విహ్వల

శుభసాయంత్రం. మే 2022 “పాలపిట్ట” మాసపత్రికలో నా కథ “విహ్వల“. పాలపిట్ట సంపాదకులకు ధన్యవాదాలతో. “విహ్వల” చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపగోరుతూ..

ట్యూషన్ వదిలేశారు. అనిత, రజని వెళ్లిపోయారు. నేను ఒంటరిగా మిగిలాను. చీకటి దట్టంగా మసిగొట్టం నుంచి విడుదలయ్యే పొగలా అములుకుంటోంది. తలెత్తి చూసాను. నక్షత్రాలు కూడా అక్కడొకటి ఇక్కడొకటిగా నాలాగే ఒంటరిగా ఉన్నాయి.
ఈ రోజు పరిస్థితి ఏమిటో అర్ధం కాకుండా ఉంది.
రేపు లెక్కల పరీక్ష ఉంది స్కూల్లో. అందుకే ట్యూషన్లో శ్రీదేవి మేడం మరో అర్ధగంట ఎక్కువసేపు క్లాస్ తీసుకున్నారు. ట్యూషన్ వదిలి బయటకు వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది.
వీధి దీపాలు రెండు ఏ క్షణంలోనైనా ఆరిపోతాం అన్నట్లు చాల తక్కువ కాంతితో నీరసంగా వెలుగుతున్నాయి. ఇంకో రెండు కరెంటు స్తంభాలకు దీపాలు అలంకారంగా ఉన్నాయి. అంతే. అవి వెలిగి చాలారోజులు అయింది. పట్టించుకునే వారే లేరు. పుస్తకాలను గుండెలకు అదుముకుని మెల్లగా నడుస్తున్నాను.
వీధి మలుపు తిరిగితే చల్ల కాలవవస్తుంది. కాలవ దాటడానికి వంతెన ఉంది. ఆ వంతెన దాటి అర మైలు దూరం నడవాలి ఇంటికి వెళ్లాలంటే అదొక్కటే దారి.
కాలవ నిండుగా నీళ్ళు పారుతూ ఉంటాయి. అక్కడ నుంచి కొంత దూరం ఇళ్ళే ఉండవు. చెట్ల పొదలతో చిట్టడవిలాగా ఉంటుంది. అది దాటి ఇంటికి వెళ్ళాలి.
వీధిచివరకి వచ్చాను. చల్ల కాలవ నీటి మీద నుంచి వీచే గాలితో పాటు నాచు వాసన నా ముక్కుపుటలను తాకింది. వీధి మలుపు తిరుగుతుంటే గుండె దడదడలాడింది. కాళ్ళల్లో సన్నగా వణుకు కూడా మొదలైంది. ఇంట్లో అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏమో..! ఇప్పుడేం చేయాలి నేను.
అమ్మకి రెండేళ్లక్రితం స్ట్రోక్ వచ్చింది. మనిషి చాల బలహీనం అయిపోయింది. ఎవరోఒకరి సాయం లేకుండా ఏ పని చేసుకోలేదు. నాన్న ఇంటికి వచ్చేసరికి రాత్రి పదిపైనే అవుతుంది. రోజు నాకు ఈ పరీక్ష ఏమిటి. చెప్పలేనంత చిరాకుగా, మరోపక్క భయంగా ఉంది. ఆందోళనతో నా ఆలోచనలు పరిపరివిధాలుగా నా అడుగులకంటే వేగంగా పరుగులు తీస్తున్నాయి.
కాలవ వంతెన వచ్చేసింది . ఇంటికి వెళ్లాలంటే వంతెన దాటాల్సిందే. నత్త కంటే నచ్చుగా అడుగుతీసి అడుగు వేస్తున్నాను. పుస్తకాలను మరింత గట్టిగా గుండెలకు అదుముకుని తలవంచుకుని.
“అదిగోందిరా మహారాణి గారు విచ్చేయుచున్నారు” వాళ్ళల్లో ఒకడు పెద్దగా అరిచాడు చేతులు ఊపుతూ.
“రోజు కంటే అర్ధగంట ఆలస్యం అయింది రాణిగారికి. కారణమేమిటో” ఇంకోడన్నాడు సిగరెట్టు పొగ రింగురింగులుగా గాల్లోకి వదులుతూ విలాసంగా .
