“విమోచనం..”పాల పిట్ట ఉగాది కథల ప్రత్యేక సంచిక లో ప్రచురణ అయిన నా కథ ఇక్కడ చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. కథని మీ వాల్ మీద మీ మిత్రుల కోసం షేర్ చేయండి. మరో నలుగురికి కథ చేరుతుంది. నిజ జీవిత సంఘటనలతో రాసిన కథ ఇది.



‘తాటి చెట్టు నీడ నీడా కాదు..తగులుకున్నోడు మొగుడూ కాదని’ అదేదో సామెత చెప్పినట్లు పాపం ఆ ప్రమీల ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో వదినా” ఫోన్లో మాట్లాడుతున్న రేవతమ్మ పిలగాడిని చూసి మళ్ళా మాట్లాడుతానని ఫోన్ కట్ చేసింది. “అమోవ్.. ..తల తిరగతా ఉండాదే నాకు” బాత్రూం లోనించి బైటకి వొచ్చి మంచం మీద కూలబడ్డాడు శ్రీనివాసు.
“అదేందిరా శీనా. జిమ్ డ్రెస్ వేసుకొనిఉండావు కదా” మంచం కాడికి వొచ్చింది రేవతమ్మ.
“పోదామనే డ్రెస్ వేసుకున్నా. ఇప్పుడు ఒళ్ళు నొప్పులుగా కూడా ఉన్నైమా”
శ్రీనివాసు నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. రవంత వెచ్చగా అనిపించింది.
“మే సురేఖా..ఎంత సేపు మొద్దు నిద్దర పోతావు.. లేమీ. అన్నకు ఒళ్ళు వేడిగా ఉండాది. ధర్మామీటరు తీసుకొని రా” రేవతమ్మ అరుపులకి దిగ్గున లేచి కూర్చుని కళ్ళు నిలుపుకుంటా అల్మారా కాడికి పోయి తలుపు తీసి డబ్బాలో ఉన్న ధర్మామీటర్ తీసి వాష్ బేసిన్ దగ్గర కడిగి, శ్రీనివాసులును నోరు తెరవమని నాలిక్కింద పెట్టింది సురేఖ.
రెండు నిమిషాలకి ‘కిక్ కిక్’ మని సౌండ్ వొచ్చింది. ధర్మా మీటరు తీసి చూసింది. “మో…జరం 101 ఉండాది ” అనిందా పిల్ల బెదురు ముఖమేసుకుని.
“ఇదేందిరా దేవుడా..ఈ రోజు రిటను గిఫ్టుల కోసం బేగం బజారుకు పోదామనుకుంటిమే. ఈ జరమేంది”
“సరేలేమా. గిఫ్టులకు మళ్ళా పోవచ్చు. ముందు అన్నకు జరం తగ్గనీ “. అని “డోలో వేసుకో అన్నా” అంటూ మాత్ర కాగితంలోనించి చింపి ఇచ్చింది సురేఖ. రొవ్వన్నీ నీళ్ళు నోట్లో పోసుకొని మాత్ర ఏసుకున్నాడు శ్రీనివాసు.
“కాసేపు పండుకోరా. బార్లీ గింజలు ఉడకేస్తా. జావ తాగుదువుగాని” అంటూ వంటింట్లోకి వెళ్ళింది రేవతమ్మ కంగారుగా అడుగులు వేస్తూ. స్టవ్ మీద నీళ్ల గిన్నె పెట్టి అన్ని బార్లీ గింజలు వేసింది. అవి బాగా ఉడికినాక, వడగట్టి నీళ్లలో చిటికెడు రాళ్ళుప్పుకలిపి, లోటా తెచ్చి శ్రీనివాసుకి ఇచ్చింది. బార్లీ నీళ్లు తాగి మళ్ళా నీరసంగా పనుకున్నాడు.
“ఇదిగో మే. తొమ్మిది గంటలకి కింద క్లినిక్ తెరుస్తారు. మెడికల్ షాపులో ఇంతియాజ్ వొచ్చేసుంటాడు. ఓ తూరి ఫోన్ చేసి అన్నకి జరమనిచెప్పి ఇంటికాడకి రమ్మను” రేవతమ్మ మాట నోట్లో ఉండగానే ఇంతియాజ్ కి ఫోన్ చేసిందామ్మి. వంటింట్లోకి పోయి ఎసరేద్దామని నీళ్ళు పెట్టింది. మరుగుతున్న నీళ్ళను చూస్తా ఉండాది రేవతమ్మ.
వీడు బి.టెక్ ఊర్లో పెద్ద నాయిన ఇంటికాడుండి చదువుకున్నాడు. బి.టెక్ నాలుగో సంవత్సరంలో ఉండగా పెద్ద నాయినోళ్ళ పక్కింట్లో బాడుక్కి చేరిన వాళ్ళ కూతురు ఇంటర్ చదవతా ఉండాదంట. ఆ పిల్ల బాగుండాది అని వీడు చూస్తే, ఆ అమ్మి కూడా వీడి చాయ చూసి సిగ్గుపడతా నవ్వేదంట. ఆ అమ్మి అట్లా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసరికి, వీడు ‘లేడికి లేచిందే పరుగన్నట్లు, వాళ్ళ ఇంటికి పోయి ఆ అమ్మిని పెళ్ళిచేసుకుంటానని అడిగేదానికి పోదాం రమ్మని ‘చెవి కాడ జోరీగ’ మాదిరిగా ఒకటేమని పొరకాడతా ఉంటే, వీడి బాధ చూడలేక పెద్దమ్మ కూతురు ‘పూర్ణ’ వీడిని తీసుకోబోయిందట పెళ్ళిళ్ళ పేరమ్మ మాదిరిగా.
వీళ్ళిద్దరిని జూసి ఆ పిల్ల అమ్మ తోక తొక్కిన పాము బుసగొట్టినట్లు , “ఇంటర్ చదవతా ఉండే చిన్న పిల్లను పెళ్ళి జేసుకుంటానని అడిగేదానికి పెద్దమనుషుల్లా వచ్చారు. మీ పెద్దోళ్ళకి చెప్తాను మీ సంగతి. పోండి పోండి” అని అరిచిందట. ముఖానికి గంటు పెట్టుకుని వస్తా వస్తా ఓ తూరి ఎనక్కి మల్లుకోని ఆ పిల్ల కళ్ళలోకి చూశాడట ఈ ప్రభుద్దుడు. ఆ పిల్ల కళ్ళల్లో ఏం ఔపడిందో ఏమో. పదేళ్ళు మళ్ళా ఆ ఊసే ఎత్తలేదు వీడు.
“పాతికేళ్ళు దాటినాయి. సంబంధాలు చూస్తాము రా” అంటే అప్పుడొద్దు, ఇప్పుడొద్దు అంటా దాటేస్తా ఉంటే, ఏమో అనుకున్నా. ఈ కాలంలో మొగ పిలకాయలకి పెళ్ళి కుదరడం చానా కష్టంగా ఉండాది. బెండకాయ ముదిరినట్టు ముదిరితే అసలు పెళ్ళి కాదురా అంటా పోరకాడితే, వీడు వద్దు వద్దంటా వొచ్చింది ఇందుకేనేమో.
రెండేళ్ళ ముందు ఇంస్ట్రాగ్రామ్ లో ఆ పిల్ల “నువ్వంటే ఇష్టమే. ఇప్పుడు మీ పెద్దోళ్ళని తీసుకోని మా ఇంటికి వచ్చి అడుగు” అని మెసేజ్ పెట్టినకాడ్నించి పరుగులు తీయించాడు. వాళ్ళ నాయన సౌదీలో ఉండాడని, ఆయన రావాలని, ఆ పిల్లకు ఉద్యోగ్యం రావాలని, చెల్లెలి చదువు పూర్తి కావాలని, ఎప్పుడు పోయినా ఏదో ఒక సాకు చెప్పిపంపించింది వాళ్ళమ్మ . ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉంటే, ఇదిగో ఇన్నాళ్ళకి వాళ్ళు పెళ్ళికి ఒప్పుకునే తలికి మా ‘తల్లో ప్రాణం తోకలోకి వచ్చినట్లైంది’. ఇకన వీడు మమ్మల్ని బొంగరం తిప్పినట్లు, పెళ్లి పనులకు పరుగులు పెట్టిస్తా ఉండాడు. నిశ్చితార్ధం కూడా అయిపోయి, పెళ్ళి ఇంక పదిరోజుల్లోనే ఉండాది. ఎన్ని పనులని చేసుకోవాలి. మగ పెళ్ళి వాళ్ళం అయినా సరే “పెళ్ళి పనులంటే పులితోక పట్టుకుని పరిగెత్తినట్లు. ఆలోచిస్తా ఉండాది రేవతమ్మ.
ఇంతియాజ్ వొచ్చి జరం చూసాడు. ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేస్తానని, సూది పంపిస్తానని చెప్పి పోయినాడు. ‘పులిమీద పుట్ర’ మాదిరిగా ఇదేందిరా నాయినా ఈ జరం ఇప్పుడే రావాలా. ఏం జరమో ఏందో..! మీ నాయిన జూస్తే గుచ్చి, సిరంజిలోకి ఇంత రక్తం తీసినాడు. డోలో, ఇంకేవో యాంటీబయాటిక్ మాత్రలేసుకోమని ఇచ్చి, వాట్సాప్ కి రిపోర్ట్ షూటింగ్ అంటా మూడు రోజుల నుంచి తిరగతా ఉండాడు. పెళ్లి పనులు ఎట్టచేయాలో తెలియడం లేదు” దిగులుగా అనింది రేవతమ్మ
శ్రీనివాసు కళ్ళు మూసుకొని పడుకొని ఉండాడు. సురేఖ ఒక తట్టు, రేవతమ్మ ఒక తట్టు అన్నాలు కూడా తినకండా దిగాలు పడి కూర్చొనుండారు. బ్లడ్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా, పిలగాడికి ఏం జరమొచ్చిందో అని ఒకటేమని ఆందోళన పడతా ఉండారిద్దురూ.
