మిత్రులకు నమస్కారాలు. 2021 సంవత్సరంలో నా మొదటి కవిత ” సృజనప్రియ” మాసపత్రిక జనవరి సంచికలో. తన బిడ్డ [రైతు] కోసం ఓ అమ్మ [సాగు నేల] పడే ఆవేదనే ఈ కవిత “నేల తల్లి “. నువ్వు కవిత రాయాల్సిందే అంటూ ప్రోత్సహించిన “సృజనప్రియ” సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారికి ధన్యవాదాలతో…
సాగునేలను అన్నం పెట్టే తల్లిలా ఆరాధించి, తన ఒంట్లో శక్తి ఉడిగిపోయేదాకా నేలతల్లి మీద ఆధారపడ్డ మా నాయన కవితే ఇది..
నాగలి కర్రుతో
నువ్వు నా గుండెను
చీల్చుతూ ఉంటే
పసిబిడ్డడు పాలుతాగుతూ
లేతపాదాలతో నా గుండెలమీద
తన్నినట్లు పరవశించి పోయాను..
చెంగోవాలు కట్టి చాడ పెడితే
అద్దంలా ఉన్న నాలో
పొద్దప్ప ప్రతిబింబం
మెరిసిపోతుంటే మురిసిపోతూ
అన్నం విత్తనాలేసే నీ చేతిస్పర్శ కోసం
స్వాగత తోరణాలతో ఎదురు చూసా..
ఆకుపచ్చ చీర కట్టుకున్న
పడుచు పిల్ల పరుగుతీస్తుంటే
పైటచెంగు రెపరెపలాడినట్లు
పైరగాలి వీచినప్పుడల్లా
నాట్యమాడుతూ
గాలివెంటే ఊయలలూగే
పచ్చటికంకులను
మట్టిలో చెదిరిపోకుండా
కాపాడే పునాదినయ్యాను..
జీవ, రసాయన ఏ ఎరువులు
నాలోకి ఎంత ఎక్కువ పంపినా
అదుపుతప్పి నా బలంతగ్గిపోతున్నా
మీ సత్తువ కోసమే కదా అని
నిమ్మకుండి పోయాను..
చీడపీడలు పట్టి
చిగురు కంకులు తలవాల్చేస్తే
నలత పడ్డ బిడ్డను చూసి
కలత పడ్డ అమ్మలా రోదించాను..
వరదల వెంట వాగులు పొంగి
నన్ను నిలువునా కోసేసిన
మీ ఆకలి తీర్చడం కోసం
నన్ను నేనుమళ్ళీ మళ్ళీ
మాచికలువేసి కుట్టుకుంటూనేఉన్నా..
కానీ ఈ రోజు నీ పంటమీద నీకు హక్కు
లేదంటూ
నిన్ను నిలువునా నిలువరిస్తుంటే
ఏమి చేయలేని నిస్సహాయ
తల్లిలా తల్లడిల్లుతున్నా..
రోహిణి వంజారి