మిత్రులకు నమస్తే. నవంబర్ 2020 విశాలాక్షి మాసపత్రికలో నేను రాసిన కథ ” ప్రార్ధన” ప్రచురితం అయినది. ” కరోనా” మహమ్మారి వల్ల మనం ఎంత నష్టాన్ని, బాధని చవిచూసామో మనకందరికీ తెలుసు. మనలాగే నోరులేని జంతువులు కూడా ఎంతో బాధ పడుతున్నాయి. ఆ జంతువులన్నీ కలసి మనగురించి, కరోనా గురించి ఏం మాట్లాడుకున్నాయో ఈ కథ “ప్రార్ధన” లో తెలుసుకుందామా.. కథ చదివి కామెంట్ చేయడం మరువకండి ఫ్రెండ్స్…
సమయం ఉదయం పది గంటలు. మార్చి నెల. ఎండ ఇంకా ఎర్రగా రాలేదు. ఎర్రగడ్డ చౌరస్తా దగ్గర అటు మెట్రోస్టేషన్ సైడు నుంచి నాలుగు కుక్కలు, ఇటు రైతు బజారు సైడు నుంచి ఆరు కుక్కలు వస్తూ సరిగ్గా “గోకుల్ ” సినిమా థియేటర్ దగ్గర ఎదురు పడ్డాయి. తోకలు ఊపుకుంటూ ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఆరవసాగాయి.
భౌ భౌ భౌ ఓ కుక్క అరిచింది. దాని భాషలో ” ఏమిటి మీరు ఎక్కడ నుంచి వస్తుండ్రు “
ఎదురుగా ఉన్న కుక్క సమాధానంగా భౌ భౌ భౌ మంది.” మా సంగతి సరే మీరు ఎక్కడ నుంచి వస్తుండ్రు. ఎప్పుడూ లేనిది ఇదేదో వింతగా ఉంది. గల్లీలన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒక్క మనిషి కూడా కనిపిస్తలేదు. మూడు దినాలనుంచి గల్లీలన్నీ తిరగతా ఉన్నాం. ఏ డంపర్ బిన్ దగ్గరా ఇన్ని మెతుకులు దొరకతా లేవు. మేము ఎప్పుడూ యూసుఫ్ గూడా చౌరస్తా కాడ తిరిగేటోల్లం. అక్కడ మనుషులు కనపడక ఇక్కడేమైనా అవుపిస్తారేమో అని ఈడకొచ్చినం” అంది యూసుఫ్ గూడ కుక్క.
” మేము ఎప్పుడూ ఈడ్నే తిరుగుతా ఉంటాం. రైతు బజార్ దెగ్గర చానా హోటళ్ళు ఉండాయి కదా. మెట్రో స్టేషన్ కింద బజార్లో చానా మాంసం కొట్టులు కూడా ఉండే. అక్కడ ఏమైనా నాలుగు చికెన్ ముక్కలు దొరుకుతాయేమో, హోటళ్ళ ముంగడ జనాలు తిని వదిలేసిన పుల్లేకుల్లో అంత బువ్వ ఏమైనా దొరుకుతాయేమో అని వారం నుంచి గల్లీ గల్లీ తిరగతా వస్తున్నాం. ఏడా దొరకలేదు. అసలు ఈ మనుషులంతా కట్ట గట్టుకొని యాడికి పోయిన్రో తెలుస్తలేదు. ఆకలితో డొక్కలు నీలుక్కా పోతా ఉన్నయి. మీకైనా నాలుగు మెతుకులు దొరికాయా” అంది ఎర్రగడ్డ కుక్క.
” సరేలే, రోలు వచ్చి రోకలితో మోర పెట్టుకున్నట్లుండే. ఎప్పుడూ జాతర మాదిరిగా రోడ్లల్లా తిరగతా ఉండే జనాలు ఏమయిన్రో, ఒక్క బస్సు తిరగతా లేదు. ఒక్క కారు తిరగతా లేదు. పైని మెట్రో రైలు కూడా తిరగతా లేదు. ఈ మనుషులకు ఏమైందో తెలిసేదెట్టా ద్యావుడా ” అంది యూసుఫ్ గూడ కుక్క.
ఇంతలో అక్కడికి” మియ్యాం మియ్యాం” అంటూ నీరసంగా రెండు పిల్లులు వచ్చాయి. ఎంత జాతి బేధం ఉండి ఎదురు పడినపుడు గుర్రుగా చూసుకున్నా ఇప్పుడు అవసరం అయింది కాబట్టి ఎర్రగడ్డ కుక్క పిల్లిని చూసి ” మేమంటే రోడ్లల్లా తిరిగేటోల్లం. మీరు పొద్దస్తమానం ఇళ్ళ కాడనే కదా తిరగతారు, మనుషులేమైనా కనపడ్డారా మీకు” అంది.
” ఏంజెప్పమంటారు… అంతకు ముందర తలుపులు తెరిచి ఉన్న ఇళ్ళల్లోకి దూరి ఇంటివాళ్ళను ఏమార్చి పాలో,]పెరుగో, అన్నమో ఏది దొరికితే అది తినేటోల్లం. ఇప్పుడు తలుపులు కాదు కదా కిటికీలు కూడా బిడాయించి మూసుకొని యాడికి పోయినరో ఎరుకైతలేదు. ఈడ మెయిన్ గల్లీలల్ల చికెన్ కొట్టుల దెగ్గర రొండు చికెన్ ముక్కలైన దొరుకుతాయమో అని ఇట్లోచ్చినం. ఒక్క నరమానవుడు కూడా కనపడతాలేడు. గల్లీలల్ల బ్లీచింగ్ పౌడరు చల్లుండే. ఇక ఎలుకలు బొక్కల్లోంచి బయటకి యాడ వస్తాయి. ఇప్పుడు ఆకలికి ఎలుకలు మా కడుపుల్లో పరిగిస్తా ఉండాయి. ఈ మనుషులకేమైందో, ఏదైనా భూతం మనుషులను మనుషులను మొత్తానికి మాయం జేసిందేమో అని కంగారుగా ఉండాది మాకు. ఆకలికి తాళలేకుందాం ” నీరసంగా అంది తెల్ల మచ్చల నల్ల పిల్లి ఉట్టి మూతి నాక్కుంటూ.
కుక్కలు, పిల్లులు అట్లా మాట్లాడుకుంటుండగానే హఠాత్తుగా ఆకాశంలో పడమర దిక్కు నుండి పావురాల గుంపు వచ్చి అక్కడ వాలింది. పావురాల వాలకం చూస్తుంటే అవి కూడా ఆకలి, దప్పులతో ఉన్నట్టు ఉన్నాయి. గోధుమ రంగు పిల్లి ఆశగా వాటివైపు అడుగేయబోయింది. తెల్లమచ్చల నల్లపిల్లి దాన్ని అడ్డుకుని ఇప్పుడు వీటి కోసం ఆశ పడితే మొదిటికే మోసం వస్తది . ముందు మనుషుల ముచ్చట వీటిని కూడా ఓపాలి అడుగుదాం ” అంది. కుక్కలు కూడా సరేనన్నాయి. వెంటనే తెల్ల మచ్చల నల్ల పిల్లి పావురాలను చూస్తూ ” మిమ్మలను చూస్తా ఉంటే చానా అలిసిపోయి ఉన్నట్టున్నారు. ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు మీరంతా ” అంది.
పావురాలు కుక్కలను, పిల్లులను చూసి కాస్త జంకినై. అయినా తమకంటే పెద్ద జాతుల జీవులు అవి. అడిగినదానికి సమాధానం చెప్పకుంటే వాటికి కోపం వస్తదని ” కుక్క బాబాయిలు, పిల్లి అన్నలు ఎట్ల చెప్పమంటారు మా దీన గాధ. మాకు మనుషులెవరు గింజలేస్తాలేరు. నీళ్ళు పెడతాలేరు. అసలెవరు మాకు కనిపిస్తాలేరు. చానా దూరం నుంచి వస్తూ ఆకలితో కళ్ళు తిరగతా ఉండి ఇక ఎగరలేం అని ఇక్కడ వాలినం” అంది పెద్ద పావురం.
“అదేంది! మేమంటే గల్లీలెంబడి, ఇళ్ళ చుట్టూ తిరిగేటోల్లం. మీరు ముప్పై అంతస్తుల అపార్టుమెంట్ల అంత ఎత్తుకైనా ఎగిరి ప్రతి ఇంటి బాల్కనీ లోకి వెళుతారు కదా. అక్కడ మీకు మనుషులు ప్లేట్లల్లా బియ్యం గింజలు, పల్లీ గింజలేసి తొట్లలో నీళ్ళు పోసి పెట్టలేదా” అంది ఎర్రగడ్డ కుక్క.
అయ్యో మా రాత. పది దినాల ముందు దాకా వాళ్ళు మాకు అట్లనే గింజలు, నీళ్లు పెడతా ఉండే. ఈ మధ్యలో ఏమైందో ఏమో, అందరు ఇంటి వెనక పక్క ఉన్న బాల్కనీ అద్దాల డోర్లు కూడా మూసేసి కర్టెన్స్ వేసేసి ఉన్నారు. ఇండ్లలోకి గాలి కూడా దూరడానికి లేకుండా తలుపులు బిడాయించేసిండ్రు. వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నారో, లేదో తెలుస్తా లేదు” అంది పావురం.
దూరం నుంచి కోతుల గుంపు కూడా వీటి దగ్గరకు వచ్చి చేరి వాటి బాధలు కూడా చెప్పుకున్నాయి.
సరే మనమందరం ఇప్పుడు మనుషుల జాడ కోసం వెతుకుతా ఉన్నాం. మనకి వాళ్ళు ఏమైనారో తెలుస్తా లేదు. కానీ మనకంటే బాగా కాకులకి తెలుస్తుంది. అవి ఊరూరా తిరిగి ఎగురుకుంటా వస్తాయి. అవి వస్తే కానీ మనకి ఈ మనుషుల ముచ్చట తెలీదు అనుకున్నాయి అవన్నీ.
అవి అట్లా అనుకుంటుండగానే కావు కావు మంటూ అక్కడ అక్కడున్న జంతువుల గుంపు చూసి కాకులు కూడా అక్కడికి వచ్చి వాలినై.
” అబ్బా ! అట్లా అనుకుంటే ఇట్లా ప్రత్యక్షము అయిన్రు మీరు. నూరేళ్లాయుస్సు మీకు. మనుషుల జాడ తెలీక ఇక్కడ మేమంతా పరేషాను అవుతున్నం. ఊరూరా తిరిగేటోళ్లు మీరు. మనుషులు ఇక్కడ కనిపిస్తా లేరు. ఊర్లల్లో అయినా ఉన్నారా? ఆడ కూడా లేరా? చెప్పండి ? కాకమ్మలు ” అంది యూసుఫ్ గూడ కుక్క.
“ఏం చెప్పనికి మాకు సమజైతా లేదు. మనుషులకు అదేదో “కరోనా” అనే మాయదారి రోగం అంటుకుందట. అది మొదట చైనా దేశంలో మొదలై, ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఇపుడు మన దేశానికీ కూడా పాకిందట” అంది కాకి విచారంగా…
” రోగమొచ్చింది సరే. మరి జనాలంతా ఏమైనట్టు. హోటల్స్, సినిమాహాల్స్, బజార్లు, మాల్స్ అన్ని మూతబడి ఉండే” అంది ఓ కోతి అనుమానంగా కాకిని చూస్తూ…
“ఆడికే వస్తన్నా… అది అంటు రోగం అని రోగం ఉన్నవాళ్ళు తుమ్మినా, దగ్గినా కరోనా క్రిములు గాల్లో నుంచి ఇంకో మనిషి ముక్కు, కళ్ళలోకి వెళ్ళిపోతాయట. అందుకే ఇప్పుడు ఎవరు దగ్గినా, తుమ్మినా కరోనా రోగి అని అనుమానంగా చూస్తున్నారట. అంచేత అందరు ఇంటి నుంచి బయటికి రాగూడదని పెబుత్వం లాక్డౌన్ అని ఆర్డర్ వేసిందట. ఇపుడు ఒకే ఇంట్లో వాళ్ళు కూడా ఒకరినొకరు ముట్టుకోకుండా ఒక్కక్కరు ఒక్కో గదిలో ముక్కు, మూతి మాస్క్ తో బిగించుకొని బిక్కు బిక్కు మంటా ఉన్నారట” అంది కాకి.
” అయ్యో ఇదా మనుషులు కనపడక పోవడానికి కారణం. ఇప్పుడు అర్ధం అయింది నాకు, చానా ఏళ్ళ కిందటనే బెమ్మమ్ గోరు కాలజ్ఞానంలో మనుషులకు “కోరంకి ” అని రోగం వచ్చి చానామంది జనాలు చచ్చిపోతారని చెప్పిందంట. నాకు మా నాయనమ్మ చెప్పింది నా చిన్నపుడు. అది ఈ “కరోనా” రోగమే అనిపిస్తోంది నాకు. అయినా ఈ ముచ్చట్లన్నీ నీకెట్లా తెలుసు ” అంది కోతి.
” ఆ అదే చెప్తాన్న. జనాలను బయటికి రావద్దు అని చెప్పినా కొందరు పోరగాళ్ళు అవసరం లేక పోయిన గల్లీలల్లా తిరగతా ఉన్నారట. వాళ్ళని అదుపు చేయనీకి పోలీసోళ్ళు మాత్రం గల్లీల్లో తిరగతా ఉన్నారట. వాళ్ళు ఈ ముచ్చట్లు చెప్పుకుంటుంటే విన్నాను నేను ” అంది కాకి.
“ఔరా కరోనా! అయితే కంటికి కనపడని ఓ చిన్న క్రిమి మొత్తం ప్రపంచాన్ని ఆగమాగం చేస్తోందన్నమాట” అంది కోతి ముక్కు మీద వేలేసుకొని…
” అవును మరి! ఈ కరోనా వచ్చిన కాడ్నించి వ్యాపారాలు దెబ్బ తిన్నాయట. వలస కూలీలకు పనులు లేక వాళ్ళ ఊర్లకి పోనీకి వాహనాలు కూడా లేక నడుచుకుంటే పోతున్నారట. ఊర్లలో పండిన పంట కొనేటోళ్లు లేక రైతులు కూడా నష్టపోతున్నారట. ఈ మాయదారి కరోనా ప్రపంచానంత ఓ ఆట ఆడిస్తోంది” అంది కాకి.
ఇంతలో ఎర్రగడ్డ రైతుబజార్ కుడి పక్కాగా కాస్త దూరంలో పెద్ద పెద్దగా వెర్రి అరుపులు వినిపించాయి…
” బాబోయ్, ఉన్నట్టుండి మనుషులు ఎక్కడ నుంచి అట్లా అరుస్తున్నారు. ఏం కొంప మునిగిందో ఏమిటో ఈ మాయదారి కరొనతో. నాకు భయంగా ఉంది. ఇక్కడ నుంచి పోదాం పదండి” అంది గోధుమ రంగు పిల్లి కంగారుగా…
” ఒక్క క్షణం ఆగండి. మేము వెళ్ళి చూసి వస్తాం అని రెండూ కాకులు ఎగురుకుంటూ అటు వెళ్లాయి..
ఐదు నిమిషాల తర్వాత వెళ్లిన కాకులు తిరిగి వచ్చాయి. అవి ఏం చెప్తాయో అని మిగతావి ఆతృతగా చూడసాగాయి. వాటి ఆత్రుత గమనించి కాకులు ” ఛీ ఛీ ఈ పాడు కరోనా వల్ల మనుషులకు ఎన్ని కష్టాలు వచ్చాయి. ఈ మనుషుల పరిస్థితి చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలుస్తా లేదు. అక్కడ రైతుబజార్ పక్కన ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి ఉంది కదా. మొన్న, నిన్నటిలోనే చాల మంది జనాలు పిచ్చి పట్టి అక్కడ చేరింరట” అంది కాకి విచిత్రంగా ముక్కు తిప్పుతూ…
” అదేంటి కరోనా వల్ల పిచ్చి కూడా లేస్తుందా వీళ్ళకి పాపం ” అంది పావురం.
” కరోనా వల్ల కాదు. ఈ రోగం రావడంతో అన్ని దుకాణాలు బందు చేసినట్టే మందు దుకాణాలు, కల్లు దుకాణాలు కూడా బందుచేసినారంట. గట్లని మందు, కల్లు రోజు తాగేటోళ్ళకి గిప్పుడు అవి దొరక్క మందు లేకపొతే నిద్రపట్టక నరాలు వీకు అయి పిచ్చి లేచి వెర్రి అరుపులు అరుస్తూ, వింతగా ప్రవర్తింస్తుంటే వాళ్ళను ఈడ పిచ్చాసుపత్రిలో వేసినారంట” అంది కాకి.
” వామ్మో! గిదేందిరా ! ఈ కరోనా భూతం వల్ల ఇంకెన్ని వైపరీత్యాలు జరుగుతాయో ఏమో. అదే సరే కానీ ఇప్పుడు మన ఆకలి తీరేదెట్టా? ఇంకో రెండు రోజులు తిండి గాన దొరక్కపొతే చచ్చిపోతానేమో అని భయంగా ఉంది నాకు” అంది ఎర్రగడ్డ కుక్క.
మిగతా అన్ని కూడా దానికి వంత పాడాయి..
” మీకేనా…మాకు కూడా ఆకలే కదా. అంతక ముందు మనుషులు పెళ్ళిళ్ళు, పుట్టిన రోజులు, పూజలు, ప్రార్ధనలు అంటూ వేడుకలు చేసి మంచి పిండి వంటలు చేసుకుని తిని, తిన్నంత కుప్పతొట్లల్ల పోసేటోరు . అవన్నీ మన కడుపులు నింపేవి. ఇప్పుడు ఏ వేడుకలు లేవు. మొత్తం దేశమంతా స్మశాన వైరాగ్యం అములుకోని ఉండే. అయినా మేమొకమారి గల్లీలల్ల చూసి వస్తాం. ఎక్కడైనా మనకి ఇంత తిండి దొరుకుతుందేమో ” అని కాకులు ఓ దిక్కుకు, పావురాలు మరో దిక్కుకు యెగిరి పోయినాయి.
ఓ గంట గడిచింది. దిగాలుగా కూర్చొని ఉన్నాయ్ కుక్కలు,పిల్లులు, కోతులు…
రివ్వుమని ఎగురుకుంటా వచ్చి వాలినై కాకులు, పావురాలు. అవి ఏం వార్త చెప్తాయో అని ఆతృతగా చూస్తున్న వాటితో ” మేము గల్లీలల్లో తిరగతా ఉంటే మాకు కొన్ని దగ్గర్లా చారిటీ హోంల దెగ్గర ఇళ్ళు లేకుండా అడ్డుక్కుతినే బిచ్చగాళ్ళకు, అనాధలకు అన్నం పెడతా ఉన్నారు కొందరు మనసున్న మనుషులు. మనం అక్కడికి పొతే వాళ్ళు తినంగా మిగిలింది మనకు పెట్టవచ్చని ఆశ. అందుకని మెల్లగా మనం ఆడికి పోదాం” అంది కాకి.
