అతడే

నా బుంగరెట్టల గౌను సాక్షి గా జ్ఞాపకాల పొరల్లోని టైలర్ రంగయ్య స్మృతిలో.. మనం అందంగా కనపడాలని, మన ఆత్మ గౌరవాన్ని నిలపాలని అహర్నిశలు శ్రమించే దర్జీలందరికీ “ట్రైలర్స్ డే”, శుభాకాంక్షలతో❤️❤️🙏🙏



“వీధి చివర బంకులో అతడు
దీక్షగా పనిచేసుకుపోతున్నాడు
అతని చూపులు నిశితంగా
మమతల దారాల వెంట పరుగు తీస్తున్నాయి
అతని చేతివేళ్ళు అభిమానపు వంతెనలను
నిర్మిస్తున్నాయి..
అతని కాళ్ళు కదిలినప్పుడల్లా
టక టకమని వొచ్చే శబ్దం
శ్రమజీవన రాగాన్ని వినిపిస్తోంది..
బుంగ రెట్టల గౌను కుట్టేశావా..?
ఆశగా అడుగుతుంది ఓ చిన్నారి పాప
లాగుచొక్కా కొత్త ఫ్యాషన్తో కుట్టమంటాడు మునీర్ తమ్ముడు
రవికలు రేపే ఇచ్చేయాలంటుంది లక్ష్మీ బాయి
అంగీ అర్జెంటుగా కావాలంటాడు ఆచారి బాబాయ్..
కాజాలు కుట్టే చిన్నబ్బులుకి
నీళ్ళు తాగడానికి కూడా సందుండదిక
రాత్రిపగలూ టకటకల శబ్దాలే
రాబోయే రంజానుకో, దీపావళికో
ముందస్తు స్వాగత రాగాలను ఆలపిస్తూ..
పండగైనా సరే అతని ఒంటిమీద మాత్రం
ఎప్పుడూ ఆ చిరుగుల ఖద్దర్ బనినే
ముఖంలో మాత్రం ఎప్పుడూ చెరగని చిరునవ్వే..
తను కుట్టిన కొత్త గుడ్డలు వేసుకుని
మురిసిపోయే అందరి కళ్ళల్లోని మెరుపులన్నీ అతనివేగా “
మా వీధి చివరి బంకులో టైలర్ రంగయ్యే అతను
మా రంగయ్య దర్జీ లాంటి ట్తెలర్స్ అందరికీ “Tailors Day ” శుభాకాంక్షలు 🌹🌹🎊🎊


వంజారి రోహిణి
February 28