మెడ సౌందర్యం కి చిట్కాలు. డిసెంబర్ నెల సాహూ లో. “సాహూ” మాసపత్రిక మన హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో 174, 175 స్టాల్ల్స్ దగ్గర దొరుకుతున్నాయండీ..
” నీ మెడ చుట్టూ గులాబీలు, ఈ సిగపాయల మందారాలు. ఎక్కడివీ రాగాలు” పాట విన్నారా అండి. ఎంత చక్కగా ఉంటుందో కదా. మరి మన మెడ చుట్టూ గులాబీల దండ వేయించుకోవాలంటే మనం ఎంతో గొప్పపని చేసి ఉండాలి కదండీ. మన గొప్పతనానికి ప్రశంసగా మన మెడని అల్లుకున్న పూలమాల వల్ల మన మనసు, తనువు ఆనందంతో పులకరిస్తాయి కదా. మీకు ఇప్పటికే అర్ధం అయిందనుకుంటాను. ఈ నెల అందమే ఆనందంలో నేను ఏం చెప్పబోతున్నానో. అదేనండి మెడ సోయగానికి చిట్కాలు తెలుసుకుందాం ఈ సంచికలో.
చాలామంది ముఖం అందంగా కనపడాలని చాల శ్రద్ధ పెడతారు. ముఖం క్రిందనే ఉన్న మెడని మాత్రం అసలు పట్టించుకోరు. ముఖానికి ప్యాక్ లు, రకరకాల క్రీములు పూస్తారు కానీ మెడని వదిలేస్తారు. ఇది చాల పెద్ద పొరపాటు. దీనివల్ల ముఖం ఒక రంగులో, మెడ నల్లగా కొట్టొచ్చినట్లు తేడా కనపడుతుంది. అలా కాకుండా మెడ కూడా కాస్త శ్రద్ధ పెట్టి, కింద సూచించిన చిట్కాలు అమలు చేస్తే శంఖం లాంటి మెడ మీ సొంతం అవుతుంది.
- వయసు కంటే ముందే మన నిర్లక్ష్యం వల్ల వచ్చే వార్ధక్యపు ముడతలు ముందుగా మెడ మీదే ప్రత్యక్షం అవుతాయి. అందువల్ల తప్పనిసరిగా రోజు ఓ ఐదు నిముషాల సమయం మెడ వ్యాయామం కోసం కేటాయించాలి. దీనికోసం చాల తేలికైన చిట్కాలు.
a. తలని చాల మెల్లగా పైకెత్తి కొన్ని సెకన్లపాటు పైకి చూస్తూ ఉండి నెమ్మదిగా కిందికి దించాలి. చుబుకం మెడని తాకేటట్లు వంచి కొన్ని సెకెన్ల పాటు ఉండి తలని యదాస్థానానికి తేవాలి. ఇలా ఓ పది సార్లు చేయాలి.
b. మెడని కుడి వైపుకి మెల్లగా తిప్పి కొన్ని సెకెన్ల పాటు ఉండి తర్వాత ఎడమ వైపుకు తిప్పాలి.
c. తర్వాత మెడని గుండ్రంగా క్లాక్ వైస్ డైరెక్షన్లో, అంటి క్లాక్ వైస్ డైరెక్షన్లో ఓ పది సార్లు మెల్లగా తిప్పాలి. ఇలా చేయడం వల్ల మెడ కండరాలకు మంచి బలం చేకూరుతుంది. అనవసరపు ముడతలు మెడ చర్మం నుంచి తొలగిపోతాయి. డబల్ చిన్ సమస్య కూడా తగ్గి శంఖం లాంటి మెడ మీ సొంతం అవుతుంది. - ఉదయం స్నానం చేసే అర్ధ గంట ముందు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనె ఏది అందుబాటులో ఉంటే ఆ నూనె లో ఓ టేబుల్ స్పూన్ తీసుకుని, దానిలో చిటికెడు మంచి పసుపు వేసి మెడ ముందు, వెనుక కూడా నూనె ని పూసి రెండు చేతులతో మెడ భాగాన్ని సున్నితంగా ఓ ఐదు నిమిషాల పాటు మర్ధన చేయాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే మెడ పేరుకున్న మురికి పోయి శుభ్రపడుతుంది.
- ముఖానికి వేసుకునే ముల్తానీ మట్టి ప్యాక్ మెడకు కూడా వేసుకోవడం వల్ల మెడ చర్మం కూడా శుభ్రపడి కళగా కనపడుతుంది.
- పాల మీగడలో పసుపు కలిపి కూడా మెడ చర్మాన్ని మర్ధన చేసుకోవచ్చు.
- నూనె లేదా పాల మీగడ తో మెడని మర్ధన చేసిన అనంతరం సెనగపిండి, పెరుగు, తేనె వేసి కలిపినా ప్యాక్ ని మెడకు వేసుకుని ఓ పది నిముషాల తర్వాత కడిగేసుకుంటే మెడ కూడా ముఖంలాగే మెరుపులీనుతుంది.
- ఇక సరైన పోషకాహారం, మంచి నిద్ర తో పాటు శరీరంలో తేమ శాతం తగ్గకుండా సరిపడే నీళ్ళు తప్పనిసరిగా తాగాలి. అప్పుడే చర్మంలో ఉండే కొల్లాజెన్ పదార్ధం చక్కగా సాగేగుణాన్ని కలిగించి మెడ చర్మం ముడుతలు పడకుండా ఆపుతుంది.
చాల తేలికైన పై చిట్కాలను పాటిస్తే మీ మెడ చుట్టూ గులాబీల దండ కాదు ఏకంగా బంగారు నెక్లెస్ వేయాలని అనిపిస్తుంది. మరెందుకాలస్యం. శంఖం లాంటి మెడని సొంతం చేసుకుందాం రండి.