మధ్యాన్నానికి శ్రీనివాసు ఒంటిమీద అక్కడక్కాడా కుంకుమ అద్దినట్లు ఎర్రటి మచ్చలు కనపడ్డాయి. పిలగాడు చిన్నగా మూలగతా ఉండాడు. ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు’ జరానికి తోడు ఒంటి మీద ఆ మచ్చలు చూసేతలికి రేవతమ్మకి కాళ్ళు చేతులు ఆడలా. ఇకన రిపోర్ట్ కోసం చూడకుండా అప్పటికప్పుడు “క్యాబ్ బుక్ చేయి సురేఖ. వీడిని ఆసుపత్రికి తీసుకొని పోదాము” అనింది గబగబా సంచిలో దుప్పటి, నీళ్ల సీసా పెడుతూ. రెండు నిమిషాల్లో క్యాబ్ వచ్చేస్తుందని చెప్పింది సురేఖ.
బీరువాలో ఉన్న లలితా జువ్వలరీస్ వాళ్ళు ఇచ్చిన చిన్న పర్సుతీసి, ఆరువేలను చేకావిలిగా ఉంటాయని పెట్టుకునింది రేవతమ్మ. శ్రీనివాసుని మెల్లగా లేపి చెరోరెక్క పట్టుకుని మెల్లగా బైటకి నడిపించారు. ‘పోలో మని పొతే పొద్దోమని’ వచ్చే ఇంటాయన మూర్తి యేవేళకు వస్తాడో అని తాళాలు ఇంటిబయట ఉన్న చెప్పుల స్టాండులో పెట్టారు. మెల్లగా ఆటోలో ఎక్కి కూర్చున్నాడు శ్రీనివాస్. రేవతమ్మ, సురేఖ చెరోతట్టు కూర్చున్నారు. ఆటోని ముందుకు ఉరికించాడు ఓలా డ్రైవర్.
ఓఆర్ ఆర్ మీదుగా రెక్కల గుర్రంలా దౌడు తీసిన ఆటో అటుదిరిగి, ఇటుదిరిగి గచ్చిబౌలి దగ్గర ఓ పెద్ద ఆసుపత్రి ముందర ఆగింది. పదంతస్తుల పైమాటగా ఉన్న ఆ ఆసుపత్రి భవంతి చూసేతలికి రేవతమ్మకి కళ్ళు తిరిగినాయి. అయినా పిలగాడి పెళ్ళి పదిరోజుల్లో ఉన్నాది కదా. అర్జెంటుగా జరం తగ్గాలంటే ఆ మాత్రం పెద్ద ఆసుపత్రికి రావాల్సిందే అని తృప్తి పడి, శ్రీనివాసును మెల్లగా నడిపించుకుంటూ లోపలి పెద్ద హాల్లోకి వెళ్లారు. రిసెప్షన్ ౩వ అంతస్తులో ఉంది అని చెప్పాడు అక్కడ యూనిఫామ్ లో ఉన్నఒకతను. “పిలగాడికి జరం. నిలబడలేకుండా ఉన్నాడు అంటే వీల్ చెయిర్ తెచ్చారు అక్కడివాళ్లు. లిఫ్టులో మూడో అంతస్తుకి వెళ్లారు. అక్కడ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా చాల మంది పేషంట్స్, వారి తాలూకు మనుషులు కుర్చీల్లో కూర్చొని డాక్టర్ల పిలుపు కోసం ఎదురు చూస్తా ఉండారు దిగాలు ముఖాలు ఏసుకొని.
లోపలంతా ఏ.సి. వల్ల చలి పుడతా ఉండాది. రిసెప్షన్లో శ్రీనివాసు జరం సంగతి చెప్పి పేరు రాయించుకుని వచ్చింది సురేఖ. పది నిమిషాల్లో ఓ పొడవైన కాయితం చేతిలో పెట్టింది రిసెప్షన్ దగ్గరి అమ్మాయి. అవన్నీ అప్పటికప్పుడే చేయించాల్సిన టెస్టులట. కొండవీటి చాంతాడంత పొడుగున్న టెస్టుల లిస్టు చూసేతలికి ఒణుకు పుట్టింది రేవతమ్మకి. మళ్ళీ ఇద్దరూ శ్రీనివాసు చెరోరెక్క పట్టుకుని రెండో అంతస్తులోకి వచ్చారు. అక్కడ బైట ఉన్న బెంచి మీద నలుగురు కూర్చొని ఉన్నారు. శ్రీనివాసు ఐదోవాడు.
పావుగంట తర్వాత రమ్మని పిలిచారు. లోపలకు పోగానే బల్ల మీద కూర్చోమని, చేయి గట్టిగా ఒత్తి పట్టుకోని చేతికి పట్టీ బిగించి కట్టాడు ల్యాబ్ అతను. ఇంత పొడుగున్న సిరంజి సూదిని శ్రీనివాసు చేతికి గుచ్చి, సిరంజి నిండా నెత్తురు లాగింది నర్సు. ఎర్రటి, చిక్కటి నెత్తురు సిరంజిలోకి దిగతా ఉంటే, రేవతమ్మ కళ్ళు ఒత్తుకునింది. తొమ్మిది చిన్న చిన్న టెస్ట్ ట్యూబుల్లో ఆ నెత్తురుతో నింపారు. తొమ్మిది రకాల టెస్టులు చేసి, రిపోర్ట్స్ మూడు గంటల్లో పంపుతాము. ఇరవై వేలు కట్టమన్నారు. ఇరవై వేలా..! నోరు బావురు కప్పలా నోరు తెరిచింది రేవతమ్మ. అంతలోనే పిలగాడి పెళ్ళి గుర్తుకు వచ్చి, టక్కున నోరు మూసేసింది.
సురేఖ డబ్బులు గూగుల్ పే చేసింది. ‘మూడు గంటల తర్వాత డాక్టర్ వస్తాడు. అందాక హాస్పిటల్ రూంలోనే అడ్మిట్ అవ్వమని రిసెప్షన్లో మరో పది వేలు కట్టించుకున్నారు. గాలి తీసిన రబ్బరు ట్యూబులా అయింది రేవతమ్మ ముఖం. పదిరోజుల్లో జరగబోయే కొడుకు పెళ్ళి గుర్తుకు వచ్చి, చిన్నగా నిటూర్చింది. లిఫ్ట్ లో 8 వ అంతస్తులోకి తీసుకువెళ్లి రూమ్ చూపించింది నర్సు. శ్రీనివాసు నీరసంగా పడుకున్నాడు మంచంమీద. యుద్ధ ప్రాతిపదికన ఒకసారి ముగ్గురు నర్సులు రూంలోకి వచ్చారు ఒక నర్సు సెలైన్ బాటిల్ కి సిరంజి గుచ్చి శ్రీనివాస్ కుడిచేతి మీద సూది పొడిచింది. బాటిల్ ని మంచంకి పక్కనే ఉన్న స్టాండుకి తగిలించింది. ఇంకో నర్సు ధర్మామీటర్ నోట్లో పెట్టి జరం చూసింది. అప్పటికి 100 ఉంది. డోలో, ఇంకేదో మాత్ర వేసి నీళ్లు తాగించింది. “ఇంకాసేపట్లో బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్లు వస్తారు” అని చెప్పి వచ్చినంత వేగంగా వెళ్లిపోయారు వాళ్ళు.
శ్రీనివాస్ మంచం మీద నీరసంగా కళ్ళుమూసుకుని పడుకున్నాడు.గెంట మూడయింద. 8 అంతస్తులో పెద్దగా పేషెంట్స్ ఉన్నట్లు లేరు. రిసెప్షన్ దగ్గర కూర్చున్న నర్సులు తప్ప ఇంకెవరు లేరు. రూమ్ బైట కాసేపు నిలబడి లోపలి వచ్చేసింది రేవతమ్మ. అంతా నిశ్శబ్డం. మనసునిండా ఆందోళన. రిపోర్ట్స్ లో ఏం చెప్తారో. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలో. ఒకపక్క పిలగాడి పెళ్లి పెట్టుకొని ఉండేతలికి చెప్పలేని భయంగా ఉండాది ఆమెకి. ఇంటాయన రాంమూర్తి కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తా ఉండాది. రేవతమ్మ వాలకం గమనిస్తానే ఉండాది సురేఖ.”మోవ్..ఎంతసేపని వాకిట్లో నిలబడతావు. నాయిన షూటింగ్ నించి లేటుగా వస్తానన్నాడు కదా. బయలుదేరేముందర ఫోన్ చేస్తాడులే. అన్నకి జ్వరమని, మనం ఆసుపత్రిలో ఉన్నాం అని చెప్తాములే. నువ్వు లోపలి రా” ఆ పిల్ల మాటలు పూర్తి కాక ముందే ‘పిడికిలి మట్టికోసం పది మందిని పంపినట్లు’ శ్రీనివాసుని చూసేదానికిబిలబిల మంటూ నలుగురు డాక్టర్లు రూంలోకి దూసుకొనొచ్చారు.
ముగ్గురు పెద్ద డాక్టర్లు. పెద్ద గడ్డాలతో, పెద్ద కళ్ళద్దాలతో ఉండారు. ఒకతను చిన్నవాడు. పెద్దాయన శ్రీనివాస్ గుండెలమీద సేతస్కోప్ పెట్టి రెండు నిముషాలు పరీక్షించాడు. చిన్న డాక్టర్ చేతిలో రిపోర్ట్స్ ఉన్నాయి. వాటిని చూస్తుంటే చిన్నప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు పట్టుకుని అయివారు క్లాసులోకి వచ్చినట్లు ఉండాది రేవతమ్మకు. ఐదు నిమిషాల నిరీక్షణ తర్వాత పెద్ద డాక్టర్ కళ్లద్దాలు తీసి ఒకసారి తుడుచుకుని రేవతమ్మ చాయ చూస్తూ “మేము చెప్పేది విని మీరు కంగారు పడకండి. మీ అబ్బాయికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. బ్లడ్ ప్లేటిలెడ్స్ చాల తక్కువ ఉన్నాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. మీ అబ్బాయిది A పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఆ గ్రూప్ ఉన్నవాళ్లు ఎవరైనా ఉంటే చెప్పిపెట్టండి. సాయంత్రం బ్లడ్ ఎక్కించాలి.” అన్నాడు కాస్త సీరియస్ గా ముఖం పెట్టి. ఆ మాట వినేతలికే రేవతమ్మకు గుండె జారిపోయింది. నలుగురు డాక్టర్లు అదే బిలబిల మనే శబ్దంతో పక్క రూంలోకి దూసుకుపోయారు.
“మో..నాకు డెంగ్యూ జరమా..! జరమని నా పెళ్ళి ఆపేయారు కదా” శ్రీనివాసు కళ్ళల్లో ఆందోళన చూసి “వెధవ ముండ జ్వరం. ఎవరి దిష్టి కళ్ళు వీడిమీద పడ్డాయో ఏమిటో. వాళ్ళ దుంప దెంచ. రెండు రోజుల్లో తగ్గిపోతుంది లేరా శీనా..నువ్వు దిగులుపడబాక” అని “సురేఖ..నీ ఫ్రెండ్స్, వాడి ఫ్రెండ్స్ లో ఆ గ్రూప్ రక్తం ఎవరికైనా ఉందేమో కనుక్కో మే” అంటా ఆమె కూడా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసేదానికి మల్లుకున్నాది. ఐదు నిమిషాల్లో జుట్టు యెగ్గట్టుకొని నల్లటి చుడిధార్లో వొచ్చింది ఒకామె రూములోకి. ఆమె రాగానే ఇద్దరూ నిలబడ్డారు. “నేను ఇక్కడ డైటీషియన్ ని. సమయానికి పేషేంట్ కి మంచి ఫుడ్ తెచ్చి ఇస్తున్నారు కదా. ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటె చెప్పండి” ఓ తూరి పనుకోనున్న శ్రీనివాసుని చూసి వెళ్ళిపోయింది. అరగంట తర్వాత ఫీజియోథెరపిస్ట్ అంటూ ఇంకొకతను వచ్చి పిలగాడిని చూసి, ఒకసారి వాడి కాళ్ళు, చేతులు పట్టుకుని ఊపి వెళ్ళిపోయాడు. కాసేపటికి రూమ్ క్లీనింగ్ అంటూ ఒకామె వచ్చి, ఒక్క నిమిషంలో రూమ్ తుడిచి వెళ్ళింది. తేపతేపకి ఎవరో ఒకరు రూంలోకి వస్తానే ఉండారు. వాళ్ళు ఒచ్చినప్పుడల్లా నిలబడి, వాళ్ళు పోయాక కూర్చుని, మళ్ళా నిలబడి, ఇక లాభం లేదని సాయంత్రం దాక నిలబడే ఉండిపోయారు రేవతమ్మ, సురేఖలు.
సాయంత్రానికి శ్రీనివాసు ఫ్రెండ్స్ ముగ్గురు, సురేఖ ఫ్రెండ్స్ ఇద్దురు వచ్చారు రక్తం ఇస్తామని. నర్సులు వాళ్ళకి టెస్టులు చేసి, ఇద్దరి రక్తం శ్రీనివాసుకు సరిపోతుందని,వాళ్ళ రక్తం తీసుకోని, శ్రీనివాసుకి ఎక్కించారు. “ఆహా..ఇది కదా స్నేహమంటే. అవసరానికి వచ్చి రక్తం ఇచ్చి ఆదుకున్నారు నాయనా. మీ ఋణం తీర్చుకోలేము. చిన్న పిలకాయలైనా పెద్ద గుణం ఉండాది మీకు. ఆ ఏడుకొండల వాడు మిమ్మల్ని చల్లగా చూడాలి ” అంటా వాళ్ళకి చేతులెత్తి మొక్కింది రేవతమ్మ.
అప్పటికి రాత్రి పదైంది. షూటింగ్ నుంచి నేరుగా హాస్పిటలకే వొచ్చాడు శ్రీనివాసు నాయిన మూర్తి. రాత్రి ముగ్గురు హాస్పిటల్ లోనే పనుకున్నారు. పక్కరోజు షూటింగ్ లేదంటూ ఇంటి దగ్గరకి పోయి, స్నానం చేసి, హోటల్ నుంచి భోజనాలు పార్సెల్ కట్టించుకుని వచ్చాడు మూర్తి. ఆ రోజుకి టెంపరేచర్ చూస్తే నార్మల్ గానే ఉంది శ్రీనివాసుకి. ‘పెద్ద గండం గడిచింది దేవుడా’ అనుకుంటూ దణ్ణం పెట్టుకుంది రేవతమ్మ. నర్సులు, రూమ్ క్లీనింగ్ వాళ్ళు, డైటీషియన్ అంటూ ఎవరోఒకరు వస్తానే ఉండారు. శ్రీనివాసు ముఖంలో కొంచం తెరిపి కనపడింది. లేచి కూర్చుని, “జరం తగ్గిపోయింది. ఇంటికి వెళ్ళిపోదాం నాయనా” అన్నాడు శ్రీనివాసు. “సాయంత్రం డాక్టర్లు వచ్చాక డిశ్చార్జ్ చేయమని అడుగుదాము” అన్నాడు మూర్తి. రేవతమ్మ, సురేఖ హాస్పిటల్ కి దగ్గరలోనే ఉండే షాపింగ్ మాల్ కి వెళ్ళి, రిటర్న్ గిఫ్ట్స్ కొని ఇంటి కాడ పెట్టేసి వచ్చారు. సాయంత్రం మళ్ళీ డాక్టర్ల బృందం వచ్చింది. “సర్, మా శ్రీనివాసుకి జ్వరం తగ్గిపోయింది. డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు” ఆత్రంగా అడిగింది రేవతమ్మ. “
“నిన్ననే కదా రక్తం ఎక్కించింది. అప్పుడే డిశ్చార్జ్ అంటే ఎలా..! ఇంకో రెండు రోజులు అబ్సర్వ్ చేయాలి. జ్వరం నించి కోలుకోవడానికి టైం పడుతుంది. అన్నట్లు మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా” సురేఖ వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు పెద్ద డాక్టర్. “ఉంది సర్” అనిందా పిల్ల.
తృప్తిగా తలాడించి, ఇంకోతూరి శ్రీనివాసుని పరీక్షగా చూసి, విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్లిపోయారు డాక్టర్లు. నర్సు వచ్చి సెలైన్ పెట్టి వెళ్ళింది. ఆ రోజు కూడా టెంపరేచర్ నార్మల్గానే ఉంది. ఇంతలో కాబోయే వియ్యపురాలు సుధమ్మ ఫోన్ చేసింది. రేవతమ్మ కంగారు పడుతుంటే మూర్తి సెల్ తీసుకుని “హలో” అన్నాడు. “అన్నయ్య గారు. వదిన లేదా” అడిగిందామె. “ఉంది ఉంది. ఇస్తాను” అంటూ శ్రీనివాసు జ్వరం గురించి ఆమెకి చెప్పవద్దని సైగ చేసి, ఫోన్ రేవతమ్మకి ఇచ్చాడు. “ఆ వదినా..బాగున్నారా చెప్పండి” అంది రేవతమ్మ తడబాటుగా. “ఆ బాగున్నాము వదినా. ఇంకా ఐదు రోజుల్లోనే పెళ్ళి కదా. పనులతో ఒక్క చోట నిలబడడానికి లేకండా ఉండాది. మద్రాసుకు వచ్చి వుండాము. నల్లి సిల్క్ షోరూం లో పట్టుచీరలు కొంటున్నాము. తల్లి చీర కోసం ఎరుపు రంగు చీర తీసుకున్నాము. మీకు ఎరుపు రంగు నచ్చుతుంది కదా. లేకుంటే వేరే రంగు తీసుకుంటాను. అసలు వీడియో కాల్ చేసి, చీరలు చూపిస్తాను” అందామె.
“అయ్యో.. వద్దు.. వద్దులే వదినా వీడియో కాల్ వద్దు. నాకు ఎర్ర రంగు నచ్చుద్దిలే. మేము బైట షాపింగుకి వొచ్చివుండాము. మళ్ళీకాల్ చేస్తాను వదినా” అంటూ కంగారుగా ఫోన్ పెట్టేసింది రేవతమ్మ. అప్పుడే లోపలకు వచ్చిన నర్సులు చోద్యం చూస్తున్నట్లు నిల్చున్నారు. ‘ఆమ్మో.. వీడికి జరం అని తెలిస్తే ఇంకేమైనా ఉందా..! లేనిపోని ప్రశ్నలు వేసి, అనుమానంతో విసిగిస్తారు. ఆ పిల్ల కూడా వీడికి చాల సార్లు ఫోన్ చేసిందట. వీడు మెస్సేజ్లు చేసి మేనేజ్ చేస్తున్నాడు. ఈ జరం తగ్గిపోయి, ఆ మూడు ముళ్ళు వేసేస్తే చాలు వీడు’ గుండెల మీద చేయి వేసుకుంది రేవతమ్మ.
మరో మూడు రోజులు ఆసుపత్రిలోనే గడిచి పోయింది. ‘పొద్దున్నే షూటింగ్ ఉండాది. ఈ రోజు పిలగాడికి డిశ్చార్జ్ చేస్తామని చెప్పినారు కదా. సాయంత్రానికి వొచ్చేస్తా. ఈడ నుంచే ఇంటికి పోదాము’ అని చెప్పి మూర్తి వెళ్ళిపోయాడు. జరం తగ్గిపోయింది. ఇకన ఇంటికి పోదామని శ్రీనివాసు నస మొదలుపెట్టాడు. “డాక్టర్ వొచ్చినాక చెప్పేసి పోదామురా శీనా. కాసేపు ఓర్చుకోరా” రేవతమ్మ బతిమాలతా ఉండాది. నర్సులు వొచ్చి టెంపరేచర్ చూసి, సెలైన్ బాటిల్ మార్చి వెళ్ళారు. శ్రీనివాసుకి బన్సీరవ్వ ఉప్మా తెచ్చిచ్చింది కాంటీన్ అమ్మాయి. ఉప్మా నోట్లో పెట్టుకొని “ఛీ..ఉప్పులేదు, కారం లేదు. చప్పిడి ఉప్మా. రవ్వలో వేడినీళ్ళు పోసి తెచ్చారు. నాకొద్దు” అని పళ్ళెం పక్కన పెట్టేసాడు. సురేఖ బయట హోటల్ కి వెళ్ళి ఇడ్లిలు, దోశలు తెచ్చింది. ముగ్గురు తిన్నారు. డాక్టర్ కోసం కళ్ళల్లో కాయలు కాచేలా ఎదురుచూస్తా ఉన్నారు. నర్సులు వచ్చారు. డైటీషియన్ వొచ్చి పోయింది. పీజీయోతెరపిస్ట్ వచ్చివెళ్ళాడు. పక్కలు మార్చి వెళ్ళేవాళ్ళు వచ్చి దుప్పటి, దిండు కవర్లు మార్చి వెళ్ళారు. ఆయమ్మ వచ్చి గది ఊడ్చి, మాఫ్ చేసి వెళ్ళింది. బాత్రూం క్లీనింగ్ చేసే అతను ఫినాయిల్ సీసా తీసుకుని మరి బాత్రూమ్లోకి వెళ్ళి శుభ్రం చేసి వచ్చాడు. డాక్టర్ జాడ మాత్రం కనుచూపు మేరలో లేదు. రూము తలుపు నెట్టుకుని వచ్చినవాళ్ళు డాక్టర్ అనుకుని ప్రతిసారి ఆతృతగా లేచి నిలబడడం,తర్వాత వాడిపోయిన తోట కూర కాడలా కూర్చుండిపోవడం. అప్పటికే గంట రెండు అయింది. మధ్యాన్నం మీల్స్ ప్లేట్ తీసుకుని కాంటీన్ అతను తలుపు తోసుకుని లోపలకు వచ్చాడు. అతన్ని చూడగానే శ్రీనివాసుకి ఒళ్ళు మండిపోయింది. “మేము డిశ్చార్జ్ అయి ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. మీల్స్ వద్దు” గట్టిగా అరిచినంత పనిచేశాడు. కాంటీన్ అతను బిత్తరపోయి, మీల్స్ ప్లేట్ బల్ల మీద పెట్టి, వెనక్కి చూడకుండా గబగబా తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. హఠాత్తుగా శ్రీనివాసు చేతికి పెట్టి ఉన్న సెలైన్ ట్యూబ్ ని లాగేసి “మా..డాక్టర్ ఇకన రాడుగానీ, నేను ఇంటికి వెళ్ళిపోతా. మీరు డబ్బులు కట్టేసి రండి” అంటా గబగబా తలుపు తోసుకుని వరండాలోకి వచ్చి లిఫ్ట్ దగ్గరకి పోయినాడు. రేవతమ్మ, ప్రమీల బిత్తరపోయి శ్రీనివాసు చేతులను చెరోపక్క పట్టుకుని, గదిలోకి లాకొచ్చారు. “ఒరే శీనా, ఈ రోజు ఆరునూరైనా సరే మనం ఇంటికి వెళ్ళిపోదాము. మీ నాయిన ఒచ్చేదాకా ఆగరా” అంటా బతిమాలింది. నాలుగు గంటలప్పుడు ఇద్దరు డాక్టర్లు వొచ్చారు. శ్రీనివాసుని పరీక్షించి, రేవతమ్మ తట్టు చూసి, మేడం ఒక్క నిమిషం బయటకు రండి” అన్నాడు పెద్ద డాక్టర్, అదేదో సినిమాలో మాదిరి సీరియస్ గా ముఖం పెట్టి. కంగారుగా బయటకు వెళ్ళింది రేవతమ్మ. వాళ్ళు ఏం చెప్తారో అని శ్రీనివాసుకి ఆందోళన ఎక్కువైంది. “మీ అబ్బాయికి జ్వరం తగ్గిపోయింది. అంతా నార్మల్ గా ఉంది. కానీ ఈ ఒక్క రోజు చూసి రేపు డిశ్చార్జ్ చేస్తాము అన్నాడు. రేవతమ్మకి ఒళ్ళు మండిపోయింది.”వాడికి అంతా నార్మల్ గా ఉంది అనే మాట చాటుగా పిలిచి చెప్పడం ఎందుకు డాక్టర్? ఆ ముక్క వాడిముందే చెప్పండి” కాస్త కటువుగా వచ్చిన రేవతమ్మ స్వరానికి డాక్టర్ ఏమనుకున్నాడో ఏమో కానీ, రూములోకి వచ్చి, పండుకోనున్నశ్రీనివాసు బుజం తట్టి “యు ఆర్ పెర్ఫెక్ట్లీ అల్ రైట్ మై బాయ్” అని, డిశ్చార్జ్ సంగతి తర్వాత చెప్తాము అని వెళ్ళిపోయారు డాక్టర్లు. “ట్రీట్మెంట్ కి ఇన్సూరెన్స్ ఉంది అని డాక్టర్లకి చెప్పకుండా ఉంటే సరిపోయేది. అప్పుడైతే రెండురోజుల ముందే డిశ్చార్జ్ చేసిఉండేవాళ్ళు”అనింది సురేఖ. మాటల్లోనే షూటింగ్ నుంచి మూర్తి వచ్చేసాడు. విషయం అంతా చెప్పేసి, ఎల్లుండి ఊరు ప్రయాణం ఉండాది. ఆవులెల్లుండి పిలగాడిని మా అన్నోళ్ళఇంటి కాడ పెళ్ళికొడుకుని చేయాలి అనికుంటిమి కదా. ఈ డాక్టర్లు ఈ రోజు కూడా డిశ్చార్జ్ మాట ఎత్తలేదు” అనింది రేవతమ్మ. వాళ్ళు చెప్పరు నాయినా. మనం ఇంటికి వెళ్ళిపోదాము. శ్రీనివాసు ఎత్తుకున్నాడు. ఇక లాభం లేదని సురేఖని తీసుకుని మూర్తి రిసెప్షన్ దగ్గరకి పోయి డిశ్చార్జ్ గురించి అడిగాడు. డాక్టర్ చెప్పాలని తమకేమి తెలీదని డ్యూటీ నర్సులు చెప్పారు. ఎల్లుండి శుభకార్యం పెట్టుకొని వుండాము. ఊరికి పోవాలి. పిలగాడికి అంతా నార్మల్గా ఉందని చెప్పి, డిశ్చార్జ్ చేయకుండా ఇంకా సతాయిస్తా ఉండారు. మీకు బిల్లు యెంత కావాలో రాసుకోండి అంటా చెక్ బుక్ ను రిసెప్షన్ టేబుల్ మీద విసురుగా పెట్టి, పై అధికారులకు రిపోర్ట్ చేస్తాము అని గట్టిగా అదిలించే సరికి అప్పటికప్పుడు డ్యూటీ నర్సు డాక్టర్ కి ఫోన్ చేసింది. బిల్లు కట్టించుకుని డిశ్చార్జ్ చేయమని చెప్పాడు డాక్టర్. ఆరు రోజులు ఆసుపత్రి లో ఉన్నందుకు మూడు లక్షల బిల్లు చేతిలో పెట్టారు వాళ్ళు. పిలగాడి పెళ్ళిని తలుచుకుని ఒక్క ముక్క ఎక్స్ట్రా మాట్లాడకుండా గమ్మున డబ్బులు కట్టి రూంలోకి వచ్చారు. అప్పుటికే తట్టా బుట్టా అంతా సర్దేసి రెడీగా ఉండారు రేవతమ్మ, శ్రీనివాసులు.
అపార్ట్మెంట్ పార్కింగ్ లో కారు పెట్టేసి, లిఫ్ట్ దగ్గరకి నడుచుకుంటా వొచ్చారు ముగ్గురు. మెడికల్ కిట్, బ్యాగ్ తగిలించుకుని అపార్ట్మెంట్ క్లినిక్ లో ఉన్న మెడికల్ షాప్ ఇంతియాజ్ కూడా లిఫ్ట్ దగ్గరకు వొచ్చాడు. వీళ్ళని చూస్తానే “మేడం. శ్రీనివాసుకి జ్వరం తగ్గిందా. ఇప్పుడు ఎలా ఉంది. మొన్నాడే కదా పెళ్ళి. వాట్సాప్ లో మీరు పెట్టిన కార్డు చూసాను అన్నాడు” “ఏం చెప్పమంటావు లే ఇంతియాజ్ అబ్బయ్యా.. డెంగ్యూ జ్వరానికి డెబ్బైఆరు రకాల టెస్టులు చేయించి, ఆరు రోజులు ఆసుపత్రిలో ఉండినదానికి మూడు లక్షలు బిల్లు వేశారు” ముఖం వేలాడుస్తూ అంది రేవతమ్మ. “అయ్యో..గట్లనా మేడం. ఆ జ్వరం మన అపార్ట్మెంట్ లో చాల మందికి వచ్చింది. కొందరు బయటి హాస్పిటల్స్ కి వెళ్లకుండా నా దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకున్నారు. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి సెలైన్ పెట్టాను. పది వేలు ఖర్చుతో వాళ్ళకి జ్వరం తగ్గిపోయింది” అన్నాడు. నిజమే ఇంతియాజ్. పిలగాడి పెళ్ళి పెట్టుకొని ఉండామని భయపడి పెద్ద ఆసుపత్రికి పొతే వాళ్ళు చుక్కలు చూపించారు. నీ మాట ఇనున్నా బాగుండేది. అయినా అదేదో సామెత చెప్పినట్లు “కాంచనం కర్మ విమోచనం” అని…చెప్తా ఉండాది రేవతమ్మ. లిఫ్ట్ తలుపు తెరుచుకుంది.
——The End—–
రోహిణి వంజారి
9000594630