మనుషులు మానవత్వాన్ని మరచి మృగాలుగా మారుతున్నవేళ ఆవేదనతో రాసిన ఈ “మనిషి – మృగం” కవిత విశాలాక్షి మాస పత్రికలో ప్రచురితం అయింది.
ఓ మనిషీ.. జాగ్రత్త సుమా..
మనిషి లోని మనిషి
మాయమై పోయి
మనిషి రూపంలో
మృగాలు తిరుగాడే
జనారణ్యమిది…
ప్రేమించలేదని ముఖాన
యాసిడ్ పోసో, చున్నీతో
ఉరిబిగించో అమాయకపు
అబలను కబళించే
ఈవ్ టీజర్స్ రూపంలో
మానవ మృగాలు
తిరుగాడుతున్నాయిపుడు.
కట్టుకున్న భర్త నచ్చలేదని
అన్నంలో విషం కలిపి
మోసపు ప్రేమ నాటకాన్ని
రక్తికట్టించి, నమ్మిన భర్తను
నట్టేట ముంచే భార్యల రూపంలో మానవ
మృగాలు తిరుగాడుతున్నాయిపుడు.
కనిపెంచిన కూతురు తనకు
నచ్చిన వాడిని మనువాడిందని..
కులం, మతం, ఆస్తి, అంతస్తు,
పరువు,హోదాల
ముసుగులు వీడలేక
కన్నకూతుర్ని,మరో
కన్నతల్లి బిడ్డడి
కుత్తుక ను కత్తులతో
తెగనరికే కసాయి
తండ్రుల రూపంలో
మానవ మృగాలు
తిరుగాడుతున్నాయిపుడు
ఓ మనిషీ జాగ్రత్త…