క్రింది కవిత “ఓ సోదర” మెతుకుసీమ–కవనసీమ తెలుగు భాష వైశిష్ట్య సంచిక లో ప్రతిచురితమైంది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన.
————————————————————————————————————————–
ఉగ్గుపాలు రంగరించి పోసి
పాలబువ్వ నోటికందిస్తూ అమ్మ నేర్పిన
తెలుగు భాషను మరువకు ఓ సోదరా !
ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని దేశాలు తిరిగినా
తల్లిదండ్రులను ఎట్లా మనం మరచిపోమో
అట్లే మాతృభాషను మరవకూడదు సోదర !
“మమ్మి డాడి అంటేనే ముద్దు”
అనే కాన్వెంట్ చదువుల్లో అమ్మదనం, తెలుగుదనం
పునాదుల్లోనే సమాధి అవుతోంది సోదర !
“దేశభాషలందు తెలుగు లెస్స” అని పొగిడినా
విదేశీయులు సైతం ప్రశంసించినా
తెలుగు భాష గొప్పదనం ఎరుగవేమి సోదర !
తెలుగు పలుకు తేనెలూరినట్లు
తెలుగు జిలుగు కమనీయ కాంతులైనట్లు
వెన్నెల్లో చందమామను చూసినట్లు
వసంతంలో గండుకోయిల పాడినట్లు
తెలుగు మాట వింటే మదికి ఆహ్లాదం కల్గును సోదర !
జన్మనిచ్చిన తల్లికి మనం ఎలా ఋణపడినామో
మనం పుట్టిన ఈ తెలుగు గడ్డకు
తీర్చలేని రీతిన మనం ఋణపడి ఉన్నాం సోదర !
మన శక్తియుక్తులన్ని ధారపోసి
మాతృభాష అభివృద్ధి దోహదపడతాం సోదర !
చేయిచేయి కలుపుదాం! పదం పదం పలుకుదాం!
తెలుగు వెలుగులు నింపుదాం సోదర!