విమల సాహితి ఎడిటోరియల్ 52 – బొడ్డు తాడు

బొడ్డు తాడు తెగకుంటే ఏమౌతుంది? ఈనాటి విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “బొడ్డు తాడు” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🙏

ఎప్పుడో చాల చిన్నప్పుడు ఆవు, పులి కథ విన్నాం మనందరం. మంద నుంచి తప్పిపోయిన ఆవు పులి కంట పడుతుంది. పులి అవును చంపి తింటానని బెదిరిస్తుంది. ప్రాణభయంతో వణికిపోయింది ఆవు. అయితే అంత భయంలో కూడా ఆవుకి తన బిడ్డ లేగ దూడ గుర్తుకు వస్తుంది. బిడ్డకు పాలిచ్చివస్తానని పులిని బతిమిలాడుకుని వెళ్ళి తన కన్నబిడ్డకు కడుపునిండా పాలు ఇచ్చి, పశువుల మందలోనే కలిసి ఉండమని, ఒంటరిగా తిరగద్దని, ఎన్నో జాగ్రత్తలు తన లేగదూడకి చెప్పి, తర్వాత నిజాయితీగా పులి దగ్గరకు వస్తుంది. ఆవు నిజాయితీకి మెచ్చి పులి దాన్ని చంపకుండా వదిలేస్తుంది. ఈ కథలో ఆవు నిజాయితీతో పాటు మనం గ్రహించాల్సిన మరో గొప్ప విషయం ఒకటి ఉంది. అది మాతృ వాత్సల్యం. తన ప్రాణాపాయ స్థితిలో కూడా అవుకు దాని బిడ్డ గుర్తుకు వచ్చింది. బిడ్డ ఆకలి గుర్తుకు వచ్చింది. అది అమ్మ గొప్పతనం. ఏ కొలతలకు అందనిది , ఏ తులాభారానికి సరితూగనిది ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే.
ప్రపంచంలో ఏ మత గ్రంథంని చూసినా మాతృమూర్తికి ఇచ్చిన స్థానం అగ్రభాగానే ఉంటుంది. లోకంలో అత్యంత గౌరవంగా చూడాల్సినది ఎవరిని అనే ప్రశ్న వస్తే, కన్నతల్లిని అని ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ చెప్తుంది. ఇక రాజాజ్ఞ కన్నా కన్నతల్లి ప్రేమ గొప్పదని చాటి చెప్పిన గొప్ప స్త్రీ మూర్తి యోకెబెదు. ఐగుప్తు రాజు ఫరో హెబ్రీ మగబిడ్డలను చంపి నదిలో పార వేయబడాలని ఆజ్ఞాపించినప్పుడు, మోషే తల్లి యోకెబెదు భయపడలేదు. రాజాజ్ఞను ఎదిరించి ఆ తల్లి మూడు నెలలు ఆ బాలుని దాచింది. తర్వాత తన బిడ్డను ఫరో కుమార్తె సంరక్షణలో ఉండేటట్లు యుక్తిగా ఆమెకు అప్పగించబడేటట్లు చేసిందని బైబిల్లో మాతృమూర్తి గొప్పదనం గురించి ప్రస్తావన ఉంది.
దేవకీ దేవి, వసుదేవులకు పుట్టే బిడ్డ వల్ల తనకు ప్రాణగండం ఉందని, వారిని కారాగారంలో బంధిస్తాడు కంసుడు. దేవకీ దేవికి కృష్ణుడు పుట్టిన వెంటనే, బిడ్డ మీద ఉన్న మమకారాన్ని మనసులో దాచుకుని, బిడ్డ క్షేమంగా ఉండాలని తలచి, చిన్ని కృష్ణుడిని కన్నవెంటనే యశోద సంరక్షణలోకి పంపుతుంది దేవకీదేవి. భాగవతంలో కన్న తల్లి గొప్పదనాన్ని తెలియచేసే ఉత్కృష్టమైన సంఘటన ఇది.
ఒకసారి చరిత్రను పరిశీలిస్తే, క్షత్రియ మరాఠా రాజు శివాజీని అత్యంత ధైర్యసాహసాలు గల యోధునిగా తీర్చి దిద్దడంలో అతని కన్న తల్లి జిజియా బాయిది అతి ముఖ్యమైన పాత్రఉంది. ఇలా కన్న బిడ్డను ప్రేమించేవారు, బిడ్డ నడవడికను తీర్చిదిద్దేవారు, క్రమశిక్షణతో పెంచేవారు కన్నతల్లిని మించి మరొకరు ఉండరనేది రూఢీ అయిన సత్యం.
ఈనాడు ఈ ఆధునిక యుగంలో మనదేశంలో కన్న తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇది. అసలు నేను, ఇది నా దేహం. ఇది నా మనసు. అంతా నేనే. అంతా నా కోసమే అనుకుంటూ ఉంటాం. మరి ఈ నేను అనేది ఎక్కడ నుంచి వచ్చింది? ఈ దేహం నీకు ఎవరు ఇచ్చినది?
తెల్లటి తన గర్భ ద్రవాన్ని ఎర్రటి నెత్తుటి ముద్దని చేసి, అది దినదినప్రవర్ధమానం చెందుతూ ఉంటే, అనుక్షణం సంతసిస్తూ, నెత్తుటిముద్దకు అవయవాలు, మనసు, బుద్ధి, జ్ఞానం అన్నిటినీ తన గర్భాశయంలోనే ఏర్పరచి, పరిపూర్ణ మనిషిగా ఈ లోకంలోకి తీసుకువస్తుంది కన్న తల్లి. నవమాసాలు మోసి, తనకు ప్రాణగండం ఉంది, ప్రసవం అంటే చచ్చి, బ్రతకడం అని తెలిసి కూడా ప్రసవ వేదనని అనుభవించి, బిడ్డకు జన్మనిస్తుంది మాతృమూర్తి. పుట్టిన తర్వాత కూడా తల్లిని అంటిపెట్టుకునే ఉంటుంది బిడ్డ దేహం. బొడ్డు తాడు తెంపకపోతే, ఆ తల్లినే అంటిపెట్టుకుని వేలాడాల్సిందే ఎంత కాలమైనా. బొడ్డు తాడు తెంపి, లోకానికి బిడ్డను పరిచయం చేస్తుంది తల్లి. బొడ్డుతాడు తెగినా, పేగు బంధాన్ని మాత్రం జీవితాంతం మోస్తుంది కన్నతల్లి. కాబట్టి దేహం అంటే అది నీది, నాది కాదు. అది కన్న తల్లి బిడ్డకు పెట్టిన జీవ బిక్ష. బాలింత నొప్పులు సలపరిస్తున్నా, బిడ్డ మలమూత్రాలు ఎత్తిపోస్తుంది ఇష్టంగా. ఇంకెవరు బిడ్డకు చేయలేని సేవలు చేస్తుంది తల్లి. అమ్మ అని పిలిస్తే చాలు తననితాను మరచి, పరవశిస్తుంది. అందుకే కన్న తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది అంటారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తుంది కన్న తల్లి. రాజైనా, పేదైనా, ఎంత గొప్పవాడైనా ఓ తల్లికి బిడ్డే. “సృష్టి కర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించింది ఒక అమ్మ” అనే అద్భుతమైన మాటని అంటారు ఓ సినీ కవి. అమ్మ ప్రేమను, అమ్మ త్యాగాన్ని వివరించడానికి ఈ లోకంలో సరితూగేది ఏది లేదు. అటువంటి తల్లిని గుర్తుచేసుకోవడానికి లేదా ఆ మాతృమూర్తిని కొనియాడడానికి, సంతోషపెట్టడానికి ఒకరోజు కావాలి అనుకోవడం మూర్ఖత్వం.
కన్నవాళ్ళు బతికి ఉన్నపుడు పట్టించుకోకుండా, డబ్బు మాయలోపడి విదేశాలకు వెళ్లడమో, లేదంటే ముసలి తల్లిదండ్రుల ఆలనాపాలనా భారమనో శక్తి ఉడిగి పండుటాకులవంటి తల్లిదండ్రులను వృద్దాశ్రమాల్లోనో, నడిరోడ్డుమీదో వదిలివేసి వెళ్ళే చాలామందిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈనాడు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వృద్ధాశ్రమానికి వెళ్ళి మాతృదినోత్సవం అనో, పుట్టిన రోజనో ఇంత పెద్ద కేకు తీసుకువెళ్లి కట్ చేసి, కొవ్వొత్తులను ఆర్పివేయడమో చేయిస్తారు. ఇంకొందరు తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు వారిని అనాథలను చేసి, ఒంటరివారిని చేసి, వారు చనిపోయాక, గొప్పల కోసం భారీ ఎత్తున కర్మకాండలు చేస్తారు. బతికి ఉండగా రెండు ముద్దలు ప్రేమగా పెట్టలేని బిడ్డలు, తల్లిదండ్రులు చనిపోయాక కర్మకాండలు చేస్తే ఏమి? చేయకపోతే ఏమి? బతికి ఉండగానే తిండి సరిగా పెట్టక, వారి పోషణ భారం అనుకుంటూ నరకాన్ని చూపించే బిడ్డలు, చనిపోయాక తల్లిదండ్రులు ఉత్తమ గతులు పొందాలని ప్రార్ధనలు చేస్తే ఏమి ఒరుగుతుంది ?
తనదేహాన్ని, ప్రాణాన్ని బిడ్డలకొరకు ధారపోసి, బిడ్డల సంతోషమే తన సంతోషంగా ఎన్నో సుఖాలు వదులుకుని, మరెన్నో త్యాగాలు చేసే పిచ్చి తల్లులు బిడ్డల నుంచి కోరుకునేది వారి ఆదరణే. ఆ మాతృమూర్తి కోసం పెద్ద పెద్ద త్యాగాలు చేయబల్లేదు. ధనరాశులను కుప్పపోయబల్లేదు. కన్నవాళ్ళ సంతోషంకోసం ఎటువంటి త్యాగం చేయబల్లేదు. రోజులో కనీసం ఒక్క ఐదు నిముషాలైనా తల్లి చెంత కూర్చుని, ఆప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడితే చాలు. “తిన్నావా అమ్మ” అని అడిగితే చాలు. ఆ తల్లి ఎంత మురిసిపోతుందో. ముసురుకుంటున్న వృద్ధాప్యాన్ని కూడా బిడ్డల ప్రేమతో ఎదుర్కొంటుంది పిచ్చి తల్లి. తల్లికి తగిన బిడ్డలుగా ఉండాలి మనం. తల్లిదండ్రులు చూపిన బాటలో నడిచి, వారికి ప్రేమాభిమానాలను సంపూర్ణంగా అందించి, ఈలోకంలోనే, ఇక్కడే వారు స్వర్గలోకాన్ని [ సంతోషాన్ని] చూడగలిగే బాధ్యత ప్రతి కన్న బిడ్డకు ఉండి తీరాలి. లోకంలోని పిచ్చి తల్లులందరికి ప్రేమాభివందనాలు.
‘మే’ నెల 12 న మాతృదినోత్సవం సందర్భంగా ఈ వ్యాసం మాతృమూర్తులందరికి అంకితం.


రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630