విమల సాహితి ఎడిటోరియల్ 15 – బేబీ… ఐ లవ్ యూ

Baby…..I Love You..
Be Always Beautiful Yourself ❤️❤️

బయట ఎవరితోనో కాదు. నీతో నువ్వు గాఢంగా

ప్రేమతో మునిగిపో..

ఈ వారం విమల సాహితీ సంపాదకీయం. చదవండి.మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి

ఆహా..! ఎంత మధురంగా ఉన్నాయి ఈ మాటలు. నవ యవ్వనపు వీణల తంత్రులన్నీ ఒక్కసారిగా కోటి రాగాలను ఆలపించినట్లు. ప్రేమికుల మధ్య ఆ తొలివలపు మధురిమలు చూస్తుంటే మనసు, తనువూ పులకరించిపోదా..! ప్రేమను పొందని బతుకెందుకు? చరిత్రలో ప్రేమకు దాసోహం అవని ఏ రాజైనా ఉన్నాడా? చరిత్ర తిరగేస్తే ప్రేమ కోసం ఎన్ని యుద్దాలు జరిగాయో మనకు తెలియదా? ప్రేమ పవిత్రమైనదే. మరి ఎక్కడ వచ్చింది తేడా?

ఈ మధ్యన వచ్చిన సినిమా “బేబీ” గురించి ఒకసారి ఇక్కడ ప్రస్తావించుకుంటే బస్తీలో నివాసం ఉంటున్న ఓ అమ్మాయి. హైస్కూల్ చదివే వయసే. ఆ బస్తీలోనే తిరిగే ఆటోవాలా ఆకర్షణలో పడింది. అది ప్రేమే అని మనసును ఇద్దరు మభ్యపెట్టుకుంటారు.ఆ ఆటో డ్రైవర్ కూడా కనిపెంచిన తల్లిని నిర్లక్ష్యం చేస్తూ, ఈ పిల్లే తన జీవితం అంటూ ఆమె వెనుకబడడం.ఆ అమ్మాయి ఆటోవాలా ఇచ్చిన చిన్నచిన్న గిఫ్ట్ లకి పొంగిపోయింది. అతడే తన జీవితానికి కథానాయకుడు అనుకుంది. కాలేజీలో చేరాక అప్పటిదాకా ఉన్న ప్రపంచం మారిపోయింది. కొత్త ప్రపంచం, కొత్త స్నేహాలు, కొత్త అలవాట్లు ఊపిరిసలపనీయని ఆకర్షణలు. మాట మార్చింది, నడత మార్చింది, కట్టూ బొట్టూ మార్చింది. ఆటోడ్రైవర్ అప్పు చేసి కొనిచ్చిన సెల్ ఫోన్తోనే కొత్త ప్రేమకు శ్రీకారం చుట్టింది. కొత్త బాయ్ ఫ్రెండ్ కొనిచ్చిన ఖరీదైన ఐ ఫోన్ ముందు ఆటో వాలా ఇచ్చిన ఫోన్ డబ్బా అయింది. కాలేజీలో స్నేహితురాళ్ళ మధ్యన మధ్యం, సిగరెట్లు, మత్తుమందు అలవాటు చేసుకుని, ఎంత దిగజారాలో అంత జారి, నైతిక విలువలను పాతాళానికి తొక్కి, కొత్త ప్రియుడి కోసం వలువలు విప్పింది.

ఆకర్షణ మత్తు దిగాక ఏం పొందిందో, ఏం కోల్పోయిందో తెలిసాక జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏమిటా నష్టం? కోల్పోయినదేమిటి? ఉన్నత సంస్కారంతో ఓ గొప్ప లక్ష్యం ఏర్పరచుకుని కెరీర్ లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాల్సిన సమయంలో, ఇక జీవితం లేదన్నట్లు ఆత్మహత్యకు పాల్పడటం. సినిమా ముగింపు ఏమైంది అనేది ఇక్కడ అవసరం లేని విషయం కానీ, ఇక్కడ వరకు చూస్తే, ఈ సినిమా ఇచ్చిన మెసేజ్ ఏమిటి ? నాకు వచ్చిన ఈ సందేహమే చాల మందికి వచ్చి ఉంటుంది. సమాజంలో జరిగే విషయాలే మేము సినిమాగా తీస్తున్నాము అనవచ్చు. జరుగుతున్న దారుణాలు విచారకరమే.

అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఇప్పుడు ఒక ప్రేమలో కాదు. ఒకే సారి పలువురితో ప్రేమలు, లైంగిక సంబంధాలు పెట్టుకోవడం చాల సాధారణం అయిపోయింది. ఒకరి కంటే ఇంకొకరు ఎక్కువ

అందంగానో ఉంటేనో, ఎక్కువ డబ్బు ఉంటేనో తక్కెడలో తూకం వేసినట్లు బంధాలను కూడా తూచి, మంటను చూసి వెలుగనుకుని భ్రమసే దీపపు పురుగుల్లాగా ఆకర్షణలో పడి, ఒకరికి తెలియకుండా మరొకరి తో ఉంటూ, నిజాలు బయట పడే వేళ భయము, స్వార్ధం వారిని చంపడానికో, చావడానికో పురిగొల్పుతున్నాయి.

సొంతవాళ్లను హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఎక్కడో ఓ చోట జరిగిన సంఘటనలు సినిమాల రూపంలో, యూ ట్యూబ్ లలో, వెబ్ సిరీస్ లలో ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసేలా చేస్తున్నాయి. మంచి కంటే వేగంగా చెడే కదా మనసుని ఆకర్షించేది. ఇక్కడ ఇటువంటివి చూసి, తాము కూడా ఆ అనుభవం పొందాలి అనే తహతహతో చదువుకునే యువత నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి, ఎంత దిగజారాలో అంతగా కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారు. ఈ ఆధునిక, డిజిటల్ జీవితాలను ప్రతిబింబించడంలో సాహిత్యం పాత్ర కూడా ఉందనడం అతియోశక్తి కాదు. ఇప్పుడు వచ్చే కొన్ని కథలను చూస్తుంటే, సాహిత్యం పాఠకులకు, ముఖ్యంగా యువతకి ఎటువైపుకి మార్గదర్శనం చేస్తోంది అని ఒకింత విచారం కలుగుతోంది. తాము ఇలా బతుకుతున్నాము, కాబట్టి మీరూ ఇలా బతకండి. జీవితానికి ఏ లక్ష్యం వద్దు. కాస్తంత కూడా శ్రమ తగలకూడదు. సర్దుబాటు తనం అసలు వద్దు. ఎవరెట్టు పోయినా పర్వాలేదు. నా ఆనందమే నాకు ముఖ్యం అనుకుంటున్నవారు, తమ పైత్యాన్ని పాఠకులమీదకు వదులుతున్నారు.

అయితే విజ్ఞానం, వివేచన, చేసిన పొరపాట్లు దిద్దుకునే నైపుణ్యం మెండుగా ఉన్న యువత ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తామనితాము చక్కదిద్దుకునే స్వయంనియంత్రణ కలిగిఉండాలి. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని నిరంతరం లక్షసాధన కొరకు శ్రమించాలి. అప్పుడే యువ భారతం దారితప్పకుండా, విజయం వైపుకు పయనం సాగించి నవ భారత నిర్మాణానికి నాంది పలుకుతుంది. ఇందు కొరకు ఇంట్లో తల్లిదండ్రులు తమ బిడ్డల బాగు కోసం కొంత తమ జీవితం తాము త్యాగం చేసినా పర్వాలేదు. అలాగే బడుల్లో , కళాశాలల్లో అధ్యాపకులు ర్యాంకుల కోసం పరుగులు పెట్టించకుండా, కాసిన్ని నైతిక విలువలు పిల్లల చెవిన వేయాలి. ఇక విస్తృతంగా విలయ తాండవం చేస్తున్న యూ ట్యూబ్, వీడియోలు, వెబ్ సిరీస్ ల వరద తాకిడికి సెన్సార్ అనే అడ్డు కట్ట వేయగలిగితే, అప్పుడు సమాజానికి నైతిక విలువలు గల ఉత్తమ పౌరులను అందివ్వగలుగుతాము.

రోహిణి వంజారి

సంపాదకురాలు

9000594630