నిర్మాల్యం

క్రింది కవిత “నిర్మాల్యంసాహిత్య ప్రస్థానం మాస పత్రిక లో నవంబర్ 2019 సంచికలో ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన.

————————————————————————————————————————–

గతం…
గ్రీష్మపు వేడిమికి కరిగిపోయిన ఓ మంచు ముక్క

కలం పాళిలో ఇంకిపోయిన ఓ ఆఖరి సిరా చుక్క.
పండగ సంబరాల అంతిమ ఘట్టంలో మిగిలిపోయిన ఓ నిర్మాల్యం..
వేడుకల అనంతరం నిమజ్జనం అయిపోయే ఓ మట్టి పెళ్ళ..
వెనుకకు తిప్పలేని ఓ గడియారపు ముల్లు..
శరత్ కాలపు చెట్టు కింద రాలిపడిన ఓ ఆఖరి పండుటాకు..
లోపలి కండరాల నుంచి చర్మం పైకి పుట్టుకొచ్చిన ఓ వ్యార్థక్యపు ముడత
నిరాశ తరంగాలు వ్యాప్తి చేసిన ఓ దుర్గంధం..
ఓటమి గాయాలు మిగిల్చిన చెరిగిపోని ఓ పచ్చబొట్టు..
ఏదైతేనేం గతం గతమే నిన్నటి భయం ఓ భూతమే..
చీకటిని నిందిస్తూ నిన్నటిని యోచిస్తే, నేటి చైతన్యం ఓ గగన కుసుమమే..
రేపటి వెలుగు ఇకపై ఓ సుదూర స్వప్నం..
చేజారిన క్షణం తిరిగి రాదని వివేకం కలిగుంటే, గతాన్ని గురించి యోచన వ్యర్ధం..
నేటి కర్తవ్యాన్ని ఆచరణలో పెడితే, రేపటి వెలుగు పూల ఆగమనం తధ్యం