మిత్రులకు శుభోదయం. ఈవారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “పాద ధూళిలో ప్రాణాలు” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి
నలుగురిని ఒకచోట చేర్చి, నాలుగు మంచి మాటలు చెప్తే సమాజంలో ఓ మార్పుకి శ్రీకారం చుట్టవచ్చు. మంచైనా, చెడైనా వ్యాపించాలంటే మౌత్ పబ్లిసిటి ని మించిన సామాజిక వనరు మరొకటి లేదు. చెడుని కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే మనుషుల ఐక్యమత్యాన్ని నిర్వీర్యం చేసి, మనుషుల మధ్య చిచ్చు పెట్టే మానవ బాంబుల, మానవ శరాల దుష్ట సమావేశాలు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట రహస్యంగా జరుగుతూనే ఉంటాయి. అయితే మరి సత్సంగ్ అంటే ఏమిటి? ఎందుకు ఈ సమావేశాలు?
రాత్రి-పగలు, చీకటి-వెలుతురు లాగే ప్రతిమనిషి జీవితంలో సంతోషం-దుఃఖం ఒకదాని తర్వాత ఒకటి వచ్చి అతిథుల్లా పలకరించి వెళుతుంటాయి. కష్టాలు వచ్చినప్పుడు దుఃఖం, సుఖాలు కలిగినప్పుడు ఆనందం అనుభూతి చెందడం సాధారణ మానవుని నైజం. ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన. కోరినవెన్ని లభించినా, కొత్త పరిస్థితులవలన కొత్త కోరికలు కలిగి అవి నెరవేరనప్పుడు, ఉన్న కొద్ది సంతోషం కూడా పోగొట్టుకుని, దుఃఖంలో మునిగి, తమని ఈ బాధల నుంచి ఎవరు తప్పిస్తారా అని ఎదురు చూస్తూ, తమ భవిష్యత్తుని దర్శించుకోవడం కోసం జాతకాలు, జ్యోతిష్యాలు, అంజనాలు, మంత్రాలు, తంత్రాలు అంటూ పరుగులు తీస్తారు. వాస్తు దోషమని ఒకరు, రంగురాళ్ళు ధరించమని ఒకరు, పేరు మార్చుకోమని మరొకరు మనుషులను సుఖాల మత్తు కోసం తమ చుట్టూ తిప్పుకునే మాయగాళ్ళు కాక, నా దర్శనం చేసుకో, నా పాదధూళి రాసుకో నీ కోరికలన్నీ తీరుతాయి అని చెప్పి మనుషులను సర్వనాశనం చేసే దొంగ బాబాలు ఈ కాలంలో కోకొల్లలు. ఊరికొకరు, వీధికొకరు. అసలు వీరిని ఎందుకు ఆశ్రయించాలి?
ఎప్పుడో ప్రాచీన కాలంలో నమ్ముకున్న భక్తులను రక్షించిన కృష్ణుడు, మంచి నీటిని ద్రాక్ష రసంగా మార్చిన క్రీస్తు, తన స్పర్శ తో, తాను వాడిన నీటితో కుష్ఠు ఇతర వ్యాధులతో బాధ పడే వాళ్ళకు ఉపశమనం కలిగించిన షిర్డీ సాయిబాబా లాంటి వారి కొన్ని గాధలు మనం విని ఉన్నాం. వారు అపదల్లోనో, ఆకలి తీర్చడం కోసమో తమ శక్తిని వినియోగించారు కానీ, మనుషుల గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఎటువంటి చిల్లర మహిమలు చూపలేదు. ఆ కాలం గురించి కూడా కాసేపు పక్కన పెడదాం.
మనుషులు ఎవరి సుఖదుఃఖాలకు వారే బాధ్యులు అని మనకు ‘వివేకానందుడు’ చెప్పారు. మనిషికి తన శక్తి మీద తనకు నమ్మకం కోల్పోయినప్పుడు మాత్రమే ఇతరులను ఆశ్రయిస్తాడు. సుఖదుఃఖాలు మనోనిర్మితాలు. ఏది జరిగినా సహనం కోల్పోకుండా, ఓపికతో, ఓరిమితో ఎదురుచూస్తూ తన ప్రయత్న లోపం లేకుండా కృషి చూస్తూ ఉంటే, కష్టం – సుఖం ఏది మనిషిని చలింపచేయలేదు. గాలిలో దీపం పెట్టి చేతులు అడ్డుపెట్టకుండా, దీపం ఆరిపోకూడదు అనుకోవడం మూర్ఖత్వం.
పాత రోజుల్లో పదిమందిని ఒకచోట చేర్చి ఓ గుడిలోనో, బడిలోనో హరికథల ద్వారా నాలుగు మంచి మాటలు చెప్పేవారు. సామూహికంగా ప్రార్ధనలు చేసి, దైవానికి తమ చేరువ కావాలని చర్చిలోనో, మసీదు లోనో గురుద్వారా లోనో నలుగురు ఒకచోట చేరడం మనకి తెలుసు. కానీ ఆశ్రమాలు, మహిమలు అంటూ అనేకులైన దొంగ బాబాలు కోరికలు తీర్చుతామని మనుషులను మభ్యపెట్టి, వారి నుంచి డబ్బులు దండుకుని తమ పబ్బం గడుపుకునే వారు తయారైపోతున్నారు. కొన్నేళ్ళ క్రితం నెల్లూరు జిల్లా వరదయ్య పాళెంలో జనాలనుంచి వేలు, లక్షల సొమ్ములు దండుకుని, కోట్లు ఖర్చు పెట్టి స్వర్ణదేవాలం అని ఓ ఆశ్రమమం కట్టాడు ‘కల్కి’ అనే ఓ దొంగ బాబా. జనాలకు దర్శనానికి అనుమతి ఇవ్వడంతో ఆ ఆశ్రమంలోకి ఒక్కసారిగా వేలమంది జనాలు ఆ దొంగ బాబాని చూడడానికి వెళ్ళి, తోసుకుని, తొక్కుకుని, ఊపిరాడక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగింది. ఆ తర్వాత ఆ దొంగ బాబా అసలు రూపం బయట పడింది. ఆ తర్వాత మహిమలు చూపిస్తామని, సంతానం ప్రసాదిస్తామని వెర్రి మహిళా భక్తులను ఆకట్టుకుని, ఆనక వారిపై లైంగిక దాడి జరిపే ‘డేరా బాబాలు’ మన దేశంలో కోకొల్లలు. ఇదిగో ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లో వందల మంది ప్రాణాలు బలికొన్న భోలే బాబా ఒకడు.
ఐదు వేల మందికి సరిపోయే చోట, యాభై వేల మంది కూడితే, తొక్కిసలాట, ఉక్కపోత, ఊపిరాడకపోవడం, ప్రాణాలు కోల్పోవడం కాకా ఇంకేం అద్భుతాలు జరుగుతాయి. ఎంత గొప్ప బాబా అయినా మనిషి జీవితాన్ని మార్చలేడు. బాబాల పాద ధూళి ఒక్కరోజులో మనిషిని కోటీశ్వరుడ్ని చేయదు. ఒక్క రోజులో సమస్యలు మొత్తం తీరిపోవు. మూఢ భక్తి, వెర్రి భక్తి, వ్యక్తి పూజ మానుకుని మనుషులు తమని తాము సంరక్షించుకోవడానికి ఇతర శక్తులు, వ్యక్తుల మీద కాక తమ శక్తి మీద తాము నమ్మకం కలిగి జీవించాలి.
నిజంగా తమకు ఏదైనా కష్టం ఉంటే, ఏకాంతంలో కూర్చుని, మనసుని దైవత్వం వైపు మరల్చి, ధ్యానం చేస్తే, తమ కష్టాన్ని విన్నవించుకుంటే, తప్పకుండా మనిషి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలా కాకుండా, గొంతెమ్మ కోరికలతో దొంగ బాబాల దర్శనం, పాద ధూళి కోసం ఎగబడితే ప్రాణాలు కోల్పోవడం, అంతులేని దుఃఖం తప్ప ఇంక ఏం మిగలదు.
అసలు ఇటువంటి దొంగబాబాలకు ప్రభుత్వ అనుమతులు, అండదండలు ఎలా లభిస్తాయో తల్చుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్రమాలకు, సామూహిక కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలియక పోవడం పూర్తిగా పాలకుల నిర్లక్ష్యం. ప్రజారక్షణ అంటే చిన్న చూపు. ఇటువంటి తరుణంలో అల్ట్రా మోడరన్ యుగంలో, ఆధునిక సాంకేతిక సదుపాయాల మధ్య మనుషులు జీవనం సాగిస్తున్న ఈ కాలంలో మనుషులు మూఢ భక్తి, గొర్రె దాటు భక్తి, మానుకోవాలి.
ఇది కలియుగం. ఇక్కడ దేవుళ్ళు ఎవరూ లేరు. మంత్రాలకు చింతకాయలు ఎవరూ రాల్చలేరు. గాలిలో నుంచి, ధూళిలో నుంచి అద్భుతాలు సృష్టించలేరు. దైవాంశ సంభూతులు అని చెప్పుకునే దొంగ బాబాలకు భార్య, పిల్లలు ఉంటారు. వారు చాల వరకు సంసారులే. లక్షల మంది మూఢ భక్తులు ఇచ్చిన సొమ్ముతో వాళ్ళు విలాసవంతమైన జీవితం గడుపుతూ, నీ కష్టాలకు నేను భరోసా, నీకు నేను కైవల్యాన్ని ఇస్తాను అనడం హాస్యాస్పదం. నిజంగా అంత మహిమలు ఉంటే మనుషుల మధ్య యుద్దాలు, ద్వేషాలు లేకుండా నివారించవచ్చు కదా. గాజా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్క పసిబిడ్డను తిరిగి బతికించమనండి. ఇప్పుడు భోలే బాబా తన మహిమతో చనిపోయిన వారిని తిరిగి బతికించమనండి. నిజంగా దేవుడు దిగి వచ్చాడు అని అందరం మొక్కుదాం. అజ్ఞానాన్ని విడనాడాలి. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తూ, వెనకేసుకొస్తున్న పాలకులను ప్రశ్నించాలి. మంత్రాలకు, మహిమలకు ఏ చింతకాయలు రాలవని తెలుసుకుని, మూఢ భక్తిని విడనాడి విచక్షణతో ఆలోచించాలి. గాలి, ధూళి అంటూ ఇతరుల పై ఆధారపడడం కాదు. మనిషి తన మనసుని తాను జయించడానికి ప్రయత్నం చేయాలి.
ఉత్తర ప్రదేశ్ లో భోలే బాబా సత్సంగ్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి అశ్రునివాళులతో..
రోహిణి వంజారి
సంపాదకీయం