నిత్య ప్రేమికుడు

“వాడికి నా అందంతో పనిలేదు
ఆపాదమస్తకం గిలిగింతలు పెట్టేస్తాడు
వాడు నా రంగు తెలుపా నలుపా చూడడు
వాడి నఖక్షతాలు దంతక్షతాలు సరేసరి
వాడికి నా గెలుపోటములతో పనిలేదు
నా చేత్తో పెడితే కానీ ఒక్క ముద్దైనా తినడు
నేను బయటకెళితే చాలు వాడి కళ్ళల్లో గుబులు
వాకిట్లో తోరణాలకి వాడి చూపులను వేలాడదీస్తాడు
నేనేదో కానుకలు తెస్తానని ఆశపడడు
నేను తిరిగొచ్చే దాక గుమ్మం దగ్గరే వాడి మకాం
రోజూ I LOVE YOU చెప్పలేదని అలగడు
నా ఒడిలోచేరి ప్రేమగీతాన్ని మౌనంగా ఆలపిస్తాడు
కాసింత పరాగ్గా ఉన్నా చాలు
కళ్ళల్లోకి చూస్తూ చూస్తూ ముద్దులు పెట్టేస్తాడు
❤️ ఎమోజీలు మెసేజ్ చేయలేదని నిష్ఠూరపడడు
నిలువెత్తు ప్రేమకు మనమే నిదర్శనమంటాడు
నా మగధీరుడు నా నిత్య ప్రేమికుడు నా టైగర్”


రోహిణి వంజారి
14-2-2023