వస పాలు కావాలిప్పుడు

ప్రియమైన రచయితలు సాహితీ సంబరాల నడుమ ఆవిష్కరించిన “ప్రియ కవిత” సంకలనంలో చోటు చేసుకున్న నా కవిత ఇది. శ్రీ ఇందూ రమణ గారికి, శ్రీ రంగబాబు గారికి ధన్యవాదాలతో 🙏🙏. ఇప్పుడు మూగబోయిన అందరి నాలుకల మీద వసపాలు పోయాల్సిందే కదా. కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతారుకదా❤🌹🙏

ఉభయకుశలోపరి
ఎన్ని ఏళ్లయ్యిందంటావ్ ఉత్తరంలో ఈ మాట చూసి
హలో అబ్బయ్య ! ఎట్లుండారు
ఎన్నాళ్ళయ్యిందంటావ్ ల్యాండ్ ఫోన్లో ఈ మాటవిని
ఇప్పుడు మాటలెందుకు అంటారా?
నవ్వుకో ఎమోజి, లవ్వుకో ఎమోజి, ఏడుపుకో ఎమోజి
సంతోషమైన, దుఃఖమైన ఒక్క ఎమోజితో సరి
నాలుగుగోడల మధ్య నాలుగు టచ్ స్క్రీన్లు
నిత్యం యంత్రాలతోనే సహజీవనమిప్పుడు
డాలర్ల వేటకు వలస పోయిన పిల్లపిట్టలకోసం
వారానికోసారి వీడియో కాల్ చేస్తే
టచ్ స్క్రీన్ ను ఎంతసేపు తడిమినా
మనవడికి తాతయ్య చెప్పే కథలు ప్రత్యక్షముగా వినిపించేనా?
నానమ్మ అందించే గోరుముద్దల రుచి తెలిసేనా?
నాదంతా చాదస్తం అంటారా?
నా ఆలోచనలు పొరపాటు అంటారా?
నేనింకా అనాగరికంగానే ఉన్నానంటారా ?
కాలంతో పాటు నేను ఎదగడంలేదంటారా ?
మాటలు లేక ఇప్పుడు స్వరపేటిక
విలుప్తాంగం అవుతోంది
ఇక లాభం లేదు ప్రతి నాలుక మీద
కాసిన్ని వసపాలు పోయాల్సిందే ఇప్పుడు

2 thoughts on “వస పాలు కావాలిప్పుడు”

Comments are closed.