ఈ వారం నవతెలంగాణ సోపతిలో నేను రాసిన కవిత “తలలు-మొండాలు”. సోపతి సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి
మమ్మల్నిన్కా పూలతో తీగలతో పోల్చకండి
మా ఒంపుసొంపుల్ని మీ కావ్యకపటాల్లోకి నెట్టకండి
త్యాగాలు మీ వంతు అంటూ ఆంక్షలు విధించకండి..
మా వేదనలను వినే సమయం మీకులేదు
మా సమయాలను మాత్రం మీకోసం లాక్కోకండి..
ప్రేమ దోమ అంటూ మా వెనుక పడకండి
ప్రేమికుల రోజంటూ పూలబొకేలు ఇవ్వకండి..
మీ మాయలోపడి మా బతుకును మరచిపోయాం
దీపం వేడిని వెలుగనుకుని భ్రమపడ్డాం.
చీకటిలోకి తోసేస్తున్నారని తెలుసుకునేలోగానే
మా తలలు నరికి మొండాలతో రమించకండి..
మీకు కామాన్ని కలిగించే రొమ్ములు మర్మస్థానం
మాత్రమే ఉన్న మొండాలం కాదు మేము ..
మాకు తలలు ఉన్నాయి
తలలో మెదడు ఉంది ..
అక్కడ ఆలోచనలు ఉన్నాయి
ఆలోచనల్లో మా బతుకు ఉంది..
బతుకు మీద ఆశ ఉంది అని తెలుసుకుంటే చాలు
మీరు ఏ దినోత్సవాలు మాకోసం జరుపబల్లేదు..
మమ్మల్ని మాంసం ముద్దల్లా కాక
సాటిమనుషులుగా మీరు గుర్తిస్తే చాలు ..
రోహిణి వంజారి
9000594630