విమల సాహితి ఎడిటోరియల్ 66 – అఖండ భారతం – అ’మృత’ భారతం

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం ” అఖండ భారతం- అ ‘ మృత ‘ భారతం ” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.

మూడు దిక్కులా నీటి వనరులు, నాలుగవ దిక్కున పర్వత కనుమలు మధ్యన వెలిసిన విశాలమైన ద్వీపకల్పం మన అఖండ భారతం. ఎన్నో ప్రాంతాలు. మరెన్నో కులాలు, మతాలు, సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు అనుసరించే ప్రజలతో, అపారమైన ప్రాకృతిక వనరులతో ఎన్నో శతాబ్దలుగా విలసిల్లుతూ, ఎందరో మహానుభావుల అమృత వాక్కులను, నైతికతను అనుసరిస్తూ, అనునిత్యం జనజీవన చైతన్యంతో తొణికిసలాడే భారత దేశం ఒకప్పుడు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో అరాచక శక్తుల విజృంభనతో నోరులేని వర్గాలు ముఖ్యంగా స్త్రీలు గజగజలాడే దేశంగా మారబోతోందా??

సకల జనుల సమ్మిళితం, బహు సంస్కృతుల సమ్మేళనం అనిపించుకున్న అఖండ భారతావనిలో ఇప్పుడు మనుషులను వేరు చేస్తూ అడ్డుగోడలు మొలుస్తున్నాయి. మనిషిని మనిషిగా గుర్తించే రోజులు పోయి, మనుషుల ముఖాల్లో మతాల ఛాయలు వెదికే పనిలో పడిపోయారు ప్రజలు. వారిని రెచ్చగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకునే అరాచక శక్తులు పెరిగిపోయాయి. మహిళలను దేవతలుగా చూడాలి, గౌరవించాలి అన్నచోటనే మహిళల పట్ల అకృత్యాలు పెరిగిపోయాయి. కుల ద్వేషం, మత ద్వేషం, ప్రాంతీయ ద్వేషం, పనికి రాని మూడాఛారాల రకరకాల ద్వేషాల తీవ్రతల తాకిడికి లుకలుకలాడుతోందిు నేటి అఖండ భారతం.

2018 వ సంవత్సరంలో తన కూతురు అమృత, దళిత కులానికి చెందిన ప్రణయ్ ని ప్రేమించి, తమ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకుందని అప్పటి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మారుతీరావు అనే వ్యాపార ప్రముఖుని కన్న కూతురు గర్భవతి అన్న కనికరం లేకుండా ఆమె భర్త ప్రణయ్ ని గుండాలను పెట్టి చంపించాడు. ఆనాదిగా జరుగుతున్న పరువు హత్యల జాబితాలో ఈ హత్య కూడా చేరింది. చట్టం మారుతీ రావుని శిక్షించింది. కన్న కూతురి బతుకుని చేతులారా బుగ్గిపాలు చేశాననే మానసిక వ్యధో, మరే కారణం చేతో మారుతీరావు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అంతస్తు, పరువు రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టాయి. అయితే ఇప్పుడు ఆ విషయం ఎందుకు మనకి అంటే, కాలం కొన్ని గాయాలను మాన్పుతుంది. తీరని వేదనలకు కూడా కాలం సమాధానం చెప్తుంది. నిరంతరం శోక సంద్రంలో దుఃఖితులై ఉంటే మనుషులు ఎప్పటికీ మాములు జీవన స్రవంతిలో కలవలేరు. ఫలితంగా మనిషి మానసిక రోగి అవుతాడు. అలా కాకుండా కాలం నెమ్మదిగా జ్ఞాపకాల గాయాలకు కొత్త పరిస్థితులు, సరికొత్త బంధాల మలాములు అద్దుతూ మనిషిని బతికిస్తుంది.

ప్రణయ్ హత్య జరిగి ఏళ్ళు గడుస్తున్నాయి. నిండా పాతికేళ్ళు లేని అమృత ఇప్పుడు బతుకు చేసిన గాయాన్ని తన భర్త ప్రతిరూపమైన కొడుకు సమక్షంలో మరపుకు తెచ్చుకుంటూ, తల్లి దగ్గరకు చేరింది. తన బిడ్డతో కాస్త సంతోషంగా ఉంది. తను చేసే దైనందిన పనులను సోషల్ మీడియాలో పెట్టుకుంటోంది సరదాగా. అది ఆమె చేసిన నేరం. ఇక ఆమె మీద బూతుల ట్రోలింగ్స్. ఇది మన అఖండ భారతంలో పురుష పుంగవులు మహిళలకు ఇచ్చే గౌరవం. ఇదే దేవతలు నడయాడే దివ్య భారత ఖండం. పసి వయసు అమ్మాయి భర్తని కోల్పోతే ఇందులో కన్న తండ్రే నేరస్తుడైన పరిస్థితిలో ఇక జీవితాంతం ఆమె తెల్ల గుడ్డలు కట్టుకుని, బోసి ముఖంతో, బోడి గుండుతో విధవరాలి వేషం వేసుకుని ఎవరి కంటా పడకుండా ఓ మూలన పడి ఏడుస్తూ ఉండాలని వీరి కోరికా? అలా ఉంటే ఈ సో కాల్డ్ సొసైటీ లో మనుషులకు ఆమె మీద జాలి కలుగుతుందా? అలా స్త్రీలు సమాజం చూపించే జాలితో జీవితాంతం బతకాలా?

ఔననే చెప్తున్నాయి సోషల్ మీడియాలో ఆమె మీద ట్రోలింగ్స్, బూతుల కామెంట్స్. ఇటీవల సినీనటి జయసుధ, ఆమె కుమారుడి ఫోటోని ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. ఇక ఆమె గురించి ట్రోలింగ్స్, సంకుచిత కామెంట్స్. హిందూ మతం నుంచి వెరే మతంలోకి మారడమే ఆమె చేసిన నేరం. భారత దేశం లౌకిక రాజ్యం. లింగ వివక్ష లేకుండా భారత దేశంలోని ప్రతి ఒక్కరూ వారి కులాన్ని ఇష్టమైన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించవచ్చు. నైతిక విలువలను పాటిస్తూ, స్వేచ్ఛగా బ్రతకవచ్చు. ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి, ఉన్నత ఉపాధి ఉద్యోగాలు పొందడానికి అర్హులే. సోషల్ మీడియాలో సామాజిక ప్రయోజనాల కంటే, వ్యక్తి దూషణ , వ్యక్తి పూజ, కుల, మతాల పిచ్చి, ద్వేషం ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి.

సమాజానికి దారి దీపాలవంటి సాహితీ కారులు కూడా ఇప్పుడు ప్రజలను చీకట్లో తోయాలని చూస్తున్నారు. మన మాతృభాషలో వచ్చే రచనలకంటే పర భాష రచనలను, రచయితలను నెత్తిన పెట్టుకునే వాళ్ళు,సాహిత్యంలో కూడా కులం, మతం, ప్రాంతం లాంటి అడ్డుగోడలు కట్టి, తమతమ కోటరీలలో తమ చుట్టూ చేరి భజన చేసే భజనకారులకు పట్టం కట్టడం , ఇతర మతాల రచయితలను దూరం పెట్టడం లాంటి చర్యలు చేస్తూ సాహితీ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు అనడం అతిశయోక్తి కాదు. ఎప్పుడో పండితులు రాసిన రచనలకు వక్ర భాష్యాలు కట్టడం, సాహిత్యం, చిత్రలేఖనం అంటే కూడా తెలియని వారు పండితుల చిత్రాలను, రచనలను విమర్శించడం, కథకు శైలి, శిల్పం ఎందుకు, బూతు మాటలతో కథని రక్తి కట్టించవచ్చు అనే నవ యువ రచయితల మాటలు, జెండాలు, దేవుడి బొమ్మలు ప్రొఫైల్ పెట్టుకుని ఇతరులను ట్రోల్ చేయడం, అశ్లీల కామెంట్స్ చేస్తూ, తాము మాత్రమే దేశ భక్తులమని చాటుకోవడం. అఖండ భారతం అంధకార భారతం అయ్యే రోజు అతి దగ్గరలోకి వస్తుందేమోనని విచారం. మారాలి. ప్రభువుల మనసులు మారాలి. మనుషుల ఆలోచనా సరళి మారాలి. మంచి మార్పు కోసం ప్రతి భారతీయ వ్యక్తి ముందడుగు వేయాలి. అభ్యుదయంతో, ఆదర్శభావాలతో కూడిన మన సంస్కార భారతం మన ముందు తిరిగి హిమనగమంత ఎత్తున నిలవాలి.

రోహిణి వంజారి

సంపాదకీయం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *