యుద్ధం- శాంతి” కవిత్వ సంకలనంలో నేను రాసిన “లక్ష వత్తుల కాగడా” కవిత చదవండి. Doctor Vidyadhar Jeldi గారికి, శ్రీ Sarikonda Narasimharaju గారికి ధన్యవాదాలతో


అక్కడ నెత్తురు ఏరులై పారింది
గడ్డకట్టిన నెత్తుటి మడుగులు నల్లటి అవశేషాలైనాయి
జరిగిన రక్తపాతాన్ని పైనుంచి చూసిన ఆకాశం
వెక్కి వెక్కి ఏడ్చింది..
నింగి కార్చిన కన్నీటి బొట్లు నేలపై పడ్డాయి
నెత్తుటి చుక్కలకు మళ్ళీ జీవమొచ్చింది
ఒక్కో చుక్కా ఒక్కో కథ వినమంటోంది ..
తల తెగిన పౌరుడి నెత్తుటి చుక్క
తనవారి కోసం తల్లడిల్లుతోంది..
పసివాడి పెదవులమీది నెత్తుటి చుక్క
అమ్మ రొమ్ముకోసం తండ్లాడుతోంది ..
కళ్ళ ముందు మాంసంముద్దైన పసివాడి కోసం
కన్నతల్లి గుండె ముక్కలు ముక్కలై రోదిస్తోంది..
ముష్కరుడి పంటి గాటుకి తెగిన
చెల్లెలి మర్మాంగం తనకుతానే ఆత్మాహుతి చేసుకుంటోంది..
పగ తీరని మానవమృగాల మొండాలు కలదిరుగుతూ
రణభూమిని రమిస్తూనే ఉన్నాయి..
మతం కుళ్ళు కాలవల్లో మురికిలా పారుతూ
కక్ష కంపుకొడుతోంది అక్కడంతా..
కురుక్షేత్ర రణరంగమైన
కళింగ యుద్ధ భూమి అయినా
ఉక్రెయిన్ నేల అయినా
గాజా మట్టిగడ్డ అయినా
ఎక్కడైనా నెత్తుటి చుక్కలకు
జీవమొస్తే చెప్పేది ఒకటే గాధ..
అధికారపు ఆశ ఓ పచ్చిపుండు
మతం విచక్షణని చిత్తుచేసే శతఘ్ని
యుద్ధం ఓ దుర్మార్గపు అవకరం..
కత్తులతో కుత్తుకలు నరుక్కున్నా
బాంబు దాడులతో మారణహోమం జరిపినా
నెత్తుటి సమిధలుగా మారేది అమాయకజనమే..
అంతిమ గెలుపు మాత్రం శూన్యానిదే
మిగిలేది ఏమి ఉండదక్కడ..
శాంతి సమాధానాలు దొరకవునీకెక్కడా
నువ్వు చేసేది కూడా ఏమిలేదక్కడ
కానీ…
ప్రతి నువ్వు ఓ మనిషిగా మారితే
ప్రతి నువ్వు ఓ మానవత్వపు దివ్యవైతే
నువ్వు లక్ష ఒత్తుల కాగడగా మారి
ప్రతిగుండెలో ఓ ప్రేమ దీపాన్ని వెలిగించు…
రోహిణి వంజారి