఇంట్లో ఉన్న తల్లీకొడుకుల ధీన గాధ. మా హోటల్ దగ్గర, మా ఇంటి వెనుక ఇంట్లో జరిగిన యదార్ధ సంఘటనలే ఈ “ఆసరా” కథకు ప్రేరణ. కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుప ప్రార్ధన…

——————————————————————————————————————————

మేము కొత్త ఇంట్లోకి వెళ్ళి వారం రోజులైంది. మిద్దెమీద రెండో అంతస్తులో మా ఇల్లు, మా ఇంటికి ఎదురుగా సరిగ్గా రోడ్డుకి అవతల మేము కొత్తగా హోటల్ పెట్టాం. శాఖాహార భోజన, ఫలహారాల హోటల్, రుచి, శుచి బాగుండాలని హోటల్ పేరు కూడా “రుచి ఫాస్ట్ ఫుడ్స్” అని పెట్టాం. మా వారు ఇతర బిజినెస్ వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో హోటల్ బాధ్యతలు పూర్తిగా నేను నిర్వహించేదాన్ని. మేం ఎక్కడ ఉన్నా చుట్టుప్రక్కల వారందరినీ పరిచయం చేసుకోనిదే నా మనస్సాగదు. చాలావరకూ అందరూ పరిచయం అయ్యారు, అందరికీ పనిలో పనిగా మా హోటల్ గురించి కూడా పబ్లిసిటీ ఇచ్చుకున్నాను.
ఆ రోజు మిద్దె పైన ఇంటిముందు వరండాలో పెట్టిన పూలకుండీలకు నీళ్ళుపోస్తూ యదాలాపంగా కిందకు చూశాను.

అది సరిగా మా ఇంటి వెనుకవైపు (రైల్వే) రైలు పట్టాలు. వాటికి అవతల రైల్వే క్వార్టర్స్ ఇళ్ళు. పెద్ద పెద్ద చెట్లు ప్రకృతి మాత పచ్చ చీర కట్టుకున్నట్లు కనులకింపుగా ఉంది. ఇంటిలోకి రాబోతూ హఠాత్తుగా కింద ఉన్న ఓ చిన్న రేకుల ఇంటి వైపు చూసాను. ఇంటి ముందర చాలా బాగా ఉంది. అంతా పిచ్చి చెట్లు, మొలిచి రాళ్ళు రప్పలతో చిన్న సైజు అడవిలో గోచరించింది. ఇంటి ముందు ఎప్పటివో చీకిపోయిన తాటాకులతో వేసిన పందిరి. పక్కనే బాగా పాచిపట్టిన నీళ్ళతొట్టి, చిన్న బండ రాయి ఉన్నాయి. ఆ ఇంట్లో మనుష్యులు ఉన్న ఆనవాలేమీ కనబడలేదు. ‘ అందరినీ పరిచయం కున్నాను. ఈ ఇంట్లో ఎవరుంటున్నారో ఏమో’ అని నాలో నేనే పెద్దగా అనుకుంటూ ‘పక్కింటి సుభద్ర పిన్ని వాళ్ళ ని అడుగుదాం అనుకుని ఆ సాయంత్రం హోటల్ నుంచి ఇంటికి వచ్చాక ఆ రేకుల ఇంటి గురించి ప్రక్కింటి పిన్నిగారిని అడిగాను “ఏమో నాకు సరిగ్గా తెలియదు నవనీతా, ఆ ఇంట్లో ఎవరు అమ్మ కొడుకు ఉంటారట. వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. ఆ ఇంట్లో ఉండే అతనికి మతిస్థిమితం లేదని అందరూ చెప్పుకుంటారు.

అటువంటి వాళ్ళతో మనకెందుకు అని నేనెప్పుడూ వాళ్ళ ఇంటి జోలికి వెళ్ళలేదు” అని చెప్పింది. “అదేంటి పిన్నిగారూ.. అలా అంటారు. మన ఇరుగు పొరుగు గురించి మనం తెలుసుకోపోతే ఎలా? వారికేదైనా సమస్య ఉంటే మనం చేసే సహాయంవల్ల వారికేదైనా పరిష్కారం లభిస్తుం దేమో” అన్నాను. “ఎవరికీ లేని ఆరాటం మనకెందుకు లేని పోని దరిద్రాన్ని నెత్తికెక్కించుకోవటం ఎందుకమ్మాయ్, ఇదిగో కాఫీ తీసుకో అని చేతికి గ్లాసు అందించింది ఆవిడ. ఎందుకో నాకు కాపీ చేదుగా అనిపించింది. బహుశా కాఫీ కంటే ఆమె మాటలే ఎక్కువ చేదుగా అనిపించి, నాకు రుచించలేదనుకుంటా ఇక అక్కడ ఉండ బుద్ధి కాక, మళ్ళీ వస్తాను పిన్నిగారు” అంటూ వచ్చేసాను. ఆవిడ మాటలతో నా మనసంతా చేదుగా మారిపోయింది.

మార్చి నెల మధ్యాహ్నం పన్నెండు గంటలు వేసవి వడగాల్పులు మొదలైనాయి. ఎవరిమీద కోపాన్నో భూమిమీద చూపిస్తున్నట్లు భానుడు నడి నెత్తి మీద కొచ్చి నిప్పులు కురిపిస్తున్నాడు…
ఒక్కొక్కరే మా హోటల్ కి భోజనాలకి రావటం మొదలైంది. భోజనాల సెక్షన్లో ఉన్న మా హోటల్ కుర్రాళ్ళు అంకయ్య , మధు ఇద్దరూ పార్కిల్స్ కడుతు న్నారు. సిల్వర్ కవర్లలో కొన్ని అన్నం పాకెట్స్ కాస్త చిన్న కవర్లలో కూర, సాంబారు. ఊరగాయ ప్యాకెట్లు, సెపరేట్ గా పెరుగన్నం ప్యాకెట్లు ముందుగానే కట్టి పెట్టుకుంటే, ఎవరన్నా వచ్చి పార్శిల్ భోజనం అడగ్గానే వెంటనే ఇచ్చేందుకు ఇలా సిద్ధంగా ఉంచుతాం. మా హోటల్లో లో ఫుల్ మీల్స్ 25 రూపాయలే కావటంతో చుట్టుపక్కల ఉన్న భవన నిర్మాణ కార్మికులు అందరు మా హోటల్ కి వచ్చి భోజనం చేసేవారు. ఆ రోజు పన్నెండింటికే ఓ పదిహేను మంది వరకు వచ్చి కూర్చుని భోజనం చేస్తున్నారు.

క్యాష్ కౌంటర్ (గల్లాపెట్టి) దగ్గర నేను ఒక పక్కన బిల్లులు కొడుతూ, మరో పక్కన డబ్బులెక్కలు చూసుకుంటున్నాను. సరిగ్గా ఆ సమయంలో, ” ఇదిగో అమ్మాయి, మేము మీ ఇంటివెనక ఉన్న రేకులింట్లో లో ఉంటాం. నాకు రెండు పెరుగన్నం పాకెట్టలు ఇవ్వు మా అబ్బాయి జీతం రాగానే డబ్బులిస్తాను” అంది చాలా దూకుడుగా. ఎంతో పరిచయమున్న వాళ్ళతో మాట్లాడినంత దర్పంగా అడిగింది.

ఒక్క క్షణం ఆమె కేసి తేరిపారా చూశాను. సన్నగా రివటలా ఉంది. ఆవిడ తైల సంస్కారం లేని రింగులు తిరిగిన ముగ్గుబుట్ట లాంటి తెల్లటి జుట్టు, ముడతలు పడిన దేహం వయస్సు అరవై దాటి ఉండవచ్చు. వెంటనే రెండు పెరుగన్నం పాకెట్టు బిల్లు కొట్టి అంకయ్యను కేకేసి పార్శిల్స్ తెచ్చి ఇమ్మన్నాను. అతను తెచ్చేలోపు మీరేనా అమ్మా మా వెనకింట్లో ఉండేది. నా పేరు నవనీత, మీ పేరు ఏమిటమ్మా ? మీతో పాటు ఇంట్లో ఇంకెవరుంటారు” అని అడిగాను. జవాబు చెప్పడం ఇష్టం లేదన్నట్లు అసహనంగా నిలబడింది ఆవిడ. ఆంకయ్య తెచ్చిన పెరుగన్నం పాకెట్లు చేతికియ్యగానే ఎవరో వెనుకనించి తరుముతున్నట్లు వడివడిగా అడుగులేసుకుంటూ రోడ్డుదాటి చిన్న సందులో నించి వాళ్ళింటికి వెళ్ళిపో యింది ఆ పెద్దావిడ.

ఒక సాయంత్రం హోటల్ నుంచి ఇంటికి వచ్చి టీ తాగి మొక్కలకు నీళ్ళు పోద్దామని వరండాలోకి వచ్చాను మనసులో ఏదో కుతూహలం పీకుతుంటే కిందకు చూశాను. ఆ రేకులింటీ ముందు ఉన్న పాచిపట్టిన నీళ్ళతొట్టిలోనించి మగ్ బయటకు తీయలేక అందులోకి వంగి నిలబడి ఒక వ్యక్తి చాలాసేపటినుంచి నుంచి అలాగే అవస్థపడుతున్నాడు.

వెనక నుంచి చూడటం వల్ల అతని ముఖం సరిగా కనబడలేదు నాకు. మగ్ పట్టుకునే శక్తికూడా లేనట్టు సన్నగా వణుకుతూ ముఖం మీద నీళ్ళు జల్లుకుని శక్తివిహీనమైనట్లు అక్కడే కూలబడిపోయాడు. ‘అయ్యో అనుకుని క్రిందకు వెళ్దాం అనుకున్నా, అంతలోనే మధ్యాహ్నం హోటల్ దగ్గరకు వచ్చిన పెద్దావిడ బయటకు వచ్చి అతన్ని లాక్కెళుతున్నట్టుగా ఇంట్లోకి తీసుకెళ్ళింది. పాపం రాళ్ళు, రప్పలు గుచ్చుకున్నట్లున్నాయి. బాధగా అరుస్తున్నట్టున్నాడు ఆ వ్యక్తి. ఇంట్లోకి వచ్చానేగానీ నా మనసంతా వెనకింటి వాళ్ళ గురించే ఆలోచన ‘అతను అంత శక్తి విహీనుడుగా ఎందుకున్నాడు? ఆ ఇంటి ముందంతా పాడుబడినట్లు ఆ రాళ్ళు తుప్పలేంటి’ వాళ్ళ ఆలనా పాలనా చూసేవాళ్ళు లేరా? కనీసం పనివాళ్ళు కూడా లేరా నాలో నేనే జవాబు తెలియని ప్రశ్నలు వేసుకుంటూ, ఇక ఉండబట్టలేక నాకు తెలియకుండానే మిద్దె మెట్లు దిగి కిందకు వెళ్ళాను. వెనుక ఉన్న రేకుల ఇంటివైపు అడుగులు వేశాను.
ఇంటిబయట రేకు తలుపు దగ్గరకు వేసి ఉంది. అది కూడా శిధిలావస్థలో వంగిపోయి, చిల్లులు పడిపోయింది. మెల్లగా తలుపు లాగి లోపలికెళ్ళాను ఇల్లంతా బూజుపట్టి సాలిగూళ్ళు వేలాడుతున్నాయి. విరిగిపోయిన కుర్చీలు చిందరవందరగా పడివున్న పుస్తకాలు, ఎప్పుడు విడచినవో, మాసిపోయిన పాతబట్టలన్నీ పెద్దగుట్టగా పోసిఉన్నాయి. ఇల్లంతా ఏదో వెగటు వాసన. చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దం తాండవిస్తుంది. ఆ ఇంట్లో ఆ గది లోనే ఒకమూలగా ఉన్న మంచం మీద నిస్త్రాణంగా పడుకుని ఉన్నాడతను. గాఢనిద్రలో ఉన్నాడనుకుంటా.

మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మరో గదిలోకి వెళ్ళాను. మొత్తంగా రెండు గదుల ఇల్లే. వంటిల్లు అనడానికి సాక్ష్యం అక్కడ ఒక కుండ నాలుగు గిన్నెలు, చిన్న కిరోసిన్ స్టవ్ ఉన్నాయి. సిమెంట్ పెచ్చులు ఊడి పోయి, ఇటుక రాళ్ళు బయట పడి ఉన్న ఒక చిన్న ఆరుగుని అనుకుని తల పట్టుకుని పట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుని ఉంది. ఆ పెద్దావిడ నేను వచ్చిన అలికిడి కూడా గమనించినట్లు లేదు. మెల్లగా వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని పిన్నిగారూ ” అని పిలిచాను. అంతే ఆవిడ అదురుపాటుగా కళ్ళు తెరిచింది.

ఎవరు ఎవరు నువ్వు?!” తడబడుతూ అడిగింది.. నేను పిన్ని గారు. నా పేరు నవనీత .మీరు మా హోటల్ కి వచ్చారు కదా , పెరుగన్నం ప్యాకెట్లు పార్శిల్ తీసుకెళ్లారు. గుర్తొచ్చిందా” అన్నాను. “హా… డబ్బుల కోసం వచ్చావా ? తర్వాత ఇస్తానులే, వెళ్ళు, వెళ్ళిపో అంది.

“అయ్యో అందుకురాలేదు పిన్నీగారు మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. ముందు గదిలో నిద్ర పోయే అతను ఎవరు ?మీరెందుకిలా.. నా మాటలు పూర్తికాకముందే ఆవిడ విరక్తిగా నవ్వి “ప్రపంచం ఎప్పుడో మమ్మల్ని వదిలేసింది . ఈ ఇంటికి మనిషి అన్న వాడు వచ్చి ఏడాదిపైనే అయింది. మా గురించి నీకెందుకు వెళ్ళు వెళ్ళు” అంది. మా మాటల అలికిడికి అనుకుంటా మంచం మీద నిద్ర పోయే అతనికి మెలకువ వచ్చినట్లు ఉంది. తూలుతూ గదిలోకి వచ్చి “అమ్మా! ఎవరు వచ్చింది.. అంటూ నన్ను చూసి, “ఏవరు నువ్వు? దివ్యా.. నన్ను వదిలిపోయినదానివి మళ్ళీ ఎందుకు వచ్చా వు ఇక్కడకు. పో పో లేకుంటే నిన్ను చంపేస్తా” అంటూ అక్కడున్న తుప్పుపట్టిన గ్యాస్ లైటర్ని నా మీదకు విసిరాడు నేను తప్పుకునే లోపే అది వచ్చి నా నుదుటికి తగిలి క్రింద పడింది. తుప్పుపట్టిన లైటర్ అంచు సర్రున నా నుదిటిలోకి గుచ్చుకుని రక్తం బొటాబొటా కారింది. చీరకొంగు నుదుటికి అడ్డంగా అదిమిపెట్టి, బాధను దిగమింగి ” ఏమిటండీ ఈయనకు ఒంటో ఏమీ బాగోలేదా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. ” అని అడిగాను

” వీడు ఎవరినీ ఈ గడప తొక్కనీయడమ్మా మా చావు మేము చావాల్సిందే నువ్వు ఇక్కడే ఉన్నావంటే, వాడు నిన్ను చంపేస్తాడు వెళ్ళు తల్లీ వెళ్ళిపో ” అని గబగబా నా చేయి పట్టుకుని బయ టకు తీసుకొచ్చింది ఆవిడ. నుదుటి గాయానికి చీరకొంగు అలాగే గడ్డం పెట్టుకుని వేదనగా ఇంటికి వచ్చేశాను గాయం లోతుగా అయింది .యాంటి సెప్టిక్ పౌడర్ గాయానికి అద్దుకుని కాస్త వేడిగా టీ చేసుకుని తాగాను.
మా శ్రీవారు రాగానే, వాళ్ళ విషయం చెబితే, “పాపం ఏం కష్టం వచ్చిందో వాళ్ళకి ఆ పెద్దావిడ ఇక మీదట ఎప్పుడు భోజనం కోసం వచ్చినా నువ్వు డబ్బులు తీసుకోకు” అన్నారు.

ఆ తర్వాత మధ్యాహ్నం పూట భోజనం సమ యంలో, ఆ పెద్దావిడ మళ్ళీ వస్తుందేమో అని ఒక రెండు రోజులు ఎదురు చూశాను. రాలేదు. పాపం ఎలా ఉన్నారో అనుకుంటూ, ఇక ఉండబట్టలేక మూడోరోజు మధ్యాహ్నం పూట హోటల్ కుర్రాళ్ళకి చెప్పి రెండు పెరుగన్నం ప్యాకెట్లు తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. అతను మంచం మీద పడుకుని నిద్ర పోతున్నాడు. మనిషిని పరీక్షగా చూస్తే నలబై ఏళ్ళ వయసు వాడిలా ఉన్నాడు. కానీ ఆ ముఖంలో ఇంకా పసి ఛాయలు పోలేదనిపిస్తోంది.

చప్పుడు చెయ్యకుండా వంటింట్లోకి వెళ్ళి అరుగును అనుకుని కూర్చుని ఉన్న ఆమెను చిన్నగా “పిన్ని గారు” అని పిలిచాను. నన్ను చూడగానే ఆమె నా చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని వచ్చింది. ఇద్దరం అక్కడ అరుగు మీద కూర్చున్నాం . “చెప్పండి పిన్నిగారూ, అసలు మీ అబ్బాయికి ఏమైంది. మీరు హోటల్ కి రాలేదని మీకు పెరుగన్నం తెచ్చాను” అంటూ ఆ ప్యాకెట్లు రెండూ ఆమెకి అందించాను. ఆమె కళ్ళు నీటిచలమలయ్యాయి. ” ప్రపంచానికి లేని ఆసక్తి మా మీద నీకు ఎందుకు ఆ పడుకుని ఉన్నది నా పెద్ద కొడుకు నిరంజన్ నాకు ముగ్గురు పిల్లలు. నాకు ఇంకో కొడుకు,కూతురు ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే మా ఆయన బాధ్యతలన్నీ నా మీద పెట్టి తను సుఖంగా వెళ్ళిపోయాడు. ఊర్లో ఉన్న కాస్త పొలంతో కొన్ని రోజులు నెట్టుకొచ్చాను. కూతురు పెళ్ళి కి ఆ పొలం అమ్మేసాం.ఇక మిగిలింది ఈ ఇల్లు ఒక్కటే. లాయర్ చదువు చదివాడమ్మా. స్టేట్ ఫస్టుగా వచ్చి బంగారు పతకం తెచ్చుకున్నాడు. రేపో మాపో హైకోర్టు న్యాయమూర్తి కావలసినవాడు. ఈ రోజు జీవచ్ఛవంలా పడి ఉన్నాడు అని ముఖాన్ని చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది .

“అయ్యో ఏడవకండి పిన్నిగారు, మీ వివరాలు అడిగి మిమ్మల్ని మరింత దుఃఖానికి గురిచేశాను “అంటూ అనునయంగా ఆమెను పట్టుకున్నాను. ఆమె కాస్త తేరుకుంది. కన్నీళ్ళు తుడుచుకుని అసలు కథ చెప్పుకొచ్చింది.

“లా చదివే రోజుల్లో వీడు, వీడి క్లాస్మెట్ ‘దివ్య’ ఒకరినొకరు ఇష్టపడ్డారమ్మా. ఆ విషయమే నాతో చెప్పాడు.’ తమ్ముడు చదువు, చెల్లికి పెళ్ళి చేసే బాధ్యతలు నాకు ఉన్నాయి. వాళ్ళని స్థిరపరిచే లోగా మనం కూడా స్థిరపడిపోదాం ‘అన్నాడట వీడు ఆ అమ్మాయితో సరే అనుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నారు. నేను కూడా వాళ్ళ ప్రేమకు అడ్డు చెప్పలేదు. వాడు లాయర్ గా ప్రాక్టీస్ పెట్టాడు. దివ్య వీడు ఇద్దరూ సినిమాలు, షికార్లు అంటూ తిరిగారు .

తర్వాత ఏం జరిగిందో ఏమో ఆ అమ్మాయి మెల్లగా ముఖం చాటేసింది . వీడు ఫోన్ చేసినా మాట్లాడేది కాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది. ఇలా కాదని, ఒకఒకసారి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు . వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారని చెప్పారట. అప్పటినుంచీ వీడు మానసికంగా ఒంటరివాడై పోయాడు. ఆ అమ్మాయి కోసం పిచ్చి వాడైపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒకరోజు హఠాత్తుగా వచ్చి పెళ్లి చేసుకోబోతున్నాను” అంటూ శుభలేఖ తీసుకొచ్చి వీడి చేతిలో పెట్టింది. ఆమె సొంత బావనే పెళ్ళి చేసుకుంటుందట. అతని పేరు శ్రీధర్ అని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడని, అక్కడే సెటిలైపోతామని వివరాలన్నీ చెప్పి వీడి మనస్సులో పెనుతుఫాన్ సృష్టించింది. వీడు ఎంత బతిమాలినా గానీ, ప్రాక్టికల్‌గా ఆలోచించు నిరంజన్. నా లాంటి ఇంకో అమ్మాయి నీకు దొరక్కపోదు . నాకు విలాసవంతమైన జీవితం అంటే ఇష్టం. నాకు జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయి. ఇక్కడ ఉంటే అవి తీరవని పిస్తోంది. అంటూ గతంలో అతడితో అనుభవించిన ప్రేమ మాధుర్యాన్ని అంతా మరచిపోయి, డాలర్ మాయలో పడి వీడిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి పోయిందమ్మా. ప్రేమించానని వెంటబడి , వీడిలో ఎన్నో ఆశలు రేపిన ఆ అమ్మాయి చేసిన ప్రేమ గాయం శరాఘాతంలా వీడి గుండెను తాకింది. అంతే! ఇక అప్పటి నుంచి బాణం దెబ్బకి నేలకూలిన పక్షి లాగా విలవిలలాడి పోతున్నాడు .అప్పటినించి , ఆ మంచమే లోకంగా బతుకుతున్నాడు వాడు.

అమెను మరచిపోవడానికి నిద్రమాత్రలు అలవాటు చేసుకున్నాడు. పగలూరాత్రీ అనే తేడా లేకుండా ఎప్పుడూ ఆ మత్తులోనే తన స్వప్నలోకం సృష్టించుకుని నెరవేరని ఆశలపందిరిని నిద్రలోనే మోస్తున్నాడు. ఎప్పుడైనా మెలుకువ వచ్చినప్పుడు , రెండు ముద్దలు నోట్లో పెడితే అయిష్టంగా తింటాడు.

ఇంటికి ఎవరైనావస్తే దివ్యా ఎందుకొచ్చావ్ మళ్ళీ. నాకు అన్యాయము చేసి వెళ్ళియావు కదా” అంటూ ఏడుస్తాడు. లేకుంటే ఇక్కడనుంచి వెళ్ళిపో అని అరుస్తూ చేతికందిన వస్తువును వాళ్ళపై విసురుతాడు. దాంతో చుట్టుపక్కల వాళ్ళెవరూ మా ఇంటి వైపు రావటం మానేశారు. వీడి వల్ల బాగుపడ్డ వీడి తమ్ముడు, చెల్లెలు కూడా వీడి పరిస్థితి తెలిసినా గానీ పట్టించుకోవడం లేదు. మమ్మల్ని వెలివేశారు తల్లీ, వాళ్ళు ఈ ఇంటికి వచ్చి ఐదేళ్ళ పైనే అయింది. ఇంట్లో సామాన్లన్నీ అమ్మేశాను. వీడు న్యాయవాదిగా మా కుటుంబాన్ని ఏదో ఉద్ధరిస్తాడనుకున్నాను. కోర్టుకు వెళ్ళకుండా ఇలా మంచమే లోకంగా పడి ఉండటంవల్ల వీడి ఉద్యోగం కూడా పోయింది.

ఎప్పుడో ఆరు నెలలకోసారి కరెంటు బిల్లు వారు, లేకుంటే కోర్టు నుంచి ఓ మనిషి వచ్చి వీడిచేత సంతకం పెట్టిం చుకునో వెళ్ళేవాడు. ఇదే తల్లి మా పరిస్థితి ఆ రోజు ఆకలికి ఓర్చుకోలేక మీ హోటల్ కి వచ్చాను. నువ్వు అన్నం పెట్టి అన్నపూర్ణలా మమ్మల్ని ఆదరించావు. అంటూ చెప్పటం ఆపింది ఆ పెద్దావిడ.
అంతలో లోపల అతను లేచిన అలికిడయ్యింది.వాడు లేచినట్టున్నాడు. వెళ్ళిపో తల్లీ, నిన్ను ఇక్కడ చూస్తే వాడికి దివ్య గుర్తుకువస్తుంది. త్వరగా వెళ్ళమ్మా” అంటూ ఆవిడ లోనికి వెళ్ళిపోయింది. భారమైన మనస్సుతో నేను ఇంటికి తిరిగి వచ్చాను.

హైదరాబాద్ మా అక్కయ్య కూతురు పెళ్ళి. మా హోటల్ కుర్రాళ్ళకి బాధ్యతలన్నీ అప్పగించాను. మా వెనకింటి పెద్దావిడ ఎప్పుడు హోటల్ దగ్గరకు వచ్చినా అన్నం పార్కిల్స్ ఇవ్వండి. డబ్బులు అడక్కండి” అని వాళ్ళకి మరీ మరీ చెప్పి వెళ్ళాను. పెళ్ళి అయిపోగానే వచ్చేద్దామనుకున్నాను. సత్యనారాయణస్వామి వ్రతం ఉంది. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాయి. కాస్త సహాయం చెయ్యి అంటూ అక్క బలవంతం చేయడంవల్ల వదిహేను రోజులు హైదరాబాద్ లో ఉండిపోవాల్సి వచ్చింది. బిజినెస్ పనిమీద మా వారు కూడా ఇక్కడే ఉండి పోయారు.

ఊరు నుంచి వచ్చిన రోజు పొద్దునే చెట్లు కాస్త వాడిపోయి కనిపించాయి. పని అమ్మాయి నీళ్ళు సరిగా పోయలేదని విసుక్కుంటూ యధాలాపంగా మిద్దె పైనుంచి కిందికి చూశాను. వెనక రేకుల ఇంటి ముందు జనం గుంపుగా ఉన్నారు. నా మనస్సు ఏదో కీడు శంకించింది. అదిరే గుండెలతో మెట్లు దిగి వెనకింటి వైపు వెళ్ళాను. ఆ ఇంట్లో ఉన్న అమ్మ, కొడుకు చనిపోయారని చెప్పారు అక్కడివాళ్లు.

నాకు ఒక్కసారిగా దుఖం తన్నుకొచ్చింది. కాళ్ళు చేతులు స్వాధీనం తప్పి వణుకుతుండగా మెల్లగా లోపలికి నడిచాను. అక్కడ మంచం మీద అస్థిపంజరంలా అతను, వంటింట్లో ఎప్పటిలాగే ఆరుగుని అనుకుని ఆమె. మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి నప్పుడు ఎలా ఉన్నారో అదే స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు నిర్జీవమైన స్థితిలో.

అప్పటికే వాళ్ళు చనిపోయి వారం రోజులైందట. ఏదో పని ఉండి పెద్దామె నడుచుకుంటూ వెళుతుంటే ఆటోవాడు ఆమెను గుద్దేశాడట కాలు విరిగిన ఆమెను అదే ఆటోలో తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాడట. ఆహారం లేక, సరైన వైద్యం లేక, పట్టించుకునే నాధుడే లేక రెండు నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.

కరెంటు బిల్లు మీటర్ రీడింగ్ కోసం వెళ్ళినతను, వాళ్ళను ఆ స్థితిలో చూచి భయపడి అందర్నీ పిలుచుకొచ్చాడట. వాళ్ళు పోయిన సంగతి తెలిసి, ఆమె కూతురు, కొడుకు వచ్చి మొసలి కన్నీరు కార్చి పది లక్షలు విలువచేసే ఆ ఇంటి కోసం ఇద్దరూ కొట్లాడుకుని, వాళ్ళ పార్థివదేహాలను అనాథశవాల్లా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి పనిచేసిన కోర్టు వాళ్ళు, మరికొందరూ తలా కొంచెం చందాలేసుకుని మున్సి పాలిటీ వ్యాన్ లో ఆ మృతదేహాల్ని తీసుకెళ్ళి అంత్య క్రియలు జరిపించారు.

నా మనసు దుఃఖం తో మూగబోయింది. ఎంత పొరబాటు జరిగింది. ఊరునుంచి వచ్చాక అతడిని మానసిక వైద్యుడికి చూపించాలనుకున్నాను. ఆమెకి ఎంతో ధైర్యం చెప్పి ఆ తల్లీకొడుకులిద్దరినీ మనుషుల్లో పడేలా చెయ్యాలనుకున్నాను. మా శ్రీవారు కూడా అందుకు సంతోషంగా అంగీకరించారు. కానీ మేం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చే లోపే ఇంత ఘోరం జరిగిపోయింది. ఇక్కడే ఉండి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేదాన్ని. వాళ్ళ పరిస్థితి ఎప్పటికప్పుడు నాకు ఎప్పటికప్పుడు తెలిసుండేది.. ఎందుకో ఆపరాధ భావంతో కుంచించుకుపోయాను.

వాళ్ళు అలా శవాలుగా మారటానికి కారణం ఎవరు. సర్వం కోల్పోయిన వారిపట్ల ఆదరణ చూపించలేని ఈ సమాజమా? మనుష్యుల్లోని స్వార్ధమా ? ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఒకరికి ఒకరు మాట్లాడుకోకుండా ఫేస్బుక్,వాట్సాప్ లకు బానిసలై , కనీసం ఇరుగుపొరుగు ఇళ్ళల్లో ఎవరున్నారు. ఏం జరుగుతుంది అని కూడా తెల్చుకోలేకపోతున్నమన యాంత్రిక జీవన ఫలితమా ? జవాబు లేని ప్రశ్నలను నాకు నేనే వేసు సుకున్నాను. ఇలాంటి తల్లీడుకులే కాదు . ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కనీసం పలుకరించే దిక్కులేక, ఆపద సమయంలో ఆత్మీయ స్పర్శ, ఓదార్పు మాటలు, చేయూత లభించక తమ జీవితాలను అర్ధాంతరంగా కడతేర్చుకుంటున్నారు.

ఆందరికీ తెలిసిన విషయం చెప్పాలంటే ఆప్యాయత అందించి ఆలనా పాలనా చూసే దిక్కు లేక, కెరీర్ డౌనైపోయిందనే వేదనతో, ఒంటరి తనంతో పసి మొగ్గ గానే రాలిపోయిన నటుడు ఉదయ్ కిరణ్.
తనతో ఏడడుగులు వేసి కడదాక తోడుంటుందనకున్న తన జీవన సహచరి అర్ధాంతరంగా మరణించాక , ఒంటెద్దు జీవితం భరించలేక, ఈ లోకంలో నేనుండలేను నాకై నేనే సెలవు తీసుకుంటున్నా, అంటూ మృత్యువును ఆలింగనం చేసుకున్నారు ప్రముఖ నటులు రంగనాథ్. ఈ మధ్యకాలంలో నెల్లూరులో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను ఒంటరిచేసి కన్నతల్లి చనిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచని ఆ చిన్నారులు ఆ తల్లి శవాన్ని అలా ఇంట్లోనే మూడు నెలలు ఉంచేశారు. తిండి తిప్పలు లేకుండా ,ఇంటినించి బయటకు రాకుండా ఉండిపోయారు. అసలు వాళ్ళ ని గమనించే నాధుడే లేకపోవడంతో చిన్నారులు అస్థిపంజరాలుగా తయారయ్యారు.

ఇలా అనేక సంఘటనలు నాకు గుర్తుకు రాసాగాయి. ఇలా లెక్కించుకుంటూపోతే దిక్కూమొక్కూ లేని వాళ్ళు ఎందరో, ఎందరెందరో ఉన్నారు. వాళ్ళందరిని ఏకాకులని చేసి చంపేస్తున్నది ఎవరో కారు.. మనమే. పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా కనీసం తెలుసుకోకుండా, పొరుగువాణ్ణి పట్టించుకోకుండా బతికేస్తున్న మన యాంత్రిక జీవనమే. ఇలాంటి వాళ్ళందరినీ చంపేస్తున్నది మన బిజీ లైఫే. మరి వాళ్ళంతా అలా చనిపోవలసిందేనా ? ఈ సమస్యకు పరిష్కారమే లేదా ? ఒంటరి వారిని , బిడ్డలు వదిలేసిన వృద్ధులను, తల్లితండ్రి లేని పసి మొగ్గలను ఆదరించి ఇంత అన్నం పెట్టే వాళ్ళు లేరా ?
దుఃఖంతో నా మనస్సు పూడుకుపోయింది. ఆ దుఃఖంలోంచే నాలో ఒక భావన రూపుదిద్దుకుంది అది కేవలం ఒక భావన కాదు. ఒక నిర్ణయం ఆనాటి నా ఆవేదనకు ప్రతిరూపమే ఒంటరి బతుకులకు నేను కల్పించిన” ఆసరా “.

కాలం గిర్రున తిరిగి పోయింది. మానవసంబంధాలకు దూరమై, నాగరిక సమాజంలో కోట్లాదిమంది పట్టించుకోని జనం మధ్య ఒంటరిగా బతికే ఆర్తులకు నా అనాధ ఆశ్రమం చేయూతగా నిలుస్తోంది.
ఇప్పుడు నా ‘ఆసరా’తో వాళ్ళందరూ ఎంతో సంతోషంతో, మనోవికాసంతో, హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు. వాళ్ళ చిరునవ్వుల్లో , ఆ తల్లీకొడుకులు కలకాలం చెక్కు చెదరకుండా నిలిచిపోవాలనేదే నా ఆశ.

9 thoughts on “ఆసరా”

 1. సూపర్ స్టోరీ
  ఇది వరకే చదివాను. మళ్లా మరోసారి ఆసక్తి గా చదివాను.
  చూసిన సత్యాన్ని అక్షరీకరించడం కొంచం కష్టమే… మొదలు కావాలి ముగింపు కావాలి. జరిగిన.. చూసిన సంఘటనలను కథగా మలచగలగడం కత్తి మీద సామే
  మీ కథ మనసును తాకుతుంది
  అభినందనలు

  Reply
 2. చాలా బాగుంది.బహుశా వాస్తవ కథై వుండొ చ్చనుకుంటా.
  ముగింపు చకచకా జరిగి పోయింది.ఆసరా మీరెప్పుడు పెట్టాలనుకున్నారో ఎక్కడా చెప్పలేదు.ఆ సంఘటన చూశాక అనుకున్నారా? ఆప్రస్తావన కథలో లేదే?
  కథ మానవీయంగా ఉంది. బాగా రాశారు.

  Reply
 3. చాలా బాగుంది అని చెప్పడానికి ఇది కథ కాదు
  కథ రూపంలో ఉన్న జీవితం బాధగా ఉంది
  జీవితాల నుండి పుట్టిన కథలు బాగున్నాయి అని చెప్పలేము
  బాధ్యతని తెలియజేస్తాయి మనిషికి

  Reply

Leave a Comment