4. దిగులంతా మానవత్వం గురించే!

ఈ పక్షం సారంగా పత్రిక లో నా “దిగులు వర్ణం” కవిత్వం గురించి సీనియర్ సాహితీ వేత్తలు శ్రీ విహారి గారి అపురూప సమీక్ష. చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు పత్రికలో కామెంట్ చేయండి. మీ రోహిణి వంజారి

ఇన్ని వర్ణచిత్రణాల మధ్యన రోహిణి జీవన తాత్విక స్పృహని మరువలేదు. బతుకు అర్ధం, పరమార్ధం- కడకు మనిషి చిత్తవృత్తినీ, ప్రవర్తననూ సరళ రేఖపై నిలుపుతాయని తెలిసిన సత్యాన్ని శ్రేయోభిలాషతో మంచి కవితలుగా సంపుటిలో చేర్చారు.

రోహిణి వంజారి సాహిత్యారాధనలో పొద్దుచాలని రచయిత్రి. కథకురాలుగా అనేక బహుమతులను, పురస్కారాలను పొందారు. రెండు కథా సంపుటాలు వచ్చాయి. తన యూ ట్యూబ్ ఛానల్లో ప్రముఖుల పరిచయాలు నిర్వహించడం, ఇతర రచయితల కథలను, కవితలను తన స్వరంలో వినిపించడం ఆమె సౌజన్యానికి, సాహిత్యసేవాసక్తికీ నిదర్శనం. స్నేహశీలి, పర్యావరణ, జీవావరణ ప్రేమికురాలు. “దిగులు వర్ణం” రోహిణి తొలి కవితా సంపుటి. ఆవిష్కరణకు ముందే చాలా మంది ప్రసిద్ధ కవులూ, సంపాదకులూ, విమర్శకులూ ఈ కవితా సంపుటిని సమీక్షించడం, ప్రశంసించడం- ఒక ప్రత్యేకమైన గుర్తింపూ, ఆమె కవిత్వ రచనా బలానికి ఎత్తిన వైజయంతిక.

జీవితంలో దిగులుని అనుభవించడం వైయక్తికం. ఇది ఒక ఎత్తు. దాన్ని గుర్తించడం వేరు. గుర్తించి, దాని సారాన్ని ఒంటబట్టించుకుని, ఒక రూపావిష్కరణం చేయడం మరో ఎత్తు. ఈ ఎత్తుని ఎత్తారు; ఎక్కారు రోహిణి. అందుకనే ఈ ‘దిగులు వర్ణం’ ని వర్ణ సమాన్మాయం అంటున్నాను నేను. అంటే దిగులుకు చాల తలకట్లు, కొమ్ములూ, గడులూ, సుడులూ  వగైరా చాల సంజ్ఞలు ఉన్నాయి. ‘దిగులు వర్ణం’ రూపకమా లేక దిగులు యొక్క వర్ణమా! ఇంతకీ ఈ వర్ణం రంగా, కులమా? అక్షరం మాత్రమేనా? పెద్ద విచికిత్స! ఈ విచికిత్సలోని అన్నీ పార్శ్వాలకీ సమాధానాలు చెప్పాయి – ఈ సంపుటిలోని కవితలు! రచయిత్రి ‘దిగులు’ సమాహారం పెద్ద చిత్రవర్ణదర్శిని. అది బహుపార్శ్వాలు కలిగినది.      బాల్యం, యవ్వనం, స్నేహం, ప్రేమ, అనుభందం, గతం ఈ అనుభూతుల మిశ్రమం ఆమె ‘దిగులు వర్ణం’.

‘మా నాయన ఊరు’ అనే కవితలో  “ఎన్నని చెప్పను / జ్ఞాపకాల ట్రంకు పెట్టెలో/ దాచుకున్న పసిదనాల ఊసులు../ఇన్నాళ్ళకు మళ్ళీ ఊరిలోకి, చేనులోకి/ పల్లె పగడాల నవ్వులను తనివితీరా ఏరుకుని/ పచ్చటి పైరగాలిని ఊపిరుల నిండా నింపుకుని/ నా బాల్యపు ఘ్నపకాల ట్రంకు పెట్టెని/ మీ కోసం తెరిచాను మళ్ళీ ఇక్కడ” అంటూ స్మృతిధారలో ‘పల్లె పగడాల నవ్వులు’ వంటి కవితాత్మక వ్యాక్యాన్ని జాలువారుస్తుంది.

ఇలాంటిదే మరో ఖండిక ‘నా బాల్యపు మిఠాయి అంగడి’ – ‘కయ్యకయ్యా తిరిగి ఏరుకున్న పరిగ మోపులు’ ని చూపుతుంది. ఎన్నెన్నో ఆర్ద్రమైన వ్యాక్య స్పర్శలూ, జ్ఞాపకాల తీపిగురుతులూ!  ‘ముంగింట్లో ముత్యాలు’ – చక్కని రంగు ముగ్గులు – ‘ఆమె చూపుడు వేలూ బొటన వేలూ దీక్షగా కదులుతుంటే/ మధ్యన పువ్వు నుంచి రాలే పచ్చని పుప్పొడిలా’ ముగ్గు పొడి విన్యాసానికి అభివ్యక్తి సాంద్రత కవిత్వ చిత్రాన్ని చూపుతుంది. రచయిత్రి భావుకత కలిసి వాస్తవ దృశ్యావిష్కరణం రససిద్ధిని కలిగిస్తుంది.

ఈ దృశ్యాత్మకతని నిబిడంగా నింపుకున్న కవితలు ఈ సంపుటిలో మనోహరంగా దర్శనమిస్తాయి. ‘ఉత్సవం’ అద్భుతంగా రచయిత్రి ‘హేమంతపు ఉషోదయపు నడక’ ఎలా ఉత్సవమై సాగిందో చూపుతుంది. చదువరిని ఆ గమనంలో భాగస్వామిని చేసి ఊసులాడుతుంది. ఈ కవయిత్రి బతుకు చదువుని గట్టిగా చదువుకుని, గతుకుల్లో నడిచిన అనుభవాలు కలిగిన బుద్దిజీవి. అందుకే సామాజిక సంక్షోభాల్లో సాధారణ మనుషుల ఇక్కట్లూ, కాల పరిణామ స్పృహ ఆమె కవిత్వంలో చాల ప్రశ్నల్ని రేపుతాయి. సంపుటి మొదలే ‘నేలతల్లి’ కవిత వచ్చింది. నేలతల్లి రైతు దుర్దశకు రోదిస్తుంది. ‘ఈ రోజు నీ పంట మీద నీకు హక్కు లేదంటూ/ నిన్ను నిలువునా నిలువరిస్తుంటే/ ఏమి చేయలేని నిస్సహాయ తల్లిలా తల్లడిల్లుతున్నా’ అని. ఇలాగే మరో కవితలో ‘రైతుల పాదాలకంటిన బురదను/ ఆర్తిగా ముద్దాడుతాను’ అన్నారు. సరిహద్దు రక్షకులకు జోహారు అనీ, ‘ఎన్ని ఉగాదులొచ్చినా’ సామాన్యుల బతుకు గీత సరళం కాకపొతే ప్రయోజనం ఏమిటనీ – స్పష్టంగానే చెప్పారు.

నైరూప్యమైన కవితా వస్తువుల్ని ఎన్నుకుని, వాటి అక్షరీకరణ ద్వారా, పఠితకు అనుభూతిని కలిగించడంలో రోహిణిది అందెవేసిన చెయ్యి. ఆమె ‘మాట’ గురించి [అవసరం, అనవసరం జాగ్రత్తల హెచ్చరికలతో] రాశారు. ‘ఒంటరి దుఃఖం’ గురించి రాశారు. ‘భయం’ గురించీ, దాని పర్యవసానం గురించీ విశ్లేషించారు.

గతాన్ని నెమరువేసుకుంటున్నా, వర్తమానంలో జీవిస్తున్న కవయిత్రిగా రోహిణి తన ముందూ, చుట్టూ జరుగుతున్న కాలహేలని,  ‘మనిషి’ రీతి రివాజుల్ని నిశితంగా చూస్తున్న  పరిశీలకురాలు. దీనికితోడు ఆమెకు అత్యంత గాఢంగా హృదయ నిమగ్నత కలిగిన కవితా వస్తువులు -స్త్రీ, ఈనాటి స్త్రీ జీవితం. స్త్రీ అనుభవిస్తున్న స్వేచ్చా రాహిత్యం, అణచివేత, లింగ వివక్ష, వ్యక్తిత్వ హననం, గృహ హింస, ఆమె బహిరంతర పోరాటం, మృగాడి అత్యాచారం, ఆధిపత్య ధోరణి- వీటన్నిటిపట్లా రోహిణి నిరసన, తిరస్కారం, నిష్కర్షగా ఆమె తన కవితల్లో వెల్లడించారు. ‘సహచరుడా, ‘దేశం-దేహం’, ‘అభ్యుదయం’, ‘అవును నేను చెడ్డదాన్నే’, ‘సూసైడ్ నోట్’, ‘మదపిశాచుల నికృష్టపు కరస్పర్శ’, ‘డెజావు’, ‘స్వేచ్ఛ ఒక స్వప్నం’, ‘నిస్సహాయ పక్కటెముక’ వంటి కవితల్లో ఆమె సంవేదన, సమానత్వం కోసం ఆక్రందన, వ్యక్తిత్వ సాధనకు ఆక్రోశం- అన్నీ పదునుగా అక్షరీకరణం పొందాయి.

“దిగులు’ కు గల ఇన్ని పార్శ్వాల వర్ణాలను చూపిన రోహిణి అసలు ‘దిగులు’ – ‘మనలో ప్రవహించే జీవనదికి లేని బేధాలు/ మనకెందుకో మరి/ యుగాలు మారినా, తారలు మారినా/మారని మనిషి అంతరంగాన్ని మార్చే/ మానవత్వపు రక్త వర్ణమా నువ్వెక్కడ, ఎక్కడ?’ అనే విషాద విలాపం!! అమానవీయ సంస్కృతీ  అంతం కావాలనే ఆరోగ్యకరమైన ఆకాంక్ష!! ‘ప్రవర’ వంటి అనితరసాధ్యమైన ఆర్ద్రాభివ్యక్తి  కలిగిన కవిత ఈ సంపుటికి ఒక మణిపూస. భిన్నత్వంలో ఏకత్వం – మానవత్వం అనే వాంఛనీయమైన సందేశాన్ని కవితా మాయం చేసిన మేలి రచన ఇది.

ఇన్ని వర్ణచిత్రణాల మధ్యన రోహిణి జీవన తాత్విక స్పృహని మరువలేదు. బతుకు అర్ధం, పరమార్ధం- కడకు మనిషి చిత్తవృత్తినీ, ప్రవర్తననూ సరళ రేఖపై నిలుపుతాయని తెలిసిన సత్యాన్ని శ్రేయోభిలాషతో మంచి కవితలుగా సంపుటిలో చేర్చారు. ‘నిర్మాల్యం’ కవిత రోహిణి కవితా ప్రస్థానంలో ఆమె పట్టుకున్న విజయ కేతనం అనటం సహజోక్తి!!

కవిత్వ శిల్పపరంగా రోహిణిది నిరాడంబర వ్యక్తీకరణం. వస్తువులో కేంద్రీకరణాన్ని మరువకుండా ఆధ్యాంతాలను, మధ్యన నడకనీ జాగ్రత్త చేసుకునే ముఖ్య లక్షణాన్ని ఆమె కవితా నిర్మాణం చూపుతోంది. వాక్యాన్ని అందంగా, నవంనవంగా చెప్పాలనే ఆర్తి ఉన్న కవయిత్రి రోహిణి. ‘గారడి చక్రం’ వంటి ఖండికలు స్ట్రక్చరల్ బ్యూటీ కి ఉదాహరణలు. ‘ఆవేదన’వంటి పద్యాలు రోహిణి నేర్చిన కవిత్వంలో శృతిలయల ప్రాధాన్యాన్ని, వాక్యానికి తూగు, ఊగు, ఉద్వేగం, ఉత్తేజం కల్పించగల నైపుణ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి కవితలన్నీ చదువరిని ‘ఆగు – చూడు – మళ్ళీచదువు’ అనే ప్రోత్సహిస్తాయి. ఆలోచనా ప్రేరకాలు అవుతాయి.

రోహిణి వ్యక్తిత్వానికి మూలబలం ఆమెకు సాటి మనుషుల పట్ల గల సానుకూల దృక్పథం, ఆత్మీయమైన మనోధర్మం, సౌమ్య గుణం వీటి ప్రతిఫలనమే ఆమె సాహిత్య వ్యక్తిత్వానికి పట్టుగొమ్మ అవుతోంది. కవిత్వ ప్రియులకు తుష్టినిచ్చే పుష్టిగల కవితా సంపుటి ‘దిగులు వర్ణం’. కొని, చదివి ఆనందించండి.

దిగులు వర్ణం’ కవిత్వ సంపుటి

ప్రతులకు : 

 రోహిణి వంజారి  మొబైల్ నెంబర్: 9000594630  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *