నమస్తే! నేను రాసిన ఈ కథ “మారిన మనుషులు” దర్వాజా వెలుగు V6 పత్రికలో 6-9-2020 సంచికలో ప్రచురితం అయింది .మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుప ప్రార్ధన.
——————————————————————————————————————————–
ఆమెరికాలో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం దుబాయ్ చేరింది. మరిది ఇచ్చిన సూచనల మేరకు దుబాయ్ లో నేను మరో విమానం ఎక్కాను.
సీట్ బెల్ట్ ప్లీజ్ ” అన్న చక్కని స్వరానికి ఎయిర్ హోస్టెస్ కాబోలు అనుకుంటూ తల ఎత్తాను. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు, కళ్ళు తప్ప తల నుంచి పాదాలవరకు ముసుగు తో నా ముందు ఉన్న మనిషిని చూసి ఉలిక్కి పడ్డాను. ఒక్క క్షణం తర్వాత నా బుర్రలో లైట్ వెలిగింది. కరోనా ప్రభావం వల్ల అనుకుంటా ఈ వింత వేషం. విమాన ప్రయాణం నాకు కొత్త కావడంతో కాస్త తంటాలు పడ్డాక సీట్ బెల్ట్ సరిగా పెట్టుకున్నాను. ఓ సారి చుట్టూ చూసాను. రెండు వందల సీట్ లు ఉన్న ఆ విమానంలో అక్కడొకరు ఇక్కడొకరుగా పాతిక మంది కూడా లేరు.
ఇంతలోనే ఓ ప్రకటన వినబడింది. ” ప్రయాణికులకు విజ్ఞప్తి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో అన్ని విమాన ప్రయాణాలను రద్దు చేసారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కి ఇదే ఆఖరి ట్రిప్. ఇక రేపటి నుంచి అంతర్జాతీయ విమానాలు రద్దు అని తెలుపుతున్నాం. ఆ ప్రకటన వినగానే నాకు గుండె దడ, ఒణుకు పుట్టాయి. మా మరిదిగారు ఒక్కరోజు ఆలస్యంగా అంటే ఈ రోజు కాకుండా రేపటికి టికెట్ బుక్ చేసి ఉంటే నా పరిస్థితి ఏమిటి …
సరిగ్గా రెండు నెలల ముందు అమెరికాలో చెల్లి సీత కి డెలివరీ సమయం. అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ప్రయాణం చేయలేదు. అక్కడ చెల్లి, మరిది తప్ప ఎవరు లేరు. వాళ్లిద్దరూ మరీమరీ అక్కడికి రమ్మని బతిమాలడంతో తప్పనిసరై అమెరికా వెళ్ళాను. వెళ్లే ముందు ఆయనకీ, అత్తమామలకు పిల్లల గురించి జాగ్రత్తలు లక్ష సార్లు చెప్పి ఉంటాను. అమ్మని కదా మరి. ఇటు పిల్లలను వదిలి వెళ్ళలేక, అటు చెల్లి అవసరాన్ని కాదనలేక సతమమయ్యే అస్థిమితపు మనసుతో బయలుదేరాను. పదేళ్ల లోపు ఉండే నా చిన్నారులిద్దరికి నచ్చచెప్పి బతిమాలి, వాళ్ళకి బోలేడు బొమ్మలు, చాకోలెట్స్ తెస్తానని చెప్తే నేను అమెరికాకి వెళ్ళడానికి ఒప్పుకున్నారు వాళ్ళు అయిష్టంగానే. ఆ రోజు విమానాశ్రయానికి వెళ్ళేటప్పుడు కూడా చిన్నది “అమ్మా కావాలి, అమ్మా నువ్వు వెళ్ళద్దు అని కాళ్ళకి అడ్డం పడి ఏడుస్తుంటే బాధని మనసులో మింగి తోసుకుని వచ్చేసాను.
…
దుబాయ్ విమానాశ్రయం నుంచి మెల్లగా రన్ వే మీద టేకాఫ్ తీసుకున్న విమానం ఒక్క కుదుపుతో మెల్లగా గాలిలోకి లేచింది. నా ఆలోచనలు రెండు నెలల వెనక్కి వెళ్లాయి. నేను ఆమెరికా వెళ్ళిన రెండో రోజే చెల్లికి డెలివరి అయి చక్కని ముద్దులొలికే పాపా పుట్టింది. రెండు నెలలు బాలింతకు, బిడ్డకు అమ్మలాగా అన్ని సేవలు చేశాను. ఆ మధ్యలో ఎప్పుడో మరిది కరోనా గురించి చెప్పాడు. ” అది చైనాలో మొదలైందట. చాల త్వరగా అన్ని దేశాలకు పాకుతోందట. ఇంకొన్ని రోజులలో ఎక్కడి వాళ్ళను అక్కడే లాక్ డౌన్ చేస్తారట”. ఆ మాటలు విన్నప్పుడే నా గుండెల్లో రాళ్ళు పడ్డాయి. వీలైనంత త్వరగా నన్ను ఇండియా కి పంపమని మరిదిని ప్రాధేయ పడ్డాను. ఓ పక్క పిల్లలు, ఆయన రోజు ఫోన్ చేసి ” ఎప్పుడు వస్తున్నావు. కరోనా అని ప్రయాణాలు కూడా రద్దు చేస్తే ఇక నువ్వు రావడం కష్టం అవుతుంది. త్వరగా బయలుదేరు” అనేసరికి ఇక అక్కడ నా మనసు నిలవలేదు. ఇన్నాళ్ళకు కుదిరింది. ఒక్క రోజు ఆలస్యం అయి ఉంటే…నా పిల్లలను చూసేది ఎప్పుడో ఇక. ఆమ్మో…. నా ప్రమేయం లేకుండానే నా గుండె మీదకు వెళ్ళింది నా చేయి. నా గుండె దడ దడ కొట్టుకోవడం నాకే స్పష్టంగా తెలుస్తోంది. ఆలోచనలను మళ్ళించాలని బ్యాగ్ లోనుంచి పిల్లల కోసం కొన్న బొమ్మల పుస్తకం తీసాను.
విమానం హైదరాబాద్ చేరేసరికి ఉదయం పది అయింది. నా కోసం విమానాశ్రయంకి శివ, పిల్లలు వచ్చి ఉంటారని ఫ్లైట్ నుంచి దిగి దిగగానే వాళ్ళు నన్ను చుట్టేస్తారని, వాళ్ళ కోసం కొన్న బొమ్మలు, చాకోలెట్స్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఎంతో ఉద్వేగంతో ఫ్లైట్ దిగాను.
ఎప్పుడు దేశ, విదేశీ ప్రయాణికులతో కొత్త పెళ్ళి ఇల్లు లాగా కళకళలాడే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు మనుషులే కనపడక కళ తప్పిన చావు ఇంటిని తలపిస్తోంది. నా మనసులో ఏదో తెలియని అలజడి. జనాలు లేని ఆ విమానాశ్రయ పరిసరాలు ఎందుకో భీతిని గొల్పుతూ నెగటివ్ ఆలోచనలు నాలో పురుడు పోసుకుంటున్నాయి. విమానం దిగి లగేజి చెకింగ్ పూర్తీ చేసుకుని ట్రాలీ మీద లగేజ్ వేసుకుని వచ్చిన నా కళ్ళు శివ కోసం వెతికాయి.
ఇంతలోనే ” మేడం ఇటు రండి ” అన్న పిలుపు తో పక్కకు తిరిగాను. ముఖానికి మాస్కుతో ఉన్న అతను పోలీస్ ఆఫీసర్ అనుకుంట ” మీరు ఇప్పుడే బయటకు వెళ్ళడానికి లేదు. యు.ఎస్.ఏ నుంచి వచ్చారుగా.. ఇక్కడ మెడికల్ చెకప్ చేయించుకోవాలి మీరు. కరోనా వ్యాధి మీకు లేదని తెలిసాకే మిమ్మల్ని పంపుతాం” అన్న మాటలు ఆశనిపాతంలా నా మనసును తాకాయి. శివ కి ఫోన్ చేద్దాం అంటే సెల్ ఛార్జింగ్ అయిపోయింది. నా కోసం శివ తప్పకుండా ఎయిర్ పోర్ట్ కి వస్తాడు అనుకున్నాను. కానీ ఈ పరిస్థితి లో ఇప్పుడు అసలు తను ఎయిర్పోర్ట్ కి వచ్చాడో లేదో తెలీదు. ఒకవేళ వచ్చి నా కోసం ఎయిర్పోర్ట్ బయట వేచి ఉన్నాడేమో .
” మేడం రండి” ఈ సారి పిలుపు కాస్త గట్టిగా వినిపించడంతో బలిచ్చే కసాయి వాని వెంట వెళ్ళే అమాయక గొర్రె పిల్లలా అతని వెంట రూంలోకి నడిచాను. అక్కడ డాక్టర్లు, నర్సులు, హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ వర్కర్స్ చాల మంది ఉన్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ నన్ను నేరుగా కరోనా పరీక్షలు జరిపించే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాడు. నాకు అన్ని రకాల పరీక్షలు జరిపారు. రిపోర్ట్ వచ్చేదాకా బయటకు పోవడానికి లేదు అన్నారు. ఇంటికి త్వరగా వెళ్ళాలి. నా చిన్నారులను ఎత్తుకుని ముద్దాడాలి అని నేను ఎంత తొందర పడేకొద్దీ అక్కడ అంత ఆలస్యం అవుతోంది. ఆ రక్త పరీక్షలు, ప్లాస్మా పరీక్షలు అవన్నీ చూస్తూ నర్సులు హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు గాని కరోనా సోకలేదు కదా. అనుకున్నది తడవుగానే హచ్ హచ్ మని వెంట వెంటనే రెండు తుమ్ములు వచ్చాయి. అక్కడున్నవాళ్ళు అనుమానంగా నా వైపు చూడసాగారు. ముక్కుకున్నమాస్కు తీసి అక్కడ ఉన్న డస్ట్ బిన్ లో వేసి మరో మాస్కు వేసుకుని రిపోర్ట్స్ కోసం చకోర పక్షిలా ఎదురు చూడసాగాను.
దాదాపు నాలుగు గంటలు ముంగాళ్ళమీద వేచి ఉన్నాక డాక్టర్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. అదిరే గుండెలతో వెళ్ళాను. నా రిపోర్ట్ లలో కరోనా నెగటివ్ వచ్చిందని, అయినా కరోనా లక్షణాలు పద్నాలుగు రోజులకు కానీ బయట పడవని ఇంటికి వెళ్ళినా పద్నాలుగు రోజులు హౌస్ క్వారెంటైన్లో ఉండాలని సూచించి, ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్పి ఎప్పటికప్పుడు హెల్త్ రిపోర్ట్ తమకు తెలుపుతూ ఉండాలని కండీషన్స్ అన్ని చెప్పాక ఇంటికి వెళ్ళమన్నారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ గబా గబా స్టోర్ రూమ్ కి వెళ్ళి లగేజ్ తీసుకుని బయట బడ్డాను.
ఎయిర్ పోర్ట్ బయట కూడా నరమానవుని ఛాయలు లేవు. అమెరికాలో ఉంటే ఇన్ని రోజులు తెలియలేదు కానీ ఇదంతా కరోనా ప్రభావమా… ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని నేను ఊహించలేదు. కాస్త దూరం నుంచి మాస్కు తో నా దగ్గరకు వస్తూ చేయి ఊపారు మా వారు శివా. ముఖానికి మాస్కు ఉన్నా శివా కళ్ళు నాకు తెలుసు కదా. వెంటనే గుర్తు పట్టి నేను కూడా చేయి ఊపాను. కానీ ఆ కళ్ళు ఏదో కళ తప్పినట్టు ఉన్నాయి. నేను ఆత్రంగా కారులోకి చూసాను పిల్లలకోసం. ఖాళీగా ఉన్న సీట్స్ నన్ను వెక్కిరించాయి. పిల్లలు రాలేదా? వాళ్ళు ఎలా ఉన్నారు. అత్తామామయ్యలు ఎలా ఉన్నారు. మన కాలనీ వాళ్ళంతా ఎలాఉన్నారు? నేను వస పిట్టలా ఆపకుండా అడుగుతుంటే శివా గంభీరంగా సూట్ కేసు, బ్యాగులు కారు డిక్కీలో సర్ది డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. నేను గబా గబా ఫ్రంట్ డోర్ తీసి శివా పక్కన కూర్చోబోయాను అలవాటుగా.
“పల్లు..నువ్వు వెనుక కూర్చో” అన్నాడు సీరియస్ గా. చెళ్ళున చెంప దెబ్బ కొట్టినట్టు అనిపించింది నాకు. “అదేంటి శివా కొత్తగా… ఎప్పుడు నీ పక్కనే కూర్చుంటాగా? “విస్తుపోయి అడిగాను నేను.
” అది ఇప్ప్పటి కరోనా పరిస్థితుల్లో ఇదే బెటర్” నీళ్ళు నములుతున్నట్టు అన్నాడు శివా. ” ఎయిర్పోర్ట్ లో నాకు కరోనా టెస్ట్ చేసారు శివా.నాకు నెగటివ్ వచ్చింది. నాకు కరోనా లేదు” ఎంతో ఆవేదన నా స్వరంలో జనించింది. ” అయినా ముందు జాగ్రత్త పాటిస్తే మంచిది కదా ” ముక్తసరిగా జవాబిచ్చాడు శివా. సరేలే ఇంటికెళ్ళి తలారా స్నానం చేసి అప్పుడు పిల్లలను ఎత్తుకోవచ్చు. ఇంకేం ఉంది ఒక గంటలో ఇంటికి చేరుతాం అని స్థిమిత పడి ఇక ఆయన్ని ఏం అడగకుండా కళ్ళు మూసుకుని ముందరి సీటుకు తల ఆనించాను కాస్త తలనొప్పిగా ఉండడంతో.
“పల్లు ….పల్లు….పల్లవి… నిద్రలే… నాచారం వచ్చేసింది. ఉలిక్కి పడి లేచాను శివా పిలుపుతో. కిటికీలోంచి చూస్తును కదా కారు యూటర్న్ తీసుకుని “వైజయంతి ” సినిమా హాలును దాటి మా అపార్ట్మెంట్ ఉన్న గల్లీలోకి వచ్చింది. ఇంకో ఐదు నిముషాల్లో మా ఇంటికి చేరబోతున్నాం. నా చిన్నారులను చూడబోతున్నాను. నాలోని అమ్మ ఎంత మురిసిపోతోందో. వాళ్ళు ఇద్దరు నాకు పుట్టినప్పటినుండి పోయిన నెలలో నేను అమెరికా వెళ్ళే రోజు వరకు ఒక్కరోజు కూడా వాళ్ళను వదిలి ఉన్నదిలేదు నేను. అసలు ఇన్ని రోజులు వాళ్ళు లేకుండా నేను ఎలా ఉన్నానో నాకే తెలియదు.
సెల్లార్ పార్కింగ్ లో కారు ఆగి ఆగగానే డోర్ తీసి లిఫ్ట్ దగ్గరికి పరుగులాంటి నడకతో వెళ్ళాను. లిఫ్ట్ బటన్ నొక్కబోయేంతలో ” ఆగండి పల్లవి మేడం” అంటూ మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ “ముఖర్జీ ” గారు పిలిచారు. ఆదిలోనే హంసపాదు . అసహనంగా చూసాను ఏమిటన్నట్టు. ” మీరు యూ. ఎస్. ఏ. నుంచి వచ్చారుగా.మాకు ఇప్పుడే ఎయిర్ పోర్ట్ నుంచి సమాచారం వచ్చింది. మీ మెడికల్ రిపోర్టులు చూపించండి.” అన్నాడు ఆయన. అప్పటికే ఇద్దరు ముగ్గురు చేరారు లిఫ్ట్ దగ్గర మాస్కులతో. అందరు నన్నో నేరస్తురాలిని చూస్తున్నట్టు చూసారు.
ఆనందంగా ఇంట్లోకి వెళుతుంటే ఈ అడ్డుపుల్లలేంటి నాకు అనుకుని హ్యాండ్ బ్యాగ్ తెరిచి నా రిపోర్ట్ పేపర్స్ చూపించాను ఆయనకీ. గ్లౌజులు వేసుకున్న చేతులతో ముట్టిముట్టనట్టు రిపోర్ట్స్ చూసి ఆయన ” కరోనా నెగటివ్ అని ఉంది. ఎందుకైనా మంచింది ఓ పద్నాలుగు రోజులు హౌస్ క్వారంటైన్ లో ఉండండి. ఇంట్లో అందరిని ముట్టుకుంటూ కలివిడిగా తిరక్కండి” అంటూ రిపోర్టులు మీదకు విసిరేసినట్టు నా చేతిలో వేసి వెళ్లిపోయారు. నా ఉత్సాహం అంతా పాలపొంగుమీద నీళ్ళు చెల్లినట్టు అయింది. ” అదేంటి శివా…. నేను ఇప్పుడు పద్నాలుగు రోజులు హౌస్ క్వారంటైన్ లో ఉండాలా? నాకు కరోనా లేదుగా ఇంకెందుకు?” దీనంగా అడిగాను శివ ని. ముందు ఇంట్లోకి పద అంటూ లిఫ్ట్ లోకి నడిచాడు శివ.
కాలింగ్ బెల్మోగుతూనే ఉంది. ఇంకా తలుపు తెరువలేదు. నేను ఓర్చుకోలేక అత్తయ్య, మామయ్య…రుచి…రీతూ… అంటూ తలుపు కొట్టాను. పిల్లలను చూడాలని నా గుండె ఆత్రంగా కొట్టుకొంటోంది. ఐదు నిముషాలకు తలుపు తెరుచుకుంది. ఎదురుగా ముఖానికి మాస్కు, చేతికి గ్లౌజులు వేసుకుని అత్తయ్య తలుపు పక్కగా నిలబడింది. అత్తయ్య అంటూ హత్తుకోబోయాను నేను. మరోపక్క పిల్లల కోసం నా కళ్ళు వెతుకుతున్నాయి. నేను వచ్చానని తెలిస్తే వాళ్ళు అసలు ఆగలేరు.
అత్తయ్య గబ్బుక్కున పక్కకి జరిగి ” పల్లవీ…నీ గదిలోకి వెళ్ళు. తలకు స్నానం చేయి. నీ బట్టలు తీసి డస్ట్ బిన్ పక్కన కవర్ పెట్టాను. అందులో వేసెయ్. అవి ఇక వాడవద్దు. నువ్వు తెచ్చిన బ్యాగులు కూడా బెడ్ రూమ్ బాల్కనీ లో పెట్టి తలుపు వేసెయ్. పద్నాలుగు రోజులు వాటిని అసలు తాకవద్దు. ” అంది ఆజ్ఞను జారీచేస్తూ.
అత్తయ్య… పిల్లలు మామయ్య ఏరి? ఇల్లంతా చూస్తూ అడిగాను ఉండబట్టలేక. పక్కన పిల్లల గదిలో నుంచి రీతూ ఏడుపు వినిపించింది పెద్దగా “అమ్మ.. అమ్మా” నేను అమ్మ దగ్గరకు పోతాను. అమ్మని చూడాలి అంటూ రీతూ ఆ గదిలో నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తోంది. పెద్దది కూడా కన్నీళ్ళతో బిత్తరగా చూస్తోంది. బిడ్డను ఎత్తుకోవాలని మనసు పీకుతున్నా వస్తున్న కన్నీటిని దిగమింగుకొని మాస్కు తీయకుండానే నా గదిలోకి పరుగెత్తి తలుపు మూసుకున్నాను.
అప్పుడు చెలియలి కట్ట తెగిన వరద ప్రవాహంలాగా కన్నీళ్ళుదూసుకొచ్చాయి నాకు. ఆ గదిలో నా కోసం నా బిడ్డల రోదన…వాళ్ళను ఓదారుస్తూ నిస్సహాయంగా అత్తయ్య, మామయ్య, మా వారు శివ. ఆయన కళ్ళు కూడా ఉప్పు నీటి చెలమలైనాయి. ఇక్కడ గదిలో నేను గోదావరి ప్రవాహమవుతూ…ఎంత సేపు అలా ఏడుస్తూ ఉండిపోయానో….ఈ కరోనా వైరస్ ఏంటో కానీ అందరినీ విడదీస్తోది. కళ్ళ ముందు బిడ్డలు ఉన్నా దగ్గరికి తీసుకోలేని అసహాయత. పగవారికీ కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు.
కర్తవ్యమ్ గుర్తుకు వచ్చి వాష్ రూమ్ కి వెళ్ళి తలారా స్నానం చేశాను. గంట తర్వాత అత్తయ్య తలుపు తట్టింది. నేను తలుపు తీయగానే ఎదురుగా గోడకి అనుకోని పిల్లలిద్దరితో శివ నిలబడి ఉన్నాడు. అందరి కళ్ళు ఉబ్బి ఉన్నాయి. అంతే జైలు గదిలో ఖైదీ కి ఇచ్చినట్టు అన్నం, కూరలు వేసి ఉన్న ప్లేటు ని నా ముందు పెట్టి ” పల్లవి తలుపేసుకుని అన్నం తినే విశ్రాంతి తీసుకో. ఓ పద్నాలుగు రోజులు ఇలాగే తప్పదు మనకి ” మరో మాట లేకుండా తలుపు మూసింది అత్తయ్య. బాధతో తినాలనిపించలేదు నాకు. అయినా ఇంటికొచ్చేసాను. పిల్లలు పక్క గదిలోనే ఉన్నారు. రోజుకొక సారైనా కనిపిస్తారు. పద్నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే ఇక అంతా హ్యాపీనే. నాకు నేనే ధైర్యమ్ చెప్పుకున్నాను. అన్నం తిన్నాననిపించి పక్కమీద వాలిపోయాను.
ఓ గంట గడిచింది. ఇంతలో తలుపు దబ దబా కొట్టడంతో దిగ్గున లేచి తలుపు తీసాను. ఎదురుగా పోలీస్ అధికారి ఒకరు లోపలకు వచ్చారు. ” మీరేనా అమెరికా నుంచి వచ్చింది. మీ హెల్త్ రిపోర్టులు చూపించండి” అన్నాడు ఆయన. నిద్ర మత్తు వదిలిపోయింది. బ్యాగులో నుంచి రిపోర్ట్స్ తీసి చూపించాను. పది నిముషాలు మాట్లాడి కరోనా జాగ్రత్తలు అన్ని చెప్పి ప్రతి రెండు రోజులకోసారి మీ హెల్త్ కండిషన్ గురించి రిపోర్ట్ మాకు వాట్సాప్ ద్వారా పంపండి” అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అప్పుడే మా పక్క ఫ్లాట్ గోడలకు చెవులు,కళ్ళు మొలిచినట్టు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి మా ఫ్లాట్ కి అటూ ఇటూ పక్క ఫ్లాట్ ల వాళ్ళు మాఇంట్లో వాళ్ళతో మాట్లాడడం మానేశారు . ఎంత చిత్రం. అంతకు ముందు వాళ్ళ ఇంటి పనులు అట్టా అయిపోతేచాలు, ఇట్టా మా ఇంటికి వచ్చి మా పనులు అయినాయో లేదో అని కూడా చూడకుండా అత్తయ్యతో కబుర్లు చెప్పే డాలి, భ్రమరాంబ గార్లు ఇప్పుడు మా ఇంటి ఛాయలకే రావడం లేదట.
ఇల్లలకగానే పండగ కాదు అనిపించింది నాకు. మొదటి రోజు పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళారు. తర్వాత రోజు హెల్త్ అధికారులు, మూడోరోజు సానిటరీ అధికారులు,అటు తర్వాత ఆరోగ్య కార్యకర్తలు… బాబాయ్ మా ఇంటిమీద దాడి జరిపినట్టే ఉంది. వాళ్ళ అందరి రాకపోకల తాకిడి ఎక్కువ అవడంతో మొత్తం అపార్ట్మెంట్ లో మా ఒక్క ఇంటిని రెడ్ జోన్ ప్రాంతం గా ప్రకటించినట్టు అపార్ట్మెంట్ వాళ్ళు అందరు మమ్మల్ని వెలివేశారు. అపార్ట్మెంట్ గ్రూప్ చాటింగ్ లో నేను యూ.ఎస్. ఏ . వెళ్ళి వచ్చినట్టు , అందరు మా ఫ్లాట్ పరిసరాలకు కూడా వెళ్ళవద్దు అని జాగ్రత్తగా ఉండాలని చాటింగ్ చేసుకుంటున్నారు. అది చూసి చాల బాధ పడ్డాను. నాకు కరోనా లేదు. విదేశానికి వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని మెడికల్ టెస్టులు చేసారు. నాకు కరోనా నెగటివ్ అని అందరికి తెలుసు అయినా ఈ చాటింగులు ఏమిటి. వేదనతో నా మనసు మొద్దుబారిపోయింది.
చాల రోజులైందని ఆ రోజు సాయంత్రం అత్తయ్య మా అపార్ట్మెంట్ లోనే కింద వాకింగ్ కి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు తలుపు కొట్టి నాకు చెప్పి మరి వెళ్ళింది. పోనీలే పాపం ఇంట్లో చాకిరీ అంతా తనపైనే పడింది. కాస్త రిలీఫ్ గా ఉంటుంది తనకు అనుకున్నాను. మా ఏరియా గ్రీన్ జోన్ లో ఉండడంతో వాకింగ్ కి, పిల్లలు ఆడుకునేందుకు , స్విమ్మింగ్ పూల్ కి అనుమతి ఉంది. పావు గంట కూడా కాలేదు, అత్తయ్య ఇంట్లోకి వచ్చిఏదో గొణుగుతూ సోఫాలో కూలబడింది. ఆ తర్వాత కాస్త పెద్దగా “చూసారా అండి మనకెందుకు లేనిపోని సహాయాలు. పిల్లలను వదిలి అమెరికా కు పోవద్దంటే మా చెల్లి మా మరిది అంటూ వెళ్ళింది ఈవిడ. ఇప్పుడు చూడండి నేను వాకింగ్ కి వెళ్ళితే ఆ సుధారాణి ఏమందో తెలుసా ” పల్లవిని హౌస్ క్వారంటైన్ లో ఉంచడం కూడా తప్పట. అసలు ఇంటికి ఎందుకు తీసుకువచ్చారు. కరోనా వైరస్ లక్షణాలు పద్నాలుగు రోజులకు కానీ బయట పడవు. మీరు హాస్పిటల్ క్వారంటైన్ లోనే ఉంచాల్సింది . తనను ఇంట్లో ఉంచి తగుదునమ్మా అంటూ మీరు వాకింగ్ కి, పిల్లలను ఆటలకి పంపితే మాకు కరోనా వస్తే ఎవరు భాద్యులు’ అంటూ నాతో గొడవ పడింది అంటూ ముక్కు చీదసాగింది .
“ఊరుకో సుమ. ఇంకో పది రోజులు ఓర్చుకుంటే ఈ బాధలు ఉండవు మనకి. మనం ఎంత చెప్పిన వాళ్ళకి అర్ధం కాదు. ఎవరి భయం వారిది. లోకం తీరే అంత”. అన్నారు మామయ్య. ” అమ్మా …. నువ్వు వాకింగ్ కి వెళ్ళవద్దు. పిల్లలను కూడా ఆటలకు పంపకు. రుచి,రీతూ ఈ రోజు మీకు కొత్త ఆట నేర్పుతాను అంటూ ఆయన పిల్లల గదిలోకి వెళ్ళారు . వాళ్ళ మాటలు అన్ని నాకు వినిపిస్తున్నాయి . నిజంగా కరోనా వచ్చిన పేషెంట్లా ఒణికిపోయాను నేను. ఇదేమి లోకం తీరు . ఎవరైనా బాధ లో కానీ, ఆపదలో కానీ ఉంటే వాళ్ళని తమ మంచి మాటలతో ఓదార్చి వాళ్లకు ధైర్యమ్ చెప్పాల్సింది పోయి ఇలా సూటి పోటీ మాటలతో హింసించి మనసును గాయపరుస్తారా? అసలు మన దేశంలో ఈ కరోనా వైరస్ ఎప్పటికి తగ్గుతుందో ఏమిటో…. ఈ సంకట పరిస్థితి నుంచి తాము ఎప్పటికి బయట పడతామో ఏమో అని మదన పడసాగాను.
నేను అమెరికా నుంచి వచ్చి రెండు వారలు అయింది. అపార్ట్మెంట్ లోని వాళ్ళ పోరు పడలేక ఇక లాభం లేదని శివ ఆ రోజు పొద్దునే లాక్ డౌన్ సడలింపు సమయంలోనే గాంధీ హాస్పిటల్ లో పనిచేసే నా ఫ్రెండ్ డాక్టర్ శిరీష కి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి రమ్మంది . మాస్కు ,గ్లౌజులు వేసుకున్నాను నేను. శివ వెనుక స్కూటర్లో కూర్చున్నాను. పావు గంటలో స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. తను అప్పటికే రెడీగా ఉంది. నేను వెళ్ళిన వెంటనే బ్లడ్ సాంపిల్స్ తీసుకుని, మరి కొన్ని టెస్టులు చేసి టెస్ట్ రిజల్ట్స్ వాట్సాప్ చేస్తాను అంది. ఇంటికొచ్చేశాం మేము.
వారం క్రితం నాకు కాస్త దగ్గు, 99 టెంపరేచర్ రావడంతో భయం, కంగారు పట్టుకుంది నాకు. టెస్ట్ ఫలితాలు ఎలా ఉంటాయో ఏమో, ఒక వేళ కరోనా పాజిటివ్ అని వస్తే ఎలా? ఇంకేమైనా ఉందా . నాకు ఏమైనా అయితే పిల్లలు, శివ ఏమైపోతారు ….. ఇలా అన్ని నాకు నెగటివ్ ఆలోచనలు రాసాగాయి. మాటిమాటికి వాట్సాప్ వంక చూస్తున్నా శిరీష దగ్గర నుంచి మెసేజ్ ఏమైనా వస్తుందేమో అని. ఎందుకనో గదిలో ఫ్యాన్ తిరుగుతూ ఉన్నా చెమటలు పడుతున్నాయి నాకు. తలుపు తీసి బాల్కనీ గ్రిల్స్ దగ్గరనిలబడి కిందకు చూసాను.. సమయం నాలుగైనా ఎండ తగ్గలేదు కానీ కాస్త చల్లటి గాలి వీస్తోంది. మా ఫ్లాట్ ఉండేది నాలుగో ఫ్లోర్ లో. కింద ఇంకా ఎవరు వాకింగ్ కి వచ్చినట్టు లేరు. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న సుధారాణి పిల్లలు ఇద్దరు స్విమింగ్ పూల్ దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నారు. హఠాత్తుగా వాళ్ళ చిన్న పాపా శ్రుతి పెద్దలు స్విమ్మింగ్ చేసేవైపు చాల లోతుగా ఉన్న వైపు అంచు నుంచి నీళ్ళలో పడిపోయింది. వెంటనే నీళ్ళలో మునకలు వేయసాగింది.
పై నుంచి చూస్తున్న నేను ఒక్క క్షణం బిత్తర పోయాను. మరు క్షణం మరో ఆలోచల లేకుండా, ఏదో తెలియని శక్తి నాలో ప్రవేశించినట్టు నా గది తలుపు తీసుకుని హాలు మెయిన్ డోర్ తీసి మెట్లు దిగి పరుగెత్తాను. నాకేమైందో అని అత్తయ్య ” పల్లవి…. పల్లవి …. ఎక్కడికి ” నా వెనుకే అరుస్తూ మెట్లు దిగుతోంది . నేను గబా గబా స్విమ్మింగ్ పూల్ దగ్గరకి వెళ్ళి వెనుక ముందు చూడకుండా నీళ్ళలో దూకేసాను. మునిగిపోతున్న పాపని ఒడిసి పట్టుకుని నా గుండెలకు హత్తుకుని స్విమింగ్ పూల్ నుంచి బయటకు వచ్చాను . ఏం జరిగిందో తెలియక అపార్ట్మెంట్ వాళ్ళంతా నా చుట్టూ చేరారు. పాపని కింద పడుకోబెట్టి పొట్ట ఒత్తాను. నీళ్లు బయటకు కక్కింది శృతి . అప్పుడు మా అపార్ట్మెంట్ లోనే ఉండే డాక్టర్ పరమేశ్వర్ గారు వచ్చి పాప నాడీ చూసి పర్వాలేదు గండం గడిచింది అన్నాడు. పాప మెల్లగా కళ్ళు తెరిచింది. పాపా వాళ్ళ సుధారాణి కన్నీటితో నా చేతులు పట్టుకుని ” పల్లవి ఈ రోజు నువ్వు మా పాపను కాపాడుకుంటే మాకు దక్కేది కాదు. నీ ఋణం ఏమి చేసి అయినా తీర్చుకోలేము. నిన్ను కరోనా పేషేంట్ అని మా మాటలతో హింసించాము. కానీ నువ్వు మా బిడ్డను రక్షించి మాలో ఉన్న ఇతరులను నిందించే రోగాన్ని పోగొట్టి ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం, విశాల హృదయం ఉన్న దానిగా ఈ రోజు నిరూపించావు.” అంది . అందరు నా వంక కృతజ్ఞతా భావంతో చూడసాగారు.
అప్పుడే శివ నా దగ్గరకు వచ్చి ” పల్లవి… శుభవార్త. ఇప్పుడే డాక్టర్ శిరిష మెసేజ్ పంపింది. నీకు కరోనా నెగటివ్ అని వచ్చింది. నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలివి అని ” అంటూ సంతోషంగా చెప్పారు . చుట్టూ చేరిన అందరు ఆపకుండా చప్పట్లు కొట్టారు. అందరికి చేతులు జోడించి ” మీరు ఇప్పుడు నా పట్ల చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ఇన్ని రోజులు నేను ఎంత నరకాన్ని అనుభవించానో మా కుటుంబానికి తెలుసు. నిజంగా ఏ రోగికి అయినా డాక్టర్లు ఇచ్చే మందులకన్నా తన తోటివారు చెప్పే ధైర్యపు మాటలే స్వాంతన కలిగించి వారు త్వరగా కోలుకోవడానికి ఉపకరిస్తాయి . ఈ సందర్భంగా నా మనవి ఏమిటంటే ఇప్పుడు ఐసోలేషన్ లో ఉన్న పేద కరోనా రోగుల కోసం మన వంతుగా ఆర్థికంగా కానీ, వారి కోసం ఆహరం, మాస్కులు, మెడిసిన్స్ మొదలైనవి సరఫరా చేద్దాం. వారు త్వరగా కోలుకోవడానికి మనం కూడా చేయూతనిద్దాం. ” అన్నాను. అంగీకారంగా అందరు మరోసారి చప్పట్లు కొట్టారు. మా రీతూ వచ్చి ” అమ్మ అంటూ నన్ను గట్టిగా హత్తుకుంది. నేను రీతుని ఎత్తుకుని ముద్దులు కురిపిస్తూ తన నవ్వులతో నేను శృతి కలిపాను. అందరి చప్పట్లలో మా ఇద్దరి నవ్వులు కలిసిపోయాయి .