“ఆ పక్క వీధిలో బాయ్ ఫ్రెండ్ ని కలిసివస్తోందేమో రా పాప. ఇక్కడ మనం ఇంతమందిమి రాణిగారి కోసం ఎదురుచూస్తున్నామని ధ్యాసే లేదు.” వెకిలి నవ్వులు. రోత మాటలు. మసక వెలుతురులో వాళ్ళు సరిగా కనపడడంలేదు. నలుగురు ఉన్నట్లున్నారు.
ఆపైన వాళ్ళ మాటలు వినడానికే మరింత జుగుప్సాకరంగా ఉన్నాయి. అయినా నాకు వినక తప్పడంలేదు. వంతెన దగ్గరపడే కొద్దీ గుండె దడ ఎక్కువైంది.
ఇద్దరు నా ముందుకు దూసుకువచ్చారు. నా నడక వేగం పెంచాను. చట్టుకున ఒకడు బారెడు పొడవున్న నా రెండు జడల్లో ఒక జడని పట్టుకుని గట్టిగా లాగాడు. వాడి చేతులను విదిలించి కొట్టి జడని లాక్కుని పరుగులాంటి నడకతో ఇంటిదారి పట్టాను.
“ఈ రోజు తప్పిచుకుంది. రేపు చూడాలి దీని సంగతి”వాళ్ళు గలీజు జోకులు వేసుకుంటూ పెద్దగా నవ్వుకుంటున్నారు.
ఏడుపు వస్తోంది నాకు. ట్యూషన్లో చేరిన కొన్ని రోజులు కాలవ వంతెన దగ్గర ఎవరు లేరు. చీకట్లో బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా వెళుతున్నా అంత భయం వేయలేదు. ఇదిగో పదిరోజుల నుంచే ఈ కొత్త సమస్య. చీకటిని మించిన రాకాసి సమస్య. ఆడపిల్లగా పుట్టినందుకు అనుభవించి తీరాల్సిన క్రూరమైన సమస్య.
ఇంట్లోకి అడుగు పెడుతుంటే కళ్ళనుంచి నీటి చుక్కలు రాలబోయి, మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న అమ్మని చూడగానే కన్నీళ్లు ఆవిరైపోయాయి. కర్తవ్యం గుర్తుకు వచ్చింది నాకు.
నన్ను చూడగానే అమ్మ కళ్ళల్లోకి వెలుతురు వచ్చింది. “ఈ రోజు ఆలస్యం ఆయిందేమి రా సమీ.. ” నీరసంగా నవ్వుతూ మంచం మీదనుంచి లేచి కూర్చుంది. రేపు జరిగే లెక్కల పరీక్షకోసం టీచర్ అర్ధగంట ఎక్కువసేపు ట్యూషన్ తీసుకున్నారని చెప్పి , ముఖం కడుక్కుని వచ్చి కంచంలో అన్నం,కూర కలిపి అమ్మకి ఇచ్చాను తినమని. నా వంక ఆపేక్షగా చూస్తూ మెల్లగా అన్నం తింటోంది. అమ్మ తిన్నాక తనకి మందులు ఇచ్చి, నేను కంచంలో ఇంత అన్నం పెట్టుకుని తిన్నాననిపించాను. అమ్మ పడుకుంది.
రేఖాగణితం పుస్తకం తెరిచాను. పుస్తకంలోని త్రిభుజాలు, కోణాలు అన్ని అలికినట్లు గజిబిజిగా కనిపించసాగాయి నా ఆలోచనల్లాగే. కాలవ వంతెన మీద జరిగిన సంఘటన నా ఏకాగ్రతని చిన్నాభిన్నం చేస్తోంది. ఇన్ని రోజులు వెకిలిమాటలతో వేధించారు. ఈ రోజు వారి ఆగడం నా జడపట్టి లాగే చేతలదాకా వచ్చింది. రేపు ఏం జరుగుతుందో తల్చుకుంటే దిగులు పుట్టి మనసు చదువుమీద నిలవడం లేదు. పుస్తకం మూసి పడుకుని కళ్ళు మూసుకున్నాను. నాన్న వచ్చిన అలికిడయింది. లేచి నాన్నకి అన్నం పెడదామనుకున్నాను.
” బాగా పొద్దు పోయింది. నేను అన్నంపెట్టుకొని తింటాలే నువ్వు పడుకో సమీరా ” అన్నాడు నాన్న నన్ను చూసి.
