“ఓ వివస్త్రా… నీకు వందనం ! – సంపాదకీయం 3

“చీరలోని గొప్పతనం తెలుసుకో..చీర కట్టి ఆడతనం పెంచుకో ” అన్నారు సినీ కవి చంద్రబోస్. మరి ఆ చీరనే అందరి ముందరే విప్పేసి ఆడతనాన్ని వదిలేసి వివస్త్ర అయితే..? ఆడవాళ్ళ చీరలను వాళ్ళు స్నానం చేస్తుండగా ఎత్తుకు పోయి దాచేసే కొంటెతనాన్ని, ఇంకో సందర్భంలో ఓ స్త్రీ మానాన్ని రక్షించడానికి అంతం లేని ఓ పెద్ద చీరను సృష్టించడాన్ని హీరోయిజంగా, దైవత్వంగా ఉటంకించిన పురాణ దృష్టాంతాలు ఉన్నాయి. మరి తనకుతాను వివస్త్రగా మారిన ఈ మహిళను మనం పూజించాలా.. వద్దా..? మీరు చెప్పండి.
విషయమేమిటంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెంగుళూరు కేఆర్ జంక్షన్ దగ్గర వర్షం నీళ్లు, డ్రైనేజీ పొంగి పెద్ద ప్రవాహంగా మారింది. అండర్ పాస్లోకి ప్రవేశించిన ఓ కారు ఆ ప్రవాహంలో చిక్కుకుపోయింది. అందులోని ఆరుగురి ప్రాణాలు కూడా ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన టెకీ భానురేఖ అనే ఆమె మరణించింది కూడా. మిగిలిన ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. బీబీఎంపీ రక్షణ బృందం వారిని కాపాడింది. మరి వారి ప్రాణ రక్షణ ఎలా జరిగింది..? వారు నీటిలో చిక్కుకున్న విషయం గమనించిన ఓ జర్నలిస్టు ఈదుకుంటూ కారు వద్దకు వెళ్ళాడు. వారిని కారులోనించి బయటకు తీయగలిగాడు. కానీ వారిని కాపాడాలంటే పొడవైన తాడు లాంటిది అవసరం. ఎవరైనా తాడు అందించాలని నీళ్ళలోనించే కేకలు పెట్టాడు.
అండర్ పాస్లో ఏదో జరుగుతోందని పైన రోడ్డు మీద జనం గుంపులు గుంపులుగా అక్కడ గుమిగూడారు. కొందరు సెల్ ఫోన్లతో ఆ దృశ్యాలను బంధించే పనిలో బిజీగా ఉన్నారు. ఈలోగా ఆ రోడ్డు వైపు వచ్చిన ఓ 42 ఏళ్ళ మహిళ అటు వెళ్ళింది. తాడు కావాలని జర్నలిస్టు అరుపులు వినింది. ప్రమాదంలో ఉన్న ప్రాణాలను గమనించింది. ఆ క్షణంలో ఆమెకు మరేమి గుర్తుకురాలేదు. మానవత్వం ముందు బిడియం తలవంచి పారిపోయిన ఆ క్షణం, ఆమె తన చీరను విప్పేసి ఒక అంచు ఆ జర్నలిస్టు వైపు విసిరి, రెండో అంచును అండర్ పాస్ పైన ఉన్న ఇనుప రెయిలింగుకు ముడి వేసింది. జర్నలిస్టు దానిని అందుకుని ఆమునిగిపోతున్న అయిదుగురూ ఆ చీరను పట్టుకుని, కొట్టుకుపోకుండా చూసి, ప్రమాదం నుంచి తప్పించారు. కాసేపటికి బీబీఎంపీ సిబ్బంది అక్కడకు చేరుకొని వారిని బయటకు తీశారు. అంతవరకూ సినిమా చూస్తున్నట్లు అలౌకిక భావనలో ఉన్న జనంలో కదలిక వచ్చింది. ఓ వ్యక్తి ఆమెకి తన కోటు ఇచ్చాడు. తొడుక్కుంది. ఓ అమ్మాయి చున్నీ తీసి ఇచ్చింది. కప్పుకుంది.
ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడానికి తన చీరను రక్షణ కవచంగా విసిరిన ఆమె లో ఉండేది దైవత్వం కాదంటారా..? ‘యంత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అని స్త్రీని దేవతగా పూజించాలంటే ఈ తల్లి పాదాలకి ఎన్ని పూజలు చేయాలి. అందుకే, “ఓ వివస్త్రా..నీకు వందనం”

రోహిణి వంజారి
సంపాదకీయం

1 thought on ““ఓ వివస్త్రా… నీకు వందనం ! – సంపాదకీయం 3”

Comments are closed.