దిగుడు మెట్లు

కవిత చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి 🌹🌹

“ఓ చెంప జననం మరోపక్క మరణం

ద్వంద్వ సమాసంలా ఆనందం దుఃఖం..

ఇంకెక్కడో ద్వేషం మోసం అసూయ

త్రిక సంధిలా తట్లాడుతుంటాయి..

అక్కడెవరికో పదవొచ్చిందని

ఇక్కడ గుండెల్లో మంట రేగుతోంది..

ఎక్కడో పార్టీలో ఎవరో దొరికారని

నిద్రని తరిమి నిశీధిలో..

యూ ట్యూబ్ వీడియోల శోధనలో

తనని తాను మరచి..

ఆవేశం ఆక్రోశం అవహేళన

వ్యాప్తి చేస్తూ

ఇక్కడ చాకిరేవులా

మార్చుకుంటున్న బతుకు ..

కుళ్ళు చెత్తతో బుర్ర నింపుకుని

మన ఇంటిముందు చెత్తని

ఎదురింటి ముందు పడవేసినట్లు

బుర్రలో చెత్తని

దశదిశలా వ్యాప్తి చేయనిదే

మనసుకు లేని శాంతి ..

నిశీధిలో నడయాడే పిశాచుల్లా

ముఖపుస్తక దారుల్లో

చీకటి సంచారం ..

తనలోకి తాను చూసుకునే

సమయంలేక ఓటమి మెట్లు

ఒక్కొక్కటీ దిగుతూ నేటి మనిషి..

రోహిణి వంజారి

26-5-2024