విమల సాహితి ఎడిటోరియల్ 19 – ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం.

“ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం” ఈ వారం విమల సాహితీ పత్రికలో నేను రాసిన ఎడిటోరియల్ వ్యాసం. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపండి. మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలతో..


‘గెలిస్తే ఏమొస్తుంది? మహా అయితే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. అదే ఓసారి ఓడిపోయి చూడు ప్రపంచం మొత్తాన్ని నువ్వు చూడవచ్చు. ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో నువ్వు తెలుసుకోవచ్చు’ అంటాడు మైఖేల్ మొనేట్ అనే ఓ మనోవైజ్ఞానిక నిపుణుడు.

విజయం -అపజయం, గెలుపు – ఓటమి..! ఎంత వైరుధ్యభావనలు రెండు. ఎప్పటికీ ఒక దానిని ఒకటి కలుసుకోలేని సమాంతర రైలు పట్టాల్లాంటివి. విజయం మనిషిని ఆనంద శిఖరాలకు చేరిస్తే, ఓటమి పాతాళంలోకి నెట్టివేస్తుంది. అయితే ఈ విజయం వల్ల వచ్చే ఆనందం చాల గొప్పగా ఉంటుంది కానీ, ఆ ఆనందం తాత్కాలికమైంది. పొగడ్తలు, ప్రశంసల జల్లుల సందడి తగ్గగానే విజయం తాలూకు జ్ఞాపకాలు క్రమంగా మరుగున పడతాయి. కానీ అపజయం మాత్రం అంత త్వరగా మరపుకు రాదు. అనుక్షణం ఓటమి ముల్లులాగా గుండెను గుచ్చుతుంటుంది. నిరాశ చెదపురుగులా మెదడులో చేరి తొలుస్తుంటుంది. నిద్రను దూరం చేస్తుంది.

విజయానికి పొగడ్తలు, ప్రశంసలు లభిస్తే , అపజయానికి వెక్కిరింతలు, హేళనలు, అవమానాలు వెంటపడి మనిషిని నిరాశలోకి తరుముతుంటాయి. కాస్త బలహీన మనస్కులైతే ఓటమిని తట్టుకోలేక క్షణికావేశంలో జీవితాన్ని అంతం చేసుకున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం మనం నేటి జనజీవన స్రవంతిలో. అసలు గెలుపంటే ఏమిటి? ఓటమి అంటే ఏమిటి? పరీక్షలో పాసవడం గెలుపు. ఉద్యోగ్యం రావడం గెలుపు. ప్రమోషన్ రావడం, అవార్టులు రావడం, ప్రేమించిన అమ్మాయి ‘ఒకే’ చెప్పడం. ఇవన్నీ మనం గెలుపుకు ఇచ్చుకునే నిర్వచనాలు. అదే మనం అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే ఇక క్షణాల్లో జీవితం తిరగబడిపోతుంది. ఓటమి తలుపు తడుతుంది. ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆలోచనని చంపేస్తుంది. విచక్షణని తొక్కేస్తుంది. ఇక ఒకటే దారి. ఒకటే శరణ్యం అనుకుని క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం ఆత్మహత్య. జీవితం అంటేనే గెలుపు, ఓటముల మధ్య ఊగిసలాడే లోలకం.

విజయమైనా, అపజయమైనా ఆ స్థితి శాశ్వతం కాదు. తాత్కాలికం. రాత్రి తర్వాత వచ్చే పగటిలా, చీకటి తర్వాత వచ్చే వెలుతురులా, గెలుపు ఓటములు రంగుల రాట్నంలో చక్రంలా ఒకదానివెంట ఒకటి తిరుగుతూనే ఉంటాయి. పరమపద సోపాన పథంలో నిచ్చెనలు, పాముల లాగా ఒకసారి గెలుపు నిచ్చెన ఎక్కిస్తే, ఒకసారి ఓటమి పాములా మింగేస్తుంది. అంతమాత్రాన అదే స్థితి శాశ్వతం అనుకోవడం పొరపాటు. నడి సముద్రంలో ఈదుతుంటే పెద్ద పెద్ద అలలు వస్తాయి.అల వచ్చినప్పుడు తల వంచాలి. మళ్ళీ తలయెత్తుకుని గమ్యం వైపుకు పయనం సాగించాలి. పరీక్షలో ఫెయిల్ అయ్యామని, అమ్మాయి ప్రేమించలేదని, ఉద్యోగం రాలేదని యువత నిరాశతో ఆత్మహత్యలకు ప్రయత్నిస్తే, పంట దిగుబడి సరిగా రాక అప్పులపాలైన రైతు, అత్తింటి ఆరళ్ళు తట్టులోలేక ఓ కోడలు , ప్రేమించి మోసం చేసాడని ఓ ఆడబిడ్డ, వృద్ధాప్యం మీదపడి బిడ్డలు వదిలేసిన ముసలి తల్లిదండ్రులు, ప్రమోషన్ రాలేదని ఓ చిరుద్యోగి, బిజినెస్ లో నష్టాలు వచ్చాయని వ్యాపారి ఇలా అందరూ జీవితాన్ని చాలించాలనుకుంటే, ఇక ఈ భూప్రపంచంమీద ఎవరూ మిగలరు.

అసలు మనిషి విజయం సాధించాల్సింది ఎవరిమీద? దేనిమీద? శత్రువు ఎక్కడ ఉన్నాడు అసలు? తనకు అనుకూలం కానీ, సాధ్యం కానీ విషయాన్నీ, తన అపజయానికి కారణాలను తేలికగా పరిస్థితుల మీదకు, ఇతరుల మీదకు నెట్టేయడం మానవ నైజం. ఓటమి ఎందుకు వచ్చింది? కారణాలను అన్వేషిస్తూ, సాధన చేస్తూ, తన గెలుపు, ఓటములకు తానే కారణం, ఇతరులు కాదు అని తెలుసుకుని, ఆత్మవిశ్వాసంతో నిరంతరం శ్రమిస్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తుంటే తప్పకుండా విజయం వరిస్తుంది. అందువల్ల మనిషిని ఓడించే శత్రువులు ఎక్కడో ఉండరు. తన మనసులోనే, తన ఆలోచలల్లోనే, తన వక్ర బుద్ధిలోనేలోనే శత్రువు ఉంటాడు. వాడిని జయిస్తే, తనలోని సవాలక్ష అరిషడ్వార్గాలను జయిస్తే మనిషి తప్పకుండా విజయం సాధించవచ్చు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చునేకంటే, మనకి మనమే ఓ ధైర్య వచనం కావాలి. మన మనసే శత్రువులను ఓడించే ఆయుధం కావాలి.

“అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది” అన్నారు సినీకవి చంద్రబోస్.ఈ దసరా పండుగ నాడు మనమందరం ఓ నిర్ణయం తీసుకోవాల్సిఉంది. విజయదశమి అంటే చెడు పైన గెలుపు సాధించడం. బయట ఉన్న ఎవరో శత్రువులతో కాక, నీలో ఉన్న చెడు ఆలోచనలతో, నీలో ఉన్న పిరికితనంతో, నీలో ఉన్న శత్రువుతోనే నువ్వు తలపడాలి. నిన్ను నువ్వే గెలవాలి. అదే అసలైన విజయం సాధించడమంటే.
“పసిడి పతకాల హారం..కాదురా విజయ తీరం.. ఆటనే మాటకార్ధం.. నిను నువ్వే గెలుచు యుద్ధం” అన్నారు సినీకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి.

అందువల్ల మహిషాసురులు, సైతాన్లు బయట ఎక్కడో లేరు. మన మనసులోనే తిష్ట వేసుకుని ఉన్నారు. వారితో తలపడదాం. చెడు పైన యుద్ధం చేసి విజయం సాధిద్దాం.

ఈ విజయదశమి నాడు మన మనసుమీద మనం విజయం సాధించే ప్రయత్నం చేసి, విజయ శిఖరాన్ని చేరుకుందాం.
విమల సాహితీ పాఠకులకు దసరా, విజయదశమి పండుగ శుభాకాంక్షలతో…

రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630