విమల సాహితి ఎడిటోరియల్ 65 – 150 మిల్లీగ్రాముల దౌర్భాగ్యం

150 మిల్లీగ్రాముల దౌర్భాగ్యం. ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.

ఏ చీకట్లలో కునారిల్లుతోంది దేశం? ఏ నికృష్టపు మృగనీడలు దేశాన్ని ఆవరించిఉన్నాయి? జరుగుతున్న సంఘటనలు తలచుకుంటుంటే రక్తం మరిగిపోతోంది. నిరాశ పెద్ద పాములా తలకు చుట్టుకుంటోంది. ఏమి చేయలేని నిస్సహాయత నిలువునా కూల్చేస్తోంది. భారత దేశం ప్రగతి పధంలో ఉంది. అభివృద్ధిని సాధించినది. సాంకేతికాభివృద్ధిలో ఎదురులేని విజేత అయింది. ఇవన్నీ ఉత్త మాటలు. దేశ ప్రగతి రోజురోజుకీ నైతికంగా పతనమవుతూ పాతాళానికి కూరుకుపోతోంది. భారత దేశంలో ఆడపిల్లగా పుట్టడం కన్నా అడవిలో చెట్టుగా పుట్టడం మేలనిపిస్తోంది.

నిర్భయ, దిశా సంఘటనలు జరిగి దేశాన్ని ఉల్లిక్కిపడేలా చేసాయి. నడిచే బస్సుల్లో, చీకటి రహదారుల్లో, పనిచేసే పొలాల్లో, పరిశ్రమల్లో, కొన్నిచోట్ల సొంత ఇంటిలోనే ఆడపిల్లలకు రక్షణ కరువవుతోంది. నిర్భయ సంఘటన జరిగి రెండు దశాబ్దాలు కావస్తున్నా, ప్రజల్లోనూ, పాలకుల్లోనూ, నేరస్తుల్లోనూ ఎటువంటి మార్పు రాలేదు. దేశంలోని ఆడబిడ్డల రక్షణ పట్ల అంతటా ఉదాసీన వైఖరి నల్లమబ్బులా అములుకోని ఉంది. దేశంలో లైంగిక నేరాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చట్టాలు, శిక్షలు సరిగా అమలుకాని దౌర్భాగ్యపు దేశం మనది. నేరం రుజువైన వెంటనే శిక్షలు అమలు జరపరు. తదుపరి విచారణలు అంటూ కాలయాపన చేస్తారు. నిందితులు కాస్త పలుగుబడిగలవారైతే ఇక వారికి అధికారుల అండదండలు. జైల్లోనే రాచమర్యాదలు. ఇక నేరస్తులకు భయం, పశ్చాతాపం ఎక్కడ ఉంటాయి?

మీడియాకి తెలిసి, జనం గగ్గోలు పెట్టె సంఘటనలు కొన్ని వెలుగులోకి వస్తే, అమాయక దళిత బిడ్డలమీద జరిగే అమానుష చర్యలకు అంతే ఉండదు. లైంగిక నేరం చేయడంతో సరిపెట్టుకోవడం లేదు నేరస్తులు. సాక్షాలు లేకుండా చేయడానికి అమాయక ఆడపిల్లల ప్రాణాలను కూడా తీస్తున్నారు. సాక్షాలు లేకుండా మాయం చేస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశాలు, కాలం మౌన సాక్షాలుగా రోధిస్తున్నాయి. కలకత్తా ట్రైనీ డాక్టర్ సంఘటన మరోసారి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎక్కడో మారుమూల పల్లెలో జరిగింది కాదు. దేశంలోని అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా ఉన్న కలకత్తాలో ఒక ప్రముఖ మెడికల్ కాలేజీలో డ్యూటీ డాక్టర్ పైన దారుణమైన లైంగిక నేరం జరిగింది. షరా మాములే అన్నట్లు కాలేజీ యాజమాన్యం జరిగిన సంఘటన పట్ల ఉదాసీన వైఖరి కనబరిచింది. కనీసం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో కూడా అలసత్వం చూపారు. నిందితుడు పోలీస్ డిపార్ట్మెంట్తో సంబంధం కలిగినవాడు. కనీసం నిందితుడి ముఖంలో చేసిన దారుణానికి కించిత్తు పశ్చాత్తాపం కానీ, భయం కానీ కనపడక పోగా “నేరం చేశాను. ఏ శిక్ష వేసుకుంటారో వేసుకోండి” అని నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా చెప్పాడంటే వాడి వెనుక ఎన్ని అరాచక శక్తులు వాడిని రక్షించడానికి పూనుకునివున్నాయో. అసలు ఈ దారుణ లైంగిక దాడి, హత్య వెనుక ఇంకెన్ని మృగ పన్నాగాలు ఉన్నాయో..? సిగ్గు సిగ్గు.

ఆడది గడప దాటితే చెడిపోతుంది. ఆడది వంటింటి కుందేలుగానే ఉండాలి. ఎక్కువ తినకూడదు. ఎక్కువ నవ్వకూడదు. ఇష్టమైనట్లు వస్త్రాలు ధరించకూడదు. ఉద్యోగం చేయకూడదు. ఒకవేళ చేసినా స్వేచ్ఛగా బ్రతకకూడదు. స్త్రీలకు జ్ఞానం, విద్య ఉండకూడదు. పురుషుడి అండదండలతోనే జీవితం గడపాలి. ఇటువంటి పురుషాహంకార భావజాలంతో దేశం మళ్ళీ తిరోగమిస్తూ పాతాళంలోకి కొట్టుకోబోతోంది. గురజాడ, వీరిశెలింగం పంతులు, రాజారామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే దంపతులు, డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ వంటి మహాత్ములు మరలా పుట్టి వచ్చినా ఈ నికృష్టపు సమాజాన్ని బాగుచేయలేరు. ఆడబిడ్డలకు దేశంలో రక్షణ లేదు అనేది ఘంటాపధంగా చెప్పవలసిన మాట ఇప్పుడు.

దేశం వెలిగిపోవడం లేదు. అవినీతి, దిగజారిన నైతిక విలువలతో అంధకారంలో మగ్గిపోతోంది. మద్యం, డ్రగ్స్, వాటిని మించి విచ్చలవిడిగా పోర్న్ చిత్రాలకు పోటీ పడుతూ వచ్చే యూ ట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్లు, రియాలిటీ షోలు, డబల్ మీనింగ్ మాటలతో చేస్తున్న చెత్త టీవీ షోలు. ఇవన్నీ యువత అరచేతుల్లో ఇప్పుడు. ఒక్క యువత అనే కాదు. వయసుడిగిన ముసలివాళ్ళు కూడా ఇటువంటివి చూసి, నేరాలు చేయడానికి వెనుకాడడం లేదు. నాలుగు గోడల మధ్య జరిగే లైంగిక చర్యలను, బాహాటంగా, యథేచ్ఛగా వెబ్ సిరీస్లలో చూపుతున్నారు. ఆడబిడ్డలు కూడా ఈ విషపు వల ఆకర్షణలకులోనై, పెడదారులు పట్టి, తమ బంగారు భవిష్యత్తును చేజాతుల నాశనం చేసుకుంటున్నారు.

అమ్మా ఆడబిడ్డలారా…! మీరు అడగవచ్చు. ‘తొమ్మిది నెలల పసికూనకు ఏమి ఒంపుసొంపులు ఉన్నాయని, మూడేళ్ళ పసిపిల్లకు ఎంత పెద్ద రోమ్ములున్నాయని నేరం చేస్తారు అని. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే. సినిమాల్లో, రియాలిటీ షోల్లో నటీమణులు అతి తక్కువ వస్త్రధారణతో షోలు చేసి, జనాలను వెర్రివాళ్లను చేస్తారు. షో ముగిసిన వెంటనే వారు బోలెడంతమంది సెక్యూరిటీ తో కార్లలో ఇంటికి వెళతారు. కానీ ఆ షోలని సెల్ ఫోన్లలో చూసిన కొన్ని మగ మృగాల ఆకలి తీరడానికి పసిపాపనా, ముసలామె అనికాదు. ఆ క్షణానికి ఎవరు అందుబాటులో దొరికితే వారి మీద లైంగిక దాడికి పాలబడుతున్నాయి.

ఈ సందర్భంలో తల్లిదండ్రులకు ఒక వినతి: మీ బిడ్డలు ఆడైనా, మగైనా పుట్టిన నాటినుండి ఇద్దరినీ సమానంగా పెంచండి. ఆడపిల్లల పట్ల వివక్ష చూపకండి. మీ మగబిడ్డలకు ఇతర స్త్రీలను గౌరవభావంతో చూడడం నేర్పించండి. నైతిక విలువలు నేర్పండి. “భారత దేశం నా మాతృభూమి. భారతీయులందరు నా సహోదరులు” ప్రతిజ్ఞ అర్ధాన్ని చిన్న నాడే మీ బిడ్డలకు విపులీకరించండి.

సాహితీకారులారా మీకు కూడా ఓ వినతి: స్త్రీల అంగాంగాలను వర్ణిస్తూ రాసిన కవితలు ఇక చాలు. ప్రేమ, శృంగార కావ్యాలు రాసింది ఇక చాలు. భావ కవిత్వం ఇక మాని, మన దేశ ఆడబిడ్డల అస్తిత్వం కోసం, వారి బంగారు భవితవ్యం కోసం రచనలు చేయండి. అగ్రకులం, దళిత కులం అంటూ ద్వేషం చూపకుండా అన్యాయం అయిపోయిన ఆడబిడ్డలకు బాసటగా నిలవడంలో, న్యాయం జరగడంలో వివక్ష చూపకుండా మీ కలాలకు పదును పెట్టి, మీ రచనలు పాలకుల హృదయాలను కదిలించేలా చూడండి.

ఆడబిడ్డలారా మీకు ఓ వినతి తల్లులు: ఏ అన్యాయపు కుట్రకు మీరు బలికావలసి వస్తుందో , ఏ మృగ పిశాచానికి ఏ క్షణంలో కామపు ముసలం పుడుతుందో, మీరు మాత్రం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. బాగా చదువుకోండి. అంతకంటే బాగా లోకజ్ఞానాన్ని తెలుసుకోండి. గొర్రె పిల్లలా, మేక పిల్లలా బెదిరిపోకండి. మీ చూపులోనే మగవారిని ఆమడ దూరంలో నిలబెట్టే విద్య నేర్చుకోండి. స్వీయ రక్షణ కోసం శారీరక దారుఢ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి.

లైంగికదాడి, హత్యకు గురై ప్రాణాలు కోల్పోయిన కలకత్తా ట్రైనీ డాక్టర్ మృతికి చింతిస్తూ..రక్తాశ్రు నివాళులు.

రోహిణి వంజారి

సంపాదకీయం