అందమే ఆనందం

నవంబర్ నెల సాహో పత్రికలో అందమే ఆనందం మీ కోసం…

“అధరం మధురం, వదనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం ” పాట విన్నారు కదా అండి. మరి అధరం, వదనం మధురంగా ఉండాలంటే సంతోషపు చిరుజల్లులు పెదవులనుంచి కురియాలంటే ముందు హృదయం పాల అంత స్వచ్ఛంగా వెన్న, అంత మృదువుగా ఉండాలి. కల్మషం లేని హృదయంలో కరుణ ఉంటుంది. మంచితనం ఉంటుంది. మనసు పొరల నుంచి వెలువడే ఆ స్వచ్ఛత మన ముఖంలో ప్రతిఫలిస్తుంటుంది. కాబట్టి మంచి ఆలోచనలు, మంచి తనంతోటి హృదయాన్ని, ఆ హృదయ సౌందర్యాన్ని మరింత ఇనుమడింపచేసే ముఖ సౌందర్యాన్ని, నవ్వుకి తొలి చిరునామా అయిన అధర సౌందర్యాన్ని కాస్త సహజమైన చిట్కాలతో మెరుగు పరచుకుంటే ఇక ఆనందం అంతా మనదే కదా. మరి ఈ నెల సాహూ సాధ్వి లో అధర సౌందర్యానికి చిట్కాలు వచ్చేసాయి మీ కోసం.

  1. వాతావరణం లో వచ్చే మార్పులను బట్టి మన శరీర ధర్మ ప్రక్రియలలో కూడా మార్పులు వస్తూఉంటాయి. కాలానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లు మార్చుకోక పొతే మన శరీరంలో మొదట దెబ్బ తినే అతిపెద్ద బాహ్య అవయవం చర్మం. అందులోను ముఖ చర్మాన్ని పట్టి ఉంచే కండరాలు వదలిపోతాయి. కనుక ఏ కాలంలో అయినా మన శరీరంలో నీటి శాతం తక్కువ కాకుండా చూసుకోవాలి.
  2. వర్షాకాలం, చలి కాలం పెద్దగా దాహం వేయదులే. ఎక్కువగా నీళ్ళు తాగానవసరం లేదు అనుకోవడం చాల పొరపాటు. పెదవులు ఎండిపోయి పొక్కులు కడుతున్నాయి అంటే మన శరీరంలో నీటి శాతం తగ్గిందని. కనుక రోజుకు కనీసం పది గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.
  3. కొందరికి మాటికి ముందు పెదవులు కొరికే అలవాటు ఉంటుంది. అలా కొరికినప్పుడు పెదవులు చిట్లి రక్తం వస్తుంది. బయటి నుంచి పడిన దుమ్ము, దూళి కణాలు , బాక్టీరియా అక్కడి రక్తంలో కలిసి ఇన్ఫెక్షన్ కి దారి తీయవచ్చు. పంటితో ఎప్పుడు పెదవులు కొరకకూడదు.
  4. ఎండిపోయి కళా విహీనంగా ఉన్న పెదవులపై రాత్రి పడుకునే ముందు పేరిన మంచి నెయ్యి మృదువుగా రాసుకోవాలి. క్రమం తప్పకుండా ఎలా నెయ్యి రాస్తుంటే పెదవులు మెత్తబడి, తిరిగి మెరుపుని సంతరించుకుంటాయి.
  5. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా లిప్ బామ్ రాసుకుంటే పెదవులకు ఎండ నుంచి రక్షణ లభిస్తుంది.
  6. పెదవులపైనా చర్మం పొక్కులు కట్టి ఉంటే చూపుడు వెలికి కాస్త తడి చేసుకుని పంచదారని అద్ది పెదవులపై మృదువుగా రుద్దుతూ ఉంటే పెదవులమీది పొక్కులు తొలగి పోయి మృదువుగా పెదవులు దొండపండ్లు లాగా కనిపిస్తాయి.
  7. రాత్రి పడుకునే ముందు పెదవులపై బాదం నూనె లేదా కొబ్బరి నూనె రాసుకుని పడుకుంటే పొద్దుటికి పెదవులు మృదువుగా తయారవుతాయి.
  8. పెదవులకు మంచి రంగు రావాలని కొందరు లిప్స్టిక్ పూస్తారు. కానీ అది చూడడానికి కృత్రిమంగా కనిపిస్తుంది. పెదవులకు మంచి రంగు రావాలంటే బీట్రూట్ రసాన్ని తరచూ రాస్తుంటే పెదవులు మంచి రంగు సంతరించుకుని చూడముచ్చటగా కనిపిస్తాయి.
  9. పెదవులపై రాయడమే కాకుండా బీట్రూట్ రసాన్ని తరచుగా తాగుతూ ఉంటే రక్తం పెట్టి చర్మం, పెదవులు కూడా చక్కని ఆరోగ్యాన్ని సంతరించుకుని చూడగానే ” అబ్బా! ఏమి సౌందర్యం ” అనకుండా ఉండలేరు.
    మరి పైన చెప్పిన అతి సులభమైన చిట్కాలను పాటిస్తే “నీ అధరాల పైన నేను చిరునవ్వును అవుతాను ” అని మీ శ్రీవారు \శ్రీ మతి పడేస్తారు చూడండి.