విమల సాహితి ఎడిటోరియల్ 26 – అన్యత్వ – అనన్య

ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “అన్యత్వ-అనన్య” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹

మానవ జాతి ఏర్పడడానికి లక్షల సంవత్సరాల ముందు ఈ విశ్వంలో ముందుగా జలావరణాలు ఏర్పడ్డాయి. మొట్టమొదటిసారిగా సముద్ర జలాల్లో ఎమినో ఆమ్లాల రూపంలో జీవం పుట్టుకకి అంకురార్పణ జరిగింది. భూవాతావరం జీవనానికి అనుకూలించడం ప్రారంభమైనాక కొన్ని వేల సంవత్సరాలు గడిచాక ఎన్నో జీవులు ఏర్పడి, కొంతకాలం జీవించి , ప్రకృతిలోని అసమతుల్య వాతావరణాలవల్ల ఎన్నో వందలు,వేలు జీవులు నశించిపోయాయి. డైనోసార్లు అనబడే రాక్షస బల్లులు, కొన్ని రకాల జంతువులు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ తర్వాత ఏప్ లు అనబడే చింపాంజీల వంటి జీవుల నుంచి ఎన్నో సంవత్సరాలు పరిణామం చెంది, నాలుగు కాళ్ళ మీద నడిచే జీవులనుంచి, రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడే మనిషి [హోమోసెపియాన్] గా పరివర్తన చెందాడని మనకు తెలుసు.

ఆ మొట్టమొదటి ఆదిమానవులకు మతం లేదు. అసలు తాము మనుషులమనే విజ్ఞత కూడా లేదు. క్రూర మృగాలతో పాటు సహజీవనం చేస్తూ, ఆకలికి వేటాడుతూ, జంతువులను చంపి పచ్చిమాంసం తింటూ, ఎండ, వాన , చలి లాంటి ప్రకృతి శక్తులనుంచి తమని తాము రక్షించుకోవడానికి, చెట్ల బోదెలు, ఆకులు, అలమలతో దేహాన్ని దాచుకునే మృగం లాంటి ఆదిమజాతి మనుషుల నుంచి నేటి ఆధునిక మానవుని దాకా మనిషిని పురోగాభివృద్దిగావించింది నిస్సందేహంగా మానవుని యొక్క మేధా శక్తే. అదే మనిషిని జంతువుల నుంచి వేరుచేసి, జీవన చక్రంలో, ఆహారపు గొలుసులో మనిషిని అత్యున్నత శిఖరం మీద నిలబెట్టింది.

అయితే ఆదిమ మానవుడికి ఏ మతము లేదు. మానవత్వము లేదు. ఆహారంకోసం వేట, తన స్వార్ధ జీవనమే. ఆధునిక మానవునిగా మనిషి పరిణామం చెందాక, విచ్చలవిడి జీవితానికి బానిసై, సమస్త రోగాలు, జాడ్యాలు చుట్టుముట్టాక మానవ జాతిని పరిరక్షించడానికి నైతిక విలువలను బోధిస్తూ వివిధ ప్రాంతాలనుంచి ఎందరో మహానుభావులు ఎన్నో నీతి ప్రబోధకాలు చేసి, మానవుడిని సన్మార్గం వైపు, ధర్మాచరణ దిశగా పయనింపచేయడానికి వారందరు తమ శక్తి యుక్తులు ధారబోసారు. ఎన్నో త్యాగాలు చేసారు. క్రీస్తు ప్రభువు, మహమ్మద్ ప్రవక్త, ఆది శంకరాచార్య, గౌతమ బుద్ధుడు, మహావీరుడు, షిర్డీ సాయిబాబా వంటి అవధూతలు మనుషులకు జ్ఞాన మార్గాన్ని ప్రభోదించారు. వారందరు రూపంలో వేరువేరు అయినా, వారందరి ఆత్మ ఒకటే.

ఏ మతము ఇతరులను హింసించమని బోధించలేదు. పైకి కనపడే ఆహార్యం, తినే ఆహారము, మాట్లాడే భాష,నివసించే ప్రాంతం వేరైనంత మాత్రాన మనుషులంతా ఒకటే అనే ఏకీభావన సూత్రాన్ని మరచి కుల, మత ద్వేషాలతో ఒకరినొకరు చంపుకుంటూ పొతే, ఇక మానవ జాతి అంతరించిపోవడానికి ఎంతో దూరం లేదు. ఈనాటి మానవుడు ఎంతో మేధా శక్తిని ఉపయోగించి కొండలు పిండి చేస్తున్నాడు, సముద్రపు లోతుకు వెళుతున్నాడు. చంద్రమండలం పైన కాలు మోపుతున్నాడు, కానీ తోటి మనిషి పట్ల మాత్రం ద్వేషాన్ని జయించలేకపోతున్నాడు. ప్రేమతో తాధ్యాత్మీకరణ చెందలేకపోతున్నాడు. మహనీయుల నీతి ప్రబోధకాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. హింస పెచ్చుమీరి యుద్ధాలకు దిగుతున్నాడు. శవాల గుట్టల మీద మతపు మత్తు మందుని చల్లి వికృతంగా కరాళ నృత్యం చేస్తున్నాడు.

మతమా! మానవత్వమా! అనే ప్రశ్న ఉదయించినప్పుడు మతాన్ని పక్కకు పెట్టి మానవత్వం పరిఢవిల్లినటువంటి ఎన్నో సందర్భాలు మన దేశచరిత్రలో కనిపిస్తాయి. ప్రపంచంలో మతసామరస్యానికి చక్కని ఉదాహరణ భారతదేశం అని బౌద్ధ మత గురువు దలైలామా అనేక అంతర్జాతీయ సమావేశాలలో నొక్కి వక్కాణించారు. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ఉగ్రవాద సంస్థలు, మత సంస్థలు, మతతత్వ పార్టీలు, వారి వారి అస్తిత్వం కొరకు, వ్యక్తిగత స్వార్థం కొరకు ప్రశాంతంగా ఉన్న ప్రజాజీవనంలో అల్లకల్లోలం సృష్టిస్తూ పదేపదే ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం కడుక్కోవాలని చూస్తున్నాయి. ప్రజలను విడగొట్టి పాలించిన వారు బ్రిటిష్ వారని అంటుంటాం గానీ ప్రజలను వివిధ విభాగాలుగా విభజించి ఒకరిని ఒకరు కలవకుండా మధ్యలో అడ్డుగోడలు సృష్టించి పబ్బం గడుపుకునే వారు అనేకులు మన మధ్యలోనే ఉన్నారు. ప్రజలు ఈ ప్రమాదకర ఉచ్చులో చిక్కుకోకుండా అప్రమత్తతతో మెలగాలి.

మళ్ళీ మహనీయులందరు ఈ భూమిమీద పురుడుపోసుకుని అవతరించాల్సిన సమయం ఆసన్నమైంది. లేకుంటే వినాశనం తప్పదు. మతం కన్నా మానవత్వమే నిస్సందేహంగా గొప్పది. మతాన్ని రూపుమాపి మానవత్వాన్ని బతికించాల్సిన భాద్యత ప్రతిఒక్కరికీ ఉంది. నువ్వు నేను వేరువేరు అనే అన్యత్వ భావన నుంచి మనమంతా ఒకటే అనే అనన్య భావన వైపు ప్రతిఒక్కరు పురోగమనం సాగించాలి.

“మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” అన్న మన గురజాడ వారి మాట మనుషులందరికి వజ్ర కవచం కావాలని కోరుకుంటూ..

రోహిణి వంజారి

సంపాదకీయం

9000594630