భరోసా

నమస్తే!

ప్రజాశక్తి స్నేహ బుక్ లో నేను రాసిన బాలల కథ “భరోసా” ప్రచురితం అయింది. చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపండి. ఆ పిల్లల లాగే మనం కూడా కరోనా బాధితులకు భరోసా ఇద్దామా మరి.

—————————————————————————————————————————

బడి గంట కొట్టగానే తెలుగు మాస్టర్ జయరాజు ఆరవ తరగతి గదిలోకి ప్రవేశించారు. అప్పటిదాకా బల్లల మీద ఎక్కి గోల గోలగా ఆరుస్తున్న పిల్లలంతా ఎవరి చోటుకు వారు వెళ్ళి మాస్టారుకు నమస్కారం చేసి నిశ్శబ్దంగా కూర్చున్నారు. హాజరు పుస్తకం తీసి ఓ సారి తరగతి గదిని, పిల్లలను నిశితంగా చూసారు ఆయన. గదిలో మూలాన ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని వెక్కుతున్నాడు సుభాన్. పక్కనే రఘు అతన్ని ఓదారుస్తున్నాడు. మాస్టారి రాకను కూడా వాళ్ళు గమనించలేదు.

జయరాజు మాస్టర్ వాళ్ళను చూసి ” అరే సుభాన్ ఎందుకు ఏడుస్తున్నావు? కరోనా లాక్ డౌన్ ముగిసి ఈ రోజే అందరు బడికి వచ్చారు కదా. అప్పుడే మీరు గొడవలు పడి కొట్టుకుంటున్నారా? ఎవరు కొట్టారు నిన్ను ” అంటూ పక్కనే ఉన్న రఘుని కూడా అడిగాడు మాస్టర్.

” మరేమో సుభాన్ వాళ్ళ నాన్న ఢిల్లీ వెళ్ళి వచ్చాడు సార్. అందుకని ఆయన్ని పద్నాలుగు రోజులు క్వారంటైన్ లో ఉంచి పరిశీలించి కరోనా సోకలేదని తేలాక వారం ముందరే ఆయన్ని ఇంటికి పంపించారు. కానీ సుభాన్ వాళ్ళ ఇంటికి దగ్గరే ఉన్న సంతోష్ ఈ విషయాన్నీ పొద్దునే తరగతిలో అందరికి చెప్పాడు. దాంతో అందరు సుభాన్ ని ” మీ నాన్నకు కరోనా నువ్వు మాతో మాట్లాడవద్దు. మాతో ఆటకు రావద్దు “అంటూ వాడిని తిట్టారు సార్. పాపం వాడు ఏడుస్తూ ఇక్కడ కూర్చున్నాడు’ అన్నాడు రఘు
జయరాజు మాస్టర్ సుభాన్ ని లేవదీసి అతని కన్నీళ్ళు తుడిచి వాళ్ళ బల్ల దగ్గర కూర్చోబెట్టాడు.

పిల్లలంతా సుభాన్ వంక నిరసనగా చూడసాగారు. అది గమనించాడు మాస్టర్. హాజరు పట్టి వేయడం పూర్తీ చేసి అందరిని కలయజూస్తూ ” చూడండి మీరంతా పసి బిడ్డలు. ఎవరో ఎదో చెప్పారని మనకేదో అవుతుందని నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరినీ మనం నిందించకూడదు. సుభాన్ వాళ్ళ నాన్న వేరే ఊరు వెళ్ళి వచ్చాడని , ముందు జాగ్రత్తగా అతనికి కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికే ఆయన్ని క్వారంటైన్ లో ఉంచారు. ఇప్పుడు అతనికి కరోనా సోకలేదు అతను ఆరోగ్యవంతుడు అని తెలిసి ఇంటికి పంపించారు. ఈ సంగతి నాకు కూడా తెలుసు. ఒక వేళ కరోనా సోకిన వ్యక్తిని అయినా వాళ్ళ కుటుంబాన్ని అయినా మనం నిందించకూడదు. కరోనా ఒక అంటు వ్యాధే కానీ అది నేరం కాదు. మనకు తెలిసో తెలీకో కరోనా ఉన్న రోగిని తాకడం వల్ల కానీ, వాళ్ళ దగ్గు తుమ్ముల నుంచి కానీ కరోనా క్రిములు ఇతరులకు వ్యాపించవచ్చు. అందుకని ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ముఖానికి మాస్కు వేసుకోవడం తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం శుభ్రతను పాటించడం చేస్తే కరోనా మన దగ్గరకు రాదు. కరోనా సోకిన వాళ్ళను మన మాటలతో చేతలతో బాధిస్తే వాళ్ళు మానసికంగా కూడా మరింత క్రుంగి పోతారు. అలా కాకుండా వాళ్ళు త్వరగా కోలుకునేందుకు వాళ్ళకు మానసిక ధైర్యాన్ని మంచి మాటల ద్వారా మనం వారికి అందించాలి. అప్పుడు వాళ్ళు త్వరగా కోలుకుంటారు’ అంటూ ఒక్క క్షణం అందరిని చూసాడు మాస్టర్.

ఆయన చెప్పేది శ్రద్దగా వినసాగారు పిల్లలంతా…

” ఇంకో మాట వినండి. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ తొలగించారు. అయినా కరోనా ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాలేదు మనదేశంలో. ఈ లాక్ డౌన్ సమయంలో చాల మంది ఆనాధలు, వలస కార్మికులు జీవనాధారం కోల్పోయి కనీసం తినడానికి తిండి కూడా దొరకక చాల అవస్థ పడుతున్నారు. అలాంటివారికి మనం మన శక్తి మేర పచారీ సామానులో, వాళ్ళ అవసరాలకు కాస్త డబ్బులో సహాయం చెయ్యాలి. ఆపద సమయంలో మీకు మేము ఉన్నాం అని భరోసా ఇవ్వాలి. సరేనా ” అన్నాడు జయరాజు మాస్టర్.

“అలాగే సార్ ” అన్నారు పిల్లలంతా ముక్త కంఠంతో.

“అయితే ముందుగా మీరంతా సుభాన్ కి క్షమాపణ చెప్పండి. అందరు కలిసి మెలిసి ఉండండి” అంటూ పిల్లల చేత సుభాన్ కి క్షమాపణ చెప్పించారు ఆయన. మరో మాట ఈ ఆదివారం మన స్కూల్ తరపున వలస కార్మికులకు అన్నదానం చేస్తున్నాం. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకు చెప్పండి. మరి మీలో ఎంత మంది వస్తారు అన్నదాన కార్యక్రమంలో సాయం చేయడానికి అన్నారు” ఆయన. పిల్లలంతా ఉత్సాహంగా చేతులెత్తారు.

4 thoughts on “భరోసా”

  1. బాగుంది మేడం. ఇలా సుభాన్ తండ్రి లాంటి వాళ్ళు ఎంతో మంది రోగ వివక్షకు గురయ్యారు. అలా చిన్నచూపు చూసిన వారందరికీ మీ కథానిక ఒక చెంపపెట్టు కావాలి. ఇలాంటి వాటిని చదివి అందరూ మారాలనే మీ తాపత్రయానికి వందనం మేడం.

Comments are closed.