కాకి మాటకు మిగతా అన్ని అంగీకరించాయి. ఇక వెళదాం అనుకుంటుండగా…
” ఆగండి అంది ఎర్రగడ్డ కుక్క” ఏమిటి అన్నట్టు చూశాయి మిగతావి.
” ఆకలితో ఇప్పుడు మనం అల్లాడిపోతున్నాం. కొన్ని దగ్గర్లా చెట్లు కూడా నీళ్ళు పొసే దిక్కు లేక ఎండి పోతున్నాయి. ఎంత కాదనుకున్న ఇప్పటి వరకు మనుషులు మనకి తిండి పెట్టారు. కొంత మంది మనకు ఆశ్రయం కూడా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు లేకపోతే మనం లేము. మనము, మనుషులు లేకపోతే ప్రపంచమే పెద్ద స్మశానం అయిపోతుంది. వాళ్ళ కోసం మనం ఏమైనా చెయ్యాలి. మా వంతుగా మేము రక్షక భటులతో పాటుగా జనాలు అనవసర సమయాలలో బయటకు రాకుండా కాపలా ఉంటాం. మరి మీరు” అంది
” మాకు” సహజ పారిశుద్ధ్య కారులు ” అని పేరు ఉంది కదా మేము ఇళ్ళ ముంగడ ఉన్న చెత్త, కళేబరాలను తీసుకుపోయి దూరంగా వేస్తాం” అంది కాకి.
” పాపం ఇప్పుడు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు వాళ్ళ ప్రాణాలకు తెగించి “కరోనా” ని మన దేశం నుంచి తరమగొట్టాలని నిరంతరం వాళ్ళ సేవలు అందిస్తున్నారు కదా. వాళ్ళ అందరికోసం, ఇంకా కరోనా మనుషులందరినీ వదిలి పోవాలని, ప్రపంచం నుంచి ఈ దిక్కుమాలిన కరోనా వైరస్ అంతమైపోవాలని , ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అంతకు మించి మనుషుల కోసం మేము ఏం చేయగలం” అన్నాయి పిల్లులు, పావురాలు విచారంగా “నిజమే, మీరే కాదు. ఇప్పుడు మనమంతా కలసి ‘ కరోనా గో బ్యాక్ ‘ అని నినదిద్దాం. మనుషులు ఎప్పటిలాగా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడికి ” ప్రార్ధన ” చేసి వేడుకుందాం అని అన్ని కలసి నిర్ణయించుకుని ముందుకు కదిలాయి.
జంతువులు నుంచే మనిషి వచ్చాడనేది శాస్త్రీయం. అవి ఎప్పుడు మనుషుల పక్షపాతి. ఒకటి రెండు జంతువులు టెర్రరిస్టులు లా ఉంటాయి. కొన్ని వాటికి అపాయం చేస్తేనే మనకు హాని చేస్తాయి. వాటికి మినహాయింపు ఇవ్వాలి. కాబట్టి వాటి ప్రార్థన వాస్తవం. జంతువులూ జిందాబాద్. మీకూ జిందాబాద్
మీ చక్కని ప్రోత్సహానికి ధన్యవాదాలు సర్.
మూగజీవుల వేదనను ,బాధను, ఆకలిని మీ “ప్రార్ధన”
తెలిపింది.ఆ క్లిష్ట కరోనా కాలంలో వాటి ఎండిన డొక్కలను,
ఆకలి అరుపులను వినేదెవరు?చూసేదెవరు?కానీ ఎంత గడ్డు కాలమైనా మానవత్వం తో కరుణతో స్పందించి
సహాయసహకారాలందించిన మానుషరూపంలోని
దైవాలను మరచిపోలేము .మీరు మూగజీవుల కోణంలో
ఈ ‘ప్రార్ధన’చేయటం,రాయటం చాలా బావుంది.
అభినందనలు రోహిణి గారు.
బాగుంది.. కొత్త ప్రయోగం.. కరోనా మనుషుల కే కాదు.జంతు లకూ తెచ్చి నా సమస్యలు..
మంచి ప్రయత్నం.