పడుకుంటే కళ్ళు మండుతున్నాయి కానీ నిద్ర దేవత నన్ను కనికరించలేదు. ఆ అల్లరి మూక నుంచి ఎలా తప్పించుకోవాలో అనే ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనీయడంలేదు. పొద్దున్న లేవడం ఆలస్యం అయింది. అమ్మకి స్నానానికి సాయం చేసి, వంట చేసి లంచ్ బాక్స్ లో కొంచం సాంబారు అన్నం కలిపిపెట్టుకుని, అమ్మకి చెప్పి స్కూలుకి బయలుదేరాను.
పొద్దునంతా స్కూల్లో లెక్కల పరీక్ష కోసం రివిజన్ చేయించారు. మధ్యాన్నం పరీక్ష మొదలవగానే, నాకు తెలియకుండానే నాలో మెల్లగా ఆందోళనకూడా మొదలైంది. పేపర్లో ని అక్షరాలన్నీ అత్తుక్కుపోయి పేపర్ అంతా నీలిరంగు అములుకునట్లు కనిపిస్తోంది నాకు.
చుట్టూ చూసాను. అందరు ఎంతో సంతోషంగా పరీక్ష రాస్తున్నట్లు వారి ముఖాలు వెలిగిపోతున్నాయి. నాకు ఒక్కదానికే ఈ శిక్ష ఏమిటి భగవంతుడా. నేను ఏం చేయాలి. సాయంత్రం దాక ఎలా గడిచిందో తెలియనేలేదు నా బుర్రని తొలిచేస్తున్న చెదపురుగుల్లాంటి ఆలోచనలతో.
రేపు సైన్స్ పరీక్ష. ఇంకో పది నిముషాల్లో ట్యూషన్ అయిపోతుంది అని తలచుకోగానే ఇక టీచర్ చెప్పేది నా బుర్రకెక్కలేదు. అనిత, రజని లను ఈ ఒక్కరోజు మా వీధి సైడు రమ్మని బతిమాలాను. వాళ్ళు ఆలస్యం అయితే ఇంట్లో తిడతారని వెళ్లిపోయారు.
మళ్ళీ ఒంటరి పక్షిలా నేను భయం భయంగా నడుస్తున్నాను. ఆందోళన కలిగించే ఏ విషయం అయినా అమ్మకి చెప్పకూడదు. ఆమె గుండె చాల బలహీనంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు అమ్మ ఒక సున్నితమైన గాజు బొమ్మ. కాలవ వంతెన దగ్గర అల్లరి మూక గురించి అమ్మకి చెప్పలేను. ఓ అడ పిల్ల వీధిలో ఒంటరిగా పోవాలంటే ఇంత భయపడాలా..? ఆడపిల్ల చదువుకోవాలంటే ఇలాంటి సమస్యలు కూడా ఎదురౌతాయా..? సమాధానం లేని ప్రశ్నలు నాకు నేనే వేసుకుంటున్నాను.
అల్లంత దూరంనుంచి నన్ను చూడగానే షరా మాములే అన్నట్లు వెకిలినవ్వులు, బూతు మాటలు మొదలైనాయి. పోనీ వీళ్ళ సంగతి నాన్నకి చెప్తే. ఆమ్మో. అసలుకే ట్యూషన్ మానేయమంటాడు. స్కూల్ లో సూరమ్మ టీచర్ చెప్పే లెక్కలు అసలు అర్ధం కావు నాకు. ట్యూషన్లో అయితే శ్రీదేవి టీచర్ ఎంత కష్టం అయిన లెక్కని అయినాసరే అరటిపండు వలిచి చేతికి ఇచ్చినట్లు చాల తేలికగా చెప్తుంది. మరి వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి నేను.
పౌర్ణమి దాటి రెండు రోజులు అయింది. సమయం కూడా ఎనిమిదే. కాసింత వెలుతురుగానే ఉంది. నాకు ఏదైనా మంత్రశక్తి ఉంటే ఎంత బాగుండు. వీళ్ళని అదృశ్యం చేసేసేదాన్ని కదా. కాలవ వంతెన దగ్గరైంది. వాడే మొన్న నా జడ పట్టి లాగిన వాడు నా ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేసేది.
గజేంద్రమోక్షంలో మొసలి కాలు పట్టేసి పళ్ళతో గుచ్చుతుంటే భయ విహ్వలమై ఒడలంతా ఒణుకు పుడుతూ, కాలికి కారే రక్తగాయానికి విలవిలలాడే గజేంద్రుడు ఇక నాకు మొసలితో పోరాడే శక్తి సన్నగిల్లుతోంది, నీవే దిక్కు అని ఆ శంఖచక్రధరుడిని ప్రార్దించిందట” నాయనమ్మ చెప్పిన భాగవతం కథ గుర్తుకు వచ్చింది నాకు. ఇప్పుడు వీళ్ళబారి నుండి నన్ను రక్షించడానికి ఏ దేవుడు అయినా వస్తే బాగుండు.
“అబ్బా..పదో తరగతికే పాప పిటపిటలాడిపోతోంది రా. లేత కొబ్బరి ముక్కలా ఉంది. కసుక్కున కోరికేయాలనిపిస్తోంది ” కాలవ గట్టు మీద కూర్చున్నవాళ్ళల్లో ఒకడు అంటుంటే మిగతా వాళ్ళు నా వంక చూస్తూ అసభ్యకరమైన సైగలు చేస్తూ పగలబడి నవ్వుతున్నారు.
వాడు దగ్గరికి వచ్చేసాడు. ఈ రోజు ఏం చేస్తాడో. రోజు ఈ నరకం ఏంటి నాకు. ఇప్పుడు నాకు ఓ అన్నో, తమ్ముడో ఉంటే ఎంత బాగుండేది. నాకు తోడుగా వచ్చేవారు కదా. అయినా వీళ్లకు అక్క, చెల్లి ఉండరా..? వాళ్ళను ఎవరైనా అల్లరిపెడితే వీళ్ళు ఊరుకుంటారా.
కనురెప్పపాటులో ఒకడు నా చున్నీలాగేసాడు. హఠాత్తుగా వాడు చున్నీ లాగేసరికి బిత్తరబోయాను. ఉలిక్కి పడి వాడి చేతుల్లో ఉన్న నా చున్నీని లాక్కోవాలని శక్తికొద్దీ పెనుగులాడను. వాడు వికృతంగా నవ్వుతున్నాడు. చున్నీని వాడి చేతుల్లోనే వదిలేసి పరుగులు తీసాను. ఆగవే ముం..” అంటూ వాళ్ళు నా వెనుకబడ్డారు. శక్తికొద్దీ పిక్కబలం చూపించి పరుగెత్తాను.ఒళ్ళంతా చెమటలతో ఇంట్లో అడుగు పెట్టాను.
అమ్మ పక్కనే వాసంతి అత్తని చూడగానే కాస్త గుండె దడ తగ్గింది నాకు.
“రారా సమీరా. నేను ఊరినుంచి వచ్చి గంట అయింది. నువ్వు ట్యూషన్ వెళ్ళావని వదిన చెప్పింది. నీకు ఇష్టం అని పూతరేకులు తెచ్చాను.” అంది, మంచం మీద ఉన్న పాకెట్ నా చేతిలో పెడుతూ వాసంతి అత్తమ్మ. మౌనంగా ప్యాకెట్ అందుకున్నాను.
అందరం భోజనాలు చేసాం. నా మౌనం అత్తకి విస్మయం కలిగించింది. గదిలో కూర్చుని పుస్తకం తిరగేయసాగాను. అత్త గదిలోకి వచ్చింది.
“సమీరా..! ఏంటి అంత డల్ గా ఉన్నావు. నేను ఎప్పుడు ఊరినుంచి వచ్చినా వస పిట్టలా ఆపకుండా నాకు బోలెడన్ని కబుర్లు చెప్పేదానివి. ఇప్పుడేంటి మూగనోము పట్టినదానిలా” ముఖకవళికలు చూసి క్షణాల్లో ఎదుటివారి మనసులో ఏముందో చెప్పే కళ అత్తకి పుట్టుకతో అబ్బిన విద్య.
వాసంతి అత్త నాన్నకి రెండో చెల్లెలు. అత్త దగ్గర నాకు చాల చనువు ఉంది. అమ్మకు చెప్పలేని విషయాలు కూడా అత్తతో పంచుకుంటాను. అత్తమ్మ ఆత్మీయ పలకరింపుతో నాలో గూడు కట్టుకుని ఉన్న నిస్తేజంలో చలనం వచ్చింది. . ఇంతకాలం గుండెల్లో జ్వలిస్తున్న అగ్నిపర్వతం బద్దలై కన్నీటి లావా ప్రవాహంలా బయట పడి అత్తమ్మ ఒడిని తడిపేసింది.
నా తల నిమురుతూ, అంతా విన్న అత్తమ్మ మౌనంగా గదిలోనుంచి బయటకు వెళుతుంటే ఆశ్చర్యం కలిగింది నాలో. నేను చెప్పింది అంతా విని అలా మౌనంగా వెళుతోందేంటి. తను నాకు దైర్యం చెప్తుందని, మంచి సలహా ఇస్తుందని కొండంత ఆశతో ఎదురుచూసిన నాకు అత్తమ్మ అలా వెళ్లిపోవడం చాల నిరాశ పరచింది. ఆశ్చర్యంగా చూస్తున్నాతను వెళ్ళిన వైపే. ఐదు నిముషాల్లో మళ్ళీ గదిలోకి వచ్చింది అత్తమ్మ చేతిలో పుస్తకంతో.
“ఈ పుస్తకం మొత్తం చదువు సమీరా. నీ కోసమే తెచ్చాను” అంటూ పుస్తకం నా చేతిలో పెట్టి అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది.
అమితాశ్చర్యంతో పుస్తకం అట్ట వైపు చూసాను. “భయం వీడితే జయము” టైటిల్ చూడగానే నా కళ్ళల్లోకి ఏదో తెలియని చైతన్యం ప్రవేశించింది. విస్మయంగా ఒక్కో పేజీ చదవసాగాను. చదువుతూనే ఉన్నాను. అర్థరాత్రి అయింది కూడా తెలియలేదు నాకు. ఆ పైన ఎప్పటికో మంచం మీద నిద్రలోకి వాలిపోయాను.
అత్తమ్మ ఉన్నన్ని రోజులు స్కూల్ కి సెలవు పెట్టాను. ట్యూషన్ కి కూడా పోలేదు. నాలుగు రోజులు ఉండి అత్తమ్మ ఊరికి వెళ్ళిపోయింది.
నాలుగురోజుల తర్వాత స్కూల్ కి వెళ్ళాను. సాయంత్రం స్కూల్ వదలగానే ట్యూషన్ కి వెళ్ళాను. ఏడున్నరకి శ్రీదేవి టీచర్ ట్యూషన్ వదిలేసారు. పుస్తకాలు గుండెలకు అడ్డంగా పెట్టుకుని తలవంచుకుని నడుస్తున్నాను. వీధి మలుపు తిరిగాను. మసక చీకటి. వీధి చివరి కాలవ గట్టు మీద ఎప్పటిలాగే వాళ్లంతా గుంపుగా కూర్చుని ఉన్నారు. కాలవలో పారే మురుగు నీటి కంపు వీధి అంతా వ్యాపిస్తోంది వాళ్ళ వెకిలి నవ్వుల్లాగే.
“నాలుగు రోజులు ఇటు రాకుండా ఎక్కడికి వెళ్ళావు పాపా. నువ్వు రాకుంటే ఎంత దిగులు పడ్డామో తెలుసా నీకు” అన్నాడు మోకాళ్ళ దగ్గర చినిగినట్లు ఉన్న జీన్స్ ప్యాంటు, రింగుల జుట్టు వాడు వెగిలిగా నవ్వుతూ
“పాప వచ్చేస్తోంది రా. ఈ రోజు ఎలాగైనా పాపకి ముద్దు పెట్టాలి” ఒకడు అన్నాడు గట్టు మీదనుంచి లేస్తూ. మొన్న జడ పట్టి లాగి పాపను తాకావుగా. ఈ రోజు ఛాన్స్ నాకు ఇవ్వరా” గట్టు మీదకు వాడిని తోసి ఇంకోడు నావైపు రాసాగాడు.
“నువ్వు భయపడి పారిపోయినంత కాలం కుక్కలు కూడా నీ వెంటబడి మొరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి భయం వీడి వెనుతిరిగి వాటిని ఎదుర్కొంటే తోక ముడుచుకుని పారిపోతాయి. కుక్కలైనా, కుక్కల్లాంటి మనుషులైనా అంతే. నువ్వు పిరికితనంతో ఏడుస్తుంటే మరింత ఏడిపిస్తారు. నువ్వు ఎదురు తిరిగి దైర్యంగా నిలబడితే ఎవరు నిన్ను ఏమి చేయలేరు.
నీ మాన, ప్రాణ, ఆత్మాభిమాన రక్షణ నీ జన్మహక్కు. నీ స్వేచ్చే, అభివృద్ధికి అడ్డు వచ్చే ఏ అవరోధానైనా అంతమొందిస్తేనే నువ్వు ఆనందంగా బతకగలవు. నిన్ను నిలువరించే దుష్టశక్తులను నువ్వు ధైర్యంతో ఎదుర్కొంటే ఇక నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. అయితే దానికి నీ ఆత్మబలంతో పాటు, నీ దేహ బలాన్ని కూడా పెంచుకునే బాధ్యత నీ మీద ఉంది”
పుస్తకంలోని ఒక్కో మాట ఒక్కో తూటా లాగా నాలో శక్తిని, బలాన్ని నింపసాగింది. నా శక్తిమీద నాకే నమ్మకం కలిగిన ఆ క్షణం, నా ఆత్మవిశ్వాసం నాకు కొండంత బలం ఇచ్చిన ఆ క్షణం. నాలోని పిరికితనం భయపడి పారిపోయి ఇన్నినాలో రోజులు దాగి నిద్రాణమైయున్న ఆవేశం, ధైర్యసాహసాలు బయటపడాలని ఉవ్విళ్లూరుతున్న ఆ క్షణం.
వాడు నా దగ్గరికి వచ్చేసాడు. ఒక్క క్షణం గుండెలనిండుగా ఊపిరిని పీల్చుకుని, పిడికిలి బిగించి వాడి ముఖం మీద బలంగా కొట్టాను.
విసురుగా వెళ్లి దూరంగా పడ్డాడు. కళ్ళు దిమ్మతిరిగి వాడికి చుక్కలు ఎన్ని కనిపించాయో, ఎన్ని పళ్ళు రాలాయో నాకు తెలియలేదుకానీ, రక్తం కారే నోటిని పట్టుకుని కిందపడి మెలికలు తిరుగుతున్నాడు. క్షణాల్లో కాలవ గట్టుమీది గుంపంతా మాయమైనారు. భయం వీడిన జయం నన్ను వరించిన ఆ క్షణం తొలిసారి విజయగర్వంతో ఇంటిదారి పట్టాను వాసంతి అత్తకు మనసులోనే నమస్సులు తెలుపుకుంటూ.

10 thoughts on “విహ్వల”

  1. VISSA RAMACHANDRA RAO

    రోహిణి గారి చమత్కారం కనపడలే. మామూలు కధ. పేరుపొందిన రచయిత్రి కాబట్టి, ఈకధ పాఠకుల దృష్టిలో నిలుస్తుంది. స్క్రీన్ప్లే బాగుంది.

  2. విశ్వేశ్వరరావు

    ఆడపిల్ల జీవితంలో అందులోను యవ్వన దశలో మృగాళ్ళతో ఇన్ని సమస్యలు ఎదురవుతాయా….??? బయటకు వెళ్ళి ఇంటికి చేరే మధ్య మార్గంలో ఎన్ని సవాళ్లు…!! అందుకే శ్రీ శ్రీ అన్నారు కొంతమంది కుర్రాళ్లు పుట్టుకతో వృద్ధులు అని.. మగపిల్లలు ఆడపిల్లలకు రక్షణగా ఉండాల్సింది పోయి వాళ్ళే తోడేళ్ళులా ప్రవర్తిస్తే ఎలా …..???
    మరో కధలో ఆడపిల్లలకు మగపిల్లలు ఎలా తోడు ఉండాలి అనే సందేశాన్ని అందించే ఓ చక్కని సందేశాత్మకత కధను వ్రాయండి రోహిణీ… చాలా బాగుంది భావన చక్కని కధను మాకు చదివేందుకు అవకాశం ఇచ్చారు అభినందనలు చిరంజీవి సౌభాగ్యవతి శ్రీమతి రోహిణీ…..

    1. వంజారి రోహిణి

      ధన్యవాదాలు వాణీ మేడం గారు

Comments are closed.