ఆఖరి మజిలీ

నవంబర్ నెల “సాహిత్య ప్రస్థానం” లో నా కథ “ఆఖరి మజిలీ”. నెల్లూరు లో నేను చూసిన నాలుగు జీవితాలు ఈ కథకి ప్రేరణ. ప్రస్థానం సంపాదకులకు ధన్యవాదాలతో. “ఆఖరి మజిలీ” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగోరుతూ..

“ఒళ్ళు బలిసి లేచిపోయిందంటారా..! ముండ. పిలకాయలు, మొగుడిని వదిలేసి ” ఎగతాళిగా అన్నాడతను. ఇంతకుముందెప్పుడు నేనతన్ని చూడలేదు.
” అంతేనా..! ఆ ఐరావతమ్మకి మందు పెట్టి మాయ చేసి ఆస్తంతా రాయించేసుకుందట”
కోర్టు మెట్లు ఎక్కుతుంటే వినిపించాయి ఆ మాటలు నాకు. మరి ప్రసాద్ వాళ్ళ అమ్మ నన్ను దేవత అంటోంది ఎందుకని..?
అవసరం..అసహాయత.
“ఈ టైములో నన్ను స్టేషన్ కి వెళ్ళమంటావు ఏంది” చాల విసుగు పుడుతోంది నాకు. కోపం కూడా వస్తోంది. క్షణం తీరిక లేకుండా పొద్దున్నుంచి చాకిరీ చేసి చేసి నా తనువు, మనసు కూడా అలిసిపోయాయి.
“తిరప్తి నుంచి నా స్నేహితుడు కొత్త నవలలు, స్టేషనరీ పుస్తకాలు తెస్తున్నాడు. నువ్వు ఆటోలో పోయి ఆ పుస్తకాలు తీసుకుని వచ్చేయి రమా” మంచం మీద నుంచే ఆర్డర్ వేసాడు నా మొగుడు అనబడే శీనయ్య.
మంత్రసాని పనికి ఒప్పుకున్నాక ఏదైనా చెయ్యాల్సిందే కదా. బైట సన్నగా తూర పడుతోంది. గాలి కూడా తోడైంది నేనున్నానంటూ.
“ప్రయాణికులకు విజ్ఞప్తి. తిరుపతి నుంచి నెల్లూరుకు వచ్చే పాసెంజర్ మరికొద్దిసేపట్లో రెండో నెంబర్ ప్లాటుఫార్మ్ మీదకు వచ్చును. అనౌన్స్మెంట్ పూర్తయ్యేలోగానే పాసెంజర్ రైలు వచ్చేసింది. టైం పదినలభై. ప్లాట్ఫారం నిర్మానుష్యంగా ఉంది. రైలు నుంచి చాల కొద్దిమంది దిగారు. ఎవరి చేతుల్లో పుస్తకాల ప్యాకింగ్ పెట్టెలు లేవు. అతను రాలేదేమో.. చాల చికాక్కగా ఉంది. ఇక వెళదామని వెనుతిరిగి నాలుగడుగులేసాను.
“రమాదేవి అంటే మీరేనా” మాట వినబడగానే పక్కకు చూసాను. రెండు చేతుల్లో పుస్తకాలు ఉన్న పెట్టెలు పట్టుకుని నిల్చున్న అతన్ని చూడగానే అవునంటూ తల ఊపాను. నా పేరు చెప్పాడంటే అతనే నా భర్త స్నేహితుడు అనిపించింది.
ఆ టైములో అతను మా కోసరం శ్రమ పడడం ఇంకా చాల ఇబ్బందిగా అనిపించింది. మొహమాటంగా నవ్వుతూ “మీకు అనవసర శ్రమ కలిగించాం” అని పెట్టెను అందుకోబోయాను.
” అయ్యో..నాకేం శ్రమ లేదండి. మీ వారు శ్రీను, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. తనకి ఆరోగ్యం బాగాలేక ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చాడట కదా. తను కాలేజీలో నా కంటే సీనియర్. నాకు ఈ మధ్యనే తిరుపతిలో టీచర్ గా జాబ్ వొచ్చింది. రోజు తిరుపతి నుంచి నెల్లూరికి అప్ అండ్ డౌన్ చేస్తాను” నేనేమి అడిగే అవసరం లేకుండానే తన వివరాలు చెప్పాడు.
అప్పటికే టైం పడకండు దాటింది. పుస్తకాలు ఉన్న అట్టపెట్టెలను చెరొకటి పట్టుకుని మెల్లగా మెట్లు దిగాం. ఒకటి రెండు ఆటోలు ఉన్నాయి. ఆటో మాట్లాడుకున్నాక నేను వద్దన్నా వినకుండా తను కూడా ఆటో వెనుకే స్కూటీలో ఇంటిదాకా వచ్చాడు తోడుగా. ఇంట్లోకి రమ్మనలేదు నేను.
“ఆటో లో నుంచి పెట్టెలు దించి గేటు దగ్గర పెట్టి ” ఇక వెళతాను అండి” అంటూ మరోమాటకి తావు లేకుండా చీకట్లో కలిసిపోయాడు.
ఆకలిగా ఉన్నా ఏం తినాలనిపించలేదు. నిద్రపోతున్న నా మొగుడిని చూస్తే పీకలదాకా కోపం వచ్చింది. కానీ ఏమి చేయలేను. నిస్రాణంగా మంచమ్మీద వాలిపోయాను.
పదిహేడు ఏళ్ళు నిండి నిండక ముందే వద్దని ఏడుస్తున్నా బలవంతంగా నాకంటే పదేళ్ళు పెద్ద అయిన శీనయ్యతో నాకు ముడిపెట్టి వాళ్ళ గుండెలమీది కుంపటి దించుకున్నామని సంతోషించారు అమ్మ, నాన్న.
ఇరవై నిండక ముందే మేము రెడీ అంటూ ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చేసారు. రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళి బిడ్డతో తిరిగొచ్చే వేళకి ఈయనగారి ఉద్యోగం పోయింది. ఆఫీసులో లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. నేనొచ్చేలోగా వీలైనన్ని సార్లు, కాదు కాదు వీలు చేసుకుని మరి పెద్దాపురం ఎత్తు అరుగుల ఇళ్ల చుట్టూ తిరిగి అడ్డమైన రోగాలు తెచ్చుకున్నాడు. మరి లోకానికి ఇలా చెప్తే ఎలా. నరాల జబ్బొచ్చి నిలబడలేక, కూర్చోలేక, వాలంటరీ రిటైర్మెంట్ అయ్యాను అనే అందమైన కోటింగ్ ఇచ్చి అందర్నీ ఇలా నమ్మించాడన్నమాట.
“పిల్లలకు బడి ఫీజు కట్టాలి” ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా మంచం మీద ఉన్న ఆయన్ను చూస్తూ అడిగాను. ఉన్న డబ్బంతా ఆయన, అత్తగారి మందులకు సరిపోతోంది. ఇల్లు గడవడం కష్టంగా ఉంది.
“రాత్రికి పుస్తకాలు తేవడానికి స్టేషన్కి వెళ్ళతావు కదా. ప్రసాద్ ని ఓ ఐదు వేలు అడుగు. కాస్త ఇంటి దగ్గర ఇబ్బందిగా ఉందని” చివుక్కున చూసిన నా కళ్ళల్లోకి సూటిగా చూడలేక గోడ చాయ చూస్తా అన్నాడు శీనయ్య.
స్కూటీలో ప్రసాద్ వెనుక కూర్చున్నా. పుస్తకాలు ఓ చేతిలో , మరో చేయి స్కూటీ వెనుక కమ్మి పట్టుకుని ఒద్దికగా. రోడ్డు అంతా గతుకులుగా ఉంది.
“పర్వాలేదు రమా..నన్ను గట్టిగా పట్టుకో. అంతా గుంటలు, మిట్టలుగా ఉంది” దృష్టి రోడ్డు మీదే ఉంచి అన్నాడు. మాకు తెలీకుండానే ఏకవచనంతో పిల్చుకునే దాక వొచ్చింది మా పరిచయం. నాకు మాత్రం అతన్ని డబ్బు ఎలా అడగాలి అన్నదానిమీదే ఆలోచన.
ఆత్మాభిమానం..అవసరం
ఇంటికి దగ్గరగా వచ్చేసాం. “రేపు బాబు స్కూల్ ఫీజు కట్టడానికి ఆఖరి రోజు” మాటలు కూడదీసుకుని అన్నాను.
“చెప్పు రమా. డబ్బుకు ఇబ్బందిగా ఉందా. నేను ఇవ్వనా.. నా దగ్గర అడగడానికి మొహమాట పడకు” బండి ఇంటి ముందు ఆగగానే జేబులో చేయి పెట్టి డబ్బులు బయటకి తీసాడు.
” అబ్బే..ఊరికే కాదు ప్రసాద్. చేబదులుగా ఇవ్వు. ఓ పది రోజుల్లో డబ్బు రాగానే ” ఇంతవరకు ఎవరిని చేయి చేసి డబ్బు సాయం అడగలేదు. ఈ రోజు నా భర్త స్నేహితుడిని అడగాలంటే ప్రాణం పోయేటట్లుగా ఉంది.
” ఏం పర్వాలేదు రమా. నీ ఇష్టం వొచ్చినప్పుడు ఇవ్వు” బండి వెనక్కి తిప్పుతూ అన్నాడు.
“ఒక్కసారి ఇంట్లోకి రాకూడదా” డబ్బులు పర్సులో పెట్టుకుంటూ అన్నాను.
అర్ధరాత్రి అయింది. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. రేపెప్పుడైనా వస్తాను” స్కూటీ హారన్ క్రమంగా తగ్గి అతను కనుమరుగైనాడు.
ఆ రోజు అత్తయ్య బంధువుల ఇంటికి వెళ్ళింది. స్నానాల దొడ్డిలో బండరాయి మీద కూర్చుని తీరికగా ఒంటికి పసుపు రాసుకుంటున్నాను. తడిక వెనుక ఏదో చప్పుడు. మరేదో అనుమానం నాలో. చప్పున వెనుతిరిగాను. తాటాకు తడికకి ఉన్న చిల్లుల నుంచి రెండు కళ్ళు నా నగ్న దేహాన్ని తడిమి చూస్తున్నట్లు అనిపించింది.
అంతే. ఆదరా, బాదరా ఒంటిమీద నీళ్ళు పోసేసుకుని చీర చుట్టుకున్నాను. గుండె దడదడ కొట్టుకుంటోంది. తడిక తలుపు తీసి చుట్టూ చూసాను. ఎవరు కనపడలేదు.
ఆయన మంచం మీద పడుకుని ఫ్యాషన్ టీవీ లో క్యాట్ వాక్ చేసే మోడల్స్ ని చూస్తున్నాడు. మామయ్య దేవుడి గదిలో తచ్చాడుతున్నాడు.
మరి తడిక దగ్గర కనపడిన ఆ రెండు కళ్ళు ఎవరివి. ఈయనకు నన్ను తడిక లో నుంచి చూడాల్సిన అవసరం ఏముంది..? ఇది నిజమా లేక నా భ్రమా..!
రాత్రి పది అయింది. అందరికి అన్నాలు పెట్టి వంటిల్లు సర్దేశాను. పిల్లలు, మామయ్య గదిలో నిద్రపోయారు. నిద్ర రావడంలేదు అంటూ పెరటి వెనుక ఉన్న పుస్తకాల షాప్ గదిలోకి వెళ్ళాడు శీనయ్య. పొద్దున నుంచి ఇంట్లో చేసిన కంచి గరుడ సేవల వల్ల ఒళ్ళు పులిసిపోయింది నాకు. కళ్ళు కురుకుపోతున్నాయి. నులక మంచం మీద దిండు కూడా వేసుకోకుండా వాలిపోయాను.
హఠాత్తుగా మెలుకువ వచ్చింది . ఎవరో నా గుండెలను అదిమేస్తున్నారు. పెద్దగా అరిచి దిగ్గున లేవబోయాను. నా నోటిమీద చేయి పెట్టి గట్టిగా అణిచేస్తున్నారు. చుట్ట కంపు గుప్పున నా ముక్కు పుటలను తాకింది.
” అరిచి రచ్చ చేయకు రమా.. నేనే..నీ మామను. మీ అత్తతో నాకు సుఖం లేదు. నీ మొగుడు ఇక నిన్ను సుఖపెట్టలేడు నా మాట విన్నావంటే నీకు అంతో ఇంతో స్వర్గం చూపిస్తా “
ఒంట్లోని శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకుని బలంగా ఒక్క తోపు తోసాను. దూరంగా పోయి పడ్డాడు మామయ్య. దిమ్మెరపోయాను మొదటిసారి అతనిలో కొత్త మనిషిని చూసి.
పాత తలుపు ఇనుపరేకు బలంగా నుదిటికి తగిలినట్లుంది. . గుడ్డి వెలుతురులో నుదిటి మీది నుంచి నల్లటి పాములా దిగజారుతోంది నెత్తురు.
” అబ్బా..!చంపసావే ముండా..నన్నే తోస్తావటే లంజికాన.. రోజు నువ్వు ఆ ప్రసాద్ గాడి దగ్గరికి ఎందుకు పోతావో నాకు తెలీకనా..”నుదుటికి చేయి అడ్డంగా పెట్టుకుని
“ఏం నేను ముసలాడిననా ..వాడి మీద మోజు నీకు” ఏదేదో అంటున్నాడు. ఏవి వినిపించడంలేదు నాకు. విపరీతమైన షాక్ కి గురైనాను. ఎన్ని రోజులుగా తడిక సందులో నుంచి నా నగ్నదేహాన్ని చూస్తున్నాడో. తలచుకుంటేనే ఒంటిమీద విషపు పురుగు పాకినట్లు కంపరమెత్తింది.
అదిరే గుండెలతో తలుపు తీసి గబగబా పెరటిలోకి వొచ్చాను. నూతి పళ్లెం పక్కన మంచం మీద నిద్రలో జోగుతున్నాడు శీనయ్య.
తట్టి లేపాను. రేగిన జుట్టు, కళ్ళ నిండా ఉబికివస్తున్న నీళ్ళు. జరిగింది చెప్పక తప్పలేదు నాకు.
” మా నాయనే కదా. నీ మీద ఆశ పడ్డాడు. ఒప్పుకుంటే నీదేం పోయింది. పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నావు. నిద్రని పాడుచేశావ్” అన్నాడు తాపీగా
మదపిచ్చి వల్ల సుఖరోగాలు తెచ్చుకున్నాడని ఇంతవరకు నా మొగుడిమీద కాస్త జాలి ఉండేది ఇప్పుడు అతని మాటలు విన్నాక అంతవరకూ ఉన్న జాలి పోయి అసహ్యం కలిగింది. మా మధ్య ఉన్న బంధం బాగా పలచబడి సున్నితమైన మమకారపు పోగు ఏ క్షణంలో అయినా విడిపోయేటట్లు ఉండింది ఇంతకాలం. అది ఈ రోజుతో పుటుక్కున తెగిపోయింది. అత్తమ్మకి చెప్తే అసలు నమ్మదు. ఇక ఆ ఇంట్లో నా అస్తిత్వం ఏమిటో నాకు అర్ధం కాలేదు.
ఇక ఇప్పుడు నా హృదయములో రగులుతున్న బడబాగ్ని నుంచి సేదదీర్చే ఓ చల్లటి ఓదార్పు , నా వేదనకు ఉపశమనమిచ్చే ఓ భుజం ఆసరా కావాలి నాకిప్పుడు. నాది అనుకున్న ఇల్లు పరాయిదైపోయింది ఈ క్షణం. ఈ ఇంట్లో ఉండడం మాత్రం ఇక దుర్భరం.
అసహాయత..ఆసరా
నా కోసం ఎక్కడా వెతకలేదు శీనయ్య వాళ్ళు.
తిరుపతిలో ఇల్లు బాడుగకు తీసుకున్నాం. పెళ్ళి అయిన నేను, పెళ్ళి కానీ అతను కలిసి కొత్త కాపురం పెట్టాం. వినడానికే వింతగా ఉందని ముక్కున వేలేసుకుంటున్నారా మీరు..?
ఇక ప్రాణం పోయినా ఆ ఇంటి గడప తొక్కేది లేదు. నేను ఏ ప్రయోజనం కోరి ప్రసాదుతో వొచ్చేసినా, అతను నా నుంచి కోరుకున్న నా ఆడతనాన్ని మాత్రం ఇష్టంగానే అతనికి సమర్పించుకున్నాను. పిల్లలు గుర్తుకు వస్తే మాత్రం నా గుండెని మెలిదిప్పినట్లు బాధ. నన్ను క్షమించమని వాళ్ళని అడిగే అర్హత ఇక నాకు లేదు.
పూర్తిగా సుఖంకానీ, దుఃఖం కానీ అనలేని త్రిశంకు స్వర్గంలాంటి చోట రోజులు దొర్లిపోతున్నాయి. ఆ రోజు పొద్దున ప్రసాద్ స్కూల్ కి పోవడానికి రెడీ అవుతున్నాడు.నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను. తలుపు చప్పుడైంది. ప్రసాద్ బెడ్ రూంలో డ్రెస్ వేసుకుంటున్నాడు. తలుపు తీసాను.
అతని ఉనికిని అక్కడ ఊహించలేదు నేను. జీవితంలో ఇంకెప్పుడు ఆ ఇంటిని, అతని ముఖాన్ని చూడకూడదు అనుకున్నాను. అందులో నాకెప్పుడూ ఓటమే.
“రమా.. బాగున్నావా..! ప్రసాద్ ఏడి..?” తలుపు తోసుకుంటూ లోపలకు వచ్చాడు ఒకప్పటి నా భర్త శీనయ్య. అతని రాక నాకు ఎంత నరకమైందో మాటల్లో చెప్పలేను.
“రా.. శ్రీను.. ” ప్రసాద్ పిలిచి పిలవకుండానే వొచ్చి మంచమ్మీద కూర్చున్నాడు. అతను ఎందుకు వొచ్చాడో, ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బాగుండు అనిపించింది నాకు. మంచినీళ్లు, కాఫీ మర్యాద చేయక తప్పింది కాదు నాకు.
ఎవరు ఏమి అడక్కుండానే తన కష్టాలు అన్నీ చెప్పి మొసలి కన్నీరు కార్చి, ప్రసాద్ ముందు దీనంగా నటిస్తూ చేయి చాపాడు. నా భార్యని నీకు అప్పనంగా ఇచ్చేసాను కాబట్టి నిన్ను డబ్బు అడిగే హక్కు నాకు ఉంది అని అతని అంతరాత్మధీమాగా ప్రసాద్ ని ఆదేశించినట్లు అనిపించింది నాకు.
బీరువా లో నుంచి ఎంత డబ్బు తీసాడో కూడా లెక్క చూడకుండా డబ్బు కట్ట అతని చేతిలో పెట్టాడు ప్రసాద్. అది మొదలుకొని అడపా, దడపా రావడం డబ్బులు తీసుకు వెళ్ళడం రివాజు అయింది అతనికి. పిల్లలు ఎట్లున్నారు అని అడగాలని నోటిదాకా వొచ్చేది. కానీ మళ్ళీ మమతా పెంచుకుంటే తెంచుకోవడం కష్టం. ఆ బంధానికి బందీని అయితే మళ్ళీ మనసు వారివైపుకు లాగుతుంది. ఈ జన్మకు ఇంతే ప్రాప్తం అనుకుని గమ్మున ఉండిపోయాను.
మూడు నెల్ల తర్వాత ఓ రోజు ప్రసాద్ అమ్మ, చెల్లి ఇంటికి వొచ్చారు. ప్రసాద్ స్కూల్ నుంచి ఇంకా రాలేదు. ఇంట్లోకి వస్తూనే నా మీద దుమ్మెత్తి పోశారు. మెటికలు విరుస్తూ ” పెళ్ళి కానీ నా బిడ్డని నీ టక్కులాడి వేషాలతో వల్లో వేసుకున్నావు. మా నుంచి మా వాడిని దూరం చేసావు. నువ్వు బాగుపడవే..! నాశనం అయిపోతావు” అంటూ శాపనార్ధాలు పెట్టారు. వాళ్ల ఆవేదనకు అర్ధం ఉంది. వాళ్ళకు కాకుండా అతని జీవితాన్ని మొత్తం ఆక్రమించేస్తిని నేను. ఆ మాత్రం శాపనార్ధాలను తట్టుకోవాలి కదా..!
ప్రసాద్ స్కూల్ నుంచి వొచ్చాడు. తల్లి, చెల్లి అతన్ని కూడా నోటికొచ్చినట్లు తిట్టారు. ప్రసాద్ వాళ్ళకి నచ్చేప్రయత్నంలో విఫలమయ్యాడు. నేను మౌన మునిలా మారాను. నా అస్తిత్వం, నా ఉనికి ఇక్కడ కూడా ప్రస్నార్ధకం అవుతోంది. ఇప్పుడు నాకు దారి ఏది. నేను ఎటు పోవాలి. అంతు లేని నా కథ మళ్ళీ మొదటికి వొచ్చిందా..?
శాపనార్ధాలు పెడుతూ ఉన్నట్లుండి ప్రసాద్ వాళ్ళ అమ్మ ఐరావతమ్మ నేలమీదకి ఒరిగిపోయింది. ఎడమ కాలు, చేయి, మూతి వంకర పోయినాయి.
అతని చెల్లి నన్ను శాపనార్ధాలు పెడుతూనే ఉంది. భారీగా ఉండే ఆమెను అతికష్టం మీద మంచం మీదకు చేర్చాము. ఆమెకి వొచ్చింది తీవ్రమైన పక్షవాతం అని, అన్నీ పరీక్షలు చేసి ఇక జీవితాంతం మంచం మీదనే ఉండాలని తేల్చి చెప్పేసారు డాక్టర్లు. ఎంతైనా కన్న తల్లి ప్రసాదుకి. నన్ను తిట్టడంలో న్యాయం ఉంది. ఆమె మీద నాకు కోపం లేదు. ఆమెకి అలా జరిగినదానికి నేనే కారణం అనే అపరాధభావం నన్ను అనుక్షణం వెంటాడుతోంది. ఆమెకు ఇష్టం లేకున్నా ఆమెను దగ్గరుండి చూసుకోవాలనుకున్నాను.
వారం రోజుల్లో ఇద్దరు నర్సులు మారారు. మలమూత్రాలు ఎత్తడం మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి వెళ్లిపోయారు. కూతురు సుభద్ర నాలుగు రోజులు ఉండి, కన్న తల్లి అయినా సరే ఇక నేను సేవలు చేయలేను అని మంచమ్మీద నిస్సహాయంగా పడి ఉన్నఆమెను చీదరించుకుంటూ వెళ్ళిపోయింది.
అద్వైతం..అమరత్వం
ఐరావతమ్మకి నాలుగు రోజులనుంచి జ్వరం. పొద్దున నుంచి ఆమెనే కనిపెట్టుకుని ఉండి నాకు అలసటగా ఉంది
ప్రసాద్ తన గదిలోకి పిలిచాడు. అతని కళ్ళు కాంక్షతో ఉన్నాయి. నా కళ్ళు అలసటతో ఉన్నాయి. ఐరావతమ్మకి ఏమౌతుందో అని కంగారు కూడా ఉంది. ప్రసాద్ నా శరీరం కోరుకున్నాడు. నేను నా మనసు తెలుసుకో అన్నాను . నిరాశో, నిరసనో అటు తర్వాత తను ఎప్పుడూ నన్ను పిలవలేదు. బహుశా తన సుఖాన్ని బయట ఎక్కడో వెతుక్కుంటున్నాడు. రాత్రిళ్ళు ఇంటికి రావడమే మానేసాడు. ఇప్పుడు పగలు కూడా ఈ ఇంటివైపు రావడంలేదతను.
ఆ రోజు పొద్దున ఓ ఇడ్లీ ముక్క తుంచి చక్కరలో అద్ది నోట్లో పెట్టాను. ఎందుకో ఆమె సరిగా తినలేకపోతోంది. ఉన్నట్లుండి భళ్ళున వాంతి చేసుకుంది. హఠాత్తుగా వాంతిచేసుకునేసరికి దిక్కుతోచక రెండుచేతులనుఆమె నోటి దగ్గర దోసిలి పట్టి వాంతిని చేతుల్లోకి తీసుకుని గబగబా సింకులో వేసివచ్చి, శుభ్రం చేసి, నీటిని తాగించాను. బట్టలు మార్చాను. అంతా ఓ చెక్క బొమ్మకి గుడ్డలు కట్టినట్లే. ఆమె కళ్ళు మాత్రం కదులుతున్నాయి కడలిలో చేపపిల్లల్లా. కన్నీళ్లు చెంపల మీదనుంచి కారుతున్న తుడుచుకోలేని నిస్సహాయతతో ఆమెని చూస్తుంటే నా గుండె బరువెక్కింది.
ఆ రోజు సాయంత్రం ఏదో దృఢ నిశ్చయం తీసుకున్నదానిలా సైగలు చేసి ఇంటికి లాయర్ ని రమ్మని ఫోన్ చేసి చెప్పమంది నన్ను.
ఆ రోజు అలా లాయర్ ఇంటి దగ్గరకి రావడం వల్ల, ఈ రోజు నేను ఈ కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది జీవితంలో మొదటిసారి.
ఐరావతమ్మ పూర్తీ స్పృహతో, ఇష్టపూర్వకంగా రాసిన వీలునామా కాబట్టి, ప్రసాద్, వాళ్ళ చెల్లెలు వేసిన పిటీషన్ చెల్లదని కోర్టు వారు కొట్టివేశారు.
కేసు మనం గెలిచాం అని ఇంటికి వొచ్చి ఐరావతమ్మకి చెప్పివెళ్ళారు లాయర్ విశ్వకర్మగారు.
ఆమె కళ్ళలో ఇప్పుడు సంతృప్తితో కూడిన మెరుపులు, నిశ్చింత కనిపించాయి నాకు. మంచాన పడ్డ ఆమెకు ఎక్కడ సేవ చేయాల్సివస్తుందో అని తప్పుకున్న ప్రసాద్, అతని చెల్లి ఆమె ఆస్తిని మాత్రం ప్రేమించారు. కన్న తల్లి కన్నా ఆమె ఆస్తి మీద ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అది దక్కదని తెలిసాక యధావిధిగా నన్ను శాపనార్ధాలు పెడుతూ వెళ్లిపోయారు. నా లాంటి అనాధల సేవే చేసుకుంటావో, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి నా ఆస్తి మొత్తం నీదే రమా, అంటూ సైగలతో చెప్పింది ఐరావతమ్మ. కోర్టులో కేసు గెలిచినా, సమాజంలో దృష్టిలో మాత్రం నేను ఐరావతమ్మ ఆస్తిని దోచుకున్న నేరస్తురాలిని అయినాను. నాకు ఈ ఆస్తిపాస్తుల పట్ల ఆసక్తి లేదు. ఐరావతమ్మ, నేను.. ఒకరికొకరం ఆసరా ఇప్పుడు. ఎన్నాళ్ళో ఇలా..

6 thoughts on “ఆఖరి మజిలీ”

  1. Dr G V Ratnakar

    Good story

    వాస్తవ జీవితాల యధార్ధ
    చిత్రణ…

    Congratulations madam

Comments are closed.