విమల సాహితి ఎడిటోరియల్ 22 – చిన్నారి బాలల నవ్వుల పువ్వులు – నట్టింట మెరిసే దీపావళి వెలుగులు

మిత్రులకు బాలల దినోత్సవ శుభాకాంక్షల 🌹🌹. ఈవారం విమల సాహితీ పత్రిక సంపాదకీయం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి🌹🌹

నవంబర్ అనగానే మనకి టక్కున గుర్తుకు వచ్చే పండుగలు రెండు. ఒకటి దీపావళి, ఇంకొకటి జాతీయ బాలల దినోత్సవం. అయితే పండుగల పరమార్ధం ఏమిటి? అసలు పండుగలు ఎందుకు జరుపుకోవాలి? ఒక పక్క నిరుపేదలు తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతుంటే, మరొక పక్క పండుగ పేరుతో పరమాన్నాలు తింటూ, విలాసాలకు డబ్బు దుబారా చేయడమేనా పండగ పరమార్ధం? గాజా యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోయిన పసికందుల ఆర్తనాదాలు, రోదనలు ఇంకా మనసున్న ప్రతిమనిషి హృదయాన్ని మెలిపెడుతూనే ఉన్నాయి. ఇంతలోనే బాలల దినోత్సవం వచ్చేసింది.

నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నవంబర్ 20, 1954 న, “పువ్వుల టోకెన్ల” విక్రయం ద్వారా పిల్లలకోసం ఐక్యరాజ్యసమితి అప్పీల్ కోసం నిధులను సేకరించడానికి “ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ వారి పూర్వీకుల చేత మొదటి బాలల దినోత్సవాన్ని “ఫ్లవర్ డే” గా పాటించారు. మన దేశంలో స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్భంగా, ప్రతి సంవత్సరం నవంబర్ 14 న బాలల దినోత్సవంను జరుపుకుంటున్నాం. ఎందుకంటే, నెహ్రు గారికి పిల్లలంటే అమితమైన ప్రేమ, వాత్సల్యాలు ఉండడం వల్ల బాలబాలికల సర్వతోముఖాభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేసారని మనకి తెలుసు. అయితే మనదేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడుస్తున్నా, బాలల సర్వతోముఖాభివృద్ధి సంపూర్ణంగా జరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం “లేదు” అని మనకందరికీ తెలుసు.

అసలు బాలలు అంటే ఎవరు?

ప్రతిమనిషి జీవితంలో బాల్యదశ ఉంటుంది. ఆ దశను దాటాకే మనుషులు పరిపూర్ణమైన పౌరులుగా మారుతారు. అయితే బాల్యం అనేది ప్రతి ఒక్కరికీ అపురూపం. అభం శుభం తెలియని పసి మనసులు ఉద్యానవనంలో అప్పుడే వికసించి పరిమళించాల్సిన పువ్వులు. అయితే ఎన్ని పువ్వులు వికసించకుండా మొగ్గ దశలోనే రాలిపోతున్నాయో మనకు తెలుసు. బాలల ఆనందం కోసమే కాకుండా వారి రక్షణ కోసం ఎన్నో హక్కులు, చట్టాలు రూపొందించబడ్డాయి. అక్షరాస్యత ప్రతి ఒక్కరి హక్కు. పసిపిల్లలను చదువుకి దూరం చేసి వారిచేత కూలిపనులు చేయించడం చట్ట రీత్యా నేరం. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ప్రభుత్వం చట్టాలను రూపొందించింది. అలాగే పసి బిడ్డలపై జరిగే లైంగిక దాడులు, హింస కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి.

“మొక్కై వంగనిదే..మ్రానై వంగునా” అనే నానుడి మనకు తెలుసు. పసి హృదయాలు మైనపు ముద్ద లాంటివి. ఎటు వంచితే అటు వంగుతాయి. నీరులాంటివి. నీటిని ఏపాత్రలో పోస్తే ఆ ఆకారం సంతరించుకున్నట్లు పసి వయసులో ఏది నేర్చుకుంటే అలా వారి భావిజీవితంలో మలచబడతారు. చదువు, సంస్కారం, వినయవిధేయతలు, నైతిక విలువలు మొదట ఇంట్లో తల్లిదండ్రులే బిడ్డలకు నేర్పించాలి. పసివాళ్లుచదువుకోవడానికి, ఆడుకోవడానికి, నచ్చిన క్రీడలు, లలితకళలు నేర్చుకోవడానికి ఇటు ఇంట్లో, అటు స్కూల్లో పిల్లలకు తగినంత స్వేచ్ఛ ఇవ్వాలి. పసి పిల్లలను సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంచితే అంత మంచిది. ఇందుకోసం పేరెంట్స్ తమ అహాలను పక్కన పెట్టాలి.

పిల్లలకు మంచి డ్రెస్సులు కొనిస్తున్నాం, పాకెట్ మనీ ఇస్తున్నాం అని కాకుండా రోజులో అర్ధ గంట అయినా పసివారితో కలిసి వారు చెప్పే కమ్మని ముచ్చట్లు వినాలి. వారితో ఆడుకోవాలి. తగిన సూచనలు ఇవ్వాలి. అప్పుడే వికసించిన పుష్పాల్లాంటి ఆ పసి వారు మానవత్వపు మంచి గంధ పరిమళాలను పలువురికీ పంచిపెట్టగలరు. ఎందుకంటే “నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు” అని మనకందరకూ తెలుసు కదా. ఎప్పుడో ఏడాదికి ఒకసారి “చిల్డ్రన్స్ డే” అని స్కూల్లో ఏవో నాలుగు పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వడం కాదు. ఆ పసి బాలల హక్కులను, స్వేఛ్చను కాలరాయకుండా వారి బాల్యదశను ఆట, పాటలతో, ఇష్టమైన వ్యాపకాలతో, చక్కని విజ్ఞానం నేర్చుకుంటూ ఆనందంగా అనుభవిస్తూ, స్వేఛ్చగా వారు ఎదిగేలా చూడడమే మన గురుతరకర్తవ్యమ్. అప్పుడే బాలల దినోత్సవాలకు విలువ ఉండేది. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించే స్వేఛ్చను ఇవ్వాలి. బాలల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టడం ఈ చిల్డ్రన్స్ డే ప్రధాన లక్ష్యం.

ఇక దీపావళి అంటే దీపాల వరుస. దీపం అంటే వెలుగును పంచేది. చీకటిని పారద్రోలేది. లోక కంఠకుడైన నరకాసురుడిని అమ్మవారు సంహరించిన దినానికి గుర్తుగా, అంటే లోకంలో ఉండే చెడుని నిర్ములించి, మంచిని పెంచడం స్థూలంగా చెడుతో యుద్ధం చేసి గెలుపొందడం. భాధాస్తప్తమై చీకట్లు అములుకున్న జీవితాల్లో వెలుగులు నింపడానికి నరకచతుర్దశి నరకుని లక్ష్మి దేవి సంహరించిన రోజు తర్వాతి రోజు పిల్లలు, పెద్దలు ఆనందంగా దీపాలు వెలిగించి, రంగురంగుల టపాసులు కలుస్తూ, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి.

అయితే ఇప్పుడు, ఈ భూలోకంలో మానవరూపంలో తిరిగే నరకాసులు చాల మంది మన మధ్యనే ఉన్నారు. వారిని కనిపెట్టి ప్రతి ఒక్క మనిషి ఓ శక్తిగా, ఓ ఆయుధంగా మారి ఆ నరకాసురుల అంతం చూడాలి. అట్లే మనుషుల మనసుల్లో కూడా కులం, మతం, అసూయ, ద్వేషం, అహం, అధికార దాహం, ఆక్రమిత కాంక్ష, హింస లాంటి నరకాసురుని మించిన రాక్షసులు ఉన్నారు. ప్రేమ, జాలి, కరుణ, సేవ అనే ఆయుధాలను వాడి ఎవరి మనసులో ఉన్న రాక్షసులను వారు సంహరించుకోవాలి. హృదయపు గదుల నిండా ప్రేమ దీపాలు వెలిగించుకున్ననాడు మనకు ప్రతి రోజు దీపావళి పండుగే అవుతుంది.

పదుగురి సౌఖ్యం పండే దినమే నిజమైన పండుగ దినం కదా. విమల సాహితి పాఠకులకు దీపావళి, బాలల దినోత్సవ శుభాకాంక్షలతో..

రోహిణి వంజారి

9000594630

సంపాదకీయం