మీ టూ

నమస్తే!

నేను వ్రాసిన ఈ కథ “మీ టూ”  19-12-2018 తేదీన “నవ్య ” వార పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.

——————————————————————————————————————————

జ్వాలా, తలనొప్పిగా ఉంది. కాస్త టీ పెట్టి ఇవ్వు” అంటూ ఇంట్లోకి వస్తూనే కుర్చీలో కూర్చుని తలపట్టుకున్నాడు శ్రీధర్ టీ చేతికందిస్తూ, ‘అయితే వెళ్ళినపని కాలేదన్నమాట. ఎక్కడా డబ్బు దొరకలేదాండీ” అంది జ్వాల. “లేదు జ్వాలా. యాభై వేలు కాదు కదా , కనీసం పదివేలు కూడా అప్పు పుట్టలేదు. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదు” అన్నాడు శ్రీధర్.

జ్వాల, శ్రీధర్ ది ముచ్చటైన సంసారం. వారి పాప దివ్య. ఫోర్త్ క్లాస్. శ్రీధర్ చిన్న వ్యాపారిగా ప్రారంభమై క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. లాభాల బాటపట్టి ఓసొంత ఇల్లు కట్టుకున్నాడు. ఇక భవి ష్యత్తుకు డోకా లేదనుకుంటున్న తరుణంలో, ఓ అనుకోని కుదుపు, వ్యాపారంలో నష్టాలతో శ్రీధర్ కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పులు పెరిగి పోయాయి. శ్రీధర్ దంపతులు అపురూపంగా కట్టు కున్న ఆ పొదరింటిని అమ్ముకోవలసి వచ్చింది. ఆ ఇంటిని కొనుక్కున్నవాళ్ళు, నెలరోజులు గడువు ఇచ్చారు. ఇల్లు ఖాళీ చేయడానికి. – వేరే ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా, దివ్యను వేరే స్కూల్లో చేర్పించాలన్నా అప్పటికప్పుడు కనీసం ఓ యాభైవేలైనా కావాలి. ఇల్లు అమ్మిన విషయం తెలియ గానే, అయిన వాళ్ళు. స్నేహితులు ముఖం చాటేశారు. దాంతో శ్రీధర్, జ్వాల దంపతులు అవసరానికి చేయూతలేక, డబ్బు అందక ఇరకాటంలో పడి పోయారు.

ఆఖరి ప్రయత్నంగా ఊర్లో ఉన్న తమ దూరపు బంధువు, తనకి అక్క వరుసయ్యే సుగుణకు ఫోన్ చేసింది. జ్వాల. తమ కుటుంబం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పి, సహాయం చెయ్య మని అర్థించింది. తన కూతురు కాన్పుకి వచ్చిం దనీ, తాను స్వయంగా రాలేననీ, తన భర్త భుజం గరావుతో డబ్బులు పంపిస్తాననీ తీపి కబురు అందించింది సుగుణ.

అనుకున్న ప్రకారమే, రెండు రోజుల తర్వాత సుగుణ భర్త భుజంగరావు వచ్చి జ్యాల దంపతు లకు డబ్బు అందించాడు. అద్దె ఇల్లు వెతకడంలో కూడా శ్రీధర్ దంపతుల వెంట సహాయంగా నిల బడ్డాడు. రెండు రోజులు శ్రీధర్ ఇంట్లోనే ఉన్నాడు. తిరిగి తన ఊరు వెళుతూ “జ్వాలా! మీరు ఏమీ మొహమాటపడకండి. ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ చెయ్యండి. నేను వచ్చేస్తాను. మా సుగుణ బంధువులు అంటే నాక్కూడా కావలసినవారు” అన్నాడు భుజంగరావు జ్వాలను క్రీగంట చూస్తూ. చేసిన సహాయానికి ఎంతో ఉప్పొంగి పోయారు శ్రీధర్, జ్వాల దంపతులు.

భుజంగరావును పొగడ్తల్లో ముంచెత్తి కృతజ్ఞతలు తెలియ జేసి సాగనంపారు. నవ్వు కుంటూ వెళ్ళిపోయాడు భుజంగరావు. అతడి చ్చిన డబ్బులో కొంత అద్దె ఇంటికి అడ్వాన్స్ గా చెల్లించి, రెండు గదు లున్న ఓ చిన్న ఇంటిలో ప్రవేశించి కొత్త జీవితం ప్రారంభించారు శ్రీధర్ దంపతులు. ఇక వ్యాపారం చెయ్యలేక ఓ చిన్న ఉద్యో గంలో చేరాడు. శ్రీధర్ ఆ తర్వాత కూడా భుజంగ రావు ఓ రెండుమూడుసార్లు వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతను వచ్చిన సమయంలో శ్రీధర్ ఇంట్లో లేడు. ఓసారి నెల సరుకులు తెచ్చి ఇచ్చాడు. మరోసారి ఊళ్ళో పండిన కూరగాయలు తెచ్చి చ్చాడు. అలా వాళ్ళింట్లో ఉన్న సమ యంలో, అవకాశం దొరికినప్పుడల్లా, మంచినీళ్ళు, కాఫీ గ్లాసు తీసుకునే నెపంతో తన చేతివేళ్ళతో జ్వా ల చేతు లను తాకిస్తూ సంకేతాలను పంపించేవాడు భుజంగరావు. ఇంకా బాగా అర్ధమయ్యేందుకు “నన్ను పరాయివాడనుకోకు జ్వాలా! ఒంటినిండా నగలతో ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు! నీ పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపో తోంది. నీకు ఎలాంటి అవసరం వచ్చినా సరే అవన్నీ నేను తీరుస్తాను” అంటూ పళ్ళన్నీ బయట పెట్టి నవ్వే వాడు. అతడి మాటతీరు జ్వా లకు వెకిలిగా అనిపిం చింది. అతని మాటల్లో ఏవో శ్లేషార్థాలు గోచరించేవి. దాంతో అతడిమీద గౌరవభావం తగ్గిపోయి, చిరాకు కలిగింది జ్వా లకు.
సహాయం చేసినంత మాత్రాన శ్రీధర్ లేని సమయంలో ఇలా ఇంటికొచ్చి చనువుగా మాట్లాడతాడా? జ్వాలకు అతడి ప్రవర్తన నచ్చలేదు. కానీ, తన అక్క సగుణ భర్త అనే గౌరవంతో మిన్నకుండిపోయింది జ్యూల.

ఆ రోజు దివ్యని కొత్తగా చేర్పించిన స్కూల్ కి వెళ్ళింది. జ్వాల. అంతకు ముందురోజే స్కూలు వాళ్ళు దివ్యకు ఓ చిన్న ప్రవేశపరీక్ష పెట్టారు. అందులో మంచి మార్కులు తెచ్చుకుంది. దివ్యకి స్కూల్లో అడ్మిషన్ గ్రాంట్ చేస్తూ అప్లికేషన్ , మరికొన్ని ప్రింటెడ్ పేపర్స్ జ్వాల చేతికిచ్చారు. జ్వాల గారు, మీరు ఈ పేపర్ ని ఇంటికి తీసుకెళ్ళి క్షుణ్ణంగా చదవండి. పిల్లల సంరక్షణకు సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు అందులో ఉన్నాయి. దాంట్లోనే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇంట్లోనూ, బయటా ఎక్కడైనా సరే పిల్లలు ఎవరివల్లనైనా లైంగిక వేధింపులకు గురైతే ఆ నెంబర్ కి కాల్ చేసినా, వాట్సప్ చేసినా, పోలీసులు వెంటనే స్పంది స్తారు. వేధింపులకు గురిచేసిన వాళ్ళపై తక్షణ చర్యలు తీసుకుంటారు” అని వివ రంగా చెప్పింది ప్రిన్సిపాల్ రాగిణి.

ఇంత చిన్న పిల్లలకు ఈ సమాచారం. ఈ వివరాలన్నీ అవసరమా మేడం’ అంది జ్వాల ఆశ్చర్యంగా చూస్తూ వై నాట్ లైంగిక నేరాలకు పాల్పడేవాళ్ళకు వావివరుసలు, చిన్నా పెద్దా, జెండర్ తేడాలేమీ ఉండవు. వాళ్ళు ఎక్కడో ఉండరండీ. ఏ పక్కింటి అంకుల్ రూపంలోనో, వెనకింటి బాబాయ్ గానో, దగ్గరి బంధువుల్లోనో, వీధి చివరన పోకిరీల రూపంలోనో ఉండవచ్చు. పైకి మర్యాదస్తుల్లా, పెద్దమనుషుల్లా చలా మణి అవుతూనే అవకాశం కోసం గోతికాడ నక్కల్లా, క్రూరమృగాల్లా మాటు వేసి ఉంటారు. అవకాశం దొరికినప్పుడు తమ దుశ్చర్యలకు పసివాళ్ళను బలిచేస్తారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. మన పిల్లల రక్షణ కోసం మనం కూడా పోలీసులకీ , ముఖ్యంగా షీ-టీమ్స్, యాంటీ చైల్డ్ అబ్యూజ్ స్పెషల్ టీమ్స్ సహకారం అందించాలి. ఈ విషయంలో స్కూల్లో టీచర్స్, ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా ఈ విషయంలో పిల్లలు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది” అన్నారు. రాగిణి “థాంక్స్ మేడమ్! ఈ రోజు మీ నుంచి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. ఈ విషయం గురించి తప్పకుండా మా పాపకు అవగాహన కల్పి స్తాను” అని చెప్పి, ఇంటికి చేరుకుంది జ్వా ల.

కాళ్ళు కడుక్కుని మంచినీళ్ళు తాగి టీవీ ఆన్ చేసి స్కూల్ వాళ్ళు ఇచ్చిన పేపర్ చదవడం ప్రారంభించింది. ఈలోపు టీవీలో వస్తున్న ఒక ప్రోగ్రాం జ్వాలను ఆకర్షించింది. అదొక చర్చావేదిక లైంగిక వేధింపులు లకు గురైన కొందరు సినీ నటులు, ఉన్నతోద్యోగాలు చేసే మహిళలు వారి వేదనా భరితమైన అనుభవాలను గురించి చెబుతున్న ‘మీ టూ’ చర్చాకార్యక్రమం అది.

కొందరు మహిళామండలి సభ్యులు, వివిధ రంగాల్లో ప్రముఖులైన స్త్రీలు కూడా ఆ చర్చలో పాల్గొని సల హాలు, సూచనలు ఇస్తున్నారు. చాలా ఆసక్తిగా ఆ చర్చా కార్యక్రమాన్ని చూసింది జ్వాల అందులో స్త్రీకి సున్నితమైన శరీరమేకాదు, అంతకంటే ముందు ఆమెకూ ఓ మనసు ఉంటుంది. స్త్రీ ఒక బొమ్మ కాదు. ఇష్టం లేకుండా ఆమెను లోబరు చుకునే మగవాళ్ళకు కచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఆడ దాని అవసరాన్ని అవకా శంగా తీసుకుని ఏం చేసినా మౌనంగా భరిస్తుంది అనుకునే మృగాళ్ళ దుశ్చర్యలకు అడ్డుకట్టవేసే మంచిరోజులు వచ్చాయి. లైంగిక వేధింపులకు గురిచేసిన వాళ్ళను శిక్షించడానికి ఇప్పుడు న్యాయశాస్త్రంలో, రాజ్యాంగంలో ప్రత్యేక సెక్షన్లు రూపొందించారు. అంటూ చర్చ రసవత్తరంగా సాగుతోంది. శ్రద్ధగా ఆ కార్యక్రమం చూస్తూ అందులో లీనమై పోయింది జ్వాల, అంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆ శబ్దం విని ‘ఈ మధ్యాహ్న వేళ వచ్చింది వరా అనుకుంటూ తలుపు తీసింది. తలుపు తెరవ గానే, జ్వాల మీద పడ్డట్టే లోనికి దూసుకొచ్చాడు. భుజంగరావు ఒక నిట్టూర్పు విడిచి ఇక తప్పద న్నట్లు లేని నవ్వు ముఖానికి పులుముకుంది జ్వాల టీవీ కట్టేసి అతడిని కూర్చోమంటూ మంచినీళ్ళిచ్చి మర్యాద చేసింది.

జ్వాల ఇచ్చిన మంచినీళ్ళు తాగి క్షేమం మాచారాలు అడుగుతున్నాడు భుజంగ రావు. ఎందుకో శ్రీధర్ ఇంట్లో లేనప్పుడే ఈయన వస్తాడు. అతని సాయం అడ గడం తప్పైపోయింది. అనుకోగానే, మనసంతా చిరాకుగా అనిపించింది. అయినా గానీ, పైకి నవ్వుతూ సమాధానం చెప్పింది జ్వాల “నన్ను ఇలాగే కూర్చోబెట్టేస్తావా జ్వూలా? కనీసం ‘భోం చేసావా అని అయినా అడగలేదు” అన్నాడు గోముగా భుజంగరావు.

“అయ్యో మాటల్లో పడి మర్చేపోయాను. భోజనం చేద్దురు గానీ రండి బావ గారు” అంది జ్వాల. ఇప్పుడు భోజనం వద్దులే జ్వాల, కొంచెం కాఫీ ఇచ్చావంటే తాగి వెళ తాను” అన్నాడు భుజంగరావు అతడు వెంట తెచ్చిన కూరగాయల సంచిని అప్పుడే గమనించిన జ్వాల, అయ్యో! శ్రమపడి మా కోసం ఊరు నుంచి కూరగా యలు మోసుకొచ్చారు. మాకోసం మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్లున్నారు” అంది జ్వాల.
“ఇందులో నాకేం ఇబ్బంది లేదు జ్వాలా, ఈ కూరగాయలన్నీ మన పొలంలో పండినవే. మీకిచ్చి పోదామనే వచ్చాను. నీకోసం ఈ మాత్రం చెయ్యకపోతే ఇంకెందుకు” అన్నాడు జ్వాల వంక అదోలా చూస్తూ, అతడి చూపుల్లో తేడాను స్పష్టంగా గమనించింది జ్వాల. త్వరగా కాఫీ ఇస్తే తాగేసి వెళ్ళిపోతాడులే అనుకుంది. వంటింట్లోకి వెళ్ళి పాలగిన్నె స్టా మీద పెట్టింది. గ్లాసులో పంచదారవేసి, అల్మారా దగ్గరకెళ్ళి మునివేళ్ళమీద నిలబడి పై అరల్లోకి చూస్తూ, రెండు చేతుల్ని పైకెత్తి కాఫీపొడి డబ్బాకోసం వెదకసాగింది. అంతలో నడుం మీద ఏదో తగిలినట్టైంది. దిగ్గున వెనక్కి తిరిగింది. జ్వా ల. అంతే.. భుజంగ రావు గట్టిగా జ్వాలను పట్టేసుకుని “జ్వాలా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మీద ఎప్పటి నుంచో కోరిక ఉంది నాకు. ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. నా కోరికను కాదనకు” అన్నాడు.

ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన జ్వాల, భుజంగరావుని ముందుకు ఒక్కతోపు తోసింది. భయంతో వణకిపోతోంది జ్వాల. అయినా తమాయించు కుని సుగుణ అక్క, మీరు అంటే మాకెంతో ఎంతో గౌరవం. మాకు సాయం చేసినందుకు మీకు మా కృతజ్ఞతలు. కానీ మీరు ఇలా ప్రవర్తించడం బాగా లేదు” అంది. హాఁ, మీకు ఊరికే సాయం చేశాననుకుం టున్నావా? నీ మీద మోజుతోనే మీకు సాయం చేశాను. మొదటిసారి మా పెళ్ళిలో నిన్ను చూసిన ప్పుడే నీ మీద మోజుపడ్డాను. పదేళ్ళ పిల్లకు తల్లివైనా నీ అందం చెక్కుచెదరలేదు. మీ సుగుణక్క ‘జబ రస్ట్’లో మొగోడికి ఆడవేషం వేసినట్లుంటుంది. దాంతో నాకు ఎలాంటి సుఖం లేదు. నన్ను కాద నకు జ్వాలా. నువ్వు ఏం కోరితే అది క్షణాల్లో తీరు స్తాను” అంటూ పైపైకి వస్తూ జ్వాలను చేజిక్కించు కోవాలని ప్రయత్నించాడు భుజంగరావు. భయంగా రెండడుగులు వెనక్కి వేసింది జ్వాల ఒకే ఒక్క క్షణం ఆలోచించింది. టీవీలో చూపించినట్టు తాను సెలబ్రిటీ కాదు, మహిళామండలి సభ్యురాలు కాదు. తను ఒక సాధారణ మహిళ. అయితే గొప్పగొప్ప వాళ్ళకే కాదు సాధారణమైన కుటుంబ స్త్రీలకు కూడా ఈ లైంగిక వేధింపులు ఉన్నాయి. ఇది చాపకింద నీరులా విస్తరిస్తూ పోతోంది.

ప్రతి మహిళ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట ఇలాంటి సమస్యలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. మరి దీన్ని ఎదుర్కోవాలంటే వేదిక లెక్కి చర్చించాల్సిన అవసరం రాలేదు. మౌనంగా ఈ వేదనని భరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇటువంటి కామాంధుల ఆట కట్టించడా నికి, తనని తాను రక్షించుకోవడానికి ప్రతి మహిళా తనే ఓ ఆదిపరాశక్తిగా మారాలి.ప్రముఖ విప్లవ రచయిత ‘జ్వాలాముఖి’గారి మీది ఎంతో ఇష్టంతో తన తండ్రి తనకు జ్వా ల అని పేరుపెట్టాడు. అవసరమైతే ఈ జ్వాల అగ్నిజ్వాలల్ని కురిపించి ఆ మంటల్లో ఈ కామాంధుడి మదాన్ని దహింపజేయాలి. అనుకుని భుజంగరావుని బలంగా ముందుకు తోసేసింది. స్టవ్ ప్రక్కనే తళ తళా మెరుస్తున్న కూరగాయలు కోసే చాకు తీసు కుని “నా ఒంటి మీద చెయ్యి వేశావంటే నిన్ను చంపేస్తాను. ఇంతవరకు చేసిన సాయం చాలు. ఇంకెప్పుడూ మా ఇంటి ఛాయలకు కూడా రావద్దు’ ‘ అంటూ కళ్ళల్లో చింతనిప్పులు కురిపించింది. కత్తిని సూటిగా భుజంగరావు గుండెకు గురిపెట్టింది.

‘అపర భద్రకాళి’గా మారి అగ్నిజ్వాలలు కురి పిస్తోన్న జ్వాలను చూసి జడుసుకున్నాడు భుజంగ రావు. వెనక్కి తగ్గాడు. చేసిన సహాయానికి ఇదేనా నువ్వు చూపించే కృతజ్ఞత. నువ్వు నాకు ఎలా లొంగవో చూస్తాను. నీ సంగతి చెప్తాను చూడు” అంటూ బూతులు తిడుతూ విసురుగా తలుపు లాగి బయటకెళ్ళి పోయాడు భుజంగరావు.

ఆ విసురుకు అతని కాలు తగిలి కూరగాయల సంచి దొరికూరగాయలన్నీ నేలంతా పరుచు కున్నాయి. అదిరే గుండెతో కత్తిపట్టుకుని అలాగే నిలబడిపోయింది. జ్వాల. అంతలోనే, ఎంటి జ్వాలా చేతిలో ఆ కత్తి. నన్ను చంపేస్తావా ఏంటీ” అంటూ నవ్వుతూ ఇంట్లోకి వచ్చాడు శ్రీధర్, భర్త గొంతువిని, ఈ లోకంలోకి వచ్చిన జ్యాల, మూడ్ మార్చుకుని, “అయ్యో! అవేం మాటలండీ. కూరగాయలు కోద్దామని కత్తి తెచ్చాను. ఇంతలో నంచి దొర్లే కూరగాయలన్నీ కిందపడ్డాయి” అంది తడబాటుగా.

‘ఏం ఫర్వాలేదు. కూరగాయలు నేను తీసే స్తాను. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. దివ్య కూడా స్కూలనుంచి వచ్చే టైమైంది. ‘సవ్యసాచి’ సినిమాకి టికెట్లు తెచ్చా, వెళదాం” అన్నాడు శ్రీధర్. అలాగేనండి, తప్పకుండా వెళ్దాం” అంటూ లోపలికెళ్ళింది జ్వాల .

తను చేసిన పని ఎంత మాత్రం తప్పుకాదు. ఇంకెప్పుడూ భుజంగరావు ఈ ఇంటికి రాడు. ఒక వేళ వచ్చినా, మళ్ళీ అనుచితంగా ప్రవర్తించినా ఏం చెయ్యాలో తనకి తెలుసు. మనం నిజాయతీగా ఉన్నంతవరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చిందని కుమిలిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని భుజంగరావు వంటి నీచులకు బుద్ధి చెప్పటం ఇప్పుడు ఎంతో అవసరం’ అనుకుంది జ్వాల తేలికపడిన మనసుతో.