వ్యాప్తి

నమస్తే!

నేను వ్రాసిన ఈ కథ “వ్యాప్తి”  09-06-2019 తేదీన “సాక్షి ఫండే ”లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.

 

————————————————————————————————————————–

వేపచెట్టు క్రింద పిల్లలకు పాఠం చెబుతున్న జోసెఫ్ మాస్టర్ దగ్గరకు వచ్చిచేతులు కట్టుకుని నిల్చున్నారు యాదయ్య,రంగి. వాళ్ళ కొడుకు వెంకటేసు కూడా ఆ చెట్టు క్రిందే కూర్చుని సార్ చెప్పే పాఠం వింటున్నాడు. యాదయ్య చేతులు జోడించి “సారు,తమరు మా వెంకటేసు చేత అదేదో పరిచ్చ రాపిచ్చారు కదా,ఆడు పాసయినాడు, పైచదువుల కోసం ఆణ్ణి పట్నం పంపుతామన్నారు కదా, కానీ ఆడి అమ్మ ఒప్పుకోవటం లేదు. పిల్లోడిని ఇడిచి ఉండలేనంటా ఒకటే ఏడుపు సారు. తమరు చెప్పండి  రంగికి అన్నాడు యాదయ్య.రంగిని చూసి జోసెఫ్ సారు” చూడు రంగమ్మ ఈ  వేపచెట్టు క్రింద దాని నీడలోనే దాని మొలకలు చాలా ఉన్నాయి కదా.అవన్నీ పెద్ద చెట్టు నీడన ఉన్నందున వాటికి గాలి, నీరు, సూర్యరశ్మి సరిగ్గా అందక అవి గిడసబారి పోయి సరిగా ఎదగలేదు.ఇంకెప్పటికీ కూడా అవి ఎదగవు.అదే వాటి విత్తనాలు గాలి,నీరు,పక్షుల ద్వారా వ్యాప్తి చెంది పెద్ద చెట్టుకు దూరంగా పోయి అనువైన నేలలో పడితే నీరు అంది, ఎండ తగిలి బాగా పెరిగి పెద్ద చెట్లు అవుతాయి.అలాగే బిడ్డలు మన దగ్గరే ఉండాలి అనుకుంటే పై చదువులు చదివే సదుపాయాలు లేని ఊర్లోనే ఉంటే తెలివైన పిల్లల భవిష్యత్తు కూడా ఇలా సరిగా ఎదగని గిడసబారిన పిలక మొక్కల మాదిరి అవుతుంది.వెంకటేసు పరీక్ష పాసై గురుకుల పాఠశాలలో సీటు తెచ్చుకున్నాడు.వాణ్ణి పట్నం లో ఉన్న పెద్ద బడికి పంపిస్తే వాడి భవిష్యత్తు బంగారం అవుతుంది. ఆలోచించండి”. అన్నాడు జోసెఫ్ మాస్టర్. విషయం అర్థం అయిన రంగి వెంకటేసును పట్నంలో చదువుకోసం పంపడానికి ఆనందంగా అంగీకరించింది.