దమనం

మిత్రులకు నమస్తే. మనుషుల జీవితంలో, వారి పసితనంలో జరిగిన విషాద సంఘటనలు, లేదా ఇష్టం లేని విషయాలు మనసు పొరల్లో మారుమూలకు నెట్టివేయబడతాయి. వారు పెరిగే క్రమంలో తిరిగి అలాంటి సంఘటనలు లేదా అప్పటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే నేపథ్యంలో రాసిన ఈ కథ “దమనం” విశాలాక్షి మాసపత్రిక వారి సంక్రాతి కథల పోటీ విజేతల కథల సంపుటిలో ప్రచురితం అయింది. ఈ కథల పోటీని మా అమ్మ జ్ఞాపకార్ధం “అరిశా ఆదిలక్షమ్మ స్మారక కథల పోటీ ” గా నేను స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ కథని మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా.



షూ లేసులు కట్టుకుంటూనే మెడ పక్కకి వంచి చెవికి భుజానికి మధ్యలో ఉన్న సెల్ నుంచి” హలో..గౌరవ్..హాస్పిటల్ కి బయలుదేరేసావా ” అన్నాడు రితేష్
” లేదు.. ఈ రోజు నువ్వు వస్తానన్నావ్ గా.. హాస్పిటల్ కి మధ్యాన్నం వస్తానని హెడ్ డాక్టర్ కి ఫోన్ చేసి చెప్పేసాను. నువ్వు ఇంటికి వచ్చేయ్”. తన సమాధానం వినకుండానే ఫోన్ కట్ చేసాడు డాక్టర్ గౌరవ్.
సెల్లార్లో కారు పార్కింగ్ చేసి లిఫ్ట్ దగ్గరికి వచ్చి బటన్ నొక్కాడు రితేష్.
“సుధా..” గౌరవ్ పిలుపు పూర్తీ కాకముందే ట్రే లో బిస్కట్లు, కాఫీ, ముఖంలో నవ్వు నింపుకుని ప్రత్యక్షము అయింది అతని భార్య వసుధ. ట్రే అందుకుని ఓ కప్పు రితేష్ కి అందించాడు గౌరవ్.
” గుడ్ మార్నింగ్ అన్నయ్యా.. మైత్రి ఎలా ఉంది” హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటూనే అడిగింది వసుధ రితేష్ ని. ” బాగుందమ్మా.. తను కూడా ఈ రోజు రావాల్సింది. కాస్త ఒంట్లో నలతగా ఉందని రెస్ట్ తీసుకుంటానంది” ముఖంలో ఏ భావం లేకుండా అన్నాడు రితేష్.
” ఓకే అన్నయ్యా.. లంచ్ కి అన్ని రెడీ చేశాను. ఈ రోజు ఈవెనింగ్ ఆఫీసులో స్పెషల్ మీట్ ఉంది నాకు. రావడం కాస్త లేట్ అవుతుంది” అని గౌరవ్ వంక చూస్తూ ” మీరు కూడా ఈ రోజు నైట్ డ్యూటీకి వెళ్తానన్నారు కదా హాస్పిటల్ కి ” అంటూ వాళ్ళకి బాయ్ చెప్పేసి ఆఫీసుకి వెళ్ళిపోయింది వసుధ.
వెళుతూ వెళుతూ వసుధ సందడినంతా తనతో తీసుకువెళ్లినట్లు ఇల్లంతా నిశ్శబ్డం ఆవరించింది. కాఫీ తాగి కప్పులు ఒకేసారి టేబుల్ మీదా పెట్టారు రితేష్, గౌరవ్. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. రితేష్ బిజినెస్ పర్సన్ అయితే, గౌరవ్ ప్రఖ్యాత న్యూరోసర్జన్, సైకాలజిస్ట్.
” ఇప్పుడు చెప్పు రితేష్. ఏంటి ఇంత డల్ గా ఉన్నావు. నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు నేను. నువ్వు , మైత్రి అంతా ఓకే కదా..! బిజినెస్ మానేసి జాబ్ చేస్తానంటున్నావ్ ఏంటి..? రోజు లక్షల్లో డీల్ చేసే వ్యాపారం. ఇంత సడన్ డెసిషన్ ఏంటి రితేష్? ” గౌరవ్ ప్రశ్నిస్తున్నా..పరధ్యానంలోనే ఉన్నాడు రితేష్. స్నేహితుడి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు గౌరవ్.
కాస్త తేరుకుని పరం నించి ఇహం లోకి వచ్చి ” సారీ గౌరవ్. నా సమస్య నీకు చెప్పుకోవడానికి వచ్చి పరధ్యానంలోకి వెళ్ళిపోయాను. నిజానికి సమస్య నాది కాదు.” అన్నాడు రితేష్ టేబుల్ అంచు గట్టిగా పట్టుకుని.
“మరి ” ఎవరిదన్నట్లు ప్రస్నార్ధకంగా చూసాడు గౌరవ్.
” మైత్రి ది ” కాస్త వేదన ధ్వనించింది అతని గొంతులో.

ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్ధం. ” మైత్రి అబార్షన్ చేయించుకుంటుందట” ఒక్కో పదం చెప్పడానికి చాల కష్టపడ్డాడు రితేష్. పక్కనే పిడుగు పడ్డట్లు అదిరిపడ్డాడు గౌరవ్.
“రితేష్” అంటూ గట్టిగా అతని భుజం పట్టుకున్నాడు గౌరవ్ నమ్మలేనట్టు చూస్తూ..
” నువ్వు విన్నది నిజమే. మొన్న అర్ధరాత్రి తను సూసైడ్ చేసుకోబోయింది. సమయానికి నాకు మెలుకువ వచ్చింది. తను కిచెన్ లో మణికట్టు దగ్గర చాకుతో కోసుకోబోయింది పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ. ఆఫీస్ లో ఉన్నంతవరకు పని ధ్యాసలో ఉంటుంది. నాకు టూర్లు, రాత్రి లేటుగా రావడాలు మాములే కదా. కానీ మైత్రి ఎందుకిలా ప్రవర్తిస్తోందో తెలియడం లేదు. తనని రాత్రి పూట ఒంటరిగా వదిలి వెళ్లాలంటే భయం వస్తోంది” మాట తడబడుతోంది దుఃఖంతో రితేష్ కి.
” మీ ఇద్దరికి మధ్య గొడవలేమైనా జరిగాయా.. ? ” ప్రొఫెషనల్ డాక్టర్ లా అడిగాడు గౌరవ్.
” లేదు” . ” మరి “
” తాను క్యారీయింగ్ అని తెలిసినప్పటి నుండి తన ధోరణి మారిపోయింది. ఉన్నట్లుండి రాత్రి నిద్రలో లేచి ఏడుస్తోంది. నాకు బిడ్డ వద్దు అని గోలగోలగా అరుస్తోంది. కాసేపటి తర్వాత ఏం జరగనట్లు మాట్లాడుతోంది” బాధగా అన్నాడు రితేష్.
” మీ పెళ్ళి అయిన తర్వాత ఈ రెండేళ్లలో మైత్రి ఎప్పుడైనా ఇలా ప్రవర్తించిందా”
” లేదు. తన సంగతి ఆంటీకి కూడా చెప్పాను. ‘మైత్రి పిల్లలు ఎందుకు వద్దంటుందో మీకు ఏమైనా తెలుసా అని’, ఆంటీ తనకు ఏమి తెలియదని, మైత్రికి తాను నచ్చచెప్తానని చెప్పింది” అన్నాడు రితేష్.
” మరి ఆంటీ మైత్రితో మాట్లాడిందా” సాలోచనగా చూస్తూ అడిగాడు గౌరవ్.
” ఆంటీతో మాట్లాడాకే ఈ ధోరణి ఎక్కువైంది మైత్రిలో” ఆందోళనగా చూసాడు రితేష్. గౌరవ్ లేచి కబోర్డులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఓపెన్ చేసి ఒక సిగరెట్ రితేష్ కి ఆఫర్ చేసాడు. వద్దని తల అడ్డంగా ఊపాడు అతను.
“ఇప్పటివరకు నేను కూడా తాగింది లేదు” నవ్వుతూ గౌరవ్ సిగరెట్ తీసి లైటర్ తో వెలిగించుకుని ఓ దమ్ము లాగి వదిలాడు. రితేష్ చూపుల్లో ఆందోళన ఇంకా తగ్గలేదు. గౌరవ్ ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తున్నాడు.
” మైత్రి మైట్ బి ఇన్ సం ట్రామా ” ఏదో దీర్ఘాలోచనలో ఎక్కడో చూస్తూ అన్నాడు గౌరవ్.
” ఏమై ఉంటుంది. పిల్లలు అంటేనే బిగుసుకుపోతోంది. నాకు చాల భయం వేస్తోంది గౌరవ్..నువ్వు సైకాలజిస్ట్ వి కదా. మైత్రికి ఏమైందో తెలుసుకోలేవా..?”
” కచ్చితంగా తెలుసుకోవాలి. తను ఏదో విషయం లో ఎప్పుడో ఎందుకో డిస్టర్బ్ అయింది. అది ఇప్పుడు బయట పడుతోంది. “మిన్నెసోటా ” యూనివర్సిటీ లో నా ఫ్రెండ్ ప్రొఫెసర్ ప్రఫుల్ల చంద్ర గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. ఈ ఇయర్ ” వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ” కండక్ట్ చేసే ప్రపంచ ఆరోగ్య మహా సభల్లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చి ఉన్నాడు. నిజానికి ఈ రోజు తనని కలవడానికి ఢిల్లీ వెళ్దాం అనుకున్నా..కానీ నువ్వు అర్జెంటు విషయం చెప్పాలన్నావు అని ఆగిపోయా. మైత్రి విషయం తనతో మాట్లాడతాను. అవసరం అయితే ప్రఫుల్ల చంద్ర ను ఇక్కడికి రమ్మంటాను. తన ద్వారా మైత్రికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. నేను కౌన్సెలింగ్ చేయగలను కానీ ప్రాబ్లెమ్ డయాగ్నసిస్ చేయడంలో నాకంటే ప్రఫుల్ల చంద్ర నిష్ణాతుడు” అన్నాడు డాక్టర్ గౌరవ్ ఆశా భావం ముఖంలో తొణికిసలాడుతుండగా. స్నేహితుడు ఇచ్చిన నమ్మకం తో కూడిన భరోసా రితేష్ మనసును తేలికపరచింది.
ప్రొఫెసర్ ప్రఫుల్ల చంద్రకు ఇచ్చే విందుకు రమ్మని గౌరవ్ ఫ్రెండ్స్ అందరినీ పిలవడంతో రితేష్, మైత్రి కూడా ఆ విందుకు హాజరైనారు. విందు అనంతరం తమాషాగా హిప్నోటిజమ్ చేసి అందరి మనస్సులో ఏముందో తెలుసుకుందాం అన్నాడు డాక్టర్ గౌరవ్. సరదాగా ఉంటుందని అందరు అంగీకరించారు. ” గదిలోకి వెళ్ళిన వాళ్ళను ప్రొఫెసర్ ప్రఫుల్ల చంద్ర హిప్నటైజ్ చేస్తారు. సరదా సరదాగా ఆడే అట ఇది” గౌరవ్ చెప్పగానే వంతులవారీగా ఒక్కొక్కరు గది లోకి వెళ్ళి నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు.
“అబ్బా ప్రొఫెసర్ ప్రఫుల్ల చంద్ర గారికి నాకు అప్పుడప్పుడు ఇతరుల వస్తువులు కాజేయటం లో మజా ఉందని ఎలా తెలిసిందో..! భలే కనిపెట్టిసారు ” అంది డాక్టర్ మాయ నవ్వుతూ బయటకు వచ్చి.
” అందుకేనేమో నా టేబుల్ మీద ఉన్న పెన్నులు రోజు మాయమౌతున్నాయి ” అన్న డాక్టర్ విలియమ్ మాటలకు అందరు నవ్వేశారు. డాక్టర్ మాయ ఉడుక్కుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది.
ఇప్పుడు మైత్రి వంతు వచ్చింది. మొదట తను వెళ్ళను అంది మూడీగా. “సరదాగా ఆడే గేమ్ ఇది. అంతే వెళ్ళి రా మైత్రి అని డాక్టర్ గౌరవ్ అనడంతో తడబాటుగా గదిలోకి వెళ్ళింది మైత్రి. వెళ్లేముందు వసుధ బొటనవేలు పైకెత్తి థమ్స్ అప్ సింబల్ చూపింది మైత్రికి. గదిలోకి వెళ్ళగానే ” రామ్మా.. మైత్రి..ఎలా ఉన్నారు నువ్వు, రితేష్” ఆప్యాయత నిండిన ప్రొఫెసర్ ప్రఫుల్ల చంద్ర స్వరం వినగానే ఏదో వింత అనుభూతికి లోనైంది మైత్రి.ఆ గది లో నిండిన ఇంపైన సుగంధ పరిమళం , చల్లని గాలి కొత్త ఉత్తజాన్ని, పాజిటివ్ ఎనర్జీ ని కలిగించింది మైత్రిలో. ప్రఫుల్ల చంద్ర ఆమెకు ఓ యోగిలా కనిపించాడు.
” బాగున్నాం సర్ ” చుట్టూ చూస్తూ చెప్పింది మైత్రి.
” మరి గేమ్ కి నువ్వు రెడీనా మైత్రి ” అనగానే తల ఊపింది అంగీకార సూచకంగా.
” అయితే ఇదుగో ఈ చైర్లో కూర్చో” అనగానే మంత్రముగ్ధురాలిలా కూర్చుంది మైత్రి.
వెంటనే ఆ ఈజీ చైర్ కి ఉండే ఎలక్ట్రో మాగ్నెటిక్ సెన్సార్లు మైత్రి మెదడుకి కనెక్ట్ అయినాయి.
“ఇప్పుడు రిలాక్స్డ్ గా వెనక్కి పడుకోమ్మా, నీకు నిద్ర వస్తే మెల్లగా నిద్రలోకి పో నువ్వు”
మైత్రి కళ్ళు మూసుకుంది. ఐదు నిముషాల్లో తన మైండ్ సబ్ కాన్షియస్ దశ కు వెళ్ళింది. ప్రఫుల్ల చంద్ర పిలవడంతో డాక్టర్ గౌరవ్, రితేష్ కూడా గదిలోకి వెళ్ళారు.
” అమ్మా మైత్రి.. నా మాటలు వినిపిస్తున్నాయా నీకు” ప్రొఫెసర్ మాటకు తల ఊపింది మైత్రి.
“మైత్రి నీకు రితేష్ అంటే ఇష్టమా ” అడగగానే ” తను నా ప్రాణం అంది ” మైత్రి. ” మీది లవ్ మ్యారేజ్ కదా “అన్న ప్రొఫెసర్ ప్రశ్నకు కూడా అవుననే తల ఊపింది మైత్రి
” రితేష్ నిన్ను బాగా చూసుకుంటాడా..? ఐ మీన్ నీతో ప్రేమగా ఉంటాడా”
” తన ప్రాణం కన్నా నన్ను ఎక్కువగా చూసుకుంటాడు. కానీ అది పెళ్ళికి ముందు. ఇప్పుడు నా కంటే బిజినెస్ నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు”.
మైత్రి జవాబు విన్న రితేష్ ముఖంలో మొదట ఓ మెరుపు మెరిసి ఆమె చివరి మాటతో మాయం అయింది.
” మైత్రి.. ఇప్పుడు జాగ్రత్తగా విను.. ఎందుకు నువ్వు అబార్షన్ చేయించుకోవాలనుకున్నావు” ఆ ప్రశ్న వినపడగానే మైత్రి దవడ కండరం బిగుసుకుంది.
” పుట్టిన బిడ్డను ఆనాధను చేయడం నాకు ఇష్టం లేదు” అంది మైత్రి . ఆమె చేతులు ఒణకసాగాయి.
“రిలాక్స్ మైత్రి.. నువ్వు, రితేష్ ఉండగా పుట్టిన బిడ్డ అనాధ ఎలా అవుతుంది “. మైత్రి ఏం చెప్తుందో అని ఆందోళన రితేష్ ముఖంలో తారాడుతుంది.
” నాకు అమ్మా నాన్న ఉన్నా నేను అనాధగానే పెరిగాను”
” కాస్త వివరంగా చెప్తావా మైత్రి ” ఉప చేతనావస్థలో ఉన్న మైత్రి మనసు తను పుట్టిన రోజుల దగ్గరకు వెళ్ళింది.
” నేను పుట్టిన తర్వాత మూడో నెలకే మా అమ్మా నన్ను ఆయా దగ్గర వదిలి తను ఉద్యోగానికి వెళ్ళిపోయిందట. నాకు పాలు ఇస్తే తన స్ట్రక్చర్ పాడౌతుందని నా ఆకలి తీర్చడం కోసం తన గుండెల్లో ఉబికే పాలను బలవంతంగా మందులు వాడి ఎండిపోయేట్లు చేసుకుందట. నాకు పుట్టిన పది రోజుల నుంచే పోత పాలు బలవంతంగా తాగించారట” చెప్తూ మధ్యలో ఆగింది మైత్రి.
” చెప్పు మైత్రి. ఈ విషయాలు అన్ని నీకు ఎలా తెలిసాయి ” అడిగాడు ప్రొఫెసర్
” నాన్న చెప్పాడు”
” మరి నాన్న నిన్ను బాగా చూసుకున్నాడా..? “
” లేదు.. నాకు ఊహ తెలిసేనాటికీ రోజు ఇంట్లో ఆయా తప్ప అమ్మ, నాన్న ఉండేవారు కాదు.
నేను నిద్ర లేచే సరికే అమ్మ ఉద్యోగానికి, నాన్న క్యాంపులకు వెళ్ళిపోయేవారు. వాళ్ళ కోసం నేను ఏడిస్తే ఆయా నన్ను కొట్టేది. సరిగా ఉడకని అన్నం, మాడిపోయిన కూరలు నాకు పెట్టేది. అమ్మకు చెప్తాం అంటే నేను నిద్ర పోయాక ఏ రాత్రి వేళో అమ్మ ఇంటికొచ్చేది. సెలవు రోజుల్లో కూడా మీటింగులంటూ బయటకు వెళ్లిపోయేది. ప్రోగ్రస్ రిపోర్ట్ మీద సైన్ కూడ ఆయా చేత పెట్టించుకోవాల్సి వచ్చేది. స్కూల్లో ఫ్రెండ్స్ అందరు నీకు ఆయా తప్ప అమ్మా నాన్న లేరా..? నువ్వు అనాధవా..అంటూ గేలి చేసేవారు ” కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతున్నాయి మైత్రికి.
మైత్రి మాటలకు చలించిపోయాడు రితేష్.
” కెరీర్, ఉద్యోగ్యం అంటూ మీ అమ్మ, బిజినెస్ టూర్లు అంటూ దేశాలు పట్టుకు తిరిగి నేను మేమిద్దరం నీ చిన్నతనంలో తల్లిదండ్రులుగా నీకు న్యాయం చేయలేకపోయాము రా మైత్రి ” అంటూ నాన్నఈ మధ్యనే ఫోన్ చేసి బాధ పడ్డాడు. అమ్మేమో ” మైత్రి నువ్వు గొడ్రాలు అనిపించుకోకుండా ఓ బిడ్డను కనెయ్. మూడు నెలల తర్వాత నువ్వు జాబ్ కి వెళ్లిపోవచ్చు. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు. లక్షల ప్యాకేజీ శాలరీ ఉన్న జాబ్ మానేయవద్దని రితేష్ కూడా నీకు చెప్పాడుగా ” అంటూ అమ్మ చిన్నప్పుడు నన్ను ఒంటరిని చేసినట్లు నా బిడ్డని కూడా అనాధని చేయమంటోంది”.
మైత్రి చెప్పేది వింటున్న రితేష్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
” మైత్రి.. అమ్మ.. కూల్ డౌన్..మరి నీకు ఇష్టమైనట్లు కొంత కాలం నువ్వు జాబ్ మానేసి బిడ్డను చూసుకోవడానికి రితేష్ అంగీకరిస్తే ఈ అబార్షన్ నిర్ణయం మార్చుకుంటావా..?
మైత్రి మెల్లగా తల ఊపింది. ఈజీ చైర్ కి అయి ఉన్న స్పెన్సర్ల కనెక్షన్ ఆఫ్ చేసాడు ప్రఫుల్ల చంద్ర. ఆ తర్వాత మైత్రికి గాఢ నిద్ర పట్టింది.
ప్రఫుల్ల చంద్రతో పాటు రితేష్, డాక్టర్ గౌరవ్ గది బయటకు వచ్చారు.
” రితేష్.. డోంట్ వర్రీ. మైత్రి ఓ మానసిక సమస్యతో బాధపడుతోంది. కారణాలు అన్ని మనం తన నోటితోనే విన్నాం కదా. ఓ మనిషికి తన చిన్న తనంలో సంభవించిన అవాంఛనీయ సంఘటనలు, లేదా చిన్నప్పుడు ఎదుర్కున్న కష్టాలు, ఉదాహరణకు పసి వయసులోనే తల్లి తండ్రుల మరణం, లేదా వారి ప్రేమకు దూరమై అనాధల బ్రతకాల్సి రావడం, లేదా లైంగిక దాడికి గురి కావడం ఇలాంటివి ఏవైనా ఇష్టం లేని సంఘటనలను బలవంతంగా మరిచిపోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి బాధ కలిగించే విషయాలు మనసు పొరల్లో ఎక్కడో ఓ మూలకు నెట్టివేయబడి అచేతన స్థితి లో ఉంటాయి. మనస్తత్వ్య శాస్త్ర పరిభాషలో ఈ ప్రక్రియను “దమనం” అంటారు. ఇది మనిషి తనకు ఇష్టం లేని విషయాలనుంచి తనని తాను కాపాడుకునే మనో రక్షణ తంత్రం.
” మరి అది ఇప్పుడు ఎలా బయట పడింది తనలో. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ” రితేష్ లో ఆవేదన కన్నీటిరూపంలో వెలువడుతుంటే అతని భుజం తట్టాడు డాక్టర్ గౌరవ్ ధైర్యం ఇస్తున్నట్లు.
” అక్కడికే వస్తున్నా. పసివయసులో జరిగిన ఇష్టం లేని విషయాలు, సంఘటనలు బలవంతంగా మనసు మూలల్లోకి నెట్టివేయబడినా ఆ మనిషి పెరిగే క్రమంలో తిరిగి అటువంటి పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ, అప్పుడు జరిగిన సంఘటనలను పోలిన విషయాలు కానీ మరలా పునరావృతం అయితే “దమనం” లోకి నెట్టివేయబడ్డ అంశాలు మనసు పొరల్లోనుంచి బయట పడి చేతన స్థితిలోకి వచ్చి ఆ మనిషిని మనో వ్యాకులతకు గురిచేస్తాయి. ఆ మనిషి మనసు కాస్త బలహీనమైనదైతే మెంటల్ ట్రామా ఎక్కువై ఒక్కోసారి ఆ సమస్యను ఎదుర్కోలేక ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తారు. సరిగ్గా ఇలాంటి మానసిక వ్యాకులతకు ఇప్పుడు మైత్రి గురైంది. ఒక్క నిముషం ఆగి మళ్ళీ ” ఒక్క మైత్రే కాదు. పసివయసులో తల్లితండ్రుల ప్రేమకు దూరమై , వారి నిర్లక్ష్యానికి గురై ఆనాధల్లా పెరిగిన పిల్లలు మానసిక ట్రామా అనుభవించిన వారు పెద్దయి ఇలాంటి మానసిక సమస్యలతోనే బాధ పడతారు.” ప్రఫుల్ల చంద్ర చెప్పింది విని
” అయితే ఇప్పుడు తన సమస్యకు పరిష్కారం ఏంటి ప్రఫుల్ల గారు” ఆతృతగా ప్రశ్నించాడు రితేష్.
” ఆ పరిష్కారం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది రితేష్ ” చూపుడు వేలు రితేష్ వంక ఉంచాడు ప్రఫుల్ల చంద్ర.
” నా చేతిలోనా ” విస్మయంగా అన్నాడు రితేష్ “
” ఎస్.. నీ చేతిలోనే. ఇప్పుడు తనకు నీ ప్రేమ, నువ్వు ఇచ్చే ధైర్యమ్, నీకు నేను ఉన్నాననే భరోసా మైత్రిని ఈ మానసిక ట్రామా నుంచి బయట పడేటట్లు చేస్తుంది. రితేష్ ఒక్క మాట చెప్పనా.. మనిషికి డబ్బు సంపాదన, కెరీర్, సమాజంలో హోదా ముఖ్యమే. అంతకంటే ముఖ్యం తన కుటుంబం. మనం కోట్లు సంపాదించవచ్చు కానీ కోల్పోయిన కాలాన్ని తిరిగి సంపాదించలేం. కోట్లు ఉంటాయి కానీ కుటుంబంతో గడిపే కాలం కరిగిపోతూ కరిగిపోతూ ఇలాంటి వ్యధలను మిగిల్చి పోతుంది. మనిషి తన కెరీర్, డబ్బు సంపాదనకు ఇచ్చినంత ప్రాముఖ్యత తన కుటుంబానికి కూడా ఇవ్వాలి.ఈ రెండింటిలో సమతుల్యం లేకపొతే జీవితం బ్యాలన్సు తప్పుతుంది. ఎక్కువైనదేదైనా విషతుల్యం కదా.
మైత్రికి నువ్వు ఇచ్చే సపోర్ట్ మీదే తన మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంది ఇపుడు. నేను కూడా తనకి క్లినికల్ కౌన్సిలింగ్ ఇచ్చి కొంత మానసిక సాంత్వన కలిగిస్తాను ” చెప్పడం ముగించాడు ప్రఫుల్ల చంద్ర.
కాలం తన కళ్లాలను గట్టిగా బిగించుకుని పూల తేరులా ముందుకు సాగుతోంది. మైత్రి ఒడిలో ముద్దులు మూట గట్టే బిడ్డ కోసం రితేష్ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ఇపుడు.

12 thoughts on “దమనం”

  1. చాల బావుంది రోహిణి మంచి విషయం తీసుకొని చదివిన ప్రతి ఒక్కరు ఆలోచించేలా వ్రాసారు ఇలాంటివి చాల విషయాలు మనసులో ఉండిపోతాయి .ఎంతో మందికి జరిగి వుంటాయి. కత నడిపిన తీరు బావుంది నాకు బాగా నచ్చింది ఇంకా ఇలాంటివి సమాజానికి ఉపయోగ పడే మంచి కతలు మీరు మరిన్ని వ్రాయాలి అని మనసారా కోరుకుంటూ అభినందనలు తెలియ చేస్తున్నాను.

  2. K.V.Raghava REDDY

    ????????????????????????????????????????????????నైస్ బాగా రాశారు..????????????????????????????????????????????????????????????

  3. రచయిత్రిగా మీకు మంచి భవిష్యత్తు కలదు.
    మీరు మరింత ఎదగాలని ఆశిస్తున్నాను- ఆర్ సి కృష్ణ స్వామి రాజు తిరుపతి

  4. Vummadi కుటుంబానికి, ఏక కుటుంబానికి తేడా కథలో స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దలు తోడుగా లేకుంటే, ఎంత ఐశ్వర్యం వున్నా, మనం ఒంటరి వాళ్లమే .

  5. లక్ష్మీ రాఘవ

    ప్రతివిషయమూ స్పష్టంగా scientific గా చెబుతూ , సమస్యను అద్బుతంగా చెప్పరు రోహిణీ . మీలో ఒక రచయితే కాదు . ఒక. psycologist కూడా వున్నారు. ఇలాటివి కూలంకషం గా చెప్పండి . ఎదురు చూస్తాము.

    1. వంజారి రోహిణి

      ధన్యవాదాలు మేడం. మీ ప్రోత్సహం నాకు ఎప్పుడూ అమూల్యమైనది

Comments are closed.