నమస్తే!
నేను వ్రాసిన ఈ కథ “నల్ల సూరీడు” జూలై 2019 లో “విశాలాక్షి” మాస పత్రికలో ప్రచురితం అయింది.
“మతం కన్నా మానవత్వం మిన్న” అనే నేపధ్యం లో నా కళ్ళ ముందు జరిగిన సంఘటనలను కథగా మలిచాను. ఈ కథకి “మక్కెన రామ సుబ్బయ్య స్మారక & విశాలాక్షి సాహితీ మాస పత్రిక” నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి ని పొందాను. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.
————————————————————————————————————————–
సూరీడు నల్లగా ఉంటాడా ! నింగిలోని సూరీడు ఎప్పుడైనా ముసురు పట్టినప్పుడు మబ్బుల వెనుక దాగి, గ్రహణం పట్టినప్పుడు ఆ కాస్త సమయంలో కనుమరుగై లోకాన్ని చీకటి మయం చేస్తాడు. కానీ, తాను ఎప్పుడూ నల్లబడడు . వేడి మి,వెలుగులు ప్రసాదిస్తూ లోకాన్ని చైతన్యవంతం చేస్తాడు. మరి ఈ నేలమీది సూరీడు! నికార్సయిన నల్లని దేహం కలవాడు. కాయకష్టం తో కండలు తిరిగిన, ఆరడుగుల భారీ విగ్రహం అతనిది. మరి నల్లని శరీర ఛాయ కలవాడు. అతని మనస్సు కూడా నలుపేనా లేదా దూదికన్నా మెత్తని, పాలకన్నా స్వచ్ఛమైన తెల్లనిదా తెలియాలంటే మనం కథలోకి వెళ్లాల్సిందే మరి.
“ఏరా సూరిగా నాలుగు దినాల్నించి పత్తా లేకుండా పోయావు. ‘టీ’ బంకు కూడా తెరవలేదు. ఏందీ మందల ? ఏడ పెత్తనానికి పోయినావురా? తమ ఇంటి ముందు నించి పోతున్న సూరీని కేకేసి పిలిచాడు నర్సిరెడ్డి. ” నా బంకు ఉండే తావుని ఆర్జింట్ గా ఖాళీ చెయ్యమన్నాడు, ఆ తావు ఓనర్ బాబు: బంకు పెట్టుకునే తావు కోసం నాలుగు దినాల్నించి యతకతా ఉంటాను. నర్సిరెడ్డా ” వినయంగా చేతులు కట్టుకొని జవాబిచ్చాడు సూరీడు.
“మరి తావు యాడన్నా దొరికిందంటారా” మీసం మెలేస్తూ అడిగాడు నర్సిరెడ్డి. ” దొరకలేదు రెడ్డా.., తమరేమనుకోకుంటే తమ ఇంటి ముందు గేటు అనుకోని చానా జాగా ఉండాది కదా! ఆ తావన నా టీ బంకు పెట్టుకుంటా ఈ మేలు చేసి పుణ్యం కట్టుకో నర్సిరెడ్డి ” చేతులు జోడిస్తూ అర్ధించాడు సూరీడు.
“రేయ్ సూరిగా ఏదో ఎండనబడి పోతావుంటావని మందల అడిగితే నాతోనే ఎకసెక్కాలాడతావరా నువ్వు మేమెక్కడ, నువ్వెక్కడ కులం తక్కువోణ్ణి ఇంటిముందర పెట్టుకున్నానని ఊర్లో వాళ్ళు తుపుక్కున నా ముఖం మీద ఊస్తారు. మాట్లాడింది చాల్లే, పోరా పో నాకు చాలా పని ఉంది. అంటా వెనక్కి చూడకుండా గేటువేసి లోపలికి పోయాడు నర్సిరెడ్డి.
పెద్దగా నిట్టూర్పుతో కూడిన నవ్వు సూరీడి పెదాలనించి వెలువడింది. సూరీడికి ఊహ లిసినప్పటినుంచి వాళ్ళ నాయన నడుపుతున్న టీ బంకులో పని చేస్తున్నాడు సూరీడు. ఆయన తదనంతరం సూరీడు, అతని భార్య రాధమ్మ పగలనక, రేయనక రెక్కల కష్టం చేస్తూ టీ బంకును నడుపుతూ వాళ్ళ ముగ్గురు పిల్లలను చదివిస్తూ బ్రతుకు బండిని లాగిస్తున్నాడు సూరీడు . ఊహ తెల్సింది మొదలుకొని కులం తక్కువోడు అంటరానోడు అనే మాటలు వింటానే పెరిగాడు.
చర్చి ఫాదర్ స్లీవారెడ్డి”సూరి మతం మారు నా మాట విని ఎంత కాలం ఇలా కులం తక్కువోడు అనిపించుకుకుంటావు. మతం మారితే సమాజంలో నీకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. నీ పిల్లలకు చదువుకు ఫండ్స్ వస్తాయి” అని చెవిలో జోరీగలా పోరగా, పోరగా బ్రతుకు మీది ఆశతో బాప్తిసం పుచ్చుకుని సూరీడు కాస్త సురేంద్ర పాల్ గా మారాడు.
మతం అయితే మార్చుకోగలిగాడు కానీ కొందరు మనుష్యుల మెదళ్ళలోకి తరతరాలుగా చొచ్చుకుని పోయిన విషపురుగు కులదురహంకారాన్ని మాత్రం మార్చలేకపోయాడు. చర్చికి వెళుతుంటే వెటకారపు నవ్వులను, వెకిలి మాటలను భరించాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి తన బంకులో టీ తాగుతుంటే నవ్వుకుంటాడు కర్మయోగిలా, తను ఇచ్చిన టీ అయితే తాగొచ్చు కానీ తనని ముట్టుకోకూడదు. ఎంటో ఈ మనుష్యులు అని.
చాలా ఏళ్లుగా అక్కడ ఉన్న టీ బంకును హరాత్తుగా ఖాళీ చెయ్యమంటే దిక్కుతోచని సూరీడు కాలికి బలపం కట్టుకుని వెతికాడు స్థలం కోసం. ఇంటిముందర పెద్ద జాగా ఉన్న వాళ్లందరినీ ప్రాధేయపడి అడిగాడు కాస్త తావులో బంకు పెట్టుకుంటానని .చీదరింపులు, ఛీత్కారాలు బదులుగా తీసుకుని కూడా వెతుకుతూ తన చివరి ప్రయత్నం సఫలమౌతుందనే నమ్మకంతో ముందడుగు వేసాడు సూరీడు.
ఆ రోజు గూడూరులో ఉదయం పదకొండు గంటలకే ఎండ చురుక్కుమనిపిస్తోంది. ఎవరిమీదో ఉన్న కోపాన్నంతా ఆ ఊర మీరే చూపిస్తున్నట్లు సూర్యుడు భగభగా మండిపడుతూ నిప్పుల, కురిపిస్తున్నాడు.
అప్పుడే టిఫిన్ సెక్షన్ ముగిసి జనం పల్చ పడ్డారు. హోటల్ లో ఒకరిద్దరు తప్ప పెద్దగా జనం ఎవరూ లేరు. గల్లా పెట్టి టేబుల్ దగ్గర కూర్చుని ఆ రోజు జమ అయిన డబ్బుని లెక్క పెట్టుకుంటున్నాడు మూర్తి. గళ్ళ లుంగీ, మాసిన తెల్లచొక్కా వేసుకుని భుజాన వేసుకున్న పై గుడ్డతో నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ హోటల్ లోకి వచ్చాను సూరీడు.
“అరే సూరిబాబు రారా, నాలుగు రోజులు నుంచి కనపడలేదు. ఎక్కడికి వెళ్ళావు. నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా నన్ను అడుగుతున్నారు. సూర్యం ఏడని” అన్నాడు. మూర్తి, అంకయ్యను కేకేసి చల్లటి నీళ్లు తెమ్మని. చల్లటి నీళ్ళు తాగి నిమ్మగించాక “మూర్తిబాబు మా టీ బంకు ఉండే తాపు వోనర్ ఆడనించి ఖాళీ చేయమన్నాడు.
అక్కడేదో అపార్ట్మెంట్ కట్టాలట. ఉన్నపళంగా బంకు తీసెయ్యమనే తలికి నాకు ఏం దిక్కుతోచలా, అన్ని చోట్ల తావు కోసం వెదికి యాడ దొరక్క నాకు మీరే మంచి తోవ చూపిస్తారనే విశ్వాసంతో నీ కాడికి వచ్చాను. మూర్తిబాబు అన్నాడు సూరీడు తను చేసిన ప్రయత్నాలు, పొందిన ఛీత్కారాలు వివరిస్తూ…..
“మరి ఇప్పుడు చేద్దామనుకుంటున్నావు సూర్యం నువ్వు” అన్నాడు మూర్తి. ” అది తెలికే నీకాడికొచ్చాను మూర్తిబాబు, ఊర్లో అందరూ నన్ను ఒరేయ్, తురేయ్ సూరిగా అని పిలిచిన తమరొకరే పేమగా సూరిబాబు అంటారు. తమరే ఆలోచించి నాకు ఏదో ఒక దారి చూపాలి. లేకుంటే నేను, మా ఆడది , పిలకాయలు అంతా ఇంత విషం తాగి సావాల్సిందే. ఆ బంకు తప్ప నాకు మరే ఆధారం లేదు మూర్తి బాబు” అన్నారు సూరీడు ఆవేదనగా తప్పు సూర్యం ఎప్పుడూ అలా చావు గురించి ఆలోచించవద్దు. ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది. అని ఒక్క నిమిషం ఆలోచించి సూరీ నవ్వే దిగులు పడకు. నా హోటల్ కి కుడి ప్రక్కన ఉండే ప్రహరీ గోడకి, రోడ్డుకి మధ్యలో ఐదంకణాల తావు ఉంది. ఆ తావుకి అవతలే గవర్నమెంటు రోడ్డు ఉండేది.. ఆ తావు హద్దులు అన్నీ నా ఇంటి కాగితాల్లో ఉన్నాయి. అది నా స్థలం అవుతుంది. ఆ జాగాలో నీ బంకు సరిపోతుంది. నీ బంకును తెచ్చి అక్కడ పెట్టుకో అన్నాడు. మూర్తి, ఆ మాటలు విన్న సూరీడి చెవిలో అమృతం పోసినట్లయింది. సాన సంతోషం మూర్తి బాబు. నా సమస్య ఇంత తేలిగ్గా తీరుతుందని తెలియక వారం నించి ఊరంతా జాగా కోసం తిరుగుతా ఉండాను. తమరే మంచి రోజు చూసి చెప్పండి” అన్నాడు సూరీడు.
సూర్యం “మంచి పని చెయ్యడానికి చెడ్డ రోజంటూ ఉండదు. మనం ఎప్పుడు పని ప్రారంభించాలను కుంటే ఆ రోజే మంచి రోజు ” అన్నాడు మూర్తి ” There is no wrong time to do right thing ” అనే నానుడిని గుర్తు తెచ్చుకుంటూ. సంతోషంగా బయలుదేరి పోతున్న సూర్యాన్ని ఆపి “అబ్బయ్యా మధూ అని కేకేసి మన సూరిబాబు ఏ తెల్లవారి జామునో “టీ” నీళ్ళు తాగి ఉంటాడు. ఆకలి అని కూడా చెప్పడు . సూరిబాబుకి ఇడ్లీ నాస్టా చట్నీ, కారం పొడి తెచ్చివ్వు” అన్నాడు మూర్తి. నువ్వు చల్లగా ఉండాలి మూర్తిబాబు అని సూరీడు సంతోషంగా నాస్టా తినేదానికి పోయాడు.
అలా సూరీడి టీ బంకు మూర్తి హోటల్ పక్కకి వచ్చింది. ఇలా సూరీడి టీ బంకు తన తావు లోనే పెట్టించడంలో మూర్తికి ఏ స్వార్ధం లేదు. అట్లని ఇబ్బందీ లేదు. కేవలం సూరీడి అవస్థ చూసి తన హోటల్ ప్రక్కన బంకు పెట్టుకోమన్నాడు. కాకపోతే ‘టీ” బంకు కు వచ్చేవాళ్లు ఓ నలుగురూ హోటల్ కి వస్తారని చిరు ఆశ అంతే. సూరీడు మూర్తి హోటల్ గోడ కానుకుని ఉన్న స్థలంలో టీ బంకు పెట్టుకున్నాడు. జనాలు అట్లా కొత్త తావుకి టీ తాగడానికి అలవాటు పడ్డారో లేదో ఇట్లా మళ్ళీ ఓ కొత్త సమస్య పుట్టుకొచ్చింది సూరీడికి నేనున్నానంటూ. హోటల్ ప్రహరీ గోడకానుకుని టీ బంకు . దానికి నాలుగడుగుల అవతల అడ్డ రోడ్డు. ఆ రోడ్డుకి ఆవలి (అవతల) ప్రక్క సరిగ్గా ఏదాళంగా [ఎదురుగా] సుబ్బానాయుడి ఇల్లు ఉంది. రోజు పొద్దు పొద్దున్నే సుబ్బానాయుడు టీ బంకు కాడకు వచ్చి” సూరిగా ఈ తావు మున్సిపాలిటీది. ఈడనించి నీ బంకు ఎత్తేసేయ్. . పొద్దునే కులం తక్కువోడి ముఖం చూడాల్సి వస్తోంది మేము. ఇంటి ముంగిట జనాల గోల అని గొడవ పడటమే కాక వాళ్ళ అల్లుడితో కల్పి బంకును రకరకాల యాంగిల్స్ (కోణాల్లో ఫోటోలు తీసి ప్రభుత్వ స్థలం కబ్జా చేసి ‘టీ’ అంగడి నడుపుతున్న వైనం’ అని పేపర్లలో వేయించాడు.
ఆ స్థలం మున్సిపాలిటీది కాదు మామూర్తి బాబుది అని సూరీడు, రాదమ్మ ఎంత మొత్తుకున్నా వినకుండా మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేసాడు సుబ్బానాయుడు బంకు అక్కడ నుంచి తీసెయ్యాలని. దీంతో మున్సిపల్ ఆఫీస్ నుంచి మనిషొచ్చి స్థలం వివరాలు తెలుసుకోకుండానే సూరీడిని “వీధి కి బంకు అడ్డంగా ఉంది. అక్కడ నించి తీసెయ్యమని హెచ్చరించి వెళ్ళాడు. అలా టీ బంకు తెరిచిన వారంలోనే సూరీడి ఆనందం పాలపొంగు మీద నీళ్ళు చిలకరించినట్లు ఆవిరైపోయింది. ఆ వారం రోజులు మూర్తి హైదరాబాద్లో పని ఉండి వెళ్ళాడు. అతను వచ్చేలోగా ఇవన్నీ జరిగిపోయి బంకు మళ్ళా మూతబడింది.
మూర్తి గూడూరికి వస్తూనే సూరీడు వెళ్ళి తనగోడు వెళ్లబోసుకున్నాడు . “మూర్తి బాబు మీరు పెద్దమనసుతో బంకు పెట్టుకోమని నాకు జాగా ఇచ్చినా ఆ సుబ్బానాయుడు నా మీద కక్ష గట్టాడు. ఈళ్ళందరికీ నేనేం అప కారం చేసాను మూర్తి బాబు. మళ్ళా వీళ్ళే నా కాడికొచ్చి ‘టీ ‘లు తాగి డబ్బులు ఎగ్గొట్టినోళ్ళు చాలామంది ఉండారు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా నా మానాన నేను అంగడి పెట్టుకుంటే వీళ్ళు ఇల్లా వొచ్చి నన్ను ఇగ్గు మగ్గు (నెల్లూరు యాస చిరాకు, అవరోధం] చేస్తా ఉండారు. సుబ్బానాయుడు బంకు తీసేదాక నన్ను వ దిలేట్టు లేదు. కులం తక్కువోనిగా పుట్టడం నా నేరమా” అంటూ మూర్తిని పట్టుకుని ఏడ్చాడు సూరీడు.
“అరే.. సూరి ఏడవకు, కన్నీళ్ళు చాల విలువైనవి. ఇలాంటి చిల్లర విషయాల కోసం ఏడ్చి వాటి విలువను తగ్గించకు. అయినా ఇప్పుడు బాధపడి, కూర్చుంటే సమస్య తీరదు. మనం పరిష్కారం ఆలోచించాలి. ఈ ప్రపంచంలో కులం, మతం జాతి, ప్రాంతం అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంది. ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా తన మానాన తాను బ్రతుకుతూ, బ్రతుకు తెరువు చూసుకునే వాళ్ళను ఆ బ్రతుకు తెరువు లేకుండా చే వారిని క్షమించకూడదు” అన్నాడు మూర్తి ఒకింత ఆవేశంగా. మరి ఇప్పుడు నన్నేం సెయ్యమంటావు మూర్తి బాబు, “టీ’ అంగడి లేకుంటే నేను నా ఆడది ఉరేసుకోవాల్సిందే” అన్నాడు నూరీడు బాధగా.
సూర్యం చావు అన్నింటికీ పరిష్కారం కాదు. అసలు దేనికి చావు పరిష్కారం కాదు. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా వివేకంతో ఎదుర్కోవాలి. ఆ సుబ్బానాయుడు (పదేపదే) తేపతేపకీ నిన్ను కులం తక్కువోడు అని దూషిస్తున్నాడు కదా! అదే నీ వజ్రాయుధం. కులం, మతం కన్నా మానవత్వం చాలా గొప్పది నూర్యం మానవత్వానికి విఘాతం కల్గిస్తూ మనిషిని కులం పేరు చెప్పి దూషించడం నేరం. క్షమించరాని చేరం.
నువ్వు మీ వాళ్ళని నలుగురిని తీసుకుని నెల్లూరు వెళ్ళు అక్కడ కలెక్టర్ ఆఫీస్ వెళ్లి జిల్లా, కలెక్టర్ “సునీల్ కుమార్ ” బాబుని కలవండి. మీ సమస్యని వివరించండి. కులం తక్కువ వాడని నిన్ను దూషించిన వాళ్ళమీద కలెక్టర్ కి ఫిర్యాదు రాసిచ్చారంటే అది అట్రాసిటీ కేసు అయి వాళ్ళని ఎదుర్కునే తిరుగులేని అస్త్రం అవుతుంది. మన జిల్లా కలెక్టర్ “సునీల్ కుమార్” బాబు చాలా మంచోడు. పేదలకోసం, దళితుల అభివృద్ధికోసం ఆ బాబు చాలా కృషి చేస్తున్నాడు. ఆయన తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం చూపుతారు. మీరు కేసు పెట్టారంటే ఇక దోషులైన వారు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి ఊచలు లెక్కపెట్టుకోవల్సిందే” అన్నాడు మూర్తి.
సూరీడు కళ్ళు తుడుచుకుని “సరే మూర్తిబాబు ఇక ఆ పనిమీద ఉంటాను నేను అంటూ హోటల్ నుండి వెళ్ళిపోయాడు.సూరీడు అలా వెళ్ళాడో లేదో ఇలా హోటల్లోకి దూసుకొచ్చాడు సుబ్బానాయుడు వస్తూనే “ఏమయ్యా మూర్తి నీకేమైనా మతుందా? మా కెవురికీ చేతగాకనా సూరీగాడి బంకును నీ హోటల్ ముందు పెట్టించావు. మర్యాదగా వాణ్ణి ఆడనుంచి బంకు ఎత్తేయమని చెప్పు నువ్వీ కులం తక్కువోడితో చేరి వాణ్ణి నీ పక్కన పెట్టుకున్నావంటే నిన్ను కూడా ఎలేస్తాం మేము. నర్సి రెడ్డి కూడా ఇదే మాటన్నాడు. నిన్ను ఎచ్చరిస్తా ఉండాను. ఆనక నీ ఇష్టం. ” అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్పి వచ్చినంత విసురు గానే బయటకెళ్ళిపోయాడు సుబ్బానాయుడు. కొండ అద్దమందు కొంచమై కనిపిస్తుంది. అంతమాత్రం చేత దాని విలువ తగ్గిపోదు. కుల దురహంకారుల, మూర్కుల ముందు వాదించడం దండగ అని మౌనంగా ఉండి పోయాడు మూర్తి సుబ్బానాయుడుకి ఎదురు మాట్లాడకుండా. అలా సూరీడి బంకు తన హోటల్ పక్కన పెట్టించి నందుకు మూర్తిని కూడా ఆ వీధిలో కొందరు శత్రువుల్లా చూడసాగారు.
కాలమే అన్నింటినీ పరిష్కారం చూపుతుంది అని మూర్తి వాళ్ళను పట్టించుకోలేదు. వాళ్ళ బాబాయి కాలం చేయడంతో వాళ్ళ ఊరికి వెళ్ళి కార్యక్రమాలు అన్నీ దగ్గరుండి జరిపించి తిరిగి వచ్చేసరికి పది రోజుల పైనే అయింది.
ఊరినుంచి వచ్చిన రోజు హోటల్ లో కూర్చుని ఉన్న మూర్తి దగ్గరకు కుంటుతూ వచ్చాడు సూరీడు కాలికి పెద్ద కట్టుతో. అయ్యో సూరిబాబు రారా…కాలికి ఆ కట్టేంది. మా బాబాయి చనిపోవటంతోఊరికి వెళ్ళాల్సి వచ్చింది నేను మీరు నెల్లూరు కి వెళ్ళారా ? కలెక్టర్ ని కలిసారా లేదా ? అంకయ్యను గురించి అడిగితే నువ్వు ఔపడలేదని చెప్పాడు. కొంపదీసి ఆ పెద్ద మనుషులు నీ మీద చెయ్యి చేసుకున్నారా ఏమిటి?అంటూ ప్రశ్నల వర్షాన్ని సంధించాడు మూర్తి ఆపకుండా. ” లేదు మూర్తి బాబు, మేము కలెక్టర్ బాబుని కలవలేదు. నేనే ఇంకేడైన తావున బంకుని పెట్టుకుంటాలే” అన్నాడు సూరీదు. అదేంటి సూరీ! నువ్వేం నేరం చేశావని ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్నావు . అసలేం జరిగిందో నాకు చెప్పు” అన్నాడు మూర్తి అనునయంగా. అదే మూర్తిబాబు తమరు సెప్పినట్లే వారం ముందర కాగితం మీద ఫిర్యాదు రాసి మా వాళ్ళని తీసుకొని నెల్లూరు పోయిన కలెక్టర్ బాబుని కలిసేందుకు.
“మరి కలిసారా” ఆత్రుతగా అడిగాడు మూర్తి. “లేదు బాబు నెల్లూరులో మద్రాసు బస్టాండ్ కాడ బస్సు దిగి కలెక్టరాఫీసు తావన నడుచుకుంటా పోతుంటే మేము ఓ తాగుబోతు సచ్చినోడు ఆటోని అడ్డదిడ్డంగా నడపతా వచ్చి నన్ను గుద్దేశాడు. బాబు నేను క్రింద పడి పోయాను. ఒళ్ళంతా అదిరింది. అక్కడక్కడా దోక్కుపోయి నెత్తురు దెబ్బలు తగిలాయి. మోకాలి కాడ పెద్ద కూసుగా ఉండే [ మొనదేలి) రాయి దిగబడి చానా రకతం పోయిందట. నేను కళ్ళుతిరిగి పడిపోయానట.
ఊపిరి పీల్చుకుని మళ్ళా చెప్పసాగాడు. మా వాళ్ళు నన్ను మళ్ళా ఆటో ఎక్కించుకోని బొల్లినేని ఆసుపత్రి కాడికి తీసుకుపోయారు. అడ అంటూ ఒక్క క్షణం ఆగండి సూరీడు.
“చెప్పు సూరి అక్కడేం జరిగింది. నీకేం కాలేదుగా” అత్రంగా అడిగాడు మూర్తి. అది అది నాకేం కాలేదు. మూర్తి బాబు రకత పరీక్షలు చేసి కట్టు కట్టారు . కానీ ఆ సుబ్బానాయుడు అల్లుడికి పెద్ద యాక్సిడెంటు జరిగి చాలా రక్తం పోయి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. రక్తం ఎక్కించకుంటే పేనం నిలవదని డాక్టర్లు సెప్పినారంట బాబు, రక్తానికి ఏదో గ్రూపులని ఉంటాయట కదా, ఆ బాబు రక్తం గ్రూప్ ఎక్కడా దొరకలేదట. వాళ్ళ బంధువుల్లో కూడా ఎవరికీ ఆ గ్రూప్ లేదట బాబు. ఆడ నాకు రక్త పరీక్ష చేసిన నర్సు వాళ్ళకి చెప్పిందట. ఆ బాబుది నాది ఒకటే రక్తం గ్రూపు అని. ఆ పెద్ద మనిషి సుబ్బారాయుడు నా కాళ్ళు పట్టుకుని “సూర్యం నా అల్లుడికి రక్తమిచ్చి ప్రాణ భిక్ష పెట్టారా.. నిన్ను చాలా బాధ పెట్టాను. నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను” అంటూ బతిమాలాడు.
నాకు చానా విచిత్రం అనిపించింది మూర్తి బాబు. మనుషుల కులాలు వేరు, మతాలు వేరు, కానీ మనుషులందరి రక్తం మాత్రం ఒకటే. ఆ సుబ్బానాయుడు వా కాళ్ళు పట్టుకుని బతిమాలి “సూరి మనిషికి ఉండాల్సింది కులం కాదు, మంచి గుణం అని తెలుసుకున్నాను . బంకు ఇష్టం వచ్చిన తావన ఎక్కడైనా పెట్టుకో నిన్ను ఏమనం. మనమంతా ఒకటే అని తెలుసుకున్నాను . చచ్చి నీ కడుపున పుడతాను. నా అల్లున్ని బతికించు అని ఏడ్చినాడు . మూర్తిబాబు మీరెప్పుడూ చెప్తా ఉంటారే కులం, మతం కన్నా మానవత్వం మిన్న మనమందరం మానవత్వాన్ని కాపాడాలని, ఆ సుబ్బానాయుడు కన్నీళ్ళు చూసి నేను ఆగలేక పోయాను మూర్తిబాబు, వాళ్ళ అల్లుడికి రకతమిచ్చాను. ఆ బాబు ప్రాణగండం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు నాకు చాన తృప్తిగా ఉండాది. మూర్తిబాబు, నేను బంకు కాడికి పోతాను. మా ఆడదొక్కటే ఆడ అవస్థ పడతా ఉంటుంది ” అంటూ హోటల్ నుంచి బయటకు నడిచాడు సూరీడు.
ఆ రోజు నింగిలో ప్రకాశించే సూర్యునికన్నా కోటిరెట్లు ప్రకాశవంతమైన వెలుగుని ఈ నేలమీది సూరీడి ముఖంలో చూసాడు మూర్తి . ఆ నింగిలోని సూర్యుడు లోకాన్ని జ్ఞానమయం,వెలుగుల మయం చేస్తే ఈ నేల మీది నల్ల సూరీడు మనుష్యుల మనస్సులోని చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించాడు. “ఎంచి చూడగా లోకమందు రెండే కులాలు మంచి, చెడు అని. ‘మంచి అన్నది మాల అయితే ఆ మాల నేనౌతా ‘, అన్న గురజాడ వారి ముత్యాలసరాన్ని గుర్తు చేసుకుంటూ సూరీడు వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు మూర